మీకు మీరే డాక్టర్

ఆహార ఔషధాలు -5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛిలుక తోటకూర పప్పు, పచ్చడి
చిలుక తోటకూరని క్రోటన్ మొక్క (గార్డెన్ హెర్బ్)లా పెంచుతారు. పొలంగట్ల వెంబడి పెరుగుతుంది. తోటకూరలో ఒక భేదం ఈ మొక్క. తోటకూర కన్నా ఎక్కువ శక్తివంతమైనదీ, ప్రభావవంతమైనది కూడా! లేత రంగులోనూ, ముదురు రంగులోనూ ఈ మొక్క రెండు రకాలుగా పెరుగుతుంది. రెండింటికీ సమాన గుణాలే చెప్పారు. దీన్ని తోటకూరలాగానే అన్ని రకాలుగా వండుకుంటారు. శరీరానికి తేలికదనాన్ని సౌఖ్యాన్నీ ఇస్తుంది. అన్ని దోషాలనూ పోగొడుతుంది. శరీరంలో ఉండే విషాలను హరిస్తుంది. రక్తంలో దోషాలను పోగొట్టి రక్తవృద్ధి నిస్తుంది. కడుపులో నులి పురుగుల్ని పోగొడుతుంది. స్ర్తిల ఋతు సమస్యల్లో ఇది ఔషధంగా పని చేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తస్రావాన్ని అరికడుతుంది. అతిగా తింటే వేడి చేస్తుంది. అందుకని దీన్ని పాలకూర, సొరకాయ లాంటి చలవనిచ్చే ద్రవ్యాలతో కలగలపుగా వండుకోవాలి. చింతపండు కలపకుండా పప్పు లేదా పచ్చడి తయారుచేసుకుని తింటే కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. కళ్లె పడటం ఆగుతుంది. చిలుక తోటకూర ఆకునీ, సొరకాయనీ సమానంగా తీసుకుని, మిక్సీ పట్టి ఆ రసంలో రసం పొడి కలిపి కమ్మగా చారు కాచుకుని తాగితే కడుపులో సుఖంగా ఉంటుంది. విరేచనం ఫ్రీగా అవుతుంది. పైన చెప్పిన గుణాలన్నీ దక్కుతాయి. ఇవన్నీ అపురూపంగా దొరికేవేమీ కాదు, గ్రామీణ ప్రాంతాల్లోను, చెరువుల దగ్గర పెరిగేవే! ఉచితంగా లభించే ప్రకృతి సంపద. ఇలాంటి ఆహార ఔషధాల గురించి రైతులు కూడా పట్టించుకోవట్లేదు. మన చుట్టూ చిర్రికూర, గలిజేరు, చిలుక తోటకూర, పావిలి కూర ఇలాంటివెన్నో ఉచితంగా దొరుకుతున్నాయని, వాటిలోని ఔషధ గుణాలను ఉపయోగించుకో గలగాలని విజ్ఞప్తి. మొక్కల గురించి రైతుకన్నా బాగా తెలిసేది ఇంకెవరికీ? అందుకే రైతులకు మరీ ఈ విజ్ఞాపన.
చుక్కకూర పప్పు,
పులుసు కూర, పచ్చడి
చుక్కకూరనే పుల్లబచ్చలి అని కూడా పిలుస్తారు. చూకాశాక్ అనేది దీని హిందీ పేరు. బహుశ సంస్కృతం చుక్రికా నుండి ఈ పేరు ఏర్పడి ఉండవచ్చు. పుల్లని ఆకు అనే అర్థంలోనే పత్రామ్ల లాంటి పేర్లు దీనికున్నాయి. రుమెక్స్ వెసికేరియస్ లిన్న్ అనేది దీని వృక్ష నామం.
పప్పుగా, పులుసు కూరగా, పచ్చడిగా వండుకుంటారు. తోటకూర, పాలకూర లాంటివి వండుకునేప్పుడు పులుపు కోసం చుక్క కూర ఆకులు కూడా కలిపి వండుతారు. చుక్కకూర విరేచనకారి. మొలల వ్యాధిపైన ఔషధంగా పని చేస్తుంది. అతిగా తింటే గోంగూర, చింతపండు మాదిరే కడుపులో ఎసిడిటీని గ్యాసునీ పెంచుతుంది. కానీ వాటిలాగా వాతాన్ని పెంచదని ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్నారు. వాత వ్యాధులున్న వారు వంకాయ, సొరకాయ లాంటి కూరగాయల్ని వండుకునేప్పుడు అందులో చింతపండు రసానికి బదులుగా చుక్కకూరని గానీ, చుక్క ఆకుల రసాన్ని గానీ కలిపి వండుకోవటం మంచిది. జీర్ణశక్తిని పెంచుతుంది. రుచిగా ఉంటుంది. కడుపులో నొప్పి, మలబద్ధత, కీళ్లవాత రోగులకు ఇది మేలుచేసే పుల్లని ద్రవ్యం. సరిపడితే ఎలర్జీ వ్యాధులు ఉన్నవారు కూడా చూసుకుని తినవచ్చు. మనకన్నా పంజాబీలు ఎక్కువగా తీసుకుంటారు. దీన్ని, హృదయ వ్యాధుల్లో కూడా మేలు చేస్తుంది. భయపడకుండా తినదగినది. రక్తవిరేచనాలు, కలరా లాంటి వ్యాధుల్లో కూడా ఇవ్వతగినదని, తేలుకాటుకు విరుగుడుగా పని చేస్తుందని వైద్య గ్రంథాలు చెప్తున్నాయి.

చెరకు వేళ్లతో టీ
చెరకు గడలు కోసేసిన తరువాత వృధాగా పారేసే వాటిలో మనకు వైద్యానికి పనికొచ్చే అంశాలేమైనా ఉంటే ఉపయోగించుకోవచ్చు కూడా! ఉపయోగాలు తెలిస్తే రైతులే దీన్ని సద్వినియోగ పరచవచ్చు కూడా! చెరకు వేళ్లను శుభ్రం చేసి నీడన ఆరనిచ్చి, దంచిన పొడిని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. వేడి శరీర తత్వం ఉన్నవాళ్లు చెరకు వేళ్ల పొడిని నీళ్లలో వేసి టీ లాగా కాచుకుని రోజూ రెండు మూడుసార్లు త్రాగవచ్చు. బాలింతలు ఈ టీ త్రాగితే, తల్లిపాలు పెరుగుతాయి. ఆ పాలు బిడ్డకు చలవనిచ్చేవిగా ఉంటాయి. తల్లికి కూడా చలవ చేస్తుంది. మూత్రపిండాల వ్యాధులున్న వాళ్లకు ఇది మేలు చేస్తుంది. నీరు పట్టిన వాళ్లకు త్వరగా నీరు తగ్గుతుంది. చెరకు రసం త్రాగేప్పుడు అందులో అల్లం గానీ, సోంపు గానీ తప్పకుండా కలుపుకుని త్రాగితే, చెరకు రసం వలన దోషాలు పోతాయి.
బియ్యానికి రెట్టింపు చెరకు రసం పోసి వండిన పరమాన్నం తింటూ వుంటే అలసటను పోగొట్టి, తక్షణ శక్తినిస్తుంది. బడి నుండి ఇంటికి అలసి వచ్చే పిల్లలకు పెట్టదగినదీ పరమాన్నం! దీన్ని ఒక ఔషధంగా ప్రతీరోజూ ఉదయం పూట ఒక కప్పు మోతాదులో తీసుకుంటూ ఉంటే పురుషుల్లో వీర్య కణాలు పెరుగుతాయి. లైంగిక సమర్థత పెరుగుతుంది.
తిప్పతీగ ఆకులతో పులుసు కూర/ టీ
తిప్పతీగని సంస్కృతంలో గుడూచీ అనీ, హిందీలో గిలోయ అనీ పిలుస్తారు. టీనోస్పోరా కార్డ్ఫిలియా అనేది దీని వృక్షనామం. దీని కాండం, వేళ్లు, ఆకులు రసం తీసి ఆరనిస్తే తెల్లని సత్త్వం దిగుతుంది. దీనే్న తిప్పసత్తు లేదా గుడూచి సత్త్వం అంటారు. ఇది బాగా చలవచేసే ద్రవ్యం. దాదాపు అన్ని ఆయుర్వేద ఔషధాలలోనూ దీన్ని తప్పనిసరిగా కలుపుతారు. దీని ఆకులను పులుసుకూరగా వండుకోవచ్చు. కమ్మగా వండుకోవడానికి అనుభవం మీద మీ యుక్తిని ఉపయోగించాలి. అప్పుడప్పుడూ ఈ ఆకుల పప్పుకూర లేదా పులుసు కూర తింటూ ఉంటే, శరీరంలో విషదోషాల్ని హరిస్తుంది. వేడి తగ్గిస్తుంది. మలమూత్రాలు ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆయుష్షుని పెంచుతుంది. కాబట్టి ఏ వ్యాధులూ లేనివారు కూడా తరచూ తినదగిన ఆహారం.
ఇంక వ్యాధుల విషయానికొస్తే తిప్ప ఆకులు ప్రభావవంతమైన ఔషధ విలువలు కలిగినవి. అకారణంగా వచ్చే జ్వరాలలో ఇది బాగా ఉపయోగపడుతుంది. గనోరియా, సిఫిలిస్ లాంటి సుఖవ్యాధులున్న వారికి రోజూ వండిపెట్టినా మంచిదే! మూత్రంలో మంట, వ్రణాలు, చీము త్వరగా తగ్గుతాయి. నొప్పి, వాపులను కూడా తగ్గిస్తుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి, ముఖ్యంగా డయాలసిస్ మీద ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.
షుగరు వ్యాధిలో అరికాళ్ల మంటలు వగైరా బాధలున్న వారికి తగ్గుతాయి. శరీర తత్త్వాన్ని మంచికి మార్పు చేస్తుందని దీని గురించి చెప్తారు. కీళ్లవాతం ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఆకుల్ని తింటూ ఉండటం మంచిది.
ఇలా కూరగా వండుకోవటం ఇబ్బంది అయితే ఆకుల్ని ఎండించి, పుదీనా ఏలకులు వగైరా కలిపి కమ్మగా టీ కాచుకుని త్రాగవచ్చు. ఇలా అయితే రోజూ మూడు పుటలా త్రాగేందుకు అనువుగా ఉంటుంది. పాము కాటును కూడా హరించే శక్తి దీని వేళ్లకుందని ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. అంత ప్రభావశాలి అయిన తిప్పతీగ మొక్క కంపల మీద, పాకుతూ పెరుగుతుంది. ఉచితంగా దొరికేదే!

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com