సంజీవని

కిడ్నీ వ్యాధులకు ఆయుర్వేద చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.శాంతారాం, శ్రీకాకుళం

కడుపుని మెడికల్ షాపు చేస్తూ అదేపనిగా మందులు మింగే అలవాటున్నవారికి, తరచూ మూత్రపిండాలలో రాళ్ళు చేరేవారికీ, మూత్రపిండాలలో చీము దోషం వదలని వారికీ, వడదెబ్బవలన గానీ, విరేచనాలవలన గానీ శోష వచ్చేవారికీ, షుగరు వ్యాధి, బీపీ వ్యాధి ఉన్నవారికీ, సుఖవ్యాధులతో సతమతమయ్యేవారికి మూత్రపిండాలు చెడే అవకాశం వుంది. మన ఆహార, విహార వ్యవహారాల ప్రభావంవలన మూత్రపిండాలు చెడతాయని గమనించాలి.
మూత్రం అతిగా వెళ్లినా, అల్పంగా వెళ్లినా ‘ప్రమేహం’ అనే వ్యాధిగా పిలుస్తుంది ఆయుర్వేద వైద్యశాస్త్రం, ప్రమేహం అంటే, మూత్రంలో మార్పులు ఏర్పడ్డాయని అర్థం. ఈ ప్రమేహాలు 20 ఉన్నాయి. మధుమేహం అందులో ఒకటి. ఏ రకమైన ప్రమేహానికి మన ఆహార విహారాలు, మన జీవన విధానంలో లోపాలే కారణం. మూత్రం పచ్చగా, మంటగా పోవటం అనేది మాటిమాటికీ జరగటం ప్రమాదకరమే అవుతుంది. అన్ని సందర్భాలలోనూ అది కేవలం వేడి చేసినందువలన మాత్రమే వలచ్చే బాధ కాకపోవచ్చు. ఆల్బుమిన్‌గానీ, చీముగానీ మూత్రంలోంచి తరచూ పోతుంటే కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని అర్థం. అదుపులో లేని బీపీ షుగరూ కిడ్నీలను దెబ్బతీస్తాయి. ఆహారంలో సీసం, లోహం లాంటి ఖనిజాలు అనేకం కలుస్తూంటాయి. రంగులు కలిసిన ఆహార పదార్థాలు, పలుచని తగరం (టిన్) రేకు చుట్టిన స్వీట్లూ, కిళ్లీలు కిడ్నీలను దెబ్బకొడతాయి.
కిడ్నీలమీద ఒత్తిడి ఎక్కువైందని శరీరం రకరాలైన ముందస్తు హెచ్చరికలిస్తూనే ఉంటుంది. వాటిని పట్టించుకోకపోవటంవలన కిడ్నీలు పూర్తిగా చెడే పరిస్థితి వస్తుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లవలసి వస్తున్నా, సరిగా అవకపోతున్నా జాగ్రత్తపడాలని అర్థం. తరచుగా మూత్రంలో రంగులు మారుతున్నాయంటే జాగ్రత్త సుమా అని హెచ్చరికగా గమనించాలి. త్వరగా అలసిపోవటం, శక్తిహీనత, నిద్రపట్టకపోవటం, చర్మం గరుకుగానూ, పొడిగానూ మారటం, తరచూ మూత్రానికి వెళ్ళవలసి రావటం, వెళ్లినపుడు అతిగా మూత్రం అవటం లేదా కొద్ది కొద్దిగా కావటం, మూత్రంలో చీము, ఆల్బుమిన్ ఎక్కువ కావటం, సర్ఫ్ నీళ్ళలాగా నురుగుతో మూత్రం కావటం, ముఖం ఉబ్బరించి ఉండటం, పాదాలు వాయటం, ఆకలి మందగించటం, కండరాలు పట్టేసి నొప్పులు- ఇవన్నీ విసర్జించబడవలసిన విషాలు శరీరంలోనే పేరుకుపోవటం కారణంగా కలుగుతాయి.
కనీస శ్రమ లేని సుఖజీవనం, అదుపులేని ఆహార సేవన, కొత్తబియ్యం, కొత్త పప్పు ధాన్యాలు, కొత్తమద్యం, ఇవన్నీ మధుమేహంతో సహా అన్ని ప్రమేహ వ్యాధులకూ కారణాలే! నీటిలో పెరిగే జంతువుల మాంసం, కొవ్వు పదార్థాలు, పాలతో తయారయ్యేవీ ఫ్రిజ్జులో పెట్టి తీసిన అతి చల్లనివీ, అమితంగా పులుపు, కారం, ఉప్పు కలిసినవీ కిడ్నీని దెబ్బతీస్తాయి. పగటి నిద్ర, రాత్రి జాగరణం, అతిగా కాఫీలు, టీలు, మలమూత్రాలను ఆపుకోవటం వలన కిడ్నీలు చెడతాయి. చలవచేసే ఆహార పదార్థాలు అంటే బీర, పొట్ల, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, ముల్లంగి, కరుబూజా, పండిన దోస, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్ లాంటివి చింతపండు, శనగపిండి, అల్లం వెల్లుల్లి వీటితో కల్తీ చేయకుండా వండుకు తింటే మూత్రపిండాలు పదిలంగా ఉంటాయి. వేపుడు పదార్థాలు కూడా కిడ్నీ మీద ఒత్తిడిని పెంచుతాయి.
కిడ్నీ వ్యాధుల్లో ఏ వైద్య విధానంలో మందులు వాడుతున్నవారైనా అనుభవజ్ఞుడైన ఆయుర్వేద వైద్యుని సంప్రదించి తగిన జాగ్రత్తలు తెలుసుకుని పాటించటం మంచిది. దర్భవ్రేళ్ళు, పల్లేరు, కొండపిండిలాంటి వనమూలికలు డయాలిసిస్ మీద వున్న రోగులలో కూడా మంచి ఫలితాలిస్తాయి. ఆయుర్వేద ఔషధాలను వ్యాధి అనుగుణంగా వాడిస్తే మంచి ఫలితం ఉంటుంది.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com