దక్షిన తెలంగాణ

అనువాద సాహిత్యమంటే అమితమైన గౌరవం (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్
చిరునామా:
ఇం.నం.11-9-317
లక్ష్మీనగర్, రోడ్.నం.4
కొత్తపేట, పోస్టు: ఆర్‌కె.పురం,
హైదరాబాద్ - 500102
సెల్.నం.9441054637
**

కవిత్వంతో పాటు రేడియో నాటికలు, కథానికలు, సాహిత్య వ్యాసాలు రాసిన అనుభవమున్న ప్రసిద్ధ సాహితీవేత్త అమ్మంగి వేణుగోపాల్. అనువాద సాహిత్యం మీద తనకెంతో గౌరవం ఉందంటారు ఆయన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన పూర్వీకులు రంగారెడ్డి జిల్లా వికారాబాదు దగ్గర ఆలంపల్లిలో స్థిరపడ్డారు. ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే..

ఆ మీ నేపథ్యం గురించి చెబుతారా?
నూటాయాభయ్యేండ్ల క్రితం మా పూర్వీకులు శ్రీరంగం నుండి వచ్చి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ దగ్గర ఆలంపల్లిలో స్థిరపడ్డారు. మా నాయన గారు నిజాం ప్రభుత్వ ఉద్యోగిగా మహారాష్ట్ర, కర్నాటకలో పనిచేసి ఆ తరువాత మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో ఉద్యోగ విరమణ చేశారు. నందగిరి అనంతరాజ శర్మ అనే తెలుగు పండితులు పద్యాలు రాయుట నేర్పితే, హిందీ పండితులు రుక్మయ్యగారు ఆధునిక కవిత్వంలో, సాహిత్యంతో పరిచయం ఏర్పరచారు.

ఆ మీకు రచనల పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
నిజాంకాలేజీలో పియుసి చదివేటప్పుడు అంధులైన ముగ్గురు మిత్రులు నాకు సహోధ్యాయులుగా వుండేవాళ్లు. వాళ్లతో నేను చేసిన స్నేహం నాతో ‘చీకటిలో బతుకు నీడ’ అన్న కవితను రాయించింది. వరవరరావు గారి సంపాదకత్వంలో వచ్చిన సృజన పత్రిక నిర్వహించిన పోటీలో 1967లో ఈ కవితకు రాష్టస్థ్రాయిలో మొదటి బహుమతి వచ్చింది.

ఆ మీ దృష్టిలో రచనలు ఎలా వుండాలి?
సాహిత్యంలో రాశి, వాసి అన్న రెండు మార్గాలలో నడిచే వాళ్లున్నారు. ఎంఎలో నా సహోపాధ్యాయ కన్న సామి ‘క్వాలిటీ ఉన్న రచననే అచ్చు కావాలె’ అని ఒక పాఠం చెప్పిన్రు. ‘నీ రచనలో శక్తివుంటే దానికి ఏ రోజైనా గుర్తింపు లభిస్తుందన్నది ఆయన సలహా. ఇది నా మీద బాగా పని చేసింది.

ఆ మీ రచనల గురించి తెల్పండి?
ఎంఎస్ జాషువా అనే హెడ్‌మాస్టర్ మాకు ఇంగ్లీషులో మిల్టన్ పాఠం ఒకటి బోధిస్తూ ‘బిట్వీన్ ది లైన్స్’ చదవటమంటే ఏమిటో వివరించారు. దాంతో మనం రాసేది కూడా పాఠకులు బిట్వీన్ ది లైన్స్ చదువుకునేటట్లు వుండాలని అర్థమైంది. నేను ఇప్పుడు కూడా కవిత్వ రచనలో దాన్ని అమలు చేస్తుంటాను. ఒక్క కవిత్వానికే పరిమితం కాక కథానికలు, వ్యాసాలు రాసేవాణ్ణి, నాటికలు రాసేవాణ్ణి, కథానికలు తప్ప సాహిత్య వ్యాసాలు రెండు సంపుటాలుగా వచ్చినయ్.

ఆ అనువాద సాహిత్యంపై మీ అభిప్రాయం?
అనువాద సాహిత్యం మీద నాకెంతో గౌరవం ఉంది. వివిధ భాషలకు మధ్య వంతెన నిర్మించి, ఒక స్నేహపూర్వక వాతావరణం సృష్టించే శక్తి అనువాదానికి వుంది. ఆచార్య జయధీర్ తిరుమల రావు సలహా మేరకు ఒక ఆంగ్ల గ్రంథాన్ని ‘తెలుగులిపి: ఆవిర్భావ వికాసాలు’ అన్న పేరుతో అనువదించాను. తమిళ భాషకు ప్రాచీన భాష హోదా ఇచ్చి తెలుగు భాషకు ఇవ్వనప్పుడు వాదోపవాదాలకు ఈ మూల గ్రంథం పనికి వచ్చింది.

ఆ మీ సాహిత్య పరిశోధన గురించి చెబుతారా?
పరిశోధనా రంగానికి వస్తే - గోపీచంద్ నవలా సాహిత్యం మీద చేసిన పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి వచ్చింది. తాళపత్రగ్రంథాలను కూడా చదివే అరుదైన అవకాశం నాకు లభించింది. ఆ తరువాత ‘వట్టికోట ఆళ్వారు స్వామి - రచనలు - పరిశీలన’ అన్న పుస్తకం వచ్చింది. నా సాహిత్యం మీద ఆర్.సూర్యప్రకాశరావు పరిశోధన చేసి పిహెచ్‌డి పొందటం నాకు సంతృప్తినిచ్చింది.

ఆ తెలంగాణ రాష్ట్ర సాహితీకారులను ప్రోత్సహించడంపై
మీ అభిప్రాయం?
ప్రతిజాతికి తాను గర్వించదగ్గ, చిరకాలం గుర్తుంచుకోదగ్గ, తేజోవంతమైన జ్ఞాపకం ఒకటి ఉంటుంది. తెలంగాణ జాతికి తెలంగాణ రాష్ట్ర సాధన అట్లాంటిది. రచయితలు, వాగ్గేయకారులు సాహిత్య సాంస్కృతిక రంగాలలో చేసిన ఉద్యమం కూడా స్వప్న సాకారానికి దోహదం చేసిందని చెప్పొచ్చు. అంతకుముందున్న ప్రభుత్వం తెలంగాణ రచయితలను పట్టించుకోలేదు. 60 ఏండ్లుగా రవీంద్రభారతి మెట్లెక్కని మనవాళ్లు ఇప్పుడక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వాన్ని మించి తెలంగాణ ప్రభుత్వం రచయితలకు, ఇతర ప్రతిభావంతులకు అవార్డులను ప్రదానం చేసి గౌరవిస్తుండటం గర్వకారణమైన విషయం.

ఆ మీకు కాళోజీ పురస్కారం రావడంపై మీ స్పందన?
1969 తెలంగాణ ఉద్యమకాలం నుంచి కాళోజీ గారిని చూస్తున్నాను. 1978లో వారి మీద రాసిన కవితతో తెలంగాణ ఉద్యమ కవిత్వం మొదలైంది. సాహిత్యరంగంలో నా కృషిని గుర్తించి ప్రభుత్వం 2015లో కాళోజీ నారాయణ రావు పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం నాకు సంతోషంగా ఉంది.
**
ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

**
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net