దక్షిన తెలంగాణ

ప్రగతిశీల భావాల ‘అక్షర సేనాని’! (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు: 79 - వెల: 70/-
ప్రతులకు:
సాహితీ బంజారానిలయం
ఇం.నెం.5-5-244
సంభాని నగర్, పార్శీబంధం
ఖమ్మం జిల్లా
సెల్.నం.9395130719
**
హలావత్ సీత్లానాయక్ ‘అక్షర సేనాని’ పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించి.. తమ ప్రగతిశీల భావాలను పాఠకులతో పంచుకున్నారు. ముప్పది ఐదు కవితలతో ముస్తాబైవచ్చిన ఈ గ్రంథంలో కవి సీత్లానాయక్ యొక్క ఆవేశంతో పాటు ఆవేదనను చూస్తాం.. సామాజిక దృక్పథంతో రాయబడిన ఇందలి కవితలు కవి యొక్క భావోద్వేగానికి అద్దం పడతాయి. ఆయన రక్షకభట శాఖలో పనిచేసి తమ విశ్రాంత జీవితాన్ని అవిశ్రాంతంగా సృజన రంగంపై మళ్లించి.. రచనా వ్యాసాంగాన్ని కొనసాగించడం విశేషం! కవి తమ అంతరంగంలో సవ్వడి చేసే భావాలకు అక్షర మువ్వలు తొడిగారు. ఆత్మీయతను, ఆర్ద్రతను ఆహార్యంగా జోడించి అందించే ఇందలి కవితల్లో.. కవిత్వాంశ కోసం వెతికే పాఠకులు పెద్దగా తృప్తిపడక పోయినప్పటికీ.. ఆయన సామాన్యుని గుండె చప్పుళ్లను వినిపించడం కోసం చేసిన కృషిని అభినందించకుండా ఉండలేరు!
విషాద గాథలతో.. వివరించని బాధలతో.. విజయం సాధించుటకై గిరిజన జంటలం.. ఖమ్మంలోని పార్శిబందం గుట్టపై బావి తీశాము.. రాతినేలను హరితవనం చేశామని కవి సగర్వంగా ప్రకటించుకోవడం ప్రశంసనీయం! కష్టజీవి కంటిలో తిరుగుతుంది భూగోళం.. పేదవాడి గుండెలో రగులుతుంది ఆవేశం! శ్రమజీవి చమటలో దాగి వుంది సముద్రం అంటూ ‘కష్టజీవి’ కవితను చక్కగా తీర్చిదిద్దారు. గరీబోన్ని చూసి వెక్కిరిస్తుంటారే తప్ప.. కష్టజీవి బాధలు తీర్చే వారెవరు? అని ప్రశ్నించారు.
తెలంగాణ సాధన చారిత్రక ఘట్టమనీ.. నాల్గున్నర కోట్ల జనం నవ్వుల సంబురం తెలంగాణ ఆవిర్భావం! ఇక తెలంగాణ దేదీప్యమానంగా వెలుగొందాలని కవి ఓ కవితలో కాంక్షించిన తీరు బాగుంది. ఓ కవితలో.. జనం గోసకు, గోడుకు గొడుగు పట్టిన ఘనుడు కాళోజీ అని కాళోజీ పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. కాళోజీ మనిషి కోసం పరితపించిన మహానీయుడని కొనియాడారు.
ఖమ్మం ఖిల్లాపై ఆయన రాసిన కవితలో అనేక నిజాల నైజం కోట చరితం అని చక్కగా ఆవిష్కరించారు. అవయవదానంపై రాసిన కవిత సందేశాత్మకంగా వుంది. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుతూ ‘నా ఆశ శ్వాస తెలుగు’ కవితను రాశారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అంటూ మరో కవితను ఇందులో పొందుపరిచారు. ఆధునిక కంప్యూటర్ యుగంలో కనుమరుగవుతున్న కలం పాళి గురించి కవి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. తెలంగాణ తల్లి సిగలో ఒక్కో పూవేసి చందమామలో విరిసిన పసిడి సింగారం..తంగేడు పూవంటూ రాసిన కవితలో చక్కగా తమ భావాలను ప్రకటించారు.
ప్రపంచీకరణ పడగనీడలో..పల్లెలు..ప్రకృతి..పర్యావరణం చిల్లం, కల్లం అవుతున్న వైనాన్ని ఓ కవితలో ఏకరువు పెట్టారు. ఇలా ఇందులోని కవితలు సరళంగా సీదా సాదాగా రూపుదిద్దుకున్నాయి. సముజ్వల భావదీప్తితో సాగే ఇందలి కవితలు కవి యొక్క ఉత్తమ వ్యక్తిత్వాన్ని సూచించేలా వున్నాయి. కవిత్వం రాయడంలోని మెలకువలు తెలుసుకునేందుకు.. అధ్యయనంపై దృష్టి సారించి..మున్ముందు మరింత చిక్కని కవిత్వాన్ని అందిస్తారని ఆశిద్దాం.. మాతృభాష తెలుగు కాకపోయినా.. కవి తన భావాలను అక్షరాల్లో బంధించడం పట్ల అభినందన చందనాలు సమర్పిద్దాం!

- సాన్వి కరీంనగర్, సెల్.నం.9440525544
***

కవితలు
**

నిత్యయవ్వని!

జననం ఒక నిమిషం
మరణం ఒక నిమిషం
ఆ రెంటి మధ్య కాలం సుదీర్ఘం..
అదే జీవితం!
బోసి నవ్వుల ఊసుల నుండి..
పండుటాకులా మారే మలి వయస్సు వరకు
విధి ఆడే వింత నాటకంలో పావులై
సుఖ దుఃఖాలతో, పేగు బంధాలతో
కష్ఠ నిష్ఠూరాలతో, కడుపు తీపితో
క్షణ క్షణం ఓటమితో పోరాడుతూ
అలసి సొలసి వృద్ధ్ఫ్యా ఛాయలతో
అనుభవాల సుమగంధాలను
కనురెప్పల మాటున దాగిన దృశ్యాలను
మది తలపున దాగిన వౌన రాగాలను
గుండె గూటిని కదిలించిన మధుర క్షణాలను
పంటి బిగువన దాగిన పలు వాక్యాలను
ఏడు పదులుగా మార్చే కలానికి
వృద్ధాప్యమే లేదు..
అది నిత్యయవ్వని!
అచ్చెరువొందించే అక్షర సుమగంధాలను
లక్షణంగా పేర్చి పదాల దొంతరలలో
తేలియాడునట్లు చేసే
ఓ పాళీ నీకు వందనం.. అభివందనం!

- నీలగిరి అనిత
రాంనగర్, కరీంనగర్
సెల్.నం.9014894141
**

చల్లగాలి

నారు పోసిన వాడు నీరు పోస్తాడని
భగవంతుని మీద భరోసా
భరోసాలో వెనె్నల వుంది వెలుగుంది
రేపటి విజయముంది
మందు మోతాదు మించితే
రోగం వికటించినట్టు
భరోసా జీవిత భద్రతను కూడా
భగ్నం చేస్తుంది
కలం పట్టకుండా కవిత్వం
ఎలా రాయగలం
తెల్ల కాగితమే మిగులుతుంది
ఆశ విశ్వాసానికి ప్రతీక మాత్రమే
విశ్వాసం రేపటి ఉదయానికి
గీటురాయి మాత్రమే!
ఆత్మలో దీపం దేవుడు
శాంతికి భరోసా ఓ నమ్మకం
సూర్యుడు ఉదయిస్తాడనే భరోసాలో
చీకటిని తప్పుకు
అంకితం చేయలేముగా!
అంతా దేవుడేనని
బురదలో కాలు పెట్టలేముగా
జీవితం బురద కాకూడదు
ఆత్మకు మురికి అంటకూడదు.

- సిహెచ్.మధు
నిజామాబాద్
సెల్.నం.9949486122

**
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net