దక్షిన తెలంగాణ

వచనం మీది మెరుపే కవిత్వం (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచనం మీది మెరుపే కవిత్వమని భావించే సీనియర్ కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ దేవరాజు మహారాజు సమకాలీన తెలుగు సాహిత్యరంగంలో తనదైన ‘రాజముద్ర’ వేసుకున్నారు. తెలుగు వచన కవిత్వంలో తెలంగాణ భాషను ప్రవేశపెట్టి.. తెలంగాణ భాషలో తొలి కవితా, కథా సంపుటాలను ప్రకటించిన ఘనత ఆయనకుంది. అరవై గ్రంథాలను వివిధ ప్రక్రియల్లో ప్రచురించి.. సుప్రసిద్ధ సాహితీవేత్తగా వెలుగొందుతున్న ఆయన జువాలజీ ప్రొఫెసర్‌గా మూడు దశాబ్దాలు వృత్తిని నిర్వర్తించి ఎంతో మందిని పరిశోధకులుగా తీర్చిదిద్దారు. ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ స్థాయి దాకా ఎన్నో అవార్డులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఎమెస్కో, తెలుగు అకాడమీ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, మాధురి పబ్లికేషన్స్, జనవిజ్ఞాన వేదిక, చైతన్య ఆర్గనైజర్స్, ఆయన జీవన ప్రచురణలను ప్రచురించాయి. ఎన్‌బిటి న్యూఢిల్లీ వారికి సలహా సంఘం సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన సాహిత్యంపై వివిధ విశ్వవ్యిలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.. సాహితీ స్వర్ణోత్సవం జరుపుకున్న దేవరాజు మహారాజుతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే...
**
ఆ మీరు ఎన్నో ఏట రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు?
9-10 సంవత్సరాల వయస్సులో రచన ప్రారంభించాను. రాయడం కాదు, గానీ ఏవో పదాలల్లి చెబుతుండేవాన్ని. ఉదాహరణకు ‘ఏటిలోకి ఏగినాము! ఎగిరి ఎగిరి వచ్చినాము! దోబూచులాడినాము! దొమ్మరి గడ్డ లేసినాము’ వంటివి.

ఆ రచనల వైపు రావడానికి మీకు ప్రేరణ నిచ్చిందెవరు?
తొలుత మా అమ్మగారు. తరువాత పాఠశాలలో ఉపాధ్యాయులు, నాలో ఏదో ప్రతిభ ఉందని గ్రహించి నన్ను పాఠశాల గోడ పత్రికకు సంపాదకున్ని చేశారు. నాటి ప్రధానోపాధ్యాయులు ఎం.ప్రభాకర్ రావు గారు, తెలుగు మాష్టారు టి.స్వామినాథన్ గారు ఇంకా మరికొందరు. 1965లో నేను పదోతరగతిలో ఉన్నప్పటి సంగతి.

ఆ కళా శాస్త్రానికి, విజ్ఞాన శాస్త్రానికీ తేడా ఏమిటి?
మనిషి తనేమి చేయగోరుతున్నాడో తెలుసుకునే సాధనం-కళ! మనిషి తనేమి చేయగలడో తెలుసుకునే సాధనం-విజ్ఞాన శాస్త్రం!! కళయినా, విజ్ఞాన శాస్తమ్రైనా తొలి దశలో భావనలే.. కానీ, ఒక స్థాయి భావనలు కళగా మారిపోతే, మరోస్థాయి భావనలు విజ్ఞాన శాస్తవ్రౌతాయి. ముడిసరుకంతా దాదాపు ఒక్కటే. బయటి కొచ్చే ఉత్పత్తి దశల్లో అవి తేడాలు మాత్రమే!

ఆ మంచి కథకు ఉండాల్సిన లక్షణాలు చెపుతారా?
సాహిత్యానికి ఉండే లక్షణాలు, ప్రయోజనాలు ఒకటేగానీ, ప్రత్యేకించి కథ గురించి చెప్పుకోవాలంటే జీవిత ప్రతిబింబమే కథ. ఆకాశమంత విస్తృతమైన జీవితాన్ని నాలుగు పేజీల్లో మదించగలగడమే కథ. మళ్లీ ఆ నాలుగు పేజీలే నాలుగు కోట్ల మంది జీవితాల్ని దర్శింప జేయగలగాలి.
ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
శుద్ధ వచనం కానిది కవిత్వం. వేల సంఖ్యలో ఉన్న నేటి కవుల్లో ఏ కొద్ది మందో రాస్తున్నది కవిత్వం. నేరుగా వెళ్లి హృదయాన్ని అలరించేది కవిత్వం. వచనం మీది మెరుపు కవిత్వం!

ఆ మీ ముద్రిత గ్రంథాలు?
సుమారు అరవై. ఇందులో కవిత్వం, కథ, నాటికలు, సాహిత్య వ్యాసాలు, అనువాదాలు, బాల సాహిత్యం, సరళ వైజ్ఞానిక రచనాలూ ఉన్నాయి.

ఆ మీ రచనల్లో ఎక్కువ భాగం విజ్ఞాన శాస్త్రానికి పెద్దపీట వేస్తారు. కారణం?
చిన్నప్పటి నుండి నాలో ఉన్న సాహిత్యాభిలాషను ఒకవైపు పెంచుకుంటూ మరోవైపు జీవశాస్త్ర విద్యార్థిగా ఎదిగాను గాబట్టి! అందులోనే పిహెచ్‌డి పట్టా (1979) పొందాను కాబట్టి, ముప్పయ్యేళ్లు విద్యార్థులకు అదే బోధించాను.

ఆ తెలంగాణ మాండలికంలో మీరు రాసిన రచనలకు ప్రేరణ ఏమిటి?
తెలంగాణ ప్రజలు - జీవితం. అంతకన్నా మరో ప్రేరణ ఏముంటుంది? నా పదహారోయేట హైదరాబాద్ వచ్చి పియుసిలో చేరిన నాటికి (1967) పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. బయటికి వెళ్తే ఉరుదూ మాట్లాడవలసి వచ్చేది. సాహిత్య సభల్లో గ్రాంథికం, పద్యాలు లేదా వ్యవహారిక రచనలు అప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. గ్రామాల్లో జనం మాట్లాడే భాషకు ఇక్కడ చోటు లేదా అని కావాలని తెలంగాణ ప్రజల భాషలో ‘ఊల్లెకు గాదొచ్చింది’ రాశాను. అపూర్వమైన స్పందన వచ్చింది. కొనే్నళ్ల పాటు ఆ భాషలోనే కవిత్వం, కథలూ రాశాను. నాకంటే ముందు తెలంగాణ ప్రజల భాషలో కవిత్వం రాసిన వారు లేరు. అయితే కథలు రాసిన వారున్నారు. కానీ ఎవరి పుస్తకం అచ్చు కాలేదు. 1977లో వచ్చిన నా కడుపు కోత కథల పుస్తకమే మొదటిదయ్యింది.

ఆ కథ, కవిత్వం రెండు ప్రక్రియల్లో ఏది రాయడం సులభం?
ఒక తపనతో, ఒక బాధ్యతతో రాసే వారికి ఏదీ సులభం కాదు అంతే.

ఆ కొత్త కవులకు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా?
కొత్త కవులకు, రచయితలకు అనే కాదు.. అసలు ఈ తరం కుర్రవాళ్లకు ఎవరి సలహాలు, సూచనలు అవసరం లేదు. వాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. గతంలోని మంచి సాహిత్యం, సమకాలీనంలోని మంచి సాహిత్యం చదువకుండానే, తెలుసుకోకుండానే.. తామే ఒక చరిత్ర సృష్టిస్తున్నామన్న భ్రమలో రాస్తున్న యువ కవులకు, రచయితలకు మన సలహాతో పనేముంది?

ఆ మీకు నచ్చిన కవి/రచయిత ఎవరు?
ఏ ఒక్కరి పేరు చెప్పలేను. ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దది. కాలేజీలో చదువుకునే రోజుల్లో నుండే విశ్వసాహిత్యం చదువుకోవడం ప్రారంభించాను. నాకు నచ్చిన వారి రచనలు తెలుగులోకి అనువదిస్తూ వచ్చాను. మామ్, చెకోవ్, మపాసా, ఓ హెన్రీ, స్టెయిన్ బిక్ వగైరా. తరువాత కాలంలో భారతీయ కవుల్ని, రచయితల్ని చదివాను.. ఇంకా వెనక్కి వెళ్లి కాళిదాసును చదివాను. అనువాదకుడికి ఉట్టి పఠనం సరిపోదు. అధ్యయనమే చేయాలి. నేను ఇప్పటికీ అదే పనిలో ఉన్నాను. మార్క్సిస్టు దృక్పథంతో ప్రభావితున్నైనాను. కాబట్టి ఆ పరిధిలోకి వచ్చే సాహిత్యకారుల్ని చదువుతూనే ఉంటాను. వందల సంఖ్యలో వచ్చిన/వస్తున్న నా అనువాదాలు ఈ విషయాన్ని చెపుతాయి.

ఆ సాహితీ పురస్కారాలపై, సాహితీ సంస్థల పనితీరుపై మీ అభిప్రాయం?
సదభిప్రాయమే ఉంది. సంస్థలు, పురస్కారాలు ప్రకటించే విషయంలో బాధ్యతతో, నిజాయితీతో పనిచేస్తే బాగుంటుందనుకుంటాను.

ఆ నేటి తరాన్ని సాహిత్యం వైపు మళ్లించాలంటే ఏం చేయాలి?
చదవడం బొత్తిగా మానివేసిన నేటితరాన్ని సాహిత్యంవైపు ఎట్లా మళ్లిస్తారు? డబ్బు, అధికారమూ పుష్కలంగా ఉన్నవారెవరు యువతరం గురించి, భవిష్యత్ సాహిత్య రంగం గురించి ఏ కృషి చేయలేదు. లబ్ధ ప్రతిష్టులంతా వారి వారి స్వార్థ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్న దశలో యువతరాన్ని సాహిత్యం వైపు ఎట్లా మళ్లిస్తారు? పాఠశాల స్థాయి నుండే పిల్లలకు పుస్తకం విలువ, సాహిత్యం విలువ తెలియజెప్పాలి. బాల సాహిత్యాన్ని బొత్తిగా విస్మరించాం. రాబోయే యువకుల్లో సాహిత్యాభిలాష ఎలా పెరుగుతుంది? విద్యావిధానంలోని లోపాల్ని సవరించుకుంటూ తగిన వాతావరణాన్ని రూపొందించాలి!

ఆ మారుతున్న సమాజంలో-రచనల్లో ఇజాలు, వాదాలు అవసరమంటారా?
రచనలెప్పుడూ సమాజాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కాబట్టి సమాజంలోని ఇజాలు-వాదాలు రచనల్లో ఉంటున్నాయి. తప్పదు. అవే జీవనాధారం కాకూడదు. ఎవరి అభిప్రాయాల్ని వారు స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునేంత వరకు వాదాలైనా, ఇజాలైనా ఉండాలి. తమదే సరైన వాదం అనే మూర్ఖత్వంలోకి పోతే అసలు మానవతావాదమే దెబ్బతింటుంది.

ఆ మీపై ప్రభావం చూపిన గ్రంధమేది?
ఏ ఒక్క గ్రంథం పేరో చెప్పలేను. నాకు స్ఫూర్తినిచ్చిన వారు కేవలం కవులు, రచయితలు మాత్రమే కాదు...సంఘ సంస్కర్తలు, నటులు, గాయకులు ముఖ్యంగా శాస్తవ్రేత్తలు.. వారి ఉపన్యాసాలు, జీవిత చరిత్రలు ఎన్నో ఉన్నాయి. క్లుప్తంగా చెప్పడం వీలుకాదు.

ఆ తెలంగాణ ఆవిర్భావానికి ముందు సాగిన ఉద్యమాల నేపథ్యంలో కథలు రావాలని కోరుకుంటారా?
తప్పకుండా కోరుకుంటాను. తెలంగాణ ఉద్యమం అనేక దశల్లో సాగింది. ఆయా దశల్లో రావాల్సినంత సాహిత్యం రాలేదు. ఉద్యమం తాత్కాలికం. జీవితం శాశ్వతం. అసలు తెలంగాణ ప్రజాజీవనానికి అనేక ప్రత్యేకతలున్నాయి. జీవన సంఘర్షణలోంచి తన్నుకొచ్చిన వారిని ఎవరిని కదిలించినా వందల కథలు చెపుతారు. అలాంటి జీవన వ్యథలు ఏ కొద్దిగానో గ్రంథస్థమయ్యాయి. ఎన్నో వేల వేల కథలు తమకు అక్షర రూపమియ్యండని నిశ్శబ్దంగా ఘోషిస్తున్నాయి. వాటిని వినగలిగే స్థోమత, రాయగలిగే సమర్థత ఉన్న వారు ఎవరైనా పూనుకుంటే మనకింకా ఎంతో మంచి సాహిత్యం, ప్రజాసాహిత్యం మిగులుతుంది.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544