నెల్లూరు

తెలివైన పరిమళ (మినీకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు బస్సు రాగానే ఎక్కి కూర్చొన్నాడు విష్ణు. సేల్స్‌మేనేజర్ కాబట్టి రోజూ ఏదో ఒక జిల్లాకి తప్పకుండా వెళ్లాలి. ఈరోజు నెల్లూరు, రేపు చిత్తూరు, ఎల్లుండి కర్నూలు రోజు తిరగలేకపోతున్నాను అనుకుంటూ తలపట్టుకున్నాడు. సెల్ తీసి గేమ్స్ ఆడటం మొదలెట్టాడు.
నాలుగైదు బస్‌స్ట్ఫాలు దాటగానే బస్సు నిండిపోయింది. ఒక అరగంటలో నెల్లూరు వచ్చే సమయానికి విష్ణు పక్కన ఉన్న వాళ్లు దిగిపోయారు. వెంటనే ఓ అందమైన అమ్మాయి ఎక్కింది. బస్సు అంతా చూసి సీట్లు ఎక్కడ ఖాళీ లేకపోవడంతో విష్ణు పక్కనే కూర్చుంది.
అమ్మాయిని చూడగానే కళ్లు తిప్పుకోలేకపోయాడు. విష్ణు పదేపదే ఆమెను చూస్తూ పరవశించిపోయాడు. మెడలో తాళిబొట్టు, కాళ్లకు మెట్టలు లేకపోవడంతో ఏదోవిధంగా మాట్లాడాలి, కుదిరితే ఫోన్ నెంబరు కూడా సంపాదించాలి అనుకున్నాడు.
మరో పదినిమిషాల్లో నెల్లూరు వచ్చేస్తున్న సమయంలో ఆమె తన హ్యేండ్‌బ్యాగ్‌లో నుండి మెట్టెలు, బంగారుతాళి తీసింది. విష్ణు ఆమెవైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
మెట్టెలు కాళ్లకి పెట్టుకుని, గొలుసు మెడలో వేసుకొంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందో అర్ధం కాలేదు విష్ణుకు.
ఇంక చేసేదిలేక అడిగేశాడు!
‘‘తప్పండి..! పవిత్రంగా చూడాల్సిన మెట్టెలు, తాళిబొట్టు ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు, పెట్టుకోకూడదు.. ఇది ఆచారాలకు విరుద్ధం. మీ భర్త బ్రహ్మమూహూర్తం నాడు కట్టిన తాళిని తీయడం అపచారం అని కొంచెం కోపంగా చెప్పాడు’’ విష్ణు.
‘‘అసలు నాకు పెళ్లే కాలేదండీ! అని అమాయకంగా నవ్వుతూ చెప్పగానే.. ‘‘పెళ్లి కాలేదా? అని సడన్‌గా అడిగాడు.
‘‘అవునండీ’! నాకు పెళ్లి కాలేదు’ నేనొక ఆఫీసులో పనిచేస్తున్నాను అక్కడ ఎక్కువమంది మగవాళ్లు ఉంటారు, అలాంటప్పుడు నాకు పెళ్లి కాలేదంటే ననే్న నిరంతరం చూడటం, అదేపనిగా కామెంట్లు చేయడం, వెంటపడటం, వేధించడం, ఫోన్లు, మెసెజ్‌లు, చాటింగ్‌లు అంటూ విసిగిస్తారు. అదే పెళ్లయింది అంటే కొంతలో కొంత గౌరవంగా చూస్తారు. వేధింపులు, కామెంట్లు ఉన్నా అది కొంతవరకే. గీత దాటకుండా ప్రవర్తిస్తారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది’’ అని చెప్పింది.
ఆ మాటలకి తల ఎత్తుకోలేకపోయాడు విష్ణు. నిజమే ఆమె చెప్పింది నూటికి నూరుశాతం నిజం. ప్రతి మగాడి ఆలోచన అలానే వుంటుంది. అంతేందుకు మరో నెలరోజుల్లో నాకు పెళ్లి. కానీ అమ్మాయిని చూడగానే ఏదొకటి మాట్లాడాలి అనుకోవడం సిగ్గుచేటు. మాగాళ్ల వల్ల ఆడవాళ్లు ఏదోవిధంగా వేధింపులకు లోనవుతూనే ఉంటారు. ఇంతలో నెల్లూరు రావడంతో బస్సు ఆపాడు డ్రైవర్.
చెల్లెమ్మ వచ్చే నెలలో నా పెళ్లి మీరు తప్పకుండా రావాలి. అలాగే అన్నయ్య!
చెల్లెమ్మా మీ పేరు.. ‘పరిమళ’ అన్నయ్యా..
‘‘నువ్వు తెలివైన పరిమళవి.. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దు’’ చెప్పాడు విష్ణు.
సరే అని బస్సుదిగింది పరిమళ. గబగబా నడిచి విజిటింగ్‌కార్డ్‌ని డస్ట్‌బిన్‌లో పడేసి చకచకామంటూ కాంప్లెక్స్ నుండి మాయమైంది. ఈ సన్నివేశం చూసిన విష్ణు నిజంగానే ‘తెలివైన పరిమళ’ అనుకున్నాడు.

***

మనోగీతికలు

నా నువ్వు - నీ నేను

నాకు నువ్వు, నీకు నేను
నువ్వు లేక నేను లేను నిజం కదా
నన్ను చూస్తేనే నీలో భావావేశం పొంగుతుంది
నీలో అది మొదలవగానే మొగ్గలాగా ముడుచుకున్న నేను నీకు అనుకూలంగా మారిపోతాను
అప్పటి వరకూ శే్వతవర్ణంతో ఉన్న నాకు నీ స్పర్శతో నాలో ఎన్ని రంగులో
ప్రాచీన కాలం నుండీ మనిద్దరిలో ఎన్ని మార్పులు
దళసరిగా చుట్టలకట్టలా ఉన్న నా రూపం
ఎంతో నాజూకుగా
పలు ఆకారాలుగా రూపాంతరం చెందాను
తాటిచెట్టులా మొద్దుగా వున్న నువ్వు కూడా
పొడవుగా హీరోలా తయారయ్యావు
ఏ ముహూర్తాన ఆ బ్రహ్మ మన జంటను
సృష్టించాడో గానీ
తరతరాలుగా మనది విడదీయరాని
బంధమయ్యింది
ఎన్ని జంటు మనల్ని చూసి కళ్లుకుంటున్నాయో
నువ్వు లేకపోతే నాకు ఉనికే లేదు
నేను లేకపోతే నీకు అర్ధమే లేదు
ఆది నుండి పలు పేర్లతో పిలువబడ్డ మనకు
ఈ లోకం శాశ్వతమైన పేర్లు పెట్టింది
కలమని నీకు, కాగితమని నాకు.

- దువ్వూరు సుమలత, నెల్లూరు
చరవాణి : 9494799248
**

వర్ధమాన కవి

సూర్యచంద్రులను నేత్రాలు చేసుకొని
లోకాన్నంతా శోధిస్తున్నాడు
అడుగడుగునా పెచ్చరిల్లుతున్న అవినీతిని
అహర్నిశలు ప్రతిఘటిస్తున్నాడు
అతివల మీద జరిగే అరాచకాలను
ఆక్రోశంతో ప్రశ్నిస్తున్నాడు
పసిపాపల మీది పాశవిక చర్యలను
నడివీధిలో నిలబడి నిలదీస్తున్నాడు
కులతత్వాన్ని, మతోన్మాదాన్ని
అన్యాయాలను, అక్రమాలను
తన కంటి కిరణాలకు సోకిన
ప్రతి అఘాయిత్యాన్ని
అక్షర రూపంలో పొదిగిపొదిగి
అలుపెరుగని విక్రమార్కునిలా
జనంలోకి విసురుతూనే వున్నాడు
అతని మనసుకు ఆశలు లేవు
కులం లేని తన కలం
యువతను కదిలించాలనే తపన తప్ప
అతనికున్న కోరిక ఒక్కటే
తన ఆయుధం త్రిశూలమై
నేటితరానికి విజ్ఞాన వీచికై
నరరూప రాక్షసులకు అశనిపాతమై
నిరుపేదలకు కాంతిదీపమై
అందరికీ వెలుగులు పంచి
అజరామరమై నిలవాలని
అనుక్షణం పోరాడుతూనే వున్నాడు
నేటి వర్ధమాన కవి
అతని ఆవేదనను గుర్తించండి
అతని అక్షరాన్ని ఆస్వాదించండి
అతని ఆశయానికి చేయూతనివ్వండి
అవనిన శాంతిని నెలకొల్పండి

- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9052048706
**
పురుచ్చితలైవికి నివాళి

అక్షర నివాళి

ఆమె బతుకు పుస్తకం నిండా
సంఘర్షణలు
సంచనాలు
పోరాటాలు
ప్రతీకారాలు
అవమానాల నిచ్చెనలనెక్కి
సన్మానాల పర్వతాలు ఎక్కిన
అలుపెరుగని బాటసారి
అపజయాల చీకటి నుంచి
విజయాల వెలుగుబాటలోకి
ప్రయాణించిన వీరనారి
ఆమె వెండితెర మీద సుమబాల
రాజకీయ వేదిక మీద అగ్నిజ్వాల
ఆమె కళ్లు శత్రువులపై అగ్ని వర్షాన్ని
పేదలపై ప్రేమ వర్షాన్ని
ఏకకాలంలో కురిపిస్తాయి
ఆమె అడుగు అడుగులో
ఆత్మాభిమానం
అధికార దర్పం కనిపిస్తాయి
ఆమె ఎగసిపడే కడలి
అందెల రవళి
బహుముఖ ప్రజ్ఞాశాలి
ఆమె ధీరత్వం మనకు స్ఫూర్తి కావాలి
జయలలితకు ఇదే అక్షరనివాళి
- మోపూరు పెంచల నరసింహం, నెల్లూరు.
చరవాణి : 7386362476
**
నీ జన్మ కోసం

అమ్మ నీవు తల్లివి కాకపోయినా
కొన్ని కోట్ల మంది మనసులను
దోచుకున్న అమ్మవి
నీ పరాభవం నీకు ఒక సహనం
ఆ సహనమే నిన్ను విజయం
వైపునకు మరలించింది
పురుచ్చితలైవి
ఇంకా ఎన్ని జన్మలు
ఎదురుచూడాలి
నీ జన్మ కోసం ఈ ప్రజలు

- బొమ్మసముద్రం హరికుమార్
పాకాల, చిత్తూరుజిల్లా
చరవాణి : 9177530367