ఉత్తర తెలంగాణ

మోక్షం ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోక్షం మోక్షం అంటారు
పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతారు
చుట్టూ ఆకలితో అలమటిస్తున్న
అన్నార్తులను మాత్రం ఆదుకోరు
స్వార్థం కోసం పేదవారి శ్రమను
పగలు రాత్రి దోపిడీ చేస్తారు
విరిసీ విరియని విరులను
బానిసలుగా చేస్తారు
బోలేడు సేవలు చేసుకుంటారు
భక్తి శివుని మీద పెట్టి
చిత్తం చెప్పుల మీద ఉంచుతారు
నోట్లో రామనామం జపిస్తారు
చంకలో చురకత్తులు దాచుతారు
మూడో కంటికి తెలియకుండా
ప్రాణం తోడేస్తారు
తూకంలో మోసం చేస్తారు
వినియోగదారుని తోలుతీస్తారు
మాయమాటలు చెపుతారు
నమ్మించి మోసం చేస్తారు
ఆదర్శాలెన్నో వల్లిస్తారు
అడ్డదారుల్లో నడుస్తారు
మోక్షం కోసం పాకులాడుతారు

- జాధవ్ పుండలిక్ రావు పాటిల్
భైంసా, నిర్మల్ జిల్లా, సెల్.నం.9441333315
**

ఆశయసాధన

పసిడి మేడకోసం పరుగులు తీసే
పసివాడా! కొంచెం ఆగు!
మిసమిసలాడుతోంది కదా అని
కొసరే చూపులతో చూడకు
పసిడిని అందుకోవడం కష్టం
పసితనపు అమాయకత్వం
పస తెలియని అనుభవరాహిత్యం
నినె్నప్పుడూ వెంటాడుతాయి
అసమాన ప్రతిభ కవలసిందే
అసదృశ భాగ్యాన్ని అందుకోవడానికి
ప్రతిభ అంతతొందరగా అలవడదు
అహోరాత్రాలు పరిశ్రమించాలి!
అనేక యత్నాలతో శ్రమించాలి!
అంగరాలను మింగాలి
కడగండ్ల వడగండ్లకు తట్టుకోవాలి
అన్ని పరీక్షలలో నెగ్గాలి
అన్నింటికీ తల ఒగ్గాలి
అప్పుడే నీ ఆశ సఫలం!
లేకుంటే అంతా విఫలం!!

- డా. అయాచితం నటేశ్వరశర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557
**

వర్షపు చుక్కలు!

కరువు కాటకాలను పారద్రోలి
రైతు పెదాలపై
చిరునవ్వులను చిందింపజేస్తాయి..
బీటలు వారి నోరెళ్లబెట్టిన
పుడమి తల్లి తనువును
పులకరింపజేస్తాయి..
ధరణి గర్భం నుండి
పురుడు పోసుకుని
బయటపడే మొలకలకూ
చిరుప్రాణం.. వాన చినుకులే!

- గుండు రమణయ్య
పెద్దాపూర్, జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా
సెల్.నం.9440642809
**

అ‘పూర్వ’ సమ్మేళనం

వయోభారాన్ని వ్యథా చరితల్ని ఒక్కింత పక్కకు పెట్టి
ఒంటరిగా రివ్వున ఎగిరి వచ్చాయి
అరమరికలు లేని విధంగా
చెరి సగంగా బ్రతికిన రోజుల్ని
పెరిగిన వాడల్ని తిరిగిన ప్రాంతాల్ని
గుర్తు పెట్టుకొని గుసగుసలాడుకున్నాయి
చదువులు చెప్పిన గురువులకు
సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ
అనుభవాల మధురిమలను
అనురాగంతో ఆస్వాదించుకున్నాయి
పిల్లలతో కలిసి వచ్చి
పిల్లల్లా ఆటలాడుకున్నాయి
మురిపాల ముచ్చట్ల ఝరిలో కేరింతలు కొడుతూ
చిరునామాలను సేకరించుకుంటూ
చిరునవ్వుల్ని వెదజల్లుకున్నాయి
తీపి సంతకాల ఛాయాచిత్రాల్ని
తాపీగా ముందరేసుకొని ముద్దులొలుకబోసాయి
చిరుప్రాయం సంగతుల్ని వరసిద్ధిగా ఆరాధిస్తూ
చిత్తంలో చెరిపేయని చిత్తరువులా పదిలపరుచుకున్నాయి
ఒకే గూటి పక్షులన్నీ
ఒకే కుటుంబంగా ఒదిగిపోతూ
ఆహ్వానాల ఆలింగనాలతో
ఆప్యాయతల్ని పెంచుకున్నాయి
ఏడాదికొక్కమారు ఎక్కడెక్కడున్నా
ఇక్కడే కలుసుకోవడానికి
చక్కని ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి
వాటి కలిమికి శతాభినందనాలు..!
వాటి చెలిమికి సహస్ర వందనాలు..!!

- రాకుమార
గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, సెల్.నం.9550184758
**

నల్లధనం

కొత్త నోట్లు వచ్చాయి
ఫక్కున ఆనందంగా నవ్వాయి
నల్ల కుబేరుల గుండెల్లో, సునామి వచ్చింది
పాత నోట్లు ఏడ్చాయి,
మా బతుకులు మసి అయ్యాయి అంటూ,
నల్లధనం పేరుతో మమ్మల్ని బంధించారు అంటూ,
అయ్యో, దురాశపరుల చేతుల్లో పడ్డామే అంటూ,
కట్టలు కట్టలుగా కట్టి,
మమ్మల్ని ఊపిరాడకుండా చేశారా అంటూ,
నల్లధనం రూపంలో ఉన్న పాతనోట్లు రోదించాయి!
ఎవరో వస్తారు విడిపిస్తారు అంటూ
ఎదురుచూశాయి! కానీ..
ఇంత త్వరగా ఉరిశిక్ష పడుతుందని
ఊహించలేదు అంటూ ఆక్రోశించాయి
స్వార్థపరుల చేతుల్లో ఉండి
సత్కార్యాలకు ఉపయోగపడని
ఈ జీవితం కన్న చావడం మేలని,
ఉరిశిక్ష విధించే తలారి కోసం
సంతోషంగా ఎదురుచూస్తున్నాయి!
వచ్చే జన్మలో ధర్మబద్ధమైన పాలనలో,
ధర్మాత్ముల చేతుల్లో ఉండాలని,
దేశ సంపద పెరగాలని,
పేదవారికి ఉపయోగపడాలని,
ఆ భగవంతుని వేడుకుంటూ... పెద్దనోట్లు
సంతోషంగా ఉరిశిక్షను స్వాగతించాయి!

- చిలుకమర్రి విజయలక్ష్మి
ఇటిక్యాల, జిల్లా జగిత్యాల
సెల్.నం.9493210293