ఉత్తర తెలంగాణ

ఆదర్శం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలానికి ఇద్దరు కుమారులు. వాళ్లని బాగా చదివించి ప్రయోజకులను చేయాలని గోపాలం బాగా కష్టపడేవాడు. ఆస్తులు కూడా బాగానే కూడబెట్టాడు. తను ధర్మంగా ఉంటేనే తన సంపాదనతో తన పిల్లలు అభివృద్ధి చెందుతారని నమ్మేవాడు గోపాలం. అందుకే ధర్మానికి విరుద్ధంగా ఎన్నడూ ఏ పని చేయలేదు.
అతని మంచితనం వల్లే అతని కుమారులు ఇద్దరూ బాగా చదివి మంచిగా వ్యాపారంలో స్థిరపడ్డారు. ఒక రోజు గోపాలం తన ఇద్దరు కుమారులని పిలిచి ఎప్పుడూ ధర్మం తప్పకూడదనీ ధాన ధర్మాలు చేయాలనీ, ఇతరులను మోసం చేయకూడదనీ. అలా నీతిగా జీవిస్తేనే మీ సంతానం వృద్ధిలోకి వస్తారనీ చెప్పి తన ఆస్తినంతా ఇద్దరు కొడుకులకు సమానంగా పంచి, వ్యాపారం మానేసి తీర్థయాత్రలకు బయలుదేరాడు.
కొంత కాలానికి తీర్థయాత్రలు ముగించుకొని తిరిగొచ్చిన గోపాలం తన ఇద్దరు కొడుకుల దగ్గరికి వెళ్లి వాళ్ల వ్యాపారం ఎలా సాగుతుందో తెలుసుకోవాలనుకుని పెద్ద కొడుకు రాము ఇంటికి వెళ్లాడు.
గోపాలాన్ని చూడగానే పెద్ద కోడలు సుమతి నమస్కరిస్తూ ‘బాగున్నారా మామయ్య’ అని పలకరించింది. ‘ఆ బాగున్నానమ్మా’ అంటూ లోపలికి వెళ్లాడు గోపాలం. రాము ఇల్లంతా సుఖసంతోషాలతో, పిల్లలతో కళకళలాడుతూ ఉంది. ఇంట్లో ఎప్పుడూ నిత్యాన్నదానం, పూజలు, పునస్కారాలు జరుగుతున్నాయి. ఇదంతా చూసి గోపాలం చాలా సంతోషపడ్డాడు.
తరువాత చిన్న కొడుకు సోము ఇంటికి బయలుదేరాడు గోపాలం. సోము వాళ్లింటికి వెళ్లగానే పిల్లలు ఏడుస్తూ కన్పించారు. ‘పిల్లలూ ఎందుకు ఏడుస్తున్నారు’ అన్నాడు గోపాలం. ‘ఆకలేస్తుంది తాతయ్యా’ అన్నారు పిల్లలు. గోపాలం మనసు తరుక్కుపోయింది. కోడలు అలిగి పుట్టింటికి వెళ్లిందని తెలిసింది. సోమును చూస్తే బలహీనంగా కనిపిస్తున్నాడు.
‘ఏమయింది కొడుకా ?ఇలా తయారయ్యావు’ అడిగాడు గోపాలం. తండ్రిని చూడగానే కన్నీరు పెట్టుకున్నాడు సోము. ‘నాన్నా.. వ్యాపారంలో నష్టపోయాను. ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదు. అందుకే నా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది నాన్నా’ అంటూ ఏడుస్తాడు సోము. అప్పుడు గోపాలం ఇరుగు పొరుగువాళ్ల ద్వారా సోము దానధర్మాలు చేసేవాడు కాదని, అధిక వడ్డీలు వసూలు చేసేవాడని, ఎదుటివారు ఎంత కష్టంలో ఉన్నా ఆర్థికసహాయం చేసేవాడు కాదని తెలుసుకున్నాడు.
సోముకు ఎలాగయినా తను చేసే తప్పేమిటో తెలిసేలా చేయాలని నిర్ణయించుకున్నాడు గోపాలం.
సోమును పిలిచి ‘గదిలోకి వచ్చిన గాలిని తిరిగి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే బంధిస్తే ఏమవుతుందని’ అని ప్రశ్నిస్తాడు. ‘గదంతా వేడెక్కడమే కాకుండా ఇల్లంతా చెడువాసన వస్తుందనీ, అలాంటి పరిసరాల్లో ఉంటే ఆరోగ్యం పాడవుతుందనీ ఎప్పుడూ గదిలోకి వచ్చిన గాలి బయటకు వెళ్లేలా కిటికీలు తెరిచి ఉంచితే చెడుగాలి బయటకు వెళ్లి స్వచ్ఛమయిన గాలి ఇంట్లోకి వస్తుంది’ అని సమాధానమిస్తాడు.
‘గాలి లాగానే డబ్బు కూడా సంపాదించినదంతా దాచిపెట్టి ఉంచితే, ఎవరికీ సాయం చేయకుండా ఉంటే ఆ డబ్బు కూడా మనకి సంతోషాన్నివ్వలేదని, ఎప్పుడూ వచ్చిన సంపాదనతో కొంత దానధర్మాల పేరిట చేయి మారుస్తూ ఉంటే అది పదింతలై తిరిగి వస్తుందనీ, ఇంట్లో సుఖశాంతులు నిలుస్తాయి’ అని చెప్పాడు గోపాలం.
సోము ఆ రోజు నుండి తనకున్నదాంట్లో దానధర్మాలు చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ధర్మమార్గంలో నడవసాగాడు. తొందరలోనే సోము కూడా రాములాగా గొప్పవాడవుతాడు. అతని భార్య కూడా తిరిగి వస్తుంది.
రాము, సోము ఇద్దరూ కూడా తమకు మంచి సంస్కారాన్ని నేర్పించి తమ అభివృద్ధికి కారణమయిన తండ్రిని దైవ సమానంగా చూసుకుంటూ నలుగురిలో ఆదర్శవంతంగా జీవించారు.

- బి. హరిప్రియ గిరిధర్ రావు, కరీంనగర్, సెల్.నం.9133293384

**

సాహిత్య సమాచారం

రాష్టస్థ్రాయ సాహితీ పురస్కారానికి
ఎంట్రీలు ఆహ్వానం

ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సంగనభట్ల నరసయ్య తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నెలకొల్పిన రాష్టస్థ్రాయ సంగనభట్ల నరసుబాయమ్మ, వెంకన్న స్మారక సాహితీ పురస్కారం కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య సాహితీ గౌతమి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాస్యం సేనాధిపతి, గాజుల రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2013-15 సంవత్సరాల మధ్య సాహిత్య విమర్శా శాస్త్రం’పై వెలువడిన గ్రంథాలను మూడు ప్రతుల చొప్పున ఫిబ్రవరి 10వ తేదీలోగా డాక్టర్ సంగనభట్ల నరసయ్య, జి-3, ఫ్లాట్ నెం.199, గాయత్రి రెసిడెన్సీ, సిరిపురం కాలనీ, ఆర్‌టిఏ ఆఫీసు వెనుక, మలక్‌పేట, హైదరాబాద్ -36 చిరునామాకు పంపాలని కోరారు. వివరాలకు 9440073121 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు.
**
పుస్తక సమీక్ష

అవీ, ఇవీ, అన్నీ!!

పేజీలు: 168, వెల : 150/-
ప్రతులకు:
పెంటమరాజు నరసింగరావు
ఇం.నం.16-156
నాగర్‌కర్నూల్ - 509209
సెల్.నం.9440458132

కంద కవిసింహా, సకల కళాభూషణ బిరుదాంకితులు.. కవి, కథకులు పెంటమ రాజు నరసింగరావు ‘వివిధ’ పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. అవీ, ఇవీ, అన్నీ అన్న చందంలా.. ఈ గ్రంథంలో కలగూర గంపలా.. కలగాపులగం వోలే.. నరసింగరావు వివిధ ప్రక్రియల్లో తాను రాసిన రచనల్ని పొందుపరిచారు. కనుకనే ‘వివిధ’ అని ఈ పుస్తకానికి నామకరణం చేశారు. మహా కవిపై ఆయన రాసిన వ్యాసాలను, వివిధ అంశాలపై రాసిన పాటలను, పద్యాలను, వచన కవితలను, ఒక కథను ఇందులో చేర్చారు. అన్నింటికి మించి సామాజిక చైతన్యం కోసం నరసింగారావు రాసిన మినీ కవితలను, సూక్తులను ఈ గ్రంథంలో ప్రచురించి అందరి దృష్టినాకర్షింప యత్నించారు. ఇప్పటికే ఇరవై గ్రంథాలను వెలువరించిన అనుభవం వున్న నరసింగరావు ఇలా అన్ని ప్రక్రియలను కలిపి ఒకేచోట వేయడం బాగుండదన్న విషయం ఆయనకు తెలియంది కాదు... ఒక్కో ప్రక్రియలో.. కావలసినంత రచనలు పూర్తి చేసి.. విడివిడిగా ఒక్కో గ్రంథం వెలువరిస్తే బాగుండేదని మన కనిపించినప్పటికీ.. ఆయన అభీష్టాన్ని మనమెవరం కాదనలేము కదా! శ్రీశ్రీపై రాసిన వ్యాసాల్లో నరసింగరావు శ్రామిక జనచైతన్యానికి శ్రీశ్రీ జయభేరి మ్రోగించిన విషయాన్ని, మహా ప్రస్థానంలో బహుజన అధికారాన్ని శ్రీశ్రీ ఎలా ఆవిష్కరించారో చక్కగా విశే్లషించారు. పద్య విభాగంలో సింగయ శతకం, నీతి చంద్రిక, పాణిగ్రహణ పంచరత్నాలు, పుష్కరేచ్ఛ, గురుపూజోత్సవం, గురుఃబ్రహ్మ ప్రతిష్ఠ, వర్షహేళ, హీనదాత, తదితర పేర్లతో రాసిన పద్యాలు వివిధ ముకుటాల్లో రూపుదిద్దుకున్నాయి. ఆధునిక తెలంగాణ చాటువులు శీర్షికన తెలంగాణ పోరులో బిడ్డల ఘనతలు, త్యాగాలను ఓ మోస్తారుగా ఆవిష్కరించారు. వచన కవిత్వం విషయానికొస్తే..కలాంకు సలాం సమర్పించారు. వాడని మోదుగు పువ్వు అందాలను అక్షరాల్లో బంధించారు. ఓ కవితలో ఆఫీసు దృష్టాంతాలను ఏకరువుపెట్టారు. దాశరథి అంగారం..అప్పుడప్పుడు శృంగారం తెలుగు వాళ్ల బంగారం..రుద్రవీణ, అగ్నిధార అంటూ కవితా చమత్కృతులను ఈ గ్రంథంలో పొందుపరిచారు. నరసింగరావుపై ఇతర కవులు రాసిన కవితలకు ఇందులో చోటు కల్పించారు. జ్ఞానోదయం పేరుతో రాసిన కథ ఓ మినీ వ్యాసంలా రూపుదిద్దుకుంది. కథ లక్షణాలసలే కనిపించవు.. ఇలా.. వివిధలో రచయిత పెంటమరాజు నరసింగరావు గారి వివిధ ప్రక్రియల్లో ఆయనకున్న ఆసక్తిని గమనిస్తాం.. ఈ గ్రంథంలోని రచనలలో సాహిత్య ప్రయోజనాన్ని కాంక్షించేవారు కొంత మేర నిరాశపడినప్పటికీ..ఆయనకు సాహిత్య సృజన పట్ల వున్న మక్కువను మెచ్చుకుంటారు. ఇకముందైనా నరసింగరావు గారు ప్రక్రియ వారీగా విడివిడిగా వెలువరించాలని కోరుకుందాం..

- సాన్వి, సెల్.నం.9440525544

**

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net