విశాఖపట్నం

సామాజిక చైతన్యమే కవిత్వ ప్రతిబింబం ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం రాయడానికి వయసుతో సంబంధం లేదు. ఈ సృజనాత్మకత సహజంగా రావాలి. రాటుదేలిన ఊహాశక్తి అక్షరాలలో ప్రతిబింబించాలి. ఇలా రూపుదిద్దుకున్నదే వర్తమాన కవిత్వం. వచనంలో వ్యక్తీకరించడానికి తగినంత అనుభవసారాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఈ ప్రయత్నం ఎవరైనా చెయ్యొచ్చును. కానీ బాల్యపు ఛాయలు వదలక ముందే కలాన్ని పట్టుకుని దృశ్యాల్ని చిత్రీకరిస్తుంటే ఆ నేర్పరితనమే వేరు. సుకుమారపు భావాలను సున్నితంగా తడిమి సుతిమెత్తని ఆలోచనలకు బీజప్రాయమైన పునాది వేస్తుంది. ఈ ప్రయత్నం భవిష్యత్తు తలుపులు తెరిచి సంఘర్షణ పూరితమైన సామాజిక చైతన్యానికి పురిగొల్పుతుంది. అలాంటి తడుములాట లోంచి వెలుగు చూసినదే చిన్నారి కూరెళ్ళ శ్రీశ్రేయ కవిత్వం ‘ఎంత బాగుంటుందో’. దశాబ్ద క్రితం మొదలుపెట్టిన కవిత్వ రచనలో తనదైన సొంతశైలి, భాష, వస్తువు దర్శనమిస్తాయి. లేలేత భావకుసుమాలతో పల్లవించి, వర్తమాన సమాజాన్ని నిజాయితీతో దర్శించి, కవిత్వమయం చేస్తుంది. 32 కవితల సమాహారంతో పలు కవితా వస్తువులకి ఊపిరి పోస్తుంది.
‘ముసలి పిక్కల్ని ఓల్డేజ్ హోమ్‌లకు
పసిపిక్కల్ని చైల్డ్ కేర్‌సెంటర్లకు
సంతకి తీసుకెళుతున్న కూరగాయల్లా మాటలతో సహా విసిరేస్తుంటే’ అని ‘సపోటా పిక్కలు’ కవితలో ఎద్దేవా చేస్తుంటే వర్తమాన విషాద వాస్తవికత కళ్ల ముందు కదులుతుంది. అక్షరాలలో పైకి ధ్వనించే వ్యంగ్యం మనసుని మెలిపెడుతుంది. కవయిత్రి శ్రేయలో అంతర్లీనంగా గూడుకట్టుకున్న ఆర్ద్రపూరిత ముఖచిత్రానికి ఇది ప్రతిబింబంగా నిలుస్తుంది.
‘బిచ్చగాడు’ కవితలో లోకనైజాన్ని ప్రతిఫలించే చేదు నిజాన్ని సమస్యాత్మక కోణం లోంచి అక్షరీకరించే ప్రయత్నం జరుగుతుంది.
‘అవిటితనంతో తన శరీరమే
తనకు శత్రువుగా మారినప్పుడు చేతికి ఒక రూపాయి అందుతుందేమో అని అతని కళ్ళలో ఆశ’ అంటున్నపుడు డబ్బుకు దాసోహమైన లోకనైజం బయటపడుతుంది. మానసిక వైకల్యం ముందు శారీరక వైకల్యం ప్రధానలోపంగా బిక్షగాడి కళ్లలో ఆశగా కదలాడుతుంది. యాచకత్వంలో ఉన్న కష్టనష్టాల తడి రుచిని సామాజిక దృష్టి కోణం లోంచి పరిశీలిస్తుంది. ఈ అవగాహనా స్థాయిని అంచనా వెయ్యడానికి లోచూపు చాలా అవసరం. దీనిని సమర్థవంతంగా అందిపుచ్చుకుంది కవయిత్రి శ్రేయ.
‘మా ఇంటికి ఉగాది వచ్చింది’ కవితలో ‘అమ్మెప్పుడూ చెబుతూ వుంటుంది/ వాళ్ల ఊళ్లో ఉగాది ఎంత బాగా జరిగేదని’ అంటూనే ఆశ్చర్యకరమైన ముగింపుతో కొసమెరుపు మెరిపిస్తుంది శ్రేయ.
‘ఏదీ నీ చిన్నప్పటి ఉగాది అని
బుంగమూతి పెట్టిన నాకు
మామయ్య చూపించాడు మామిడి చెట్టు
వినిపించాడు కోయిల కూత
ఇంటర్నెట్‌లో.... మీకు తెలుసా
మా ఇంట్లోకి ఉగాది వచ్చేసిందోచ్...’ అని చెప్పడం వెనుక గతంలో ఉన్న ప్రకృతి పచ్చదనం అంతరించిపోయి, వర్తమానం అంతా కట్టడాలతో నిండిపోయి, కాలుష్య ప్రపంచాన్ని మిగుల్చుతున్నదనే భావనని ఇది వ్యక్తపరుస్తోంది. ప్రపంచీకరణలో భాగంగా ఈ విధ్వంసమంతా జరుగుతోందని తెలుపుతోంది శ్రేయ.
‘నా తెలుగు భాష’ శీర్షికలో మాతృభాష గొప్పతనాన్ని తేట తెలుగులో ప్రస్తావిస్తుంది.
‘కోకిల పాటలా తీయని తేనెలా
అమ్మచేతి గోరుముద్దలా నాన్నప్రేమ పిలుపులా
అమ్మమ్మ చెప్పే కథలా తాతయ్య దీవనలా
నా తెలుగు భాష’ అంటూ వుంటే తెలుగుదనం సంస్కృతి, సాంప్రదాయం, మమకారం, ఆప్యాయత, కలుపుగోలుతనం అడుగడుగునా వ్యక్తమవుతాయి. పల్లె సౌందర్యపుబతుకు ముఖచిత్ర ఆనవాలు లీలగా మెదులుతాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థల మాధుర్యం రుచి చూపిస్తుంది. ఇవన్నీ శ్రేయలోని బహుముఖ కోణాల్ని ఒడిసిపడతాయి.
కవిత్వం ధ్వనించే వాక్యాలు ఈ సంపుటిలో మనల్ని అలరిస్తాయి. ‘దాని కళ్ళలో/ గంగ ప్రవహిస్తోంది., వౌనం మాట్లాడుతుంది/ మా ఇద్దరిమధ్య, పట్టులంగా ధరించి/అమ్మ ఉగాది కన్యలా ఉండేదని, తన చెమటతో/తాను స్నానం చేస్తూ, అక్షరాల విత్తనాలు/ మా మెదళ్ళలో / మొలిపించడానికి, అది ప్రేమగా మన ఇద్దరి ఆత్మల్లో/ జీవిస్తూనే ఉంటుంది, మా ఇద్దరి వౌన సంబంధం / మళ్లీ ఎప్పుడు చిగురిస్తుందో, ఓటమి నుంచి వచ్చిన / గెలుపె ఎప్పటికీ నిలిస్తుంది’ వంటి పద సంబంధాల నిర్మాణ పంక్తులు శ్రేయలోని సృజనాత్మక తపనను కవిత్వంగా ఆవిష్కరిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వ భావన శ్రేయలో అంతర్లీనంగా ధ్వనిస్తుంటుంది. బొమ్మలం బొమ్మలం, నాకర్థం కాలేదు, ఎందుకు, అమ్మ, ఎంత బాగుంటుందో, బాల్యస్మృతి, నది, విలువ, దైవం మున్నగు కవితలు ఈ బాల కవియిత్రిలోని పసితనపు ఛాయల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చిర్నవ్వు, ఒంటరి అవరు, ఇదినిజం, నాకో మాటివ్వాలి, రహదారి లాంటి శీర్షికలు శ్రేయలోని ఆలోచనా శక్తికి మదును పెడతాయి. ఇలా వైవిధ్య పూరిత సామాజిక వస్తువులను కవితాంశాలుగా స్వీకరించి రచన చేపట్టిన శ్రేయకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆకాంక్షిస్తూ అభినందిద్దాం!

- మానాపురం రాజా చంద్రశేఖర్,
సెల్ : 9440593910.
**
దేవుడెలా ఉంటాడు? (కథానిక)

దేవాలయ ప్రాంగణంలో పురాణ పఠనం జరుగుతుంది. నెల రోజులుగా పురాణం వింటున్న భద్రయ్యికి ఒక అనుమానం వచ్చింది. పురాణకర్త ప్రతిరోజూ దేవుడు ఉన్నాడు. దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని చెబుతుండగా అసలు దేవుడు ఎలా ఉంటాడని తనకు చూపించాలని అమాయకంగా ప్రశ్నించాడు. పురాణకర్త రామశర్మని పదేపదే అడుగుతూ అతన్ని విసిగించేవాడు.
రామశర్మకి ఇదంతా విసుగు అనిపించేది. అయినా ఊరుకుండేవాడు. భద్రయ్య వదిలేవాడు కాదు. దాంతో రామశర్మ ‘‘ ఇక్కడి నుండి తూర్పుగా నూరు యోజనాలు వెళితే అక్కడ దేవుడు ఉంటాడు చూసిరా’’ అన్నాడు.
భద్రయ్య ఇంటికి చేరుకుని తాను దేవుడిని చూసేందుకు వెళుతున్నానని భార్యకి చెప్పాడు. భార్య రాములమ్మ గుణవంతురాలు. భర్త అమాయకత్వానికి నవ్వుకుంది.
మనం చేసే ప్రతి పనిలోనూ, మనం చూసే ప్రతి వస్తువులోను దేవుడున్నాడని, నూరు యోజనాలు నడిచి వెళ్లడం దండగని చెప్పినా భద్రయ్య వినలేదు.
బియ్యం, పప్పులు, ఉప్పు మూటగట్టుకుని తూర్పు వైపు నడవడం మొదలుపెట్టాడు.
వెళ్లగా వెళ్లగా తీవ్రమైన ఎండకు అలుపు, ఆయాసం వచ్చాయి. భద్రయ్య ఒక చెట్టు కింద విశ్రమించాడు. చల్లటి నీడకు ప్రాణం లేచి వచ్చింది. ‘హమ్మయ్య దేవుడు కాపాడాడు. లేకుంటే ఈ ఎండకి ఊపిరి ఆగిపోయేది’ అనుకున్నాడు.
అక్కడే కొద్దిసేపు నిద్రపోయాడు. అనంతరం ఆ చెట్టు నుండి పళ్లు కోసుకుని తిని మళ్లీ ప్రయాణించాడు. దారిలో ఒక పేదవాడు తారసపడగా అతడికి ఇంటి నుండి తెచ్చిన పప్పులు, బియ్యం దానం చేశాడు. ఆ పేదవాడు ఆనందంతో ‘‘అయ్యా నీవు దేవుడివి’’ అని కీర్తించి వెళ్లిపోయాడు. అలా నడుస్తూ వెళుతున్న భద్రయ్యకి స్వచ్ఛమైన జలాలతో ప్రవహిస్తున్న కొండవాడు కనిపించింది. అప్పటికే బాగా చెమట పట్టి దాహంతో ఉన్న భద్రయ్యకి నీళ్లని చూడగానే అమృతాన్ని చూసినంత ఆనందం కలిగింది. చక్కగా స్నానం చేసి నీళ్లు తాగి ‘ ఆహా ఈ నీళ్లు ఎంత మధురంగా ఉన్నాయి. నిజంగా ఈ వాగును దేవుడు ఎంత బాగా సృష్టించాడు’ అనుకుని నడవసాగాడు.
కొద్దిసేపటికి అతనికి ఆకలి వేసింది. ఉన్న బియ్యం దానం చేసాడు. అటు ఇటు చూస్తే అడవి ప్రాంతంలో గొల్లవాడు గొర్రెలను మేపుతూ కనిపించాడు. అతను ఆ దగ్గరలోనే వంట చేసుకుంటున్నాడు. ఆ ప్రాంతమంతా చక్కటి వాసనతో నిండిపోయింది. భద్రయ్య ఆకలి రెట్టింపు అయింది.
భద్రయ్యని చూసిన ఆ గొల్లవాడు వంట కాగానే తనతో పాటు అతనికీ భోజనం వడ్డించాడు. ఆకలి తీరిన భద్రయ్య కృతజ్ఞతగా ‘‘దేవుడిలా నా ఆకలి తీర్చావు’’ అని చెప్పి తూర్పు వైపు బయలుదేరాడు. కొంత సేపటికి చిమ్మచీకట్లు ఆవరించాయి. కారుమేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో వర్షం కురవడం మొదలయింది. పిడుగులు పడుతున్నాయి. ఆ వర్షానికి భద్రయ్య పూర్తిగా తడిసిపోయాడు.
చలికి శరీరం వంకర్లు తిరిగిపోతోంది. ముళ్లురాళ్లు గుచ్చుకుని శరీరం రక్తం స్రవించడం మొదలయింది.
దూరంగా అతనికి వెలుగు కనిపించింది. భద్రయ్య పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక ఆలయం కనిపించింది.
ఒక ముసలి సాధవు దీపం ఆరిపోకుండా చేతులు ఆడ్డంగా పెట్టి నిల్చుని ఉన్నాడు. అతన్ని చూడగానే భద్రయ్యకి ఒక పవిత్రభావం కలిగింది. చలికి వణికిపోతున్న భద్రయ్యని గమనించి సాధవు పొడిబట్టలు ఇచ్చి, చలిమంట వేసి వివరాలు అడిగాడు.
భద్రయ్య తాను దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి బయలుదేరి వచ్చానని చెప్పాడు. దానికి సాధువు చిరునవ్వు నవ్వి ‘‘నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీవు బయలుదేరిప్పటి నుండి ఇప్పటి వరకు అడుగడుగునా నువ్వు దేవుడిని దర్శిస్తూనే ఉన్నావు. ఫలాలు ఇచ్చే చెట్టు, జలాలను ఇచ్చిన వాగు, అన్నదానం చేసిన గొల్లవాడు వీళ్లంతా దేవుళ్లే. అంతెందుకు పంచభూతాలలో ఎవరైతే దేవుడిని చూస్తారో వారే నిజమైన భక్తులు’’ అని చెప్పగానే భద్రయ్యకి జ్ఞానోదయం అయింది. దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకోవడం వృథా అని, అందరిలో దేవుడిని చూడడమే శ్రేయస్కరమని భావించి వెనుదిరిగాడు.

- టంకాల సత్యంనాయుడు,
సారథి (రాజాం నగర పంచాయతీ),
శ్రీకాకుళం జిల్లా. సెల్ : 9395355952.