విశాఖపట్నం

నల్లకుబేరుడు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటరాఘవరావు నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు. తండ్రి ఫుట్‌పాత్ మీద రెడీమేడ్ బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. రాఘవరావుకి ఆరుగురు అన్నయ్యలు, ముగ్గురు అక్కలు. అంత పెద్ద కుటుంబాన్ని పోషించలేక భార్యని కూడా కూలికి పంపేవాడు రాఘవరావు తండ్రి. చదువుకునే స్థోమత లేక రాఘవరావు అన్నయ్యలు, అక్కలు బాలకార్మికులుగా పనులు చేస్తుండేవారు. రాఘవరావుని డిగ్రీ చదివించారు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు.
అందం, తెలివి, మాటకారితనం మెండుగా ఉన్న రాఘవరావు ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునేవాడు. తన క్లాస్‌మేట్ శకుంతలని ప్రేమ వివాహం చేసుకున్నాడు. శకుంతల నగరంలోని ఒక బంగారం దుకాణం యజమాని కూతురు. కుర్రాడు డిగ్రీ చదువుకున్నాడు, తెలివైన వాడు, వ్యాపారం నడపడానికి పనికి వస్తాడని శకుంతల తండ్రి రాఘవరావుని అల్లుడిగా ఆహ్వానించాడు.
రాఘవరావుకి చిన్నప్పటి నుండి అడ్డదారిలో అందలమెక్కడమంటేనే ఇష్టం. చిన్నప్పుడే తండ్రి, అన్నయ్యల జేబుల నుండి డబ్బులు కొట్టేస్తూ వాళ్లకు దొరకకుండా జెంటిల్‌మేన్‌గా గుర్తింపు పొందేవాడు.
మయామాటలు చెప్పి న్యాయంగా వ్యాపారం చేస్తూ లాభాలు తెప్పిస్తానని మామకి చెప్పి బంగారం వ్యాపారాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు.
స్థోమత ఉన్న కుటుంబానికి అల్లుడు అయిన తర్వాత రాఘవరావులో పుట్టుకతో ఉన్న స్వార్ధబుద్ధి మరింత పెరిగిపోయింది. తండ్రి చనిపోయినప్పుడు, తరువాత తల్లి చనిపోయినప్పుడు తన వంతు సొమ్ము అంటూ ఎంతో కొంత డబ్బు సాయం చేస్తూ కుటుంబానికి అంటీముట్టనట్లు ఉండేవాడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తోబుట్టువులతో పూర్తిగా బంధాన్ని తెంచేసుకున్నాడు.
వాళ్లు ఎప్పుడైనా తారసపడినా పట్టించుకోకుండా తప్పించుకునేవాడు. బంగారం వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన వ్యాపారాలు చేసేవాడు. నకిలీ బంగారం, నాణ్యత తక్కువ బంగారం, దొంగ బంగారం, రంగురాళ్ల స్మగ్లింగ్, వజ్రాల అక్రమ వ్యాపారం వంటి చీకటి పనులు చేస్తూ అడ్డదారిలో అడ్డూఅదుపూ లేకుండా సొమ్ము సంపాదిస్తూ తక్కువ సమయంలోనే కోటీశ్వరుడు అయ్యాడు.
రాజకీయాల్లోని అవినీతి పరులు, అధికారుల్లో అవినీతిపరులు, లంచగొండులు, ప్రజల్లో అనైతికతకు పాల్పడుతుండేవారు అతని డబ్బుకు దాసోహం అయి రాఘవరావుకి అండగా ఉంటూ చట్టానికి దొరక్కుండా చూసేవారు. పది సంవత్సరాల్లోనే రాఘవరావు సుమారు వంద కోట్లు సంపాదించేశాడు. అందులో ఎక్కువగా నల్లధనమే ఉంది. ఆదాయపన్ను కట్టకుండా, లెక్కలు చెప్పకుండా సవాలక్ష ఎత్తుగడలు వేస్తూ చాకచక్యంగా తప్పించుకుంటూ పైకి జెంటిల్‌మేన్‌లా, తెరవెనుక చీకటి సామ్రాజ్యంలో రాజుగా ఎదిగాడు.
కాలగర్భంలో ఇరవై అయిదు సంవత్సరాలు గడిచిపోయాయి. రాఘవరావు దగ్గర ఇప్పుడు దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. అయినా చట్టం అతన్ని ఏమీ చేయలేకపోయింది. చట్టంలోని లొసుగులను వాడుకునేవాడు. గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు, సెక్స్ రాకెట్ నిర్వహణ చేసే వారితోనూ అతనికి సంబంధాలు ఉండేవి. చివరికి నిరుపేద స్థితి నుండి అతను వేలకోట్ల ఆస్తిపరుడయ్యాడు.
ఇదిలా ఉండగా దేశాధినేత ఒకరోజు హఠాత్తుగా పెద్దనోట్లు రద్దు చేశాడు. దేశంలో కలకలం రేగింది. అయినా వెంకటరాఘవరావు భయపడలేదు.
* * *
భర్త ఆర్థికంగా ఇరకాటంలో పడిపోతాడని శకుంతల భయపడిపోయింది. ఇంత వరకు అందరినీ మోసం చేసి డబ్బు సంపాదించిన అతనికి శిక్ష తప్పదనుకుంది.
‘‘బ్యాంకులో రెండున్నర లక్షల కంటే ఎక్కువ ఉండకూడదటకదా’’ అంటూ భయం భయంగా అసలు మేటర్ కదిపింది.
‘‘పిచ్చిదానా నేను చీకటి సామ్రాజ్యపు డాన్‌ని. పైకి వైట్ లోపల బ్లాక్. మన దగ్గర అయిదు వందల కోట్ల ఆస్తి ఉందని ప్రభుత్వానికి తెలుసు. దాని మీద పన్ను కడుతున్నాం. ఇక లెక్కకు దొరకని మరో అయిదు వందల కోట్ల ఆస్తి ఉంది. అది మన పేరిట లేదు. నా అనుచరులు, నమ్మకస్తుల పేరిట ఉంది. కనుక మన దగ్గర ఉన్నదంతా వైట్‌కిందే లెక్క’’ అన్నాడు.
అయితే అతనికీ లోలోన టెన్షన్ ఉంది. ఆదాయ పరిమితికి, నగదు మార్పిడికి తక్కువ కాలమే ఉందనుకున్నాడు.
ఉదయం తన ఆంతరంగికులతో సమావేశం అయ్యాడు. ‘‘నల్లధనంలో చాలా భాగం బినామీల పేరిట ఉంది. నగదు మాత్రం పదికోట్లే నిల్వ ఉంది. బంధుమిత్రులకు ఇస్తే దొరికిపోతాం. మన షాపుల్లో ఖాతాదారులు, మీ అనుచరులు, అనుచరుల అనుచరులకు, మనో ఉద్యోగులు, పని మనుషుల్లో నమ్మకస్తులకు మన డబ్బు తరలించండి. అయితే నేను పైకి కనిపించేటంత మంచివాడిని కాదని వాళ్లకి నా గురించి కాస్త ఘాటుగా చెప్పండి. వడ్డీలు అడగను కానీ అవసరమైనప్పుడు డబ్బు అడుగుతాను. అప్పుడు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పండి. దేశాధినేత మాటలను బట్టి నా లాంటి నల్లదొరలు భయపడిపోతారని భ్రమపడవద్దు. నల్లడబ్బు ఇవ్వడమే మన పని. దానిని ఎలా వైట్ చేసుకుంటారో అది వాళ్ల రిస్క్. అలాంటి చాకచక్యం ఉన్నవాళ్లకే మన డబ్బు ఇవ్వండి. కొంత దేవాలయాలకు ఇవ్వండి. దొరికిపోతామని అనిపించినప్పుడు కాల్చేయండి. నిరుపేదలకు, అనాథలకు మాత్రం డబ్బు ఇవ్వకండి. వాళ్లకు నా డబ్బు చేరకూడదు. వాళ్లంటే నాకు చిరాకు. తొందరపడకండి. టైం చాలా ఉంది. ఎవరికైతే నా డబ్బు ఇచ్చారో వాళ్ల చేత తెల్లకాగితం మీద డబ్బు మొత్తం, తేదీ వివరాలు రాసుకోండి. కొన్నాళ్లు మన డబ్బుతో ఎంజాయ్ చేయనీయండి. అవసరం అయినప్పుడు మన డబ్బు మనకి ఇవ్వమనండి. డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకదా. ఇక తరలించండి’’ అని చెప్పి షాపుకి వెళ్లిపోయాడు.
* * *
అయితే వెంకటరాఘవరావు చెప్పినట్లు పక్కాగా జరగలేదు. కట్టలకు నోట్లను తరలించే పనిలో అనుచరులు కొందరు పప్పులో కాలేశారు. ఐటి అధికారులకు దొరికిపోయారు. అయితే వాళ్లు నమ్మకస్తులు కావడంతో రాఘవరావు పేరు బయటపెట్టలేదు. రాఘవరావు ఏళ్లకేళ్లు శ్రమపడి, బుర్ర ఉపయోగించి సంపాదించిన డబ్బులో చాలా భాగం గాలికి వచ్చి గాల్లో కలిసిపోయినట్లే అదృశ్యమైపోయింది.
ఉన్నదాన్ని అయినా కాపాడుకోవాలని రాఘవరావు రాత్రింబవళ్లు ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ, వ్యూహాలు పన్నుతూ దాదాపు పిచ్చివాడు అయిపోయాడు.
నెలరోజుల కిందట చూసిన రాఘవరావుకీ, ఇప్పటి రాఘవరావుకీ ఎంతో తేడా వచ్చేసింది.
ఒక్కసారిగా జుత్తు ఊడిపోయి, కళ్లు లోతుగా వెళ్లిపోయి, దవడలు పీక్కుపోయి వడలిపోయిన వృద్ధుడిలా మారిపోయాడు.
అతన్ని చూడడానికి వచ్చిన అన్నయ్యలు, అక్కలు అతని స్థితికి బావురుమన్నాడు.
భార్య శకుంతల ‘‘ ఏవండీ ఇప్పటికైనా ఈ డబ్బు వ్యామోహం వదిలేయండి. ఉన్న దాంతో ప్రశాంతంగా ఉందాం. నిజాయితీగా సంపాదించింది ఉంచుకుని అక్రమ ఆస్తి గురించి ప్రభుత్వానికి చెప్పేయండి. అంతా ట్యాక్స్ కింద పోయినా మనస్సుకి ఇంత స్వాంతనైనా దొరుకుతుంది. తిన్నది ఒంటబట్టి కుదురుగా బతకవచ్చు’’ అని హితవు పలికింది.
రాఘవరావు తోబుట్టువులు కూడా ‘‘అవును అలాగే చెయ్యి’’ అని వంతపాడారు.
అప్పటి వరకు ధన శోధనలోను, అక్రమార్జనకు మార్గాలు వెతకడంలోనూ ఒంటరిపోరాటం చేసిచేసి అలసిపోయిన రాఘవరావు కూడా అదే సరైన పని అనుకున్నాడు. న్యాయంగా ఆర్జించింది ఉంచుకుని, అన్యాయంగా సంపాదించిన దాని గురించి ప్రభుత్వానికి చెప్పేసి ఆ భారం నుండి విముక్తుడు కావాలని అనుకున్నాడు.
చిన్నగా తల పంకించి అధికారులకు ఫోన్ చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు.
అతని తోబుట్టువులు, భార్య శకుంతల ముఖాలు కాంతివంతమయ్యాయి.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.