విజయవాడ

ఆర్తి ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో గంటలో బెంగుళూరులో దిగుతానేమో! సురేష్ రైల్వేస్టేషనుకు వస్తానన్నాడు. బెంగళూరు చాలా చల్లగా వుంటుందని విన్నాను. మరీ ఇంత చలి అనుకోలేదు. షాల్ పూర్తిగా కప్పుకున్నాను. మరోసారి సురేష్ ఇచ్చిన వాయిస్ మెసేజ్ విన్నాను. తన గొంతులో ఏదో మార్దవం.. అనునయం! తన పిలుపులో, మాటల్లో ఎంతో అభిమానం. ఇరవై సంవత్సరాల నా భర్త సాంగత్యంలో ఏనాడూ ఇంత ఆదరణ నేనెరుగను. అత్తమామలూ, మరిదీ, ఆడపడుచుల బాధ్యతలూ.. నా కూతురు పుట్టాక ఇక వంటిల్లూ, వాకిట ముగ్గూ, వాషింగు మెషీనూ తప్ప, నాతో అనుబంధం పెంచుకున్న వారులేరు. అంతా రొటీన్.. డ్యూటీ మైండెడ్‌నెస్. సమయానికి వారికేమైనా అమర్చలేకపోతే.. అందరికీ గుర్తొస్తాను. ‘ఇదెక్కడ చచ్చిందీ’ అని మావారూ! నిజానికి నేను నా పేరు మర్చిపోయి చాలాకాలమైంది. కోడలూ, వొదినా, అమ్మా అనే పిలుపుల్లోనూ.. ఒసే, ఏమే, ఎక్కడున్నావు? లాంటి గద్దింపుల్లోకి ఇమిడిపోయి బతుకుతున్నానిన్నాళ్లూ..!
అవసరార్థం కొనుక్కున్న స్మార్ట్ ఫోను, వాట్సాప్‌లో పరిచయం సురేష్. చాలాసార్లు మాట్లాడాను తనతో. నాకన్నా రెండేళ్లు పెద్దవాడు. తన జీవితమూ నాలాగే. భార్య, కొడుకూ.. వేరు కాపురాలు. నా జీవితంలో లాగే ఏదో అశాంతి. ఒకేగూటి పక్షులమేమో త్వరగా మనసూ, మాటా కలిశాయి. ఒక్కసారైనా తనను చూడాలని తపన. ఈ సెలవులకు మావాళ్లు అందరూ సింగపూరు టూర్ ప్లాన్ చేసుకున్నారు. నాక్కొంచెం వీలు దొరికింది. ధైర్యం చేసి బెంగళూరు బయలుదేరాను. ఎవరికీ చెప్పలేదు సురేష్ విషయం. నాకూ ఓ జీవితముంది.. కొంచెం ప్రేమ, అభిమానం, ఆదరణా కావాలని అన్పిస్తోంది. తప్పో, ఒప్పో.. అడుగు ముందుకే వేశాను. ఏదో స్టేషన్ ప్లాట్‌ఫారమ్ ఒచ్చింది. ట్రయిన్ స్లో అయింది. ఆంధ్రభూమి దినపత్రిక కొన్నాను. ఓసారి హెడ్‌లైన్లన్నీ చూశాక.. ‘ప్చ్! ఈరోజు అన్నీ రొటీను వార్తలే!’ మడిచేశాను పేపర్ని.
‘నేనోసారి చూడొచ్చామ్మా..!’ పక్కసీటు ఆంటీ అడిగారు. ‘విత్‌ప్లెజర్, తీసుకోండి’.. పేపరు అందించాను ఆవిడకు. చిరునవ్వుతో కళ్లజోడు సర్దుకుంటూ, వార్తలన్నీ గట్టిగా పైకి చదవడం ఆరంభించింది. ‘హేవిటమ్మా ఈ చోద్యం, కలికాలం కాకపోతేనూ.. ఫేసుబుక్కు స్నేహంట.. నిండా పాతిక లేవు.. ఎవడినో నమ్మింది.. నమ్మించి, నలుగురికీ అప్పజెప్పి చక్కాపోయాట్ట.. చుట్టూ వున్న మనుష్యులతో సర్దుకుపోవడం రాదు.. ఎవడో, ఎక్కడో వుండి రమ్మనగానే పోవడమేనా.. హయ్యో, పిదపకాలమూ, పిదప బుద్ధులూ..!’ ఆవిడ ధోరణిలో ఆవిడ చదువుతోంది.
ఆ వ్యాఖ్య చురుకు నాకెక్కడో గుచ్చుకుంది. నేను అన్నీ ఆలోచించేగదా గడపదాటాను. సురేష్ అలాటివాడు కాదు. నా మనసుకి ఇంకా నిశ్చయమే. ఎవరికో, ఏదో జరిగితే అది నాకూ జరగాలనే నియమం ఏదీ లేదుగా. నేను తప్పు చేయట్లేదు. సురేష్ నా మనసెరిగిన వ్యక్తి. నా నమ్మకం వమ్ముకాదు!
నా భర్తా, కూతురూ గొర్తొచ్చారు. వాళ్లీపాటికి ఢిల్లీ చేరివుంటారు. రాత్రికి సింగపూరు ఫ్లయిటు వాళ్లకి.
* * *
మరోసారి సుధా ఇచ్చిన మెసేజ్‌లు చదువుకున్నాడు సురేష్. తన కలల సుందరి.. స్వప్న మాధురి.. సుధామధూలిక.. మరో గంటలో తన ముందుంటుంది. తనతో గడపబోయే జీవితం.. రంగుల హరివిల్లులా కళ్ల ముందు వికసిస్తోంది!
‘ఏంట్రోయ్! నిన్నట్నుంచీ గమనిస్తున్నాను. నీలో నువ్వే తెగ ముసిముసి నవ్వులు. వెలిగిపోతోంది ఫేసు. ఏంటి కథా..?’ వీపు మీద చరిచాడు రమేష్.
‘హ్హ..హ్హ..హ్హా.. ఏం లేదులే’! సిగ్గుగా నవ్వాడు సురేష్. ‘ఇంకో మాటేమన్నా చెపుదూ! పొద్దునే్న స్టేషనుకెళ్లాలన్నావు. ఎవరొస్తున్నారు?’
‘ఆఁ.. ఏంలేదులే!’ మళ్లీ ఓ చిరునవ్వు.
‘ఇదుగో! చెప్తావా, లేదా?’
‘సరే, చెప్తాను. ఎవరికీ చెప్పవుగా. ప్రామిస్ చెయ్యి’
‘నీ సీక్రెట్టే నా సీక్రెట్టన్నట్లు.. చెప్పుచెప్పూ!’ హుషారుగా ముందుకు వొంగాడు.
‘ఈరోజు హైదరాబాదు నుండి నా వాట్సాప్ ఫ్రెండు వొస్తోంది. సో, ఐ యామ్ వెరీమచ్ ఎక్సైటెడ్!’
‘ఓహో..!’ చిన్నగా విజిల్ వేశాడు రమేష్. ‘వొస్తోంది..!’ అంటే లేడీనా?’
‘అవును - సుధ. తన పేరుకు తగినట్లే ఎంతో మధురంగా మాట్లాడుతుంది. వెరీ బ్యూటీఫుల్. నా కలలన్నీ కలిపి మూటగడితే.. అచ్చంగా తనే! మనసంతా మాల కడితే.. అది సుధానే! నా జీవితంలో మిగిలిన అదృష్టం ఏదైనా వుంటే అది తన పరిచయమే!’
‘ఏజెంత?’ క్యాజువల్‌గా అడిగాడు రమేష్.
‘జస్ట్ 38! నాకన్నా రెండేళ్లు తక్కువే’
‘పెళ్లయిందా?’
‘హాఁ..! నా బతుకులాగే తనున్నూ. తనకొక కూతురు, నాకొక కొడుకు. నా భార్య నన్ను నట్టేట ముంచింది.. తనకు తన జీవితం ఒక వెట్టిచాకిరీగా తోస్తోంది! మేం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. మా భావాలు కలిశాయి. తను ఒప్పుకుంటే, ముందు జీవితమంతా తనతోనే వుండాలని వుంది’
‘సురేషూ! నువ్వింత మూర్ఖుడివని అనుకోలేదు’ రమేష్ మాటకు కంగుతిన్నాడు.
‘అదేమిటి?’
‘ముక్కూ మొహం తెలియని వాట్సాప్ ఫ్రెండువి.. నువ్వు ‘రా’.. అనంగానే ఇలా వొస్తోందంటే.. ఎవడు నీలా పిలిచినా వొచ్చేరకమేమో’
‘్ఛఁ ఛీఁ..! తప్పుగా మాట్లాడకు. తను చాలా మంచి స్నేహితురాలు నాకు’ రోషంతో ముఖం ఎర్రబడింది సురేష్‌కు.
‘కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచించు. ఒకసారి పెళ్ళయిన తర్వాత, భర్త ఎలాటివాడైనా, అక్కడే ఎడ్జస్ట్ అవ్వాలి. భర్త సరిగా లేడూ.. అంటే అది ఆమె ముఖాన దేవుడు రాసిన రాత! అని సర్దుకుపోవాలి. అంతేగానీ, తెగించి బైటకొస్తోందంటే.. డౌటు లేకుండా తనొక తిరుగుబోతు అయి వుంటుంది. ఎన్ని ఇళ్లల్లో గొడవల్లేవు? అయితే మాత్రం ఆడది వీధిన పడటం ఎంత ఛండాలం? ఏ పూజలో, పాడో చేసుకుంటూ, బిడ్డను పెంచి పెద్దజేస్తూ జీవితం వెళ్లబుచ్చాలిగానీ...’
‘నువ్వు చాలా దారుణంగా మాట్లాడ్తున్నావు రమేష్. తన జీవితంలో మార్పును కోరుకుంటే తప్పేంటి? నేను చేస్తోంది అదేకదా! ఇది తప్పే అయితే, నేనూ ఆ తప్పులో భాగస్వామినే..’
‘నువ్వు మగమహారాజువోయ్. సర్దాపడ్డావు.. తప్పేం లేదు. అలాగ వుండకపోతేనే విచిత్రం. నువు మోజుపడటం నేరమేం కాదు. ముందు వెనకలు చూడాల్సింది ఆడవారే. ఇలాగైతే కాపురాలు కూలిపోవూ!’
‘జీవమేలేని కాపురమెందుకు? కాపురాలు నిలబడటం కేవలం ఆడదాని అవసరమేనా?..’
‘సర్లే! నువ్వు వినవు. నే వెళ్తున్నా. అవతలి మనిషి ఎలాటిదో, ఏమో.. నీ జేబు ఖాళీ కాకుండా చూసుకో! వీలైతే, పార్టీకి నన్నూ పిలువు’ కన్ను గీటాడు రమేష్.
‘్ఛ! సుధ అలాటి మనిషి కాదు. తనొక అద్భుతం.’ లోపలి నుండి ఎవరో అరచినట్లు.. విసుగ్గా తల విదిలించాడు సురేష్.
* * *
ఎనౌన్స్‌మెంటు చేసిన 10 నిమిషాలకే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ స్టేషన్లోకి వచ్చి ఆగింది. ఎస్-8 కంపార్టుమెంట్ వైపు నడిచాడు సురేష్. అప్పుడే విరిసిన ఎర్రమందారంలా సుధ! అలసిన కనులు ప్రయాణ బడలికను సూచిస్తున్నాయి. చేయిచాచి బేగ్ అందుకున్నాడు.
‘రండి వెళ్దాం’.. ‘నమస్తే!’
చిరునవ్వు మల్లెల జల్లు కురిసినట్లు ఫీలయ్యాడు సురేష్.
‘మీ వూరు నిజంగా చాలా చల్లగా వుంది, మా హైదరాబాద్‌తో పోలిస్తే..’
‘రోజూ ఇలాగేం వుండదు మేడమ్! మెట్రోసిటీ గదా. ఈరోజు మీరొచ్చారనే ఇంత అందం బెంగళూరు నగరానికి..!’
స్వచ్ఛంగా నవ్వింది సుధ. అలాగే చూస్తూండిపోయాడు సురేష్.
‘మీరు కొంచెం వెయిట్ చెయ్యండి రిఫ్రెష్ అయి వస్తాను’ వెయిటింగ్ హాలు వైపు వెళ్లింది.
మరో అరగంటలో రైల్వేస్టేషనుకు ఎదురుగా వున్న ‘ఉడ్‌లాండ్స్’లో టిఫెన్ చేసి, షాపింగ్ సెంటరు ఒక రౌండు చూసి, కొన్ని డ్రస్సెస్ కొనేసరికి చూస్తూచూస్తూనే టైమ్ 12 గంటలయ్యింది.
‘మా రూముకు వెళ్దామా’ సురేష్ అడిగాడు. ఎందుకో రమేష్ మాటలు గుర్తొచ్చి, చికాకుగా తోచింది అతనికి.
‘నేనూ హైదరాబాదులో బయలుదేరే ముందు, మా బంధువులకు మెసేజ్ పెట్టాను. నాకోసం ఎదురుచూస్తూ వుంటారు. అటు వెళ్తాను!’ సుధ చిన్నగా గొణిగింది.
‘అదేమిటీ! నాతో కలిసి వుంటావని ఎన్ని కలలు కన్నాను. ఇన్నాళ్లూ చెప్పుకున్న కబుర్ల విలువ ఇంత స్వల్పమా?’ మాటలు గుండెను దాటి, గొంతుకను చేరి నిశ్వాసమైనాయి తప్ప.. వెలికి రాలేదు! ‘ఎంతగానో ఎదురుచూసిన క్షణాలు ఇవేనా? ఒక్కసారి చేయందుకొమ్మని నను విడవొద్దని.. శాసించవచ్చుగదా!’ ఇంకా ఏదో ఆశల ముసురు!
తడబడ్డాడు సురేష్. ‘నేనూ.. నేను డ్రాప్ చెయ్యనా మిమ్మల్ని?’ అడిగాడు.
‘ఎందుకూ..! నేను వెళ్తానులెండి. మావాళ్ల ఇల్లు బస్టాండు దగ్గరే. ఆటో ఎక్కి వెళ్తాను.. ప్లీజ్!’
బస్టాండులో తెలంగాణ బస్సెక్కి, హైదరాబాదుకు టిక్కెట్టు కొని, కూర్చున్నాక ఎందుకో ఏడుపొచ్చింది సుధకు. లోపల నుండి తన్నుకొచ్చిన అశక్తత దుఃఖమై.. వెక్కిళ్లుగా ఎగసిపడింది.
‘నన్ను విడిచి నువ్వు వెళ్లొద్దని.. సురేష్ అడగొచ్చుగా!.. ఎందుకనలేదు?’ కిటికీ బైట గుడ్డి బిచ్చగాడి పాట గాలి వాలున వినవస్తోంది.
‘మనిషికో స్నేహం.. మనసుకో దాహం
లేనిదే జీవం లేదూ.. జీవితం కానేకాదూ..
మమతనే.. మధువు లేనిదే.. చేదు’

- డి రాజ్యలక్ష్మి, గుంటూరు జిల్లా. చరవాణి : 9440172537