రాజమండ్రి

బీదల మెతుకుపై ‘నెత్తుటి మరకలు’ (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- ప్రతులకు -
నేలపూరి రత్నాజీ,
చాగల్లు (పోస్టు - మండలం) ప.గో.జిల్లా., సెల్: 9440328432
**
ఒక విషయం మీదో, సంగతి మీదో, సంఘటన మీదో కవిత్వం అల్లటం పరిపాటే. అయితే సంఘటన మీద సుదీర్ఘ కావ్యం రాయడం చాలా అరుదుగా జరిగే విషయం. సమగ్రత, స్పష్టతకోసం సంపూర్ణ విషయాన్ని కవిత్వీకరించడం ఓ ప్రత్యేక ఒరవడితో కొనసాగుతున్న సాహిత్య ప్రక్రియ ‘లాంగ్ పోయిమ్’. దీర్ఘ కవితలకు తెలుగు ఆధునిక సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుని దళిత కవిత్వ వాదనకు దారి చూపిన అనేకానేక పరిణామాలకు విలక్షణమై చూపిస్తుంది ‘నెత్తుటి మరకలు’ దళిత దీర్ఘ కావ్యం. కవి నేలపూరి రత్నాజీ కలం నుంచి వెలువడిన ఆత్మగౌరవ ఆవేదన పూరిత దళిత దీర్ఘ కవిత ఇది.
నిజమే వేనవేల సంవత్సరాల కాలం క్రితం నుంచి ఒక అసమాజ ప్రక్రియతో నడుస్తున్న వ్యవస్థ ఇది. పైమెట్టుపై ఉన్న కులం, కిందనున్న కులంపై ఆధిపత్యం, అణిచివేతను జరుపుతుంది. ఆ దిశలో జరిగిన లక్ష్మింపేట దృష్టాంతాన్ని కవితా వస్తువుగా తీసుకొని రాసిన పుస్తకం. ఎన్నో సంఘర్షణాత్మక కవిత్వ పలుకులకు కొలమానం, నాగరికపు సమాజ సంపూర్ణ అసమానత క్రియలకు సజీవ సాక్ష్యం పలికే కవిత్వ సంపుటి ‘నెత్తుటి మరకలు’. వేల ఏళ్లనాటి వివక్షతను అక్షరబద్ధం చేస్తూ సమానత్వ కాంక్షను బట్టబయలు చేస్తున్న నేలపూరి రత్నాజీ కలం నుంచి వచ్చిన ఆత్మఘోష పలుకులివి. తరతరాల వివక్షాపూరిత క్రియలకు అనేకానేక చర్యలకు అద్దంపట్టే సంఘటనల సమాహారం.
ఈ దేశ కర్మభూమిలో ఏదో ఒక చోట ఎక్కడో ఒక మూల అనునిత్యం సాగే దౌష్టాన్యాల హేల. నాగరికపు సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కుల వివక్షాపూరిత దాడులు లౌకిక వాదుల ప్రశ్నార్థ పూర్వక నిందలకు తార్కాణమే లక్ష్మింపేట దళితుల మారణకాండ. స్వాతంత్య్రం తెచ్చాక స్వరాజ్యం వచ్చాక కూడా దళిత బహుజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వస్తువును ఎన్నుకొనటంలో కవి సరికొత్త వాదాన్ని నినాదం చేశాడు. మట్టితనం మీద మమకారాన్ని ఎలుగెత్తి చాటుతున్నాడు. ‘్భమితోనే ఆత్మగౌరవం’ అనేదే ఆయన నినాదం. భూమి మీద పట్టు పెరుగుతుందనే అక్కసుతోనే దళితులపై జరిగిన దాడి ‘ఒక సంఘటనను తీసుకొని ఒక తాత్విక నేపధ్యంలో కొన్ని పరిణామాల్ని, పర్యవసానాన్ని వివరించి తీర్పునివ్వడమే దీర్ఘ కవితా లక్షణం’ అంటారు సుప్రసిద్ధ సాహిత్యకారులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి.
కవి పలుకులు వింటే భూమాత ఎంత పులకించి పోయేదో చూడండి. ‘మా చేతులతో కలగుమ్మిన భూమి / మా కాళ్ల కింద పచ్చగా / మొలకెత్తిన భూమి / నిత్యం పొర్లాడిన భూమి’ అనడంలో తల్లీబిడ్డల అనుబంధంతో కనిపిస్తుంది. అయితే అదే తల్లి తన ఒడిని చూసుకొని తల్లడిల్లిపోతుంది. కారణం కొంతమంది ముష్కరుల చేతుల్లోకి పోయిన భూమిని చూసి కలవరపడుతుంది. అంతలోనే మరో మూడు పాదాలు మనల్ని కూడా పరవశింప చేస్తాయి. ‘్భమితోనే ఆత్మగౌరవం / భూమితోనే అధికారం / భూమితోనే ఆర్థిక సమత్వం’ అనడం రత్నాజీకే చెల్లింది. పెనవేసుకుపోయిన అనుబంధాన్ని ఎలా తెల్పుతున్నారో చూడండి’ ఆ భూమిలోనే / మన పాదం నాటుదాం .. / భూమి మన పద్యం’ అనడం అది సార్వత్రికమని చెప్పడమే. భూమి మీద పెత్తనం చెలాయిస్తున్న వాళ్ల దౌర్జన్యకాండ మాత్రమే కాదు. బతుకు గడవక భూమితో పెనవేసుకున్న పాలేరు / పాలిగాపు గాళ్ల మొదలు మంచి గుడ్డలు కట్టుకున్న వాళ్లను చదువుల చెంత పోతున్న వాళ్లను ఆఖరికీ చెంచాగాళ్ల అభిమాన జాడ్యపు ఫ్లెక్సీలు కట్టినోళ్లపైన దాడులు జరగడం వెనుక దళితులు బహుజనులపై ఓర్వలేనితనానికి కారణం రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లు. విద్య వైద్య వైజ్ఞానిక రంగాల్లో తమ స్థానాన్ని పదిలపర్చుకుంటూ పోవడాన్ని సహించలేక చేసే దుర్మార్గాలపై శంఖారావాన్ని పూరించాడు కవి నేలపూరి. కవిగా రత్నాజీ ప్రగాఢమైన అనుభూతితో పాఠకులను దళిత తాత్విక దృక్పథంతో వాళ్ల బతుకు వెతల్ని తెగేసి చెబుతున్నాడు.
‘రియాల్టీ షోల్లో వివక్షతని చూపెడ్తూ / జాతి అభిమానాన్ని పెంచమంటూ / ప్రతి మాల మాదిగ పల్లెను / కారంచేడు నిప్పుతో అంటిస్తుంది / చుండూరు మొండేలతో జడ్పిస్తుంది / నీరుకొండ ... పదిరి కుప్పు... / ఖర్లాంజీ... హత్యా మానభంగాలతో / నిద్రలేని దీర్ఘరాత్రుల్ని / పాము కుబుసంలా విడుస్తుంది’ ఎంత దగా జరుగుతుందో ఎన్ని కుట్రలు చేస్తున్నారో ఎంత రోదన పెడ్తున్నారో పై పాదాల్లోని అక్షరాలు తడిచి బావురమన్న సంగతులన్నీ ఇప్పటికే తెలిసినవి. మరి వాటి నెదిరించటానికి, నిరోధించటానికి ఏమి చేయాలో చెప్తున్నారు. ‘పోరాట నిర్మాణం లేకుండా / అంబేద్కర్ బాట తొక్కకుండా / పిడికెడు నేల / ఎలా దక్కుతుందని’ అడుగుతున్నాడు. కవికి ఒక పూనిక రావాలి. కవికి ఒక వేదిక కావాలి, అందుకే ‘మాకొద్దీ నల్లదొరతనమన్న / ‘కుసుమ’ పరాగాన్ని’ తోడు తెచ్చుకుంటూనే ‘చిన్న సన్న బీదల రాజ్యం కోసం / వెన్నుపూసలో బుల్లెట్లను మోస్తున్న గద్దర్ భుజం అసరా కోరుతూ ‘శివ సాగరాల రాగ రుతువులను / తోలుకొచ్చి / చండాల పాటకు’ పట్టం కడుతున్నాడంటే కవి సత్తా ఏమిటో రుజువు కావడం లేదూ. అదే నేలపూరిలో రగులుతున్న సాహితీ సిస్ఫోటనం, ‘బలరాముడు ఆయుధంగా / చేతపుచ్చుకున్నాడు గాని / నాగలి మా మట్టి వాకిట్లో నిలబడ్డ జాబిలి / నిజానికి పనితనానికి పేటెంటు దక్కాలి’ అని ధీమాగా చెప్పడంలోని ధీరగుణం. ఏవేవో గొప్పలు చెప్పుకోవడం కాదు కాని దేనిలోను తీసిపోని తమ జాతి గొప్పతనాన్ని చరిత్ర నుంచి పుక్కిట పట్టి అక్షర తోరణాలు కట్టాడు. అణగదొక్కబడ్డ విధానాలపై దుయ్యబడతాడు. అమానవీయతపైన ఆవేదన చెందుతునే వాటిపై ఇక సందేహించకుండా తిరగబడాలని సూచిస్తున్నాడు. అయినా తన పల్లె మీద ఎందరు వగచినా వలపన్నినా ఆర్ధ్రతను సైతం ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. ‘చద్దికుండలాంటి / మా పల్లెను / మట్టిలో నిమజ్జనం చేసింది / పరాయివాళ్లు కాదు’ అని సాఫ్ట్ కార్న్ చేస్తూనే ‘దూరంగా బతకమని / దురాలోచన చేసిన వాళ్లు’ ఉన్నారు జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తున్నాడు, ఏ వెదుకులాట లేని భూమి భుక్తి హక్కుకోసం. మెతుకు హక్కు బతుకు హక్కు భూమి హక్కు వాక్కుగా జాతీయ గీతాన్ని జాతిగేయం చేసి పాడదామంటున్నాడు. భూమిచుట్టూ అల్లుకున్న అనేకానేక కుతంత్రాలను అత్యంత పరిశీలనా దృష్టితో వివేచించిన ఈ కవి పాటను విందాం.

- రవికాంత్, సెల్: 9642489244

**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- రవికాంత్, సెల్: 9642489244