విశాఖపట్నం

ఐడియా ( కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కనీలో నుండి హాల్లోకి హాల్లో నుండి బాల్కనీలోకి తిరుగుతున్న వసంత భర్త రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది.
‘ప్రతిరోజూ ఆరున్నరకే వచ్చేసేవారు. ఈరోజు ఏడవుతున్నా రారేమిటబ్బా?’ అనుకుని నిముషాలు లెక్క పెడుతోంది.
అపార్ట్‌మెంట్ కింద స్కూటర్ హారన్ వినిపించడంతో ‘హమ్మయ్యా ఆయన వచ్చేసారు’ అనుకుంటుండగానే వసంత భర్త తరుణ్ ఇంట్లోకి వచ్చాడు.
‘‘మీకొక శుభవార్త చెబుదామని ఎదురు చూస్తున్నాను. ఈరోజే మీరు ఆలస్యంగా వచ్చారు’’ చిరుకోపం నటిస్తూ అంది వసంత.
‘‘ఏమిటోయ్ రెండు సంవత్సరాల వరకు పిల్లలు వద్దనుకున్న నీ నిర్ణయాన్ని గానీ వెనక్కి తీసుకున్నావా ఏమిటి?’’ అన్నాడు తరుణ్.
‘‘మీకు ప్రతిదీ హాస్యమేనండి. అదేం కాదు గానీ మా చెల్లెలికి పెళ్లి కుదిరిందట. ముహూర్తాలు కూడా పెట్టడం అయిపోయిందట. మా నాన్న ఫోన్ చేశారు. వచ్చే నెలలో పెళ్లట. ఈ విషయమే మీకు చెబుదామని ఎదురు చూస్తున్నాను’’ చెప్పింది వసంత.
‘‘ఓహ్ మీ నాన్నగారి ప్లానింగ్ బాగుంది. కిందటి ఏడాది నీ పెళ్లి అదే మన పెళ్లి చేసారు. ఈ సంవత్సరం మీ చెల్లెలి పెళ్లి చేస్తున్నారు. సర్లే మనం పెళ్లికి ఎప్పుడు వెళ్లాలి? ఎన్ని రోజులు సెలవు పెట్టాలి? ఏం బహుమతి కొనాలో ఆలోచించి చెప్పు. ఈలోగా నేను ఫ్రెషప్ అయి వస్తాను’’ అంటూ బాత్‌రూంలోకి వెళ్లాడు.
స్నానం చేసి కాఫీ తాగాడు కానీ తరుణ్ మనసు తొలిచేస్తోంది. మరదలి పెళ్లి విషయం విన్న దగ్గర నుండి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. నిజంగా ఇది శుభవార్తే. రిటైర్ కాకముందే మామగారు మరదలి పెళ్లి కూడా చేసేస్తే ఆయన బాధ్యతలు తీరిపోతాయి. ఆయన శేషజీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక మా విషయానికి వస్తే ఏడాది తర్వాత స్వంత ఊరు వెళ్లడం, పెళ్లి సంబరాలు, వేడుకలు ఇవన్నీ వసంతకు, తనకూ ఆనందం కలిగించేవే. విశాఖపట్నానికి దగ్గరలోనే ఉంటున్న తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని అందరినీ చూడవచ్చు. వారితో కొంత సమయం హాయిగా గడపవచ్చు. బాల్యమిత్రుల్ని కలవవచ్చు. కానీ ఎటొచ్చీ బాస్ చేత సెలవు గ్రాంట్ చేయించుకోవడమే సమస్య. బాస్‌తో సెలవు గ్రాంట్ చేయించుకోవడం అంటే భగీరథ ప్రయత్నమే. అందునా పెళ్లంటే కనీసం పది రోజులైనా సెలవు కావాలి. అహ్మదాబాద్ నుండి విశాఖపట్నానికి చేరుకోవాలంటే ఎలా లేదన్నా నాలుగు రోజులు పడుతుంది. మిగిలిన సమయంలోనే పెళ్లి పనులు, చుట్టపు చూపులు, మార్కెటింగ్ అన్నీ ముగించుకోవాలి. బాస్ అన్ని రోజులు సెలవిస్తాడా?’ ఇలా ఆలోచిస్తున్నాడు తరుణ్.
రాత్రి పడుకోబోయే ముందు భార్యతో ఇదే విషయం చర్చించాడు.
‘‘వసంతా రాత్రి నువ్వు మీ చెల్లి పెళ్లి గురించి చెప్పినప్పటి నుండి ఒకటే ఆలోచన నా బుర్రని తొలిచేస్తోంది’’
‘‘పెళ్లికి గాని వెళ్లొద్దంటారేమిటి?’’ కంగారుగా అడిగింది వసంత.
‘‘్ఛఛ అది కాదు. ఉద్యోగం నిమిత్తం ఇంత దూరం వచ్చిన మనకు మన ఊరు, మన రాష్ట్రం వెళ్లడానికి సరదా ఎందుకుండదు చెప్పు. అందులోను మీ చెల్లి పెళ్లంటే నా చెల్లి పెళ్లిలాంటిది కాదా?’’ అని తరుణ్ లాలనగా అన్నాడు.
‘‘మీ మనసు నాకు తెలుసండి. కాస్త కలవరపడ్డానంతే’’ సంజాయిషీగా అంది వసంత.
‘‘సమస్య ఏమిటంటే నేను పని చేస్తున్న కంపెనీలో నాకు అయిదంకెల జీతం ఇస్తున్నారు. అలవెన్సులు, బోనస్, మెడికల్ బెనిఫిట్స్, ఎల్‌టిసి ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయితే మా జనరల్ మేనేజర్ మాత్రం ఉద్యోగుల సెలవుల పట్ల చాలా కఠినంగా ఉంటాడు. ఉద్యోగులకు సెలవు ఇవ్వడమంటే ఎక్కడ లేని పీనాసితనం ఆవహిస్తుంది అతనికి. అక్కడికి తన సొమ్మేదో ధారపోస్తున్నట్లు ఫీలైపోతుంటాడు. మరీ అర్జెంటుగా సెలవు కావలసి వస్తే రుజువులు, సాక్ష్యాలు అడుగుతాడు. పోనీ పదిరోజులతో సరిపెట్టుకుందామంటే అయిదు రోజులే చాలంటాడు. కనీసం మనం పెళ్లికి వెళ్లి రావాలంటే పది రోజులైనా సెలవు కావాలి. అలాంటిది పది రోజులు సెలవు ఇస్తాడా అని ఆలోచిస్తున్నాను’’ అన్నాడు తరుణ్.
విషయం అంతా విన్న వసంతకి ఒక ఆలోచన స్ఫురించింది. ఏం చేయాలో భర్తకి విశదీకరించింది.
వసంత చెప్పింది విని ‘‘వర్కవుట్ అవుతుందంటావా?’’ అన్నాడు తరుణ్.
‘‘మీరేం అనుమానం పెట్టుకోకండి. నేను చెప్పినట్లు చేయండి. సెలవు సాంక్షన్ అవుతుంది. మీరు హాయిగా నిద్రపోండి’’ అంది వసంత.
తేలికపడ్డ మనసుతో ఇద్దరూ నిద్రకుపక్రమించినా పక్క అపార్ట్‌మెంట్ వాళ్ల టివి నుండి మంద్రస్వరంతో వినిపిస్తున్న ‘ఈ రేయి తీయనిది... ఈ చిరుగాలి మనసైనది’ అన్న పాట వాళ్ల మదిలో మధురోహల పరిమళాన్ని నింపింది. నా వెనె్నల వెలుగు సార్ధకమయింది అనుకుంటూ చందమామ ముసిముసి నవ్వులతో మబ్బుల చాటుకెళ్లాడు.
* * *
మర్నాడు ఉదయం పదకొండు గంటలు.
‘ఇంకా ఈయన దగ్గర నుండి ఫోన్ రాలేదేమిటి?’ అని ఎదురు చూస్తున్న వసంతకి సెల్‌ఫోన్ రింగ్ మధురంగా వినిపించింది.
లిఫ్ట్ చేయగానే అట్నుంచి ‘‘వసూ డియర్ మా బాస్ నాకు పది రోజులు లీవ్ గ్రాంట్ చేశాడు’’ అంటూ చెప్పాడు భర్త తరుణ్.
‘‘్థ్యంక్‌గాడ్’’ అంటూ వసంత తేలిక పడ్డ మనసుతో నిట్టూర్చింది.
వారం తర్వాత తరుణ్, వసంతలు విశాఖ బయలుదేరి వెళ్లడం, పెళ్లి వేడుకల్లో పాలు పంచుకోవడం, అరకు, రుషికొండ, కైలాసగిరి వంటి ఆహ్లాదకర ప్రదేశాలు, అరసవల్లి, శ్రీకూర్మం, సింహాచలం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం, మిత్రులు, బంధువులతో పది రోజులు హాయిగా గడపడం చాలా సంతోషంగా అనిపించింది తరుణ్, వసంతలకి.
సెలవు మగిసి తిరిగి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు తరుణ్, వసంత. తరుణ్ యథావిధిగా ఆఫీసు పని ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు.
ఆ రాత్రి ‘‘అవును వసూ ఈరోజు మా ఆఫీసులో అందరూ నన్ను ఒకే ఒక ప్రశ్న అడిగారు మన బాస్ నీకు పదిరోజులు సెలవు ఎలా ఇచ్చాడని. ఇప్పుడు నాకూ అదే డౌట్ వస్తుంది. మా బాస్ చేత అంత ఉదారంగా సెలవు ఇచ్చేలా నువ్వు చెప్పిన ఆ కిటుకు విశేషం కాస్త చెప్పవా’’ అని మురిపెంగా వసంత వైపు చూస్తూ అడిగాడు తరుణ్.
‘‘మోస్ట్ క్వాలిఫైడ్, ఇంటెలిజెంట్ శ్రీవారూ వెరీ సింపుల్. మీ బాస్ సెలవులంటే ఎంత నిర్దయగా ఉంటారో చెబుతూ పది రోజులు సెలవు అడిగితే అయిదు రోజులు ఇస్తారని మీరు చెప్పారు. అందుకే మిమ్మల్ని ఇరవై రోజులు సెలవు అడగమని చెప్పాను. అంతే చిట్కా పని చేసింది. ఇరవై రోజులెందుకు పది రోజులు చాలు అని సెలవు గ్రాంట్ చేసి ఉంటారు. అదే మీరు పది రోజులు సెలవు అడిగితే మీ బాస్ అయిదు రోజులే ఇచ్చేవారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. కార్పొరేట్ సంస్థల్లో యాజమాన్యాలు పాటించే కాస్ట్ కటింగ్ థియరీ ఆధారంగా ఈ సలహా చెప్పాను. రేపు మీరు జనరల్ మేనేజర్ అయినా ఇంతే’’ అంది వసంత.
‘‘మై మోస్ట్ బ్యూటీఫుల్ లేడీ యువార్ గ్రేట్’’ అంటూ మెచ్చుకోలుగా చూసి వసంత వైపు రెండు చేతులూ చాచాడు తరుణ్.
తరుణ్ కౌగిలిలో ఒదిగిపోయి సిగ్గులమొగ్గ అయింది వసంత.
**
- నేరళ్ల వెంటరావు, విజయనగరం. సెల్ : 8106800884.