విజయవాడ

అనుబంధాలు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డాడీ..! ఈసారి సంక్రాంతి పండక్కి మళ్లీ తాతగారి ఊరు వెళదామం’టూ పిల్లలిద్దరూ గొడవ చేయటం మొదలుపెట్టారు.
‘వేసవి సెలవుల్లో వెళ్లి వచ్చారుగా. ఈసారి సంక్రాంతికి మనం హైదరాబాద్ వెళ్దామం’ది పద్మజ.
‘మేం తాతగారి ఊరే వెళతామం’టూ పట్టుబట్టారు. ‘నాన్నగారు సంక్రాంతికి రమ్మని ఫోన్ చేశారు. సంక్రాంతి పెద్ద పండుగ గదా! వెళ్తేనే బాగుంటుంద’న్నాడు శ్రీ్ధర్.
‘మీరెప్పుడూ ఇంతే! పిల్లలు అడగ్గానే ఒప్పేసుకొంటారు. మా పుట్టింటికి రమ్మంటే రారు. నేను మాత్రం ఎందుకు రావాలం’ది.
‘పల్లెలో సంక్రాంతి బాగా చేస్తారు. అక్కడికి వెళ్తేనే బాగుంటుంది. కావాలంటే హైదరాబాద్ మరోసారి వెళ్దామం’టూ ఒప్పించాడు. రాజీ పడక తప్పలేదు పద్మజకి.
రేపు భోగి అనగా ముందురోజు బయలుదేరారు. పిల్లలిద్దరూ ఎంత తొందరగా తాత గారింటికి వెళ్దామా.. అని ఉవ్విళ్లూరుతున్నారు.
బస్‌లో కూర్చున్నంతసేపూ పంట పొలాల్లో వరికుప్పల్ని చూసి ‘అవేమిటి మమీ’.. అంటూ అడిగారు.
‘అవి వరికుప్పలు. మరబడితే ధాన్యం వస్తాయం’ది. పిల్లలకేం అర్థం కాలేదు. ‘డాడీ నువ్వు చెప్పమం’టూ అడిగారు.
‘రైతులు సంవత్సరమంతా కష్టపడి వరి పండిస్తారు. కుప్పలుగా వేసి ఆ కంకుల్ని నూర్చి ధాన్యం చేస్తారు. వాటిని బస్తాలకెత్తి నిల్వ ఉంచుతారు. మనం రోజూ తినే అన్నం అవేనం’టూ విడమర్చి చెప్పాక గాని వాళ్ళకి అర్థం కాలేదు.
ఆ దారంటా వచ్చేటప్పుడు కనిపించే అరటి తోటలు చూస్తున్నారు.
ఊర్లోకి అడుగు పెట్టగానే పరుగులాంటి నడకతో తాత గారింటికి వెళ్లగానే పట్టరాని సంతోషంతో పొంగిపోయారు. రాఘవయ్యగార్కి పిల్లలిద్దరినీ చూడగానే కొత్త శక్తి పుంజుకొన్నట్లు దగ్గరికి తీసుకొని అక్కున చేర్చుకొన్నారు. ఆ మమతానురాగాల మాధుర్యం ఎంత తియ్యనిదో వాళ్లకి మాత్రమే తెలుసు.
నాన్నమ్మ దగ్గర చేరి కబుర్లు చెప్పారు. మీ కోసమే చేయించానంటూ అరిసెలు, జంతికలు, సున్నుండలు పెట్టింది.
ఎప్పుడు వాటి రుచెరగని వాళ్లకి బాగా నచ్చాయి. కొడుకు, కోడలు రాకతో ఇంటికే కళ వచ్చింది.
ఆ రాత్రికే కూతురు, అల్లుడు పిల్లలతో దిగారు. అంతా కలిసి కబుర్లలో పడ్డారు.
రాఘవయ్యగారు తెల్లవారుఝామునే లేచి పనికిరాని చెక్కలు సామానులు వేసి భోగి మంటలేశారు. పిల్లలూ లేవండి భోగి మంటలు చూడమంటూ లేపేసరికి నిద్రకళ్ళతో వచ్చి ఆ మాటల్ని చూసి ఇవి ఎందుకు వేస్తారంటూ సందేహాన్ని వెలిబుచ్చారు.
పాత సామానులన్నీ పనికిరానివి మంటలో వేసి, సంక్రాంతి నుంచి కొత్తవి వాడటం ఆచారం. చుట్టుపక్కల వాళ్లంతా పెద్ద పెద్ద తాటి దుంగలు తెచ్చి ఆ మంటలో వేశారు. చుట్టూ చేరి చలిమంటలు కాచుకొన్నారు. వాకిళ్లకి తోరణాలు, గడపలకు పసుపు కుంకాలు. చీకటితో లేచి వాకిలి ముందు పెద్ద పెద్ద ముగ్గులేయటం. రంగులు దిద్ది, వాటిలో గొబ్బిళ్లును అలంకరించటం చూస్తుంటే ప్రతిదీ వాళ్ళకి వింతగానే అనిపించేది.
భోగి రోజు పిల్లలందరినీ కూర్చోబెట్టి భోగిపండ్లు పోసింది సావిత్రమ్మ. రెండవరోజు సంక్రాంతికి బొమ్మల కొలువులు పేర్చి పేరంటం జరిపారు. కనుము రోజు గోవులకు పసుపు రాసి బొట్లు పెట్టి వాటి మెడలో పూలదండలు వేస్తుంటే ఇలా ఎందుకు చేయాలంటూ ప్రశ్నలు వేశారు పిల్లలంతా!
రాఘవయ్యగారు అక్కడే ఉండి పశువులు సంవత్సరమంతా కష్టపడి పనిచేస్తాయి. పంట పొలాల్లో తిరిగి చేలను చదునుచేసి పంటలు పండటం కోసం ఎంతో శ్రమిస్తాయి. అందుకే వీటికి ఈరోజు అలంకరించి పొంగలి వండి తినిపిస్తారు. ఇలా చేస్తే మనం వాటి ఋణం తీర్చుకొన్న వాళ్లమవుతామంటూ అర్ధం అయ్యేలా చెప్పారు.
తాతగారి చేత గాలిపటాలు చేయించుకొని ఎగురవేశారు. పద్మజ పండుగ పనుల్లో పాలుపంచుకొంది. రకరకాల పిండి వంటలతో అంతా కలిసి కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేశారు.
ఇలా మీ అందరినీ చూస్తుంటే మాకెంతో ముచ్చటగా వుంది. ప్రతి సంక్రాంతి అందరం ఒకచోట కలుసుకోవటం వల్ల ప్రేమలు, ఆప్యాయతలు పెరుగుతాయి. అనుబంధాలు దగ్గరవుతాయి. ముఖ్యంగా పిల్లలకి పండుగంటే ఏమిటో తెలియాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కలగాలి. ఇలాంటి వాతావరణాన్ని చూసి వాళ్లెంత ముచ్చట పడుతున్నారో తెలుసా? బాల్యంలో మీరు పొందిన అనుభవాలన్నీ మీ పిల్లలకు వారసత్వంగా అందించండి. అదే మేము కోరుకొనేదంటూ ఆర్ద్రతగా చెప్పారు.
నిజమే మనం పొందిన బాల్యాన్ని వాటి మధురానుభూతుల్ని మన పిల్లలకు వారసత్వంగా అందించాలి. అవే తరగని సిరిసంపదలు. మాకూ పండుగ రోజన్నా అందరం కలిసి హాయిగా ఆనందంగా గడిపామన్న తృప్తి మిగులుతుంది. ఇకపై ప్రతి సంక్రాంతికి అంతా ఒకేచోట పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకొన్నారు. పండుగ నాలుగు రోజులు పెద్దలతో కలిసి పంచుకొన్న అనుభూతుల్ని మనసుల్లో పదిలంగా దాచుకొన్నారు.
తిరిగే వెళ్లేరోజు అందరికీ బాధ, దిగులు. సావిత్రమ్మ అందరికీ కొత్త బట్టలు పెట్టంది. తల్లిదండ్రులు తాతగార్కి నమస్కారాలు చేస్తుంటే పిల్లలు కూడా వంగి పాదాభివందనాలు చేశారు. మళ్ళీ సంక్రాంతికి ఇక్కడికే వస్తామంటూ వెళ్ళలేక వెళ్ళలేక మధురానుభూతుల్ని మూటగట్టుకొని బస్సెక్కారు రెండు కుటుంబాలు.
**

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- తాడికోల పద్మావతి గుంటూరు చరవాణి : 9441753376