రాజమండ్రి

సరదా పందెం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏవయ్యోయ్! నినే్న (మేనరికం మొగుడు మహాలోకువ)... నినే్న యినబడిందా?...అల్లుడు బెమ్మానందం గురించి లోకం కోడై కూస్తున్న యిషయం నీ చెవుల్లో పడిందా లేదా?.. మాట్లాడవేం బెల్లంకొట్టే రాయిలాగ! అని వీరాయమ్మ మొగుడి మీద కరిచినట్టు అరిచే సరికి సదరు ఏవయ్యోవ్’ మన అల్లుడు గారంత కాని పని ఏం చేశాడు? పెపంచకం కోడిలా అరవడానికి?... తాగడు పేకాట లేదు... కొంపతీసి దేన్నయినా మరిగాడా ఏంటి?’ అని అనుమానిస్తుంటే
‘ఆపాటి గుండె ధైర్యం బలం అతగాడిలో ఉన్నాగాని మనమ్మాయి మహాలక్ష్మి ఊరుకుంటుందా? ఊరుకోదు. గోడకు మేకు దిగ్గొట్టి దానికి ఫొటో ఏలాడగట్టినట్టు మొగుడ్ని ఏలాడదీస్తుంది. అది నా బిడ్డ నా లక్షణాలతో పుట్టి పెరిగింది మరి! నా దగ్గర నువ్వెలా అణగిమణిగి ఉంటున్నావో అల్లుడూ కుక్కిన పేనులా పడి ఉంటాడు’ అంటూ వీరాయమ్మ తల్లికూతుళ్ల ప్రతాపం చెప్పుకొచ్చింది.
ఏవయ్యోయ్ నోరెత్తలేక సన్నగా పళ్లు కొరుక్కుంటూ ‘ఆస్తిపాస్తులున్న పెళ్లానికి నోళ్లు పెద్దగా ఉంటాయి. వీళ్లతో ఏగడం కంటే బేంకు క్యూలో డబ్బులేకపోయినా నిలబడ్డం ఉత్తమం...’ అని గొణుగుతుంటే... ‘నీలో నువ్వే సణుక్కుంటున్నావేంటి?’ అన్న భార్యతో ‘అక్షరాలా పచ్చినిజం చెప్పావు అనుకుంటున్నాను. అంతే...’ అంటే వీరాయమ్మ ‘నువ్వెలా అఘోరించినా నాకెలాంటి సెబ్బర యిబ్బంది ఉండవుగాని...’ అంటుంటే మధ్యలో ‘అందుకేగా మాయమ్మ పట్టుపట్టి నన్నిచ్చి నీకు పెళ్లి చేసింది’ అన్నాడో లేదో వీరాయమ్మ అందుకుంది పెళ్లున.
‘మీ యమ్మ వెర్రి బాగుల్దికాదు. తన కొడుకు పనిపాటా చెయ్యలేని అర్భకుడు. కొంపగోడు సెంటు భూమిలేని దరిద్ర దామోదరుడు అని బాగా ఆలోచించి కూటికి గుడ్డకి గూడుకి లోటు లేకుండా బతుకుతాడని మేనరికం చేసింది. ఆ పెకారం నువ్వు నాకు దాపరించావు’ అనే సరికి పెళ్లాం చెప్పింది యదార్థం గనుక ఏవయ్యోయ్ నోరు మూసుకున్నాడు.
ముదలకిస్తే తన బలహీనతలిని పెద్దగా అరిచేసి ఊరంతకి జ్ఞాపకం చేస్తుందన్న భయంతో ఇంతకీ అల్లుడుగారు ఎలగబెట్టిన ఘనకార్యం ఏమిటంట?’ కన్న తండ్రిలా ప్రశ్నించాడు.
‘అవ్వ.. చెప్పడానికి నోరు రావడంలేదు.. అవ్వ..’ అంటూ నోరు నొక్కుకుని ఆగింది. వెంటనే ‘అయితే అల్లుడుగారు సిగ్గుకి సిగ్గొచ్చే లాంటి దవుడుబాజి పనిచేసి ఉంటాడు’. అంటే వీరాయమ్మ ‘సిగ్గులు బొగ్గులు నాకు తెలీదు కాని... ఈ మధ్య అల్లుడు దేవుడికి దణ్ణాలు పెట్టినట్టు..’ మధ్యలో ఏవయ్యోయ్ ‘అమ్మాయికి పెడుతున్నాడా?’ అంటే వీరాయమ్మ ‘అలా చేసినా బాగుండును. లోకం నవ్వినా నవ్వకపోయినా సంతోషించేదాన్ని... ‘ఏవయ్యోయ్ టెన్షన్ భరించలేక దండాలు ఎవరికి పెడుతున్నాడు? అడిగాడు.
‘టీవీ’కి టక్కున చెప్పి ‘ఇంట బైట టీవీ కనపడితే చాలు వట్టి దండాలు కాదు సాష్టాంగం పడిపోడుతున్నాడట. చూసిన జనం టీవీ సీరియల్లా నవ్వుకుంటున్నారట’. అసలు సంగతి బైటపడింది.
ఏవయ్యోయ్ విని నిర్ఘాంతపోయాడు. ఎందుకూ పనికిరానివాడు కూడా గుడి గుడిలో దేవుడికి విద్యనేర్పిన గురువుకి జన్మకారకులైన తల్లిదండ్రులికి హితవుచెప్పు పెద్దలికి పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టిన రాయి రప్పకి దండాలు పెడతారు. సాష్టాంగ పడతారు. కొందరు పొర్లు దండాలు పెడతారు. ఇవన్నీ విడిచి పెట్టి స్పెషల్‌గా టీవీ డబ్బాకే ఎందుకు దణ్ణంపెట్టి సాష్టాంగ పడిపోతున్నాడు? కారణమేమిటి?.. కొంపతీసి కీడెంచి మేలెంచమన్నట్టు.. బుర్ర ఖరాబయి.. పిచ్చిగాని పట్టిందా?.. ముదిరితే ప్రమాదం’.. అనుకున్నాక.
‘ఈ దండాలు సంగతి అమ్మడు ఫోన్లో చెప్పిందా? లేక కబురు పెట్టిందా?’ అడిగితే కాదు మన ఇరుగు పొరుగుకి వాళ్ల దగ్గర చుట్టాల వల్ల తెలిసి తనకు చెప్పారంది వీరాయమ్మ.
తన భర్త సంగతి తల్లిదండ్రులకి ఎరుకపరచలేదంటే... ఇరుగు పొరుగు చెప్పింది నిజమైతే టీవీ దండాల్లో ఏదో మతలబు ఉందన్నాడు ఏవయ్యోయ్. అది తేల్చుకోవడానికని కూతురు ఊరు వెళ్లొస్తానంటే వీరాయమ్మ వెంటనే బయల్దేరమంటూ ‘టీవీ ఛానళ్లు పెరిగిపోయినట్టు కొత్త కొత్త రోగాలు, జబ్బులు పుట్టి పెరుగుతున్నాయి.. వెళ్లీ వెళ్లగానే అమ్మాయితో వివరంగా మాట్లాడి అల్లుడిని పెద్ద డాక్టరికి చూపించండి. అశ్రద్ధ చేయొద్దు.. ఒక్కగానొక్క పిల్ల లేకలేక పుట్టింది. అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసి ఓ అయ్య చేతిలో పెట్టాము. ఇప్పుడేమయిందో చూడు..’ అని బాధపడ్డ వీరాయమ్మ మాతృహృదయం కుమార్తె క్షేమం భర్తకి చెప్పుకుంది. కష్టసుఖాలు భార్యాభర్తలని ఒకటి చేస్తాయి. అది భారతీయ వివాహ బంధం విశిష్టత. ఏవయ్యోయ్ బయల్దేరాడు.
భర్తని బహిర్ముఖంగా ఏవయ్యోయ్ అని సంభాషించే వీరాయమ్మ అంతర్ముఖంగా పతి పూజనీయుడే!
ఏవయ్యోయ్ బస్సుదిగి ఆటోలో కూతురించి ముందు దిగి గబగబ మెట్లెక్కి ఆత్రంగా లోపలికి చూసాక అప్రయత్నంగా వీధిగుమ్మం పక్కకి జరిగి నిలబడి చూసాడు.
కుమార్తె మహాలక్ష్మి హాలు మధ్య కుర్చీలో ఉండి జలపాతంలా ఏడుస్తూ మధ్యమధ్య కొంగుతో కళ్లొత్తుకుంటూ పిండుకుంటుంటే కారిన కన్నీరు ధార కట్టి గడప దగ్గర మదుగు కట్టి ఉంది.
మహాలక్ష్మి రోదనకి కారణమైన విషాద సన్నివేశం టీవీలో నడుస్తోంది. అందులో లీనమైపోయినందు వల్ల తండ్రి రాకని గమనించలేదు. ఆటో శబ్దం వినబడలేదు. ఆ సమయంలో బైటి నుంచి వచ్చిన అల్లుడు బ్రహ్మానందం మామగారిని చూసి కూడా పలకరించలేదు. నవ్వలేదు. రెండు చేతులు జోడించి ముందు హాల్లో టీవీకి దణ్ణం పెట్టాడు. తర్వాత సీరియల్ చూస్తూ కంటికి మింటికి ఏకధారగా ఏడ్చే అర్ధాంగిని చూసుకుంటూ ఆనందంతో మరలా దణ్ణాలు రెండు పెట్టాడు. మొత్తం మూడయ్యాయి.
అనంతరం నవ్వు మొహంతో తనని విస్మయంగా వీక్షిస్తున్న మావగారికి నమస్తే చెప్పి లోపలికి ఆహ్వానించాడు. ఏవయ్యోయ్ అడుగు కదిపాడు.
తండ్రి భర్త ఒకేసారి రావడంగాంచిన మహాలక్ష్మి కళ్లు తుడుచుకుంటూ దిగ్గున లేచి నిలబడి తండ్రిని పలకరించి టీవి కట్టేసి తండ్రితో భర్తని మాట్లాడమని చెప్పి కాఫీ కోసం కిచెన్లోకి దారితీసింది.
క్షేమ సమాచారాలు అడుగుతున్న అల్లుడిని ఏవయ్యోయ్ ఎగాదిగా పరిశీలించి చూసాడు. ఉన్నాద లక్షణాలు గోచరించలేదు. చక్కగా నవ్వుతూ సంభాషిస్తున్నాడు. శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాడు. తాము ఊహించినట్టు లేదు.
కాని టీవీకి ముమ్మారు దండాలు పెట్టడం ఏడ్చే భార్యని ఆనందంగా చూడ్డం ఎందుకో అర్ధంకాక అడగబోయి ఆగిపోయాడు. తర్వాత ‘బాబూ! నువ్వు మాకు కొడుకుతో సమానం. మన మధ్య అరమరికలుండకూడదు. నేనెందుకింత అర్జంటుగా వచ్చానో చెబుతున్నాను వినండి. మా ఊళ్లో మీ గురించి వింతగా చెప్పుకుంటున్నారు. కంగారుపడ్డాము. అదెందుకొచ్చిందో తెల్సుకోవాలని వచ్చాను. నా వెనుక వచ్చిన మీరు నా కంటే టీవీకి ప్రాధాన్యతనిచ్చి మూడు దండాలు పెట్టి మేము విన్నది నిజం చేశారు. కనుక బైట కూడా దణ్ణాలు, సాష్టాంగాలు పెడుతున్నారని నమ్ముతున్నాను. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు.? కారణమేమిటి? ఇదీగాక ఏడుస్తున్న మా అమ్మాయిని ఆనందవదనంతో ఎందుకు చూసారు? చెప్పండి?’ అని ప్రశ్నించే సరికి బ్రహ్మానందం ఫకఫకా నవ్వేసి ‘మిమ్మలిని అనవసరంగా బాధపెట్టినందుకు క్షమించండి. మహాలక్ష్మి నేను ఒక సరదా పందెం వేసుకున్నాము. దాని ప్రకారం నేను ఏదో రూపేనా మీ అమ్మాయిని కొట్టకుండా తిట్టకుండా కన్నీళ్ల పర్యంతం ఏడిపించాలి. నేనేం చేసినా మహాలక్ష్మి నవ్వాలి తప్ప ఏడ్వకూడదు. ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చకూడదు. సై అంది రాల్చనుగాక రాల్చనంది. నేను వలవలా ఏడ్పిస్తానన్నాను. నా వల్ల జరగదు అంది. బల్లగుద్ది చెప్పినట్టు మాట్లాడింది వెంటనే నాలో పంతం పట్టుదల పెరిగాయి. కన్నీరు పెట్టిస్తానని ఛాలెంజ్ చేసాను. ఆ క్షణం నుండి నేను అనేక విఫల ప్రయత్నాలు చేసాను. మహాలక్ష్మిని ఏడిపించలేకపోయాను. పందెంలో ఓడిపోతాను తప్పదు అనుకుంటున్నప్పుడు.. పండుగ గిఫ్ట్‌గా మీరు కొని పంపిన టీవీ నా నెత్తి మీద పాలు పోసింది. అది మా ఇంట కాలిడిన క్షణం నుండి విషాదాంత గొలుసు కట్టు సీనియల్స్ చూడ్డం ప్రారంభించి ఏడ్పుకి బానిసయిపోయింది. పందెం నియమం ప్రకారం ఏ కారణంతో ఏడ్చినా ఓటమి కింద లెక్క! అలా మహాలక్ష్మి ఓడి నేను గెలిచాను. నన్ను అనూహ్యంగా విజేతను చేసిన టీవీ రుణం తీర్చుకోడానికి ఎక్కడ కనబడితే అక్కడ దండాలు పెట్టి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సాష్టాంగం ఇంట్లో చేస్తాను. బైట చెయ్యను. కాని అది కూడా పొక్కిపోయింది.’ అని ముగించే సరికి ఏవయ్యోయ్‌కి నవ్వాలో ఏడ్వాలో అర్థంకాక బుర్రగోక్కుంటూ
‘కూతురు సీరియల్ పిచ్చికి, అల్లుడు చిలిపి పందెం నెగ్గిన టీవి భక్తికి - అది కొనిచ్చి సరదా రాద్ధాంతానికి కారణమైనందుకు ఏవయ్యోయ్ ముచ్చట పడ్డాడు.

- మాధవరపు కృష్ణ, కాకినాడ