విశాఖపట్నం

చైన్ స్నాచింగ్ (కథానికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం...
తీరిగ్గా పేపరు చూస్తూ కూర్చున్నాడు హరికృష్ణ.
పొద్దునే్న సింగారించుకుని పేరంటానికి వెళ్లిన స్వర్ణలత లబోదిబోమంటూ రావడం చూసి హతాశుడయ్యాడు.
‘‘ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు?’’ అంటూ గభాలున కుర్చీలో నుండి లేచాడు.
‘‘ఏం చెప్పామంటారండి? పోయింది ఆ వెధవ ఎవడో నా మెడలో నుండి గొలుసు తెంపుకుని పారిపోయాడు. అమ్మో అమ్మో రెండు తులాల హారం. వెంటనే పోలీసు కంప్లైంట్ ఇవ్వండి’’ గుక్క తిప్పుకోకుండా చెప్పింది స్వర్ణలత.
‘‘ఈ మధ్య చైన్‌స్నాచింగ్‌లు పెరిగిపోయాయి అని తెలుసు కదా. ఒక్కర్తివీ వెళ్లేటప్పుడు హారం ఎందుకు వేసుకున్నావ్?’’ అన్నాడు తప్పంతా ఆమెదే అన్నట్లుగా.
భర్త మాటలకి ఒళ్లు మండింది స్వర్ణలతకి.
‘‘మీ మాటలు మరీ బాగున్నాయండి. పేరంటానికి బోసి మెడతో ఎలా వెళతాననుకున్నారు? అయినా ఎంత దూరమని పక్క వీధిలోనే కదా. అంతలోనే ఆ వెధవ ఎవడో ఇంత పని చేశాడు’’ అంటూ మళ్లీ నూటొక్క రాగం అందుకుంది.
నగ పోయిందని తెలిసినా అతగాడి ముఖంలో ఏ బాధా గోచరించడంలేదు.
పైగా నిమ్మకు నీరెత్తినట్లు ప్రశాంతంగా ఉన్నాడు.
హరికృష్ణ ఓ చిరుద్యోగి. తనకి వెనకా ముందూ ఎవరూ లేరు. స్వర్ణలతని ఎంతో ఇష్టపడి పరిణయం ఆడాడు. పెళ్లయి మూడేళ్లవుతోంది. ఇంత వరకు పిల్లాపీచూ లేదు. వివాహమైన కొత్తలో భార్యని మురిపెంగా ‘లతా’ అని పిలిస్తే ‘‘వద్దండి అలా పిలవద్దు. స్వర్ణా అని పిలిస్తేనే నాకు బావుంటుంది’’ అంది గోముగా.
‘‘సరేలే నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? అలానే పిలుస్తా’’ అన్నాడు ఆలి బుగ్గమీద సుతారంగా చిటికె వేస్తూ.
పేరుకు తగ్గట్టు ఆమెకు స్వర్ణం మీద ఎంత మోజుందో కొద్ది రోజుల్లోనే బయటపడింది.
జీతం అందుకుని అర్ధాంగి చేతిలో పెట్టాడు హరికృష్ణ.
మర్నాడు ఇంటి ఓనరుకి అద్దె చెల్లించడం కోసం, కిరాణా వాడి బాకీ తీర్చడం కోసం డబ్బులడిగాడు.
‘‘ఇవిగో తీస్కోండి ఎవరికి ఎంతిస్తారో నాకు తెలియదు’’ అంటూ పదివేలు తెచ్చి చేతిలో పెట్టింది స్వర్ణలత.
‘‘ ఇవి చాలవు. నీ దగ్గరింకా డబ్బులున్నాయి కదా. అందులో నుండి మరో అయిదు వేలు తీసివ్వు. పాలవాడికి కూడా ఇవ్వాలి’’ అన్నాడు హరికృష్ణ.
‘‘నా దగ్గరున్న డబ్బులవే. చెప్పడం మరిచాను నిన్న అరతులం బంగారం కొన్నానండి. ప్రతినెలా మీరు పట్టుకొచ్చిన జీతంలో అంతో ఇంతో బంగారం కొనాలనుకుంటున్నాను’’ మనసులో మాట బయటపెట్టింది స్వర్ణలత.
భార్య మాటలకి విస్తుబోయాడు హరికృష్ణ. తన పంతం తనదే తప్ప ఎవరి మాటా వినదని తెలుసు. అర్ధాంగి కోరికను కాదనలేక డబ్బులు చాలకపోతే అప్పులు చేస్తూ తన తిప్పలేవో తను పడసాగాడు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. పెళ్లయిన ఈ మూడేళ్లలో నగా నట్రా బాగానే చేయించుకుంది. ఈమెకి బంగారం పిచ్చి ఎప్పుడు పోతుందో ఏమిటో అనుకుని తల పట్టుకుంటూ ఉండగా ఈ సంఘటన జరిగింది.
‘‘ఏంటండీ అలా ఉలుకూ పలుకూ లేకుండా అయిపోయారు. త్వరగా పోలీసులకి ఫోన్ చేయండి’’ అంది స్వర్ణలత.
ఆమె కంఠంలో అదే కంగారు.
‘‘చూడు స్వర్ణా నీ బంగారం మోజు ఎంత అనర్థానికి దారి తీసిందో. ఇక నుండైనా నా మాట విని బంగారం కొనడం మానెయ్. నువ్వు చేస్తున్న పని వల్ల అప్పులు చేస్తూ ఇప్పటికే నేను పీకల్లోతుల్లో కూరుకుపోయాను. డబ్బులుంటే బ్యాంకులో దాచుకో. దానికి వడ్డీ కూడా వస్తుంది. రేపు మనకి సంతానం కలిగితే బోలెడన్ని ఖర్చులుంటాయి. బంగారం కొనడం వల్ల లాభం ఏమిటి చెప్పు? అవసరానికి అమ్ముకుందామన్న దాని ధర రోజురోజుకి పడిపోతుంది. పైగా దొంగల భయం. నేనిప్పుడు గొలుసు పోయిందని పోలీస్ కంప్లయింట్ ఇచ్చినా దొరుకుతుందన్న ఆశ లేదు. కాబట్టి ఓ రెండు గాజులు ఉంచుకుని మిగిలినవి అమ్మేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. ఏ చీకూచింతా లేకుండా సంసారం సుఖంగా సాగిపోతుంది’’ అంటూ హితబోధ చేశాడు హరికృష్ణ.
హారం పోయినా అతనంత నిశ్చింతగా ఉండడానికి కారణం అది బంగారు వస్తువు కాకపోవడమే. ఆ ఏడు అందుకున్న బోనస్‌తో హారం చేయించమని ఇల్లాలు పోరు పెట్టేసరికి ఏం చెయ్యాలో పాలుపోక అలాగే అని చెప్పి ఓ మెరిసే గిల్టు చైను కొనుక్కొచ్చాడు. ఆ విషయం పాపం ఆ మహాతల్లికి తెలియదు. మహా అయితే ఆ గొలుసు ధర వెయ్యి లోపలే ఉంటుంది. అందుకే వస్తువు పోయిందని భార్య గగ్గోలు పెడుతున్నా తనకి చీమ కుట్టినట్లు కూడా అనిపించడంలేదు.
మగడి మాటలు ఆమె మీద బాగా పనిచేసినట్లున్నాయి. అంతే ఆ రోజు లగాయితు స్వర్ణ మరి స్వర్ణం జోలికి పోతే ఒట్టు.
చైన్ స్నాచింగ్ వల్ల ఎందరు బాధపడ్డా తనకు మాత్రం అది మేలే చేసిందని సంతోషించాడు హరికృష్ణ.

- దూరి వెంకటరావు,
25-10-30,
దాసన్నపేట మెయిన్‌రోడ్డు,
విజయనగరం-535002. సెల్ : 9666991929.
**
మనస్సాక్షి వౌనం వహిస్తే...
*
కాకినాడ-విశాఖపట్నం సూపర్ లగ్జరీ బస్ విశాఖ బస్ కాంప్లెక్స్ చేరుకోగానే టాస్క్ఫోర్స్ అధికారులు ఒక్కసారిగా బస్సును చుట్టుముట్టారు.
‘‘ఈ బస్సులో మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని మాకు సమాచారం అందింది’’ అంటూ ప్రయాణికులను తనిఖీ చేయసాగారు.
మూడవ వరస సీటులో కిటికీ పక్కనే హూందాగా కూర్చున్న వ్యక్తిని ఉద్దేశించి ఆయన పక్కనే ఉన్న ప్యాకెట్‌ని చూసి ఇదేమిటని ఆరా తీశారు.
‘‘ఎవరో ఒక వ్యక్తి విశాఖపట్నంలో ఇమ్మని నాకీ ప్యాకెట్ ఇచ్చాడు’’ చెప్పాడు అతను.
అధికారుల అనుమానం బలపడింది. వెంటనే ప్యాకెట్ తెరచి చూశారు. అందులో కాగితాల మధ్య ఒక సీల్ చేసిన పాలిథిన్ కవర్లో బ్రౌన్‌సుగర్ ఉంది. ఖరీదైన మత్తు పదార్థం అది. దాంతో పాటు మెధాక్విలోన్ అనబడే మత్తు మందు కూడా బయటపడింది.
‘‘ఎన్నాళ్ల నుండి జరుగుతోంది ఇది?’’ అంటూ అధికారులు అతన్ని నిలదీశారు.
‘‘నేను రక్షణ శాఖలో బాధ్యతాయుతమైన అధికారిగా పని చేసి రిటైర్ అయ్యాను. నాకేమీ తెలియదు’’ అని అతను మొత్తుకుంటున్నా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇరికించి ఆయన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు.
ఆయన వెనుక సీటులోనే కూర్చున్న నా ఆలోచనలు ఓ నాలుగు గంటలు వెనక్కి వెళ్లాయి.
‘దయచేసి వినండి. కాకినాడ నుండి విశాఖపట్నం పోవు సూపర్ లగ్జరీ బస్ పది నిముషాల్లో బయలుదేరుటకు సిద్ధంగా ఉంది’ అంటూ మైక్‌లో అనౌన్స్‌మెంట్ వినిపించింది.
సరిగ్గా అదే సమయంలో ఒక యువకుడు చేతిలో ఓ ప్యాకెట్‌తో బస్‌లోకి ప్రవేశించాడు.
‘‘సార్ మీరు విశాఖపట్నం వెళుతున్నారు కదా. మా తమ్ముడు అర్జెంటుగా రేపు ఉదయం ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. ఇందులో వాడి ఒరిజినల్ సర్ట్ఫికెట్లు ఉన్నాయి. కొరియర్‌లో పంపించేటంత వ్యవధి లేదు. వాడికి ఫోన్ చేసి చెబుతాను. వాడు విశాఖపట్నంలో మీ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు’’ అంటూ ప్రాధేయపడ్డాడు.
విశాఖపట్నంలోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాను నేను. ఆఫీసు పని మీద కాకినాడ వచ్చి బస్సులో తిరుగు ప్రయాణమయ్యాను. నేను ఆలోచనలో పడ్డాను. విశాఖపట్నం చేరుకున్న వెంటనే రాత్రి ఎనిమిది గంటల ట్రైన్‌కి కోల్‌కతా బయలుదేరి వెళ్లాలి. సమయం తక్కువ. ఆ అబ్బాయి రావడం ఆలస్యమైనా, ఏ కారణంగానైనా ఆ అబ్బాయి రాకపోయినా నేను ఇబ్బంది పడాలి. ఆ కారణంగానే ‘‘లేదు నాయనా వీలు పడదు’’ అంటూ సున్నితంగా తిరస్కరించాను.
నా ముందు సీటులో కూర్చున్న ఆ పెద్దాయన ఆ అబ్బాయి అవస్థ చూసి ‘‘ఇలాతే బాబూ నేను ఇస్తాను’’ అంటూ ఆ ప్యాకెట్ తీసుకున్నాడు.
‘‘్థంక్యూ సార్’’ అంటూ ఆ యువకుడు బస్ దిగి వెళ్లిపోయాడు.
నా ఆలోచనలు వర్తమానంలోకి వచ్చాయి.
ఈ విషయంలో ఆయన నిర్దోషి అన్న సంగతి నాకు తెలుసు అయినా వౌనంగా ఉండిపోయాను. దానికి కారణం దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఓ బస్సు ప్రయాణంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో దాహం దాహం అంటూ పరితపిస్తున్న ఓ అభాగ్యుడికి మానవత్వంతో మంచినీళ్లిచ్చినందుకు ఆయన చావుకి నువ్వే కారణమంటూ పోలీసులు పెట్టిన అక్రమ కేసులో నేనింకా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నందుకు.
‘నీ కళ్లెదుట జరుగుతున్న ఓ అన్యాయాన్ని ఎదిరించి ఓ అమాయకుడిని కాపాడలేకపోయావు’ అంటున్న అంతరాత్మ గొంతు నొక్కి వౌనంగా అక్కడి నుండి నిష్క్రమించాను.

- అంగర కృష్ణారావు, 40-1-24/18, కైలాసపురం,
విశాఖపట్నం-530024. సెల్ : 7396466528.