విజయవాడ

నిర్ణయం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇప్పటికి మీ అబ్బాయితో తన్నులు తిని హాస్పట ల్ పాలైన పిల్లల సంఖ్య ఎనిమిది మంది. మేము మీకు ప్రతిసారీ కబురు పెట్టడం, మీరేమో ఇదంతా మామూలు విషయమన్నట్లు తోసిపారేసి వెళ్లడం పరిపాటి అయింది. మీవాడిని ఇంకా వెనకేసుకు రావడం మావల్లకాదు’.. అసహనంగా మరోసారి చెప్పాడు శ్రీనివాసు.
‘మీరు అలాగంటే ఎలాగ సారూ! మేమా మొరటోళ్లం. మావోడ్ని మీరే కడుపులో పెట్టుకోవాలి మరి. ఆటకాయితనం సిలిపివాడు. మాలాగా ఆగమైపోకుండా వాడికి నాలుగు అచ్చరమ్ముక్కలు రానీండి సారూ. నీకు దణ్ణవెడతాను’ అరగంట నుండి ఇదే తీరు. విషయం తేలదు. అక్కడ తనెక్కాల్సిన రైలు వెళ్లిపోతే మళ్లీ ఎనిమిది గంటల్దాకా ఆ స్టేషన్లోనే అఘోరించాలి. పదోసారి వాచీ వంక చూసుకున్నాడు శ్రీనివాసు.
‘మరోసారి ఇలాగ గొడవొస్తే మీవాడికి టిసి ఇచ్చేస్తాను మరి’ గట్టిగానే చెప్పాడు.
‘బాబ్బాబూ..! అట్లనొద్దు మల్ల. నాలుగు తగలనీండి నాకొడుకుని. నేను మాట్లాడనుగా’ అతను వినేలా లేడు. అయినా ఏదో మాటవరసకి అలా బెదిరించడం తప్ప చదువు రాకపోయినా, బడికి రాకపోయినా, అల్లరి చేసినా, టీచర్లని ఎలా ఇబ్బంది పెట్టినా.. బతిమాడి తీసుకొచ్చి, పుస్తకాలిచ్చి, భోజనాలు పెట్టి, దణ్ణంపెట్టి మరీ ఆ రత్నాన్ని చదివించాల్సిన బాధ్యత గవర్నమెంటు టీచర్లదే.
ఈ ఆణిముత్యాలకు చదువుకునే అవసరం అస్సలుండదు మరి. అదంతా మేం బతకడానికి మాపై దయతలచి, కష్టపడి బడికొచ్చి కూర్చుంటారు కొందరు పిల్లలు. నూటికి 75 శాతం ఇదేతీరు. బతకలేక బడిపంతులు ఉద్యోగమన్నట్లు.
‘సరేవెళ్లండి’ విసుగ్గా అనేసి లంచ్ బ్యాగ్ తీసుకుని నాలుగు గంటల్లో రోడ్డెక్కి, రైల్వేస్టేషన్ వైపు పరిగెత్తాడు. ఆల్రెడీ.. ఆ ధూమశకటం పట్టాలెక్కి ఠీవిగా చూస్తోంది.
‘ఏంటి సారూ! ఈ వేళా వేడుకగానే వొచ్చారు’ జెండా ఊపేవాడికి ఓ అరచేతి నమస్కారం అలవోకగా విసిరేసి ప్లాట్‌ఫారంపై పరిగెత్తి ఓ బోగీలోకి శరీరాన్ని చేర్చి ఉస్సురంటూ.. రిలాక్సయ్యి- ‘ఏమోయ్! ఈరోజు కూడా ఆఖరు నిమిషంలో కదిలే రైలు అందుకున్నావు. ఎప్పటిలాగే మా గురుకుల పాఠశాల టెన్షన్లు, హాస్టలు వార్డెను బాధ్యతలు కూడా అదనం కావడంతో ఊపిరి సలపడం లేదు. ఆ ప్రిన్సిపాల్ సహకరించడు. హాస్టల్ పిల్లల గొడవలు తలనిప్పులా. ఒక్కోరోజు ఈ టెన్షన్‌తో బిపి పెరిగిపోయి, ఏ స్ట్రోక్ అయినా వొస్తుందేమోనని భయం. ఈ దినచర్యలో కాస్త విశ్రాంతీ, విరామమూ దొరికి ఆహ్లాదంగా, స్థిమితంగా తోచేది. ఈ రైలు ప్రయాణమూ, నీతో ఊసులూ తప్ప వేరేదీ లేదంటే నమ్ముతావా?
ఇంటి దగ్గర నాకోసం ఎదురుచూసే అరవిందమేదీ లేదనే నిరాశ. వానపడి వెలిసిందీ వేళ. వాతావరణం చల్లబడింది. ఎర్రబడ్డ సూర్యుడు అలసిసొలసి జారిపోతుంటే పడమటి అంచున నేలతల్లి సూరీడ్ని తనలో కలిపేసుకుంటోంది. పల్చని మబ్బు తెరలింకా నేలనీ, నింగినీ కలుపుతూ నిచ్చెనలేస్తూనే వున్నై. ఈ మబ్బులకు ఎంత తొందరపాటో! ఈ మనసు మాడితే గర్జించడం, నేలకు కుంగితే వర్షించడం, కూసింత గాలికొడితే తేలిపోవడం.. అచ్చం నాలాగే! ఆకాశమంతా నలుపు కోటింగ్ ఇచ్చిన నీలం రంగులో వుంది. బ్యారేజీ కిందున్న నీళ్లల్లో మరో ఆకాశం తొణికిసలాడ్తోంది. నల్లగా నియాన్ ఎల్‌ఇడి లైట్ల వరుసలతో బ్యారేజీ కింద నేలకీ, నింగికీ మనిషి కట్టిన వారధే హద్దులాగా తోస్తోంది. నాకూ, నీకూ మధ్యనున్న అడ్డుగోడలన్నీ మనం కట్టుకున్న వేగా. కష్టపడి ఉద్యోగాల్జేస్తూ.. అవసరమంటావా?
మళ్లీ జల్లు మొదలైంది. ఎండిన పొలాలకీ, కలల పందిళ్లకీ, తీరని కోరికలకీ, ప్రేమాభిషేకం చేసినట్లు మరోసారి నీతో కలిసి తడవాలనుంది నేస్తం. బొత్తిగా పగటి జాబిల్లివైనావు మచ్చేసి, మసకేసి, ముసురేసి కనపడవు. ప్రేమో - కామమో, విరామమో - వియోగమో, కష్టమో - నష్టమో.. ఏ పేరైనా పెట్టుకో. ఆ రెంటికీ నువ్వటూ, నేనిటూ మిగిలాం. నా కలవరం నీకెలా తెలుస్తుంది! నీతో కలిసి అల్లరి చేసిన క్షణాలు అలల్లా మనసులో ఎగసిపడ్తున్నాయి. నా చెలియలికట్టవు నీవేనని నీకు తెలియదూ?
నీపు ప్రేమలేదని నిష్ఠూరాడతావు. నిను పట్టించుకోనని నిందలేస్తావుగానీ.. నిన్ను మరిచిందెపుడు నేను? చిరు అక్షతలుంచి, నీ పాపిట కుంకుమదిద్ది, నా భార్యవని చెప్పిన క్షణం నాతో మిగిలే వుంది. దోసిటపట్టి చూడు మనం గడిపేసిన జీవితాన్ని. మనం ఒక్కటి కాదూ??
- ఆ రోజు ఎంత గొడవపడ్డామో గుర్తుందా?.. నీదే పైచేయి కావాలని అలిగావు - నీవలసిపోయి - నాకు చెమటపట్టింది, నువు తడిసిపోయి - నాకు సేదతీర్చి, నువ్వు గెలిచి - నన్ను మెచ్చుకున్న క్షణాలు ఎంత మధురమో? చూపలేని రహస్యాలు చూసేసాక, చెప్పలేని సంగతులన్నీ వినేసాక, నా చెవిలో నీ గుసగుసలు! నీ మెడవంపు దిగి మాయమయితే... సందిగ్ధం లేకుండా, నిజమేదో తేల్చునువ్వు. అదంతా కేవలం ‘పరవశమా లేక ‘మన’ వశమేనా??
మీ వూరు చాలా దూరం ఇక్కడికి. నువ్వు గోదావరి ఆవల. నేనా కృష్ణకి ఈవల. మనసుకి రెక్కలు మొలిచి, తీరాలు దాటి, నిన్నిక్కడికి తేరాదూ! పాటల పల్లకీ ఎక్కిస్తానో, మాటల మంత్రమే వేస్తానో, వేలికొసల మీటి, నీతో కూజితాలు పలికించకపోతే నామీదొట్టు - ఇప్పటికిప్పుడు మొత్తంగా నీకు సరెండర్ అయిపోతున్నాను. మరోసారి జీవితాన్ని కొత్తగా పరిచయం చేసుకుందామా? ఏమంటావు?
- ప్రేమరాహిత్యం మనసుని కాల్చుతోంది. కవన సాహిత్యం వ్యసనమైంది. త్వమేవాహమన్న భ్రమ తలపులను మరిగిస్తోంది. ఈవేళ నీవే నిద్రపుచ్చాలి. ఆలోచనలనీ, అలసిన అంతరంగాన్నీ. నీ వూహలైతే మత్తుగా వున్నాయి. తీరేనో, తీరనిదో!!
- ఆర్థిక అవసరాల కోసం అసంతృప్తి ఎటువైపు నెడుతోంది నిన్నూ, నన్నూ - నీవొకచోట, నేనొకచోట... పిల్లలు హాస్టళ్లలో - లోన్లు పెట్టి ఇల్లూ, అవసరాలూ... ఆ లోన్లు తీర్చడానికే ఇద్దరమూ గానుగెద్దుల్లా ఉద్యోగాలు చేస్తున్నట్లన్నది. విసుగొస్తోంది నాకు. మనం కలిసి వుండాలనిస్తోంది. ఈ దూరం నావల్ల కాదిక. ఇప్పటికే మనం చాలా సమయమూ, సరదాలూ... ఆనందాలూ పోగొట్టుకుని యంత్రాల్లా బతుకుతున్నాం. ఇంకానా.. వొద్దు - రేపే నా వుద్యోగానికి రాజీనామా ఇచ్చి నీ దగ్గరకి వచ్చేస్తాను. వొచ్చిన ఆదాయంతో సరిపెట్టుకుందా.. సరేనా?
మనకి స్వంత ఇల్లొద్దు.. పిల్లలకి పెద్ద చదువులొద్దు... కారొద్దు. కార్పొరేటు వైద్యం వొద్దు.. ఖరీదైన దుస్తులూ, నగలూ.. కోరికలొద్దు.. సర్దుకుపోదాం ఎలాగోలా... ఏమంటావూ?’
- ఇట్లు, నీ శ్రీనివాసు.
సుదీర్ఘ ఉత్తరం పూర్తి చేసి, మడిచి, జేబులో పెట్టుకున్నాడు. విజయవాడ వచ్చేసింది. రైలు దిగి ఇంటిదారి పట్టాడు. రేపే ఈ ఉత్తరం పోస్టు చెయాలని. రమాదేవి ఏమంటుందో, ఏమో ఆలోచిస్తూ పల్సర్ నడుపుతున్నాడు. తీర్చాల్సిన అప్పులూ, నెలవారీ ఖర్చులూ, శాలరీ డిడక్షనూ, ఇన్సూరెన్సు ప్రీమియంలు, పిల్లల ఖర్చులూ, హెల్త్ ప్రాబ్లమూ, ఫ్యూచరు బడ్జెటూ, రాబోయే పండగల ఖర్చులూ.. అన్నీ గిర్రున తిరుగుతున్నాయి బుర్రలో. ఉద్యోగం మానేస్తే ఇవన్నీ ఎలా? రామవరప్పాడు రోడ్డు సందు తిరిగాడు. ఎవరొచ్చారు? ఇంటి ముందు లైటు వెలుగుతోంది. ఇంట్లో ఎవరికైనా, ఏమైనా కాలేదుకదా? కంగారుగా తోచింది. ఊర్నించి ఎవరైనా వొచ్చారా? ఇంటి ముందు బండి ఆపి, డోర్ బెల్లు నొక్కాడు ఆందోళనగా. తలుపు తెరిచి, రమాదేవి సాక్షాత్కారం. ‘హేయ్! ఏంటీ.. సర్‌ప్రయిజు’ ఆనందంగా అన్నాడు భార్యను చూసి -
‘నాకా వుద్యోగం విసుగ్గా వుంది. పిల్లలు బాగా గుర్తొస్తున్నారు. చైల్డ్‌కేర్ లీవు పెట్టి వచ్చేశాను’ సీరియస్‌గా చెప్పింది - ‘ఏమంటాడో’ అన్నట్లు సందేహంగా చూస్తూ. పకపకా నవ్వేసి ‘పిల్లలేనా.. నేను గుర్తులేనా?’ అంటూ, జేబులోంచి తను రాసిన ఉత్తరం తీసి రమ చేతిలో పెట్టాడు ‘ఇక చదువుకో’ అంటూ. అయోమయంగా చూసింది రమాదేవి.
*
- దుగ్గిరాల రాజ్యలక్ష్మి,
ఎర్రబాలెం, గుంటూరు జిల్లా.
చరవాణి : 9440172537

- దుగ్గిరాల రాజ్యలక్ష్మి,