రాజమండ్రి

స్వాతంత్య్ర కాంక్షను నింపే ‘పశ్చిమ జిల్లా యోధులు’ (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు:
శ్రీ సత్య పబ్లికేషన్స్,
రామన్నపేట, అత్తిలి-534134
పశ్చిమగోదావరి జిల్లా,
సెల్: 7794959011
*
చరిత్రంటే చాలు చిరాకు పడిపోతారు చదువుకునే కుర్రాళ్లు. చరిత్ర అంటే చులకన భావం విద్యార్థులకు. అసలు చరిత్ర గురించి తెలుసుకోవడం ప్రారంభించామా! ఆరాటపడిపోతుంది మనసు. ఒకనాటి బతుకు పోరాటం ప్రజల ఆరాటం జనం తిరుగుబాటు పాలితులపై తిరుగుబాటు ఇలా ఎన్నో విషయాలు మరెన్నో సంగతులు తెలుస్తాయి. సమకాలీన సమాజానికి స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని అందించాలనే ధ్యేయంతో భారత స్వాతంత్రోద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లా యోధులు వంటి గొప్ప గ్రంథాన్ని వెలువరించిన రచయిత డాక్టర్ గాదం గోపాలస్వామికి గోదావరి తీర ప్రజలు రుణపడి ఉంటారు.
స్వాతంత్య్ర సమరయోధుల జీవిత సంగ్రహాలను సేకరించడం అంటే మామూలు విషయం కాదు. వారి కుటుంబ సభ్యుల నుంచి మొదలు అనేక విషయాలను అధ్యయనం చేసి రూపొందించటం సామాన్యంకాదు. ఎంతో శ్రమకోర్చి రూపొందించారు. 401 పేజీల్లో 116 మందిని పరిచయం చేయటం రచయిత కృషికి నిదర్శనం అవుతుంది. అయితే ఇవన్నీ వివిధ పత్రికల్లో వివిధ సందర్భాల్లో ప్రచురించటం జరిగింది. చిన్న దేశమైన ఇంగ్లండు పెద్దదైన భారతదేశాన్ని ఎలా వశపర్చుకొందనే విషయాన్ని చెప్తూ భారతీయ పరిపాలకుల్లో ఉన్న బలహీనత ఆంగ్లేయులకు బలాన్ని చేకూర్చిందంటారు రచయిత. అలా నెత్తికెక్కి కూర్చున్న వారిని ఎలా పోరాడవలసి వచ్చిందో పశ్చిమగోదావరి జిల్లా ఎలా ఉద్యమ స్ఫూర్తి అందుకుందో వివరించారు. 1934లో రైతు రక్షణయాత్ర పేరుతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు సాగిన పాదయాత్ర. దానికి నాయకత్వం వహించింది పశ్చిమగోదావరి జిల్లా పోతునూరు గ్రామవాసి కొమ్మారెడ్డి సత్యనారాయణ. ఒక బలమైన ఉద్యమ నేపథ్య ఘనతను చెప్పే ప్రయత్నం ఇది. చాలా కచ్చితంగా సమాచారాన్ని సేకరించి, అప్పటి పోలీసు అధికారుల నివేదికలు, జడ్జిమెంటు కాపీలు, కుటుంబీకులు చెప్పిన విషయాలతోపాటు అనేకానేక సంగతుల్ని క్రోఢీకరించుకొని వాస్తవికతను బేరీజు వేసుకొంటూ సంఘటనలను సరిపోల్చుకుంటూ డాక్టర్ గోపాలరావు రాశారు. చరిత్ర పరిశోధకుడిగా చరిత్రపై పూర్తి అవగాహనతో రాసిన వ్యాస సమాహారం.
అర్ధవంతమైన ఆలోచనలు స్ఫూర్తివంతమైన ఆశయాలు ఈ యోధుల్లో దాగివున్నాయి. వారు నడయాడిన దారుల్లో మనం తిరుగుతున్నాం. వారు పోరాడిన ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నాం. వారి ఆవేశాన్ని ఆనాటి వారి ఆశయాల్ని తెలిపే ప్రయత్నమే నూట పదహారు మంది స్వాతంత్య్రం కసం ఎలా ఉద్యమించారో ఆనాటి సమాజాన్ని ప్రభావితం చేయడమే కాదు ప్రజల్ని ఎంత సమయాత్తపరిచారో వారి జీవిత విశేషాలు చదువుతుంటే గగుర్పాటుతో పాటు ఒంట్లో రక్తం సలసలా మరిగి కర్తవ్య బోధ చేస్తాది.
శాసనోల్లంఘన, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, ఖద్దరు ధారణ, నూలు వడకడం గాంధీజీ ఏది పిలుపిస్తే ఎలా ఉద్యుక్తులయ్యారో ఈ పుస్తకం చదివితే అర్ధం అవుతుంది. తిలక్ స్వరాజ్ నిధికి రెండొందల కాసుల బంగారు నగలను గాంధీజీకి అందజేసిన మాగంటి అన్నపూర్ణ, అనేకసార్లు జైలుశిక్ష అనుభవించి వైధవ్యం ప్రాప్తించినా మొక్కవోని దీక్షతో ఆంగ్లేయ పాలనపై పోరుసల్పిన కోటమర్తి కనకమహాలక్ష్మి, అరవై ఎకరాల మాగాణి పొలాన్ని ఉద్యమం కోసం వెచ్చించి ఖర్చుచేసి పేద పిల్లల కోసం కాశీ అన్నపూర్ణ కావిడితో బిక్షాటన చేసిన పసల కృష్ణమూర్తి దంపతులు. చనిపోయే వరకు గాంధీజీ అడుగుజాడల్లో ఉద్యమించిన దండు నారాయణరాజు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదలి వీరభారతి పత్రికలో అదరగొట్టిన కాళీపట్నం కొండయ్య, మన్యం పితూరీని రగిలించిన అల్లూరి సీతారామరాజు, ప్రప్రథమ దళిత నాయకునిగా తొలి శాసన సభ్యునిగా విద్యాసంస్థల స్థాపకునిగా కృషిచేసిన గొట్టుముక్కల వెంకన్న, దేహ ఆరోగ్యం దేశ సౌభాగ్యం అన్న రీతిలో జిల్లాలో మల్లయోధునిగా ఎందరో యువకులకు వ్యాయామ విద్యను నేర్పి దేశభక్తులుగా తయారుచేసిన ఉద్దండుడు వేగేశ్న నారాయణరాజు, ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘనలో ముఖ్యభూమిక వహించటమే కాక రైతులను ఉప్పు సేద్య కర్తలుగా తయారుచేసిన ఘనుడు తల్లాప్రగడ నరసింహశర్మ, వ్యక్తి శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి హిందూ ముస్లిం సమైక్యతకు అహర్నిశలూ పాటుపడిన షేక్ అలీసాహెబ్, జాతీయోద్యమంలో వేగవంతమైన పాత్ర పోషించిన పేరేప మృత్యుంజయుడు, నేతాజీకి వ్యక్తిగత వైద్యుడుగా జాతికోసం యావత్ జీవితం ధారపోసిన కల్నల్ డి.ఎస్.రాజులు పశ్చిమగోదావరి జిల్లావాసులు.
ప్రభుత్వ దమననీతిని ఎండగట్టడానికి ‘వీరకేసరి’ దినపత్రికను నడిపి పాత్రికేయునిగా వాస్తవికతకు అద్దంపట్టే రచనలు చేసి జిల్లా స్వాతంత్రోద్యమ చరిత్రను రాసిన మంగళంపల్లి చంద్రశేఖర్, పదిహేనేళ్లకే స్వాతంత్ర కాంక్షను భర్త నుంచి సంక్రమింప చేసుకొని, శాసనోల్లంఘన చేసి పలుదఫాలు జైలు శిక్షను అనుభవించిన కొటికలపూడి సరస్వతీదేవి లాంటి వారు గాంధీజీ ప్రేరణతో ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తూ కారాగారవాస శిక్షలు సైతం లెక్క చేయకుండా జాతీయోద్యమంలో పాల్గొనడం స్వేచ్ఛా స్వాతంత్య్రానికి నిదర్శన. ప్రేమతత్వంతో సూఫీ మత సారంతో హిందూ ముస్లింల ఐక్యతను చాటిన డాక్టర్ ఉమర్ ఆలీషా ఆధ్యాత్మిక ప్రబోధాలతోపాటు ఉన్నత నైతిక విలువల్ని పరమత సహనాన్ని పరోపకార భావాల్ని విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే జ్ఞాన మార్గాన్ని ఉపదేశించేవారు. ఆనాటి పోరాట స్ఫూర్తికి నేటికి సజీవ రూపమై నిలిచి ప్రజల పక్షాన పనిచేస్తూ పోరాటాలతో మేలుకూర్చటమే కాదు పదవితో ఎంత సేవ చేయవచ్చో నిరూపించిన వంక సత్యనారాయణ లాంటి వారి ఆదర్శనీయతను రచయిత ఎంతో సమర్ధవంతంగా తీర్చిదిద్దారు.
స్వాతంత్ర కాంక్షనేకాక సంఘ సంస్కరణ, నైతిక విలువలు క్రమశిక్షణ గల జీవిత విధానం ఈ స్వాతంత్య్రయోధుల సంగ్రహ జీవితాలను చదివితే తెలుస్తుంది.

**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
*
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- రవికాంత్, సెల్: 9642489244