విజయవాడ

రచయతలకు దిక్సూచి.. శ్రీలేఖ సాహితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల : రూ. 100
ప్రతులకు : శ్రీలేఖ సాహితి,
27-14-53, మండల కార్యాలయం,
ఎదురు వీధి, హసన్‌పర్తి,
వరంగల్ - 506371.
*
సాహితీ సంస్థల్లో మేటి శ్రీలేఖ. అతిశయోక్తి ఇసుమంతయు లేదు. సాహితీ సంస్థల్లో ఎక్కువ సంస్థలు కేవలం ఉగాది కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కణ లాంటి కార్యక్రమాలకే పరిమితం. కానీ శ్రీలేఖ సాహితీ తనదైన ముద్రతో యువ సాహితీపరులకు వికాస వేదికగా నిలబడింది. 1977లో స్థాపించిన సంస్థ నాలుగు దశాబ్దాల పాటు వరంగల్ జిల్లా కవులు, రచయితలకు మాత్రమేగాక తెలుగు సాహితీవేత్తలకు, పండితులకు ఆదర్శప్రాయంగా, అద్భుతమైన వేదికగా నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంస్థ వ్యవస్థాపకులు, సంస్థ అధ్యక్షులు డాక్టర్ టి శ్రీరంగస్వామి కృషి అనితర సాధ్యం. సంస్థను స్థాపించిన నాటి నుండి అలుపెరగని ఈ కలం యోధుడు 40 వసంతాలు ఎనె్నన్నో మైలురాళ్లను సొంతం చేసుకునేలా చేసి, ఎందరో సాహితీ రంగంలోని అనామకుల్ని చేరదీసి అవకాశాలు కల్పించి, ఆణిముత్యాలుగా తీర్చిదిద్దిన ఘనుడు.
‘స్నేహం నీడనిచ్చే చెట్టులాంటిది’ అన్న నినాదంతో తెలుగు సాహిత్యానికి విశిష్ఠ సేవలు అందిస్తున్న సంస్థ శ్రీలేఖ సాహితి. ఈ నలభై సంవత్సరాల్లో 116 పుస్తకాలు ప్రచురించడం మామూలు విషయం కాదు. ప్రచురణ కర్త కాదు, వ్యాపారం కాదు. కేవలం పరస్పర సహకార పద్ధతి ద్వారా శతాధిక పుస్తకాలు ప్రచురించి ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ సంస్థ ద్వారా వెలువరించిన పుస్తకాల ద్వారా సుమారు 1500 మంది కవులు, 400 మంది కథకులు సాహితీలోకానికి పరిచయ మయ్యారు. ఇలాంటి విశేషాలన్నింటికీ అక్షరరూపం ఇచ్చిన 116వ పుస్తకమే ‘శ్రీలేఖ కాలనాళిక’. ఈ సంస్థ నుండి వెలువడిన వరంగల్ జిల్లా కథా సర్వస్వం గురించి వివరిస్తూ డాక్టర్ మహమ్మద్ తహసీన్ అలీ.. ‘108 కథలతో వచ్చిన ఈ గ్రంథం వైవిద్యభరిత కథా సమాహారం. ఈ సంకలనంలో కథలతో పాటు కథకుల జీవిత వివరాలు, ఫొటోలు ఇవ్వడం వల్ల కథా సంకలనం తేవడంలో సంపాదకుని శ్రద్ధ, అభిరుచి, ఆసక్తి అభివ్యక్తమయ్యాయి’ అంటూ సంపాదకులు డాక్టర్ శ్రీరంగస్వామిని అభినందించారు.
ఆచార్య మహాసముద్రం కోదండరెడ్డి దేవకి శ్రీలేఖ కథా సంకలనాల గురించి వివరిస్తూ.. ‘సంపాదకులు ఈ సంకలనాల్లో 99 మంది కథకులకు చోటు కల్పించారు. ఇందులో కొత్తవారు ఉన్నారు. పాతవారూ ఉన్నారు. ఈ సంకలనాలు ఇచ్చిన ప్రోత్సాహంతో చాలామంది కథా రచయిత (త్రు)లుగా తమ వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంకలనాల శీర్షికలు, కవర్ పేజీలు కూడా విలక్షణమే’నని కథావస్తు తీరుతెన్నుల గురించి చర్చించారు. డాక్టర్ యల్లంభట్ల నాగయ్య తన వ్యాసంలో ఓరుగల్లు సాహిత్యం గురించి శ్రీలేఖ చేసిన సాహిత్య సేవను ఉటంకించారు. ‘1987లో శ్రీలేఖ సాహితీ ప్రచురించిన వరంగల్ జిల్లా రచయితల వాఙ్మయ జీవిత సూచిక వరంగల్ జిల్లాకు సంబంధించిన 400 మంది వాంజ్మయకారుల సమగ్ర పరిచయం స్థూలంగా పొందుపరిచింద’ని కొనియాడారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రయోక్త సి జయపాల్ రెడ్డి వారి సందేశాత్మక వ్యాసంలో కథల్ని గురించి వివరణాత్మకంగా పరిశీలించారు. ‘ఒక్కో కథ ఓ జీవితం. కథా కథనం, శైలి, వస్తు పరిశీలన బాగా సాగింద’ని మెచ్చుకుంటూ, ‘ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించేందుకు ఇలాంటి సంకలనాలు తీసుకొస్తున్న శ్రీలేఖ సాహితీని, ముఖ్యంగా ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ శ్రీరంగస్వామిని ప్రతిఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఉంద’ని అన్నారు. డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు శ్రీలేఖ సాహితీ కవితా సంకలనాలు గురించి చేసిన సమగ్ర పరిశీలనలో శ్రీలేఖ వెలువరించిన 20 కవితా సంకలనాల్లో సుమారుగా 1500 కవితలను పరచయం చేశారు. ఇందులో ప్రధానంగా ప్రమోదూత నుండి తారణ వరకు ప్రతి ఉగాదికి తీసుకొచ్చిన కవితా సంకలనాలు సంస్థ పట్టుదలను వ్యక్తీకరిస్తున్నాయి’ అని కొనియాడారు. ఉద్యమాలతో ఉద్భవించిన అనేకానేక సాహితీ సంస్థలు ఆ ఉద్యమం ఊపులో ఉన్న రోజుల్లో ఓ వెలుగు వెలిగి, ఆనక చల్లారిపోయిన దృశ్యాలు ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి ఆసక్తితో ఉద్భవించి అనేక మంది హితులు, స్నేహితులతో అన్ని ఉద్యమాలనూ తనలో కలుపుకుని లేదా సమాంతరంగా నాలుగు దశాబ్దాల పాటు సాగిపోవడం శ్రీలేఖ సాహితి ప్రత్యేకత. 116 పుస్తకాల్లో భక్తి ఉంది. దేశభక్తి ఉంది. అభ్యుదయం ఉంది. ప్రగతిశీల భావాలున్నాయి. ఆస్తికం, నాస్తికం, విప్లవం, స్ర్తివాదం, దళితవాదం అన్నిరకాల పుస్తకాలు ఈ సంస్థ ప్రచురించింది. ఆచార్య కె సర్వోత్తమరావు తిరుపతి నుండి కాలనాళికకు సంస్థ వెలువరించిన బమ్మెర పోతనామాత్యుల భాగవతానికి సంబంధించిన వ్యాస సంకలనాల గురించి చక్కని మాటలు రాశారు. 34 వ్యాసాలతో, 272 పుటలతో వెలువడిన ఈ పుస్తకం భాగవత దర్శనంగా భావించారు ఆచార్యుల వారు. మరో డాక్టర్ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య శ్రీరామాయణ వైభవం, రామాయణ దర్శనం వ్యాస సంకలనాల గురించి రాస్తూ.. శ్రీలేఖ సాహితి- వరంగల్ వారు ముద్రించిన ప్రాచీన, మధ్యకాల, నవీన త్రివిధ సాహితీరీతుల్ని మమతా సమతా దృష్టితో సమన్వయిస్తూ, చేస్తున్న కృషిని అభినందించారు. సాధారణంగా సాహితీ సంస్థలు మఖలో పుట్టి పుబ్బలో తెరమరుగవుతుంటాయి. ఈ సంస్థ వయసు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు పదుల సంవత్సరాలు. ఈమధ్యకాలంలో ఇనే్నళ్లు నిరాఘాటంగా, సజీవంగా, సమాజోపయోగకరంగా సాగిన సంస్థ గానీ, ఇన్ని గ్రంథాలను వెలుగులోకి తెచ్చిన సంస్థ గానీ తెలుగు నేలలో లేదు. అందుకు ఆ సంస్థకు, ఆ సంస్థ నిర్వాహకులకు అత్యంత హార్దికాభినందనలు అందించారు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు పిఎల్ శ్రీనివాసరెడ్డి.
ఇదే విశ్వవిద్యాలయం నుండి ఎ విజయమ్మ ఆచార్య ఎంకె దేవకి దగ్గర ‘డాక్టర్ టి శ్రీరంగస్వామి కథా సంకలనాలు - ఒక పరిశీలన’ అనే అంశంతో పిహెచ్‌డి పట్టా కోసం సిద్ధాంత వ్యాసం సమర్పించారు. నా మూడు పుస్తకాలు కూడా ఈ సంస్థ నుండి వెలుగుచూశాయి. ఇంకా ఈ కాలనాళికలో అనేక మంది అనుబంధాలు, సంబంధాలు వివరించే అంశాలున్నాయి. ఈ సంస్థ గత 40 వసంతాలుగా చేసిన, చేస్తున్న కార్యకలాపాలు మున్ముందు అనేక సాహితీ సంస్థలకు దిక్సూచిగా ఉపకరిస్తాయి.
*
- మండవ సుబ్బారావు,
కొత్తగూడెం.
చరవాణి : 9493335150
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
*
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net