దక్షిన తెలంగాణ

తెలంగాణ ప్రామాణిక భాష.. ప్రజల చారిత్రక అవసరం! (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రామాణిక భాష తెలంగాణ రాష్ట్ర ప్రజల చారిత్రక అవసరమని భావించే ప్రముఖ కవి, నంది అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి ఇప్పటి సిద్ధిపేట జిల్లా బందారం గ్రామానికి చెందినవారు.. స్థానికతతోనే రచనకు జీవం అని ప్రగాఢంగా విశ్వసించే ఆయన తన కవిత్వంలో పల్లె జీవితాన్ని అత్యంత ప్రభావవంతంగా చిత్రించారు. సాహిత్యం ద్వారా ఉత్తమ సమాజాన్ని నిర్మించాలన్న సంకల్పంతోనే తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించడం విశేషం! తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, వైశిష్ట్యాన్ని ‘నాగేటి చాలల్ల నా తెలంగాణ’ అని గానం చేసిన సహృదయుడు ఆయన! కవిగా, కథకునిగా మాత్రమేగాక తెలంగాణ ఉద్యమకాలంలో అందరినీ చైతన్యపథాన నడిపించిన అనుభవం ఆయనకుంది. డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘వాస్తవికత-అధివాస్తవికత’ అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు. మెదక్, సిద్ధిపేట, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉపన్యాసకునిగా ప్రిన్సిపాల్‌గా సేవలు అందించి మే 2012లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన తన విశ్రాంత జీవితాన్ని సాహిత్య సృజనకు, విస్తృతికి కృషి చేస్తున్నాను..ఆయన కృషికి గుర్తింపుగా ఇటీవలనే తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను విశిష్ట సాహితీ పురస్కారంతో సత్కరించింది.

ఆ మీ రచనా వ్యాసంగాన్ని ఎన్నో ఏట ప్రారంభించారు?
నా పధ్నాలుగవ ఏట రచన ప్రారంభించాను. 1968-69వ సంవత్సరం 9వ తరగతి చదువుతున్నప్పుడు పద్యం రాశాను.

ఆ రచనల పట్ల ఆసక్తి చూపటానికి మీకు ప్రేరణనిచ్చింది ఎవరు?
నా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రధానంగా శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ, అవధాని, అనంతసాగర్ సరస్వతీ దేవాలయ నిర్మాత, మంచి పద్యకవి.

ఆ కవిగా మీ ప్రస్థానం ఎలా మొదలైంది?
మాది బందారం. మెతుకుసీమ సిద్ధిపేట జిల్లాలో చిన్న ఊరు. మా ఊరే కళల వైపు నడిపించింది. భూమిక సరిగ్గా చెప్పలేకపోవచ్చుగానీ, ఊరిలో కళకళలాడే జానపద కళాసంస్కృతులు నా చిన్నప్పటినుంచే నన్ను ఒడిలోకి లాక్కుంటూ వచ్చినయి. ఇళ్లల్లో, బావుల దగ్గర ముఖ్యంగా కల్లాల కాలం శారద కాండ్ల కథ, పాటలు అమితంగా ఆకర్షించినయి. చేన్ల దగ్గరి పాటలు, వెనె్నల రోజుల్లో మూడుగుండ్ల దగ్గరి రకరకాల ఆటపాటలు, చిందు భాగోతం, చిరుతల రామాయణాలు ఒకటి కాదు నాలో ఒక కవి కళలెత్తటానికి కారణాలు, ప్రేరణలు. మా ఊరేకాదు మా ఇల్లూ అంతే. మా బాపు బాల సిద్ధారెడ్డి సాయంత్రం వేళ పారవశ్యంతో పాటలెత్తుకునే వాడు. మూగ పాటలు అనే పేరు పెట్టుకొని వచన కవితలు ఆలపించేవాడు. వొచ్చీరాని చదువు. తెలిసీ తెలియని గీతంగా పాడేది. తర్వాత తెలిసింది. ఆయన ఆలపించిన కవితల్లో తిలక్ ‘వెళ్లిపోండి వెళ్లిపోండి’ కూడా భాగమే. భజన సమాజం దగ్గర సిద్ధప్ప శతక పద్యాలు విన్నా. పాఠశాలలో పద్యాలు కరుణశ్రీ రచించిన ‘బీదపూజ’ పద్యాలు మాకు ఎనిమిదో తరగతి తెలుగులో చదువుకుని లోపల ఒక ఆరాటం రూపుదిద్దుకున్నది. పన్యాల నారాయణ రెడ్డి తెలుగు ఉపాధ్యాయుని చతురోక్తులు, కవితాలాపన నన్ను కవిగా మొగ్గ తొడుగుతున్నప్పుడు అష్టకాల వారి పద్యాల ‘శిథిల విపంచి’ నన్ను సవరించి కవిగా నడిపించింది. తర్వాత తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం ఉద్వేగపర్చి ఉన్నత శిఖరాల వైపు పరుగు పెట్టించింది. నా అన్ని కళానైపుణ్యాలకు కవి కె.శివారెడ్డి మార్గదర్శి!

ఆ మంచి కవిత్వానికి ఉండే లక్షణాలు?
ఏ కళయినా సౌందర్యం ప్రధానం. హృదయాన్ని వికసింపజేసే ఒకానొక అద్భుత సౌందర్యమది. బాహిర సౌందర్యం తక్షణ ఆకర్షణ ఎక్కువసేపు నిలవదు. మంచి కవిత్వం హృదయానికి కొత్త అనుభవాన్నివ్వాలి. రసానుభూతి అన్నారు. అది ప్రధానం. మంచి భావన. హత్తుకునే భాష. మనసును మురిపించే శిల్పం. మూడింటి మేళవింపు మంచి కవిత గుబాళింపు అలంకారాలు, పద చిత్రాలు, ప్రతీకలు, విరుపులు, మెరుపులు, ఎత్తుగడ, ముగింపులు ఏది ఎంత అమరాలో, ఒదగాలో ఆ అమరిక మంచి కవిత్వ లక్షణం.

ఆ ఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై మీ అభిప్రాయం?
పుష్కలంగా వస్తున్నది. పుష్టి తక్కువ. వచన కవిత్వమే కాదు పద్య కవిత్వం కూడా అంతే. పై పైని ఆకర్షణలు వెల్లువెత్తినంతగా హృదయం వెల్లువెత్తటం లేదు. జీవితపు లోతులు అందుకోవటం లేదు. అట్లా అని కవిత్వ నైపుణ్యాలన్నా..అంటే అవీ తక్కువే దర్శనం లేదు. చర్మ స్పర్శే కాదు హృదయ స్పర్శ ముఖ్యం కదా-కవిత్వానికి వేగం ఇప్పటి కాలిక స్వభావం! వరదనీరు దాహం తీర్చలేదు కదా. వడకట్టాలని నా అభిమతం! వొడకట్టకుండా తాగితే వాంతులు.. వాట్సాప్ కవిత్వాలు హాట్సాఫ్ స్పందనలూ..!

ఆ మరుగునపడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే కవులు,
రచయితల కర్తవ్యాలను వివరిస్తారా?
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలంలో కనిపించిన స్ఫూర్తి రచయితల్లో తర్వాత కూడా కొనసాగాలి. ఎందరో గొప్ప రచయితలు సీమాంధ్ర రథచక్రపుటిరుసుల కింద పడి నలిగిపోయారు. చీకట్లో బిక్కుమంటున్నారు. పరిశోధించి వారి సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలి. సాహిత్యంలో వారి స్థానాల్ని సుస్థిరపరచాలి. ప్రత్యేక అధ్యయనాలు అవసరం. దానికి రచయితలకు, కవులకు బలమైన సంకల్పం కావాలి. తీవ్ర కృషి, పట్టుదల, అంకితభావన ఉంటే మంచి దశ, దిశ సాధ్యం.

ఆ కథకులుగా, కవిగా అందరి మన్ననలు పొందిన మీరు రెండు
ప్రక్రియల్లో ఏది ఇష్టం?
కథ, కవిత రెండూ ఇష్టమే. కవిత్వం కొంచెం ఎక్కవ ఇష్టం.

ఆ కథ, కవితల్లో దేన్ని సులభంగా రాయవచ్చు?
రెండూ సులభంగా రాయొచ్చు. మెప్పించే విధంగా రాయాలంటే రెండూ కష్టమే!

ఆ సార్వజనీనత రావాలంటే రచనల్లో స్థానికత ఉండాలని భావిస్తారా?
అవును. స్థానికత లేనిదే రచనకు జీవం లేదు. ‘ప్రాంతీయ స్పర్శ ఉన్న జీవముద్ర అంటందే ఏ కళారూపానికయినా జీవకళ రాదు’ అన్నాడు గురజాడ! ఎంతటి చిత్రకారుడయినా చూసిన సన్నివేశాన్ని చిత్రించినంత సజీవంగా చూడని దృశ్యాన్ని చిత్రించలేడు. జీవమంటేనే తనలో కదిలే బొమ్మ, వెంటాడే బొమ్మ, సాహిత్యంలో కూడా అంతే! రచయితను వెంటాడిన పాత్రలు, కవిని నిద్రపోనివ్వని అనుభవాలు, చివరకు స్వప్నసీమల్లో సాక్షాత్కరించేవి కూడా ఎరుకలోని మానవముద్రలే. అంటే రచయిత అనుభవంలోంచి, ప్రాంతీయతలోంచి పరవశింపజేసేవే స్థానిక భాష, పాత్రలు, ఘటనలు చిత్రించకపోతే రచనలో జీవం తొణికిసలాడదు. ఆ జీవం వెల్లివిరియకపోతే సౌందర్యం లేదు. సాహిత్యం జీవన సౌందర్యంతో కళకళలాడినప్పుడే సార్వజనీనత ఏర్పడుతుంది!

ఆ ‘నాగేటి చాలల్ల’ పాట రాయడానికి ప్రేరణ?
1996లో మలిదశ తెలంగాణ ఉద్యమ భావనలు మొలకెత్తినయి. 1997 మార్చి 8, 9 తేదీల్లో జరిగిన భువనగిరి మహాసభలో నేను ‘తెలంగాణ సంస్కృతి’ మీద ప్రసంగించాను. తెలంగాణ పండుగలు, తిండి, భాష, కళల ప్రత్యేకతలు వివరించాను. ఆ తర్వాత ఆ విషయాల మీద బాగా చర్చ జరిగింది. ఆ క్రమంలో ఒక అధికారి దర్పంతో నన్ను వెటకారం చేశాడు. అంతకుముందే ఎన్నో రకాల వివక్షలు, తిరస్కృతులు ఎదుర్కొని ఉన్నా లోన ఏదో సుడి తిరుగుతుంది. వ్యాసం, ప్రసంగం సరిపోదు. నా భావోద్వేగాన్ని పాట ఎదుర్కున్నది. ఉద్యమావసరాలకు వీలుగా పాట రాయుమని షేక్‌బాబా అనే గాయకమిత్రుడు అడిగాడు. తెల్లారితే సభ. సాధారణంగా తెలంగాణ పాటలన్నీ సమస్యల వ్యక్తీకరణలే. ఏవి లేవో, కొరవడినాయో చెప్పే పాటలే అన్నీ తెలంగాణకు ఏవి ఉన్నాయో ఆ సాంస్కృతిక విశేషాలు, అపురూప వైభవం గానం చెయ్యాలె ఆ భావనల్లోంచి ఒక తెల్లవారుజాము ఉబికిన పాట ‘నాగేటిచాలల్ల’!

ఆ ఇప్పటి తరాన్ని సాహిత్యం వైపు మళ్లించాలంటే ఏం చేయాలి?
అవశ్యం. వెంటనే దీక్షగా చేయవలసిన పని ఈ తరాన్ని సాహిత్యం వైపు మళ్లించటం కనీసం ఆకర్షించటం. తెలంగాణలో కొంత మేలు. ఉద్యమకాలంలో సాహిత్యానికి యువతరం సన్నిహితంగా వచ్చింది! పదే పదే మనం ఆ పని కొనసాగించాలి! ముఖ్యంగా విద్యాసంస్థల్లోంచి మొదలు పెట్టాలె. ఇంతకుముందటి పద్ధతుల్లో పుస్తక, పత్రికా పఠనం వైపు ఆకర్షించాలె. మరోవైపు కొత్త సాంకేతిక నైపుణ్యాలతో చైతన్యపర్చాలి!

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
మంచిదే. పురస్కారాలు రచయితల్ని ఉత్తేజపరుస్తాయి. ఉత్సాహపరుస్తాయి. అయితే, అసందర్భ పురస్కారాలు రచయిత అభివృద్ధికి అడ్డుపడతాయని నా అనుమానం! రచయితను రచనలే నిలబెడుతాయి తప్ప పురస్కారాలు నిలబెట్టలేవు! ఈ అవగాహన లేకపోవటం వల్ల కొందరు పురస్కారాల వెంబడిపడుతున్నారు. రచయిత వెనుక పురస్కారాలు తప్ప పురస్కారాల వెనుక రచయిత కాకూడదు!

ఆ తెలంగాణ ప్రామాణిక భాష రూపొందించటంలో కవులు, రచయితలు,
ప్రభుత్వం పాత్ర ఎలా ఉండాలని భావిస్తున్నారు?
తెలంగాణ ప్రామాణిక భాష తెలంగాణ రాష్ట్ర ప్రజల చారిత్రక అవసరం. రచనల్లో, పత్రికల్లో, ప్రసార సాధనాల్లో, పాఠ్యపుస్తకాల్లో, పాలనావ్యవహారాల్లో ఏ భాష వాడాలో తెలియని అయోమయం నెలకొన్నమాట వాస్తవం. ఇప్పుడు చెలామణీలో ఉన్న భాషను ఎంతవరకు స్వీకరించవచ్చనేది అసలు సమస్య. తెలంగాణ జీవితానికి దగ్గరగా తేవడానికి భాషలో ఏ మార్పులు చేయాలో నిర్ధారించవలసి ఉంది. భాషకు సంబంధించి సాధారణ వ్యవహారానికి అనుగుణంగా ప్రామాణిక ప్రయోగాలు రూపొందించుకోవలసి ఉన్నది. ముందుగా ప్రభుత్వానికి ఒక భాషా విధానం ఉండాలి. కవులు, రచయితలు, భాషావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో తరచుగా చర్చించి, పరిశీలించి తెలంగాణ సోయిని, ప్రజాసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రామాణిక భాషను రూపొందించుకోవాలి. ఒక శైలీ పత్రాన్ని, ఒక నిఘంటువును రూపొందించుకోవాలి. ఈ దిశగా భాషావేత్తలు, కవులు, రచయితలు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టవచ్చు.

ఆ మీకు నచ్చిన కవి, రచయిత?
నచ్చిన కవి కె.శివారెడ్డి, నచ్చిన రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి.

ఆ మీకు నచ్చిన గ్రంథం?
శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
బాగా చదవాలె. లోతుగా అధ్యయనం చేయాలె. ప్రతిభ ఉన్నా పదును పెట్టడానికి విస్తృత అధ్యయనం తప్పనిసరి! జీవితాన్ని అధ్యయనం చేయటం ఆవశ్యం. సమస్యలను, సంఘర్షణలను విశే్లషించుకోవటానికి దార్శనికత కీలకం. రచనాశక్తి, భావనాశక్తి పెంచుకోవాలి. రచనను నమ్ముకుంటే మంచిది. ఖ్యాతి అదే వస్తుంది. ప్రేమ, నిజాయితీ, వ్యక్తిత్వం రచయితకు మూలధనాలు, ఇంధనాలు.
**
ఇంటర్వ్యూ:
దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544