విశాఖపట్నం

వెనె్నల రాత్రులు (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదవ తరగతి సోషల్ క్లాస్ జరుగుతోంది. సూర్య కుటుంబం కోసం, పాఠానికి సంబంధం లేకపోయినా, స్వప్న టీచర్ చెబుతుంటే విద్యార్థులంతా చక్కగా వింటున్నారు.
‘‘మీలో ఎవరైనా ఎప్పుడైనా వెనె్నల్లో విహరించారా?’’
పిల్లలందరూ అడ్డంగా తలూపారు లేదన్నట్లు.
‘‘వెనె్నల మనకు ఎంతో హాయినీ, ఆనందాన్నీ కలుగజేస్తుంది. మనసుకు ఉల్లాసాన్నంద జేస్తుంది. అలాంటి వెనె్నల రాత్రులను మీరు ఆస్వాదించలేదంటే... ఆశ్చర్యం కల్గుతోంది’’ అన్నారు టీచర్.
‘‘మాకు వెనె్నల ఎలా ఉంటుందో తెలీదు మేడమ్! స్కూల్ వదలగానే ట్యూషన్‌కు వెళతాం. అక్కడ ఎనిమిది వరకూ ఉంటాం. ఆ తర్వాత ఇంటికి వచ్చి, భోజనం చేసి పడుకుంటాం! మరి మాకు వెనె్నల ఎక్కడ కన్పిస్తుంది?’’ అమాయకంగా అన్నాడు రవి.
టీచర్ నవ్వారు.
‘‘పిల్లలూ! ప్రకృతి మనకిచ్చిన గొప్పవరం వెనె్నల. సరదాగా పిల్లలంతా కలిసి ఆడుకుంటే ఎంతో బాగుంటుంది. మీరూ ఆడి చూడండి’’ అన్నారు టీచర్.
‘‘టీచర్ ! రాత్రి బయటికి వస్తే మా అమ్మ కాలు విరగ్గొడుతుంది. ఎల్లప్పుడూ చదువు చదువు అంటుంది’’ రమ కంప్లైంట్.
‘‘అవును టీచర్ మా అమ్మ కూడా అంతే. ఆటలు... పాటలు... వేస్ట్ అంటుంది. చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించమంటుంది’’ కమల అంది.
‘‘చిన్న సరదాలు కూడా మనమెలా కోల్పోతున్నామో తెలిసిందా? చిన్న వయసులో వెనె్నల్లో ఆడుకోవడం ఓ సరదా! చదువు పేరిట సరదాలని సమాధి చేయడం మంచిది కాదు’’ అన్నారు టీచర్.
‘‘మా ఊళ్లో చీకటి ఉండదు టీచర్. లైట్లు వేసేస్తారు. మేం అస్సలు ఆకాశం వైపు చూడం. స్కూలు, ఇల్లు, ప్రైవేట్, టి.వి, చదువు. ఇవే టీచర్ మాకు’’ కావ్య అంది.
టీచర్ నిట్టూర్చారు. ఈ పల్లెటూరిలోనే పేరెంట్స్ ఇంత రిజిడ్‌గా ఉంటే, పట్నంలో ఇంకెలా ఉంటారో కదా! పల్లెల్లో పుట్టి పెరిగిన వారికి వెనె్నల తెలీదు. వెనె్నల్లో ఆడుకోవడం తెలీదు. ఆశ్చర్యమే కదా! దీనికి ఎవరు బాధ్యులు? ఎల్లప్పుడు చదువు చదువు అని విసిగించే పేరెంట్స్‌దా? టీచర్లదా? విద్యార్థుల బాల్యం ఇలా మసి కావలసిందేనా?
‘‘టీచర్! మీరెప్పుడైనా వెనె్నల్లో ఆడారా?’’ స్వాతి అడిగిన ప్రశ్నకు ఈ లోకంలోకి వచ్చారు.
‘‘లేదమ్మా! నేను పట్టణంలో పుట్టి పెరిగాను. ఆకాశ హర్మ్యాలు.... పట్టపగల్లా వెలుగునిచ్చే విద్యుత్ దీపాలు ఇంక వెనె్నలేం కన్పడుతుంది. నా జీవితంలో వెనె్నల్లో ఆడుకోలేదు. వెనె్నలంటే నాకు తెలీదు. నాపిల్లలకూ తెలీదు. చూసే తీరికా వారికి లేదు. చెప్పే ఓపికా నాకు లేదు. కానీ... నిన్నను చదివిన చందమామ... చాలా సంవత్సరాల క్రిందటి చందమామ... చదివాను! వెనె్నల రాత్రుల్లో రాకుమారుని యాత్ర... అప్పుడన్పించింది వెనె్నల బాగుంటుందని’’
క్లాసు అయిపోయాక స్ట్ఫారూంలో కూర్చుంది. నిశ్శబ్దంగా కిటికీలోంచి బయటికి చూడసాగింది. ఇంతలో రమ్య వచ్చింది.
‘‘ఏంటి మేడమ్! దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?’’ అడిగింది. ఆమె హిందీ టీచర్.
‘‘వెనె్నల్లో ఆడితే ఎంత మనోహరంగా ఉంటుందో పిల్లలకు చెప్పాను. నిజానికి నేను వెనె్నలను ఆస్వాదించలేదు. నిన్న పాత చందమామలోని కథ చదివాక వెనె్నల రాత్రులపై ఆసక్తి పెరిగింది’’ అన్నారు టీచర్.
రమ్య నవ్వింది. ‘‘గ్రామాల్లో వెనె్నల మనోహరంగా ఉంటుంది. చుట్టూ పొలాలు.... చెరువులు... తోటలు... వెనె్నల్లో ఇవన్నీ మనోహరంగా కన్పిస్తాయి! కానీ... పిల్లలెవరికీ వెనె్నల రాత్రుల గురించి తెలీదు. కారణం ఏమిటి? పూర్వం గ్రామీణం వేరు. నవీన గ్రామీణం వేరు. వెనె్నల మారలేదు. ఊరు మారలేదు. మనుషులు మారారు. వారికి టివిలు కావాలి, సెల్‌ఫోన్లు కావాలి. కాని.... ప్రకృతి ప్రసాదించిన వెనె్నల అక్కరలేదు’’ అంది.
స్వప్న నిట్టూర్చింది. గ్రామాలు కూడా నవీనశకానికి రూపాంతరం చెందాయి. పాతతరం కూడా మూలాలను మరిచిపోయింది!
‘‘నిజం మేడమ్! అలనాటి గ్రామాలనుకుంటున్నారా! నేడు ఇవన్నీ బలవంతంగా ఆధునికతను దిగుమతి చేసుకుంటున్నవి. వీళ్లకు ప్రకృతి పట్టదు. తమ పిల్లలకు చెప్పరు. వెనె్నల రాత్రుల శోభను... ముసలి వాళ్లెవరూ పిల్లలకు చెప్పడంలేదు. కనీసం... పిల్లలకు కూడా వెనె్నల గురించి చెప్పరు. ఇంక... పిల్లలకు ఏం తెలుస్తుంది మేడం?’’
అందమైన ప్రకృతిని ఆస్వాదించలేక పోతున్నారు.. ఎంతో హుషారుగా సరదాగా... వెనె్నల్లో ఆడుకోవాల్సిన పసిపిల్లలు.... టివిలకు అతుక్కుపోతున్నారు. వాళ్లకు భయం చెప్పాల్సిన పెద్దలు తామూ వారితో భాగస్వాములైపోతున్నారు.
తొమ్మిదవ తరగతిలో ప్రవేశించారు స్వప్న టీచర్. పిల్లలందరూ లేచి నించున్నారు. అందరినీ కూర్చోమని చెప్పి ‘‘పిల్లలూ! మీకు వెనె్నల రాత్రులు ఎలా ఉంటాయో తెలుసా?’’ అడిగారు.
పిల్లలందరూ అడ్డంగా తలూపారు తెలీదన్నట్లు!
‘‘పిల్లలూ! మనకు టివిలే లోకం కాదు! చదువే లోకం కాదు! ప్రకృతిలో ఎన్నో అందాలుంటాయి. వాటిని మనం చూడాలి. గలగల పారుతున్న సెలయేళ్లు... పచ్చని చెట్లు... పక్షుల కిలకిలలు... జంతువులు... కీటకాలు.. అన్నీ భగవంతుడు మనకిచ్చిన వరాలు. వీటి విలువను పెద్ద వాళ్లు మీరు చెప్పలేదు. వాళ్లకు తెలీదు! ప్రకృతి విలువను వాళ్లకు తెలియజెప్పాలి. అర్థమైందా?’’
పిల్లలందరూ తలలూపారు.
సాయంత్రం రమ్య అంది ‘‘మేడమ్! మీరు చెప్పిన విషయాలు కొత్తగా... వింతగా ఉంటున్నాయి. పిల్లలందరూ మీ గురించే మాట్లాడుతున్నారు. ఇంతకుముందెవరూ వీళ్లకు వెనె్నల రాత్రుల గురించి చెప్పలేదు’’
‘‘పిల్లలకు అన్నీ తెలియాలి రమ్యా! మనిషికి మూలం ప్రకృతి అని తెలియాలి’’
‘‘నాకు కూడా వెనె్నల్లో విహరించడం తెలీదు మేడం! విద్యుత్ వెలుగుల్లో వెనె్నల సోయగం ఎలా తెలుస్తుంది?’’
‘‘మనం ఈ గ్రామంలో రెండు రోజులుందాం. పిల్లలందరినీ రమ్మని చెబుతాను మన స్కూల్ గ్రౌండ్‌లో గంటసేపు వెనె్నల్లో విహరిద్దాం. వెనె్నలను ఆస్వాదిద్దాం! ఏమంటావ్?’’
‘‘నాక్కూడా ఇష్టమే మేడం’’ అంది రమ్య.
ఈ విషయం తెలిసిన స్ట్ఫా అందరూ వెక్కిరించారు. వేళాకోళమాడారు. అయినా స్వప్న, రమ్య చలించలేదు. గ్రామంలో ఉన్న పిల్లలను రాత్రి ఏడు గంటలకు రమ్మన్నారు.
ఏడు గంటలకు పిల్లలందరూ గ్రౌండ్‌లోకి వచ్చారు. పిండారబోసినట్లు వెనె్నల. పిల్లలందరూ గంతులేయసాగారు. ఆడపిల్లలందరూ సంతోషంగా ఆటలాడారు. పిల్లల తల్లిదండ్రులు కొంతమంది వచ్చారు. వారికి ఈ అనుభవం కొత్తగా ఉంది. ఎప్పుడూ టివిలకు అతుక్కుపోయే తాము... వెనె్నల రాత్రులు ఇంత అందంగా ఉంటాయని ఊహించలేదు. తమ పిల్లలు కేరింతలు కొడుతుంటే... వాళ్లూ చిన్న పిల్లలైపోయారు.
‘‘టీచర్! చాలా బాగుంది టీచర్! వెనె్నల రాత్రులు ఇంత బాగుంటాయనుకోలేదు టీచర్!’’ కోరస్‌గా పిల్లలందరూ అరిచారు.
‘‘అమ్మా! టీచరమ్మా! మా బాల్యాన్ని గుర్తుకు తెచ్చావు. మా కాలంలో టివిలు లేవు. సెల్‌ఫోన్లు లేవు. అందరం చెరువు గట్టు దగ్గర... వెనె్నల రాత్రుల్లో కూర్చుని కబుర్లు చెప్పుకొనేవారం. వెనె్నల్లో... ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో తెలుసా! ఇప్పుడు ఏమీ లేవు. అంతా టివి మహిమ’’ ఓ పెద్దాయన బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకొని అన్నాడు.
గ్రామస్తులు కొంతమంది... పిల్లలతో పాటే సరదాగా గడిపారు. మర్నాడు ఉపాధ్యాయులందరూ స్వప్న, రమ్యలను అభినందించారు.

- మల్లారెడ్డి రామకృష్ణ సెల్: 8985920620.