విజయవాడ

శ్రీశ్రీ.. ప్రజాకవీ కాదు, మహాకవీ కాదు! (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి శ్రీశ్రీని కొందరు ఇంటర్వ్యూ చేస్తూ ‘శ్రీశ్రీ మహాకవి అయితే కావచ్చు గానీ, ప్రజాకవి కాడని కొందరు విప్లవకారుల అభిప్రాయం. మీ వ్యాఖ్య?’ అని అడిగారు. దానికి శ్రీశ్రీ సమాధానమిస్తూ.. ‘ఏకీభవిస్తున్నాను. నేను అక్షరాస్యుల కవిని, చదువు రానివారి కవిని కాను. ప్రజాకవి కానివాడు మహాకవి కూడా కాలేడు’ అన్నారు. శ్రీశ్రీ మహాకవో, ప్రజాకవో, మరో కవో చెప్పాల్సింది శ్రీశ్రీ కాదు, కాలం! కాలమంటే చరిత్ర చెబుతుంది ఎవరు ఏమిటో? 1934 నుండి 1980 వరకు తెలుగు సాహితీ క్షేత్రంలో విప్లవాల పూలు పూయించినవాడు శ్రీశ్రీ. అభ్యుదయం - విప్లవం రెండూ శ్రీశ్రీ చేతిలో నవ్యమైన రూపందాల్చి, తెలుగు సాహితీ రంగానికి ఒక ఊపు, రూపు తెచ్చాయి. శ్రీశ్రీకి ముందు తెలుగు సాహిత్యంలో శూన్యం వుందన్నారు కొందరు. కొందరు ముక్కున వేలేసుకున్నారు. శ్రీశ్రీ తరువాత కూడా తెలుగు వచన కవిత్వం పలుచనైందన్నారు ఇంకొందరు. లేదు లేదంటూనే ‘చిక్కనైన కవిత్వం’ అంటూ కవితా సంకలనాలే ప్రచురించారు మరికొందరు. శ్రీశ్రీని ‘్ఛ.. ఛీ’ అంటూ తిట్టినవాళ్లే శ్రీశ్రీ మాటలు లేకుండా ఒక్కముక్కా నేటికీ రాయలేకపోవడం అందరికీ తెలుసు. ఈవిషయానే్న శ్రీశ్రీ బతికున్న రోజుల్లో నేను అడిగాను ‘ప్ర.జ’లో. ఆ విషయం ‘రామదండునడగండి’ అని నవ్వారాయన. ఆ రామదండు ఎవరో నాకు అర్థం కాలేదప్పుడు.
ఈ తరం కుర్రాళ్లు తెలుగును స్కూల్లోనే వదిలేసి, ఏమీ రాకపోయినా 99 మార్కులతో సంస్కృతంతో ఇంటర్ పూర్తిచేసి, ఏ సెట్ పొందలేనివాడు డిగ్రీలో కూడా సంస్కృతం చదివినట్టు చదివి బొటాబొటి మార్కుల్తో సరిపెట్టుకొని, ఎంబిఎలు, ఎంసిఎలు అలాఅలా అయిందనిపించి, ఇక అప్పుడు తెలుగు డబ్బింగు కోసమో, పత్రికల కోసమో తాను బతకడానికో, వాటిని బతికించడానికో తెలుగు సాహిత్యం మీదా, కవిత్వం మీద శ్రద్ధ కలిగించుకొని కొటేషన్ల కోసమో, శ్రీశ్రీ కోసమో శ్రీశ్రీని చదవాలనుకునే శిష్య ఆటంబాబు (పరమాణువుల) కోసం శ్రీశ్రీ గురించి కొన్ని ముచ్చట్లు జయంతి సందర్భంగా..
శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి వెంకటరామయ్య గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్న స్కూల్లోనే శ్రీశ్రీ చదువుకున్నారు. 15వ ఏటనే వెంకట రమణమ్మను వివాహం చేసుకున్నారు. తరువాత కారణాంతరాల వల్ల సరోజినిని పెళ్లాడారు. వారికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు కలిగారు. ఉన్నత విద్య కోసం 1928లో మద్రాసు వెళ్లి 1931లో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. 1938లో ఆంధ్రప్రభ పత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరారు. ప్రభవతో ప్రారంభమైన ఆయన సాహితీ ప్రస్థానం దాదాపుగా 1983 జూన్ 15న మరణించే వరకూ అంచలంచెలుగా, గమ్మత్తుగా, గంభీరంగా, వాదోపవాదాల మధ్య సాగింది. శ్రీశ్రీ ఆధునిక యుగంలో ఆధునికంగా, అభ్యుదయంగా కవిత్వం రాశారనడంలో బహుశా ఎవరికీ అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ‘కష్టజీవి’కి అటూ ఇటూ నిలిచినవాడే ‘కవి’ అంటూ పతితుల కోసం, బాధాసర్పద్రష్టుల కోసం విప్లవ శంఖం పూరించినవాడు శ్రీశ్రీ. ‘మహాప్రస్థానం’, ‘ఖడ్గసృష్టి’, ‘సిప్రాలి’ వంటి కవితా సంపుటాలు శ్రీశ్రీని తెలుగు సాహితీ హిమనగంపై నిలిపాయి.
1950లో ‘ఆహుతి’ డబ్బింగ్ సినిమాతో చిత్రసీమలోకి ప్రవేశించిన శ్రీశ్రీ వేయికి పైగా పాటలు రాశారు. నవల, కవిత, కథ, రేడియో నాటికలు.. ఇలా ఆయన చేపట్టిని ప్రక్రియే లేదు. చల్లని రాజా ఓ చందమామా.., వాడిన పూలే వికసించెనే.., ఓ రంగయ్యో! పూల రంగయ్యో!.., నా హృదయంలో నిదురించే చెలీ.., మనసున మనసై..’ వంటి పాటలు ఈ తరం వారికి ఇంకా గుర్తున్నాయి. ఇక ఆయనకు వచ్చిన లేదా ఇచ్చిన అవార్డులూ, రివార్డులూ ఆయన ప్రతిభకు తులతూగేవి కావు. అంటే వామపక్ష కవి కావడం వల్ల ఎన్నో సంస్థలు పక్షపాతం (వాతం) వహించాయి. ఇచ్చినవి కూడా వారి అవార్డులకు ఈయన పేరుతో కీర్తి తెచ్చుకోవాలనే ఉద్దేశమే ఎక్కువ. ఒకటీ అరా శ్రీశ్రీపై మక్కువతో వచ్చి వుండవచ్చు. ఈ మాటలు కొందరికైనా బాధ కలిగిస్తే మరీ మంచిదే. నా ఉద్దేశ్యం కూడా అదే. ఏదిఏమైనా ఒక్కోసారి, లేదా సదా ప్రతిభను వాటితోనే తూస్తారు కాబట్టి - కొన్నింటిని ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం కాకపోవచ్చు. 1972లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి దానికే గౌరవం తెచ్చుకున్నారు. సోవియట్ అండ్ నెహ్రూ అవార్డు, రాజ్యలక్ష్మి అవార్డులు మక్కువతో ఇచ్చినవే. నేషనల్ ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులు చిత్రపరిశ్రమలో ఆయన రాసిన పాటలకు ఇచ్చారు. నేటికీ, ఏనాటికీ విన్నప్పుడల్లా ఉల్లము ఝల్లనిపించే పాట ‘తెలుగు వీర లేవరా..’. శ్రీశ్రీ ముఖ్యమైన రచనలు: ప్రభవ- 1928, వారం వారం- 1928, సంపంగితోట- 1947 (దీనిపైన కాస్త వివాదం నడిచింది), మహాప్రస్థానం- 1950, అమ్మ- 1952, మీ మీ- 1954, మరో ప్రపంచం- 1956, చరమరాత్రి- 1957, మానవుడి పాట్లు- 1958, గురజాడ- 1959, మూడు యాభైలు- 1964, ఖడ్గసృష్టి- 1966, శ్రీశ్రీ సాహిత్యం- 1970 (5 భాగాలు), వ్యాసక్రీడలు- 1973, మరో మూడు యాభైలు- 1974, మరో ప్రస్థానం- 1980, పాడవోయి భారతీయుడా- 1983. అనంతం, ప్ర.జ శ్రీశ్రీ బతికున్న రోజుల్లో పుస్తక రూపంలో రాలేదు. అవి 1986, 1990లో అచ్చయ్యాయి. 1940 నుండి 1980 మధ్యకాలంలో తెలుగు సాహితీ క్షేత్రంలో ఏ నవ్యకవితా ధోరణులు వచ్చినా అందులో శ్రీశ్రీ ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లోని సాహిత్య ఉద్యమాల ప్రభావం శ్రీశ్రీపై ప్రగాఢంగా వుంది. అనేకానేక ఇజాలు శ్రీశ్రీ కవిత్వంలో, వచన రచనల్లో, సాహిత్య విమర్శల్లోనూ అవిభాజ్యంగా కలిసిపోయాయి. ‘ఆకాశ దారులంట/ హడావుడిగా వెళ్లిపోయే భావ కవిత్వాన్ని ‘్భమార్గం పట్టిస్తాను/ భూకంపం పుట్టిస్తాను’ అంటూ శ్రీశ్రీ 1933లోనే భావ కవిత్వపు వలయం నుండి బయటపడి, మార్క్సిజానికి ప్రభావితుడై అభ్యుదయ గీతాలు రచించాడు. సర్రియలిజంలో కూడా శ్రీశ్రీ కవితలు రాశాడు. ‘జీబ్రాకి - ఆల్‌జీబ్రా చిహ్నాల లాంకోటూ, పాంకోళ్లు తొడిగి సాహిత్య పౌరోహిత్యం యిస్తే వెర్రికాదు సర్రియలిజమ్ రా సోదరా’ అంటూ సర్రియలిజం లక్షణాలు చెప్పాడు. ఆ తరువాత డాడాయిజం ప్రభావంలో కూడా శ్రీశ్రీ పడక తప్పలేదు. అయితే అందులోనే మునిగిపోలేదు. శ్రీశ్రీ రాసిన న-న-న నత్తి మాటలు, ‘హుష్ హుష్.. అను కేకలు’ డాడాయిజం ప్రభావంతో వెలువడినవే. మహాప్రస్థానం యోగ్యతాపత్రంలో చలం ‘కొద్దిరోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతిఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నుంచి తమ ఉనికిని సమర్థించుకోవలసిన గతివొస్తుంది’ అని అన్నమాట తరువాత కాలంలో ఎంత నిజమయిందో సాహితీ ప్రియులందరికీ తెలిసిందే. శ్రీశ్రీ తన వెంట తెలుగు సాహిత్యాన్ని రాకెట్ స్పీడులో నడిపించాడు. అయితే శ్రీశ్రీ భౌతికంగా నిష్క్రమించగానే ఆ వేగం తగ్గిందనే చెప్పాలి. శ్రీశ్రీ కంటే ఉన్నతులమని చెప్పుకున్నవారు ‘కనబడుట లేదు’! వారసులమని ప్రకటించుకున్న వారి చిరునామాలు దొరుకుట లేదు.
నేటి యువ రచయితలంతా శ్రీశ్రీ రేపిన ‘అలజడి’ని అందిపుచ్చుకొని తెలుగు సాహితీ క్షేత్రంలో సరికొత్త విప్లవాల పూలు పూయించాలని ఆశిస్తూ..!

- మండవ సుబ్బారావు,
కొత్తగూడెం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చరవాణి :
**

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- మండవ సుబ్బారావు