రాజమండ్రి

శ్రీశ్రీ.. ప్రజాకవీ కాదు, మహాకవీ కాదు! (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి శ్రీశ్రీని కొందరు ఇంటర్వ్యూ చేస్తూ ‘శ్రీశ్రీ మహాకవి అయితే కావచ్చు గానీ, ప్రజాకవి కాడని కొందరు విప్లవకారుల అభిప్రాయం. మీ వ్యాఖ్య?’ అని అడిగారు. దానికి శ్రీశ్రీ సమాధానమిస్తూ.. ‘ఏకీభవిస్తున్నాను. నేను అక్షరాస్యుల కవిని, చదువు రానివారి కవిని కాను. ప్రజాకవి కానివాడు మహాకవి కూడా కాలేడు’ అన్నారు. శ్రీశ్రీ మహాకవో, ప్రజాకవో, మరో కవో చెప్పాల్సింది శ్రీశ్రీ కాదు, కాలం! కాలమంటే చరిత్ర చెబుతుంది ఎవరు ఏమిటో? 1934 నుండి 1980 వరకు తెలుగు సాహితీ క్షేత్రంలో విప్లవాల పూలు పూయించినవాడు శ్రీశ్రీ. అభ్యుదయం - విప్లవం రెండూ శ్రీశ్రీ చేతిలో నవ్యమైన రూపందాల్చి, తెలుగు సాహితీ రంగానికి ఒక ఊపు, రూపు తెచ్చాయి. శ్రీశ్రీకి ముందు తెలుగు సాహిత్యంలో శూన్యం వుందన్నారు కొందరు. కొందరు ముక్కున వేలేసుకున్నారు. శ్రీశ్రీ తరువాత కూడా తెలుగు వచన కవిత్వం పలుచనైందన్నారు ఇంకొందరు. లేదు లేదంటూనే ‘చిక్కనైన కవిత్వం’ అంటూ కవితా సంకలనాలే ప్రచురించారు మరికొందరు. శ్రీశ్రీని ‘్ఛ.. ఛీ’ అంటూ తిట్టినవాళ్లే శ్రీశ్రీ మాటలు లేకుండా ఒక్కముక్కా నేటికీ రాయలేకపోవడం అందరికీ తెలుసు. ఈవిషయానే్న శ్రీశ్రీ బతికున్న రోజుల్లో నేను అడిగాను ‘ప్ర.జ’లో. ఆ విషయం ‘రామదండునడగండి’ అని నవ్వారాయన. ఆ రామదండు ఎవరో నాకు అర్థం కాలేదప్పుడు.
ఈ తరం కుర్రాళ్లు తెలుగును స్కూల్లోనే వదిలేసి, ఏమీ రాకపోయినా 99 మార్కులతో సంస్కృతంతో ఇంటర్ పూర్తిచేసి, ఏ సెట్ పొందలేనివాడు డిగ్రీలో కూడా సంస్కృతం చదివినట్టు చదివి బొటాబొటి మార్కుల్తో సరిపెట్టుకొని, ఎంబిఎలు, ఎంసిఎలు అలాఅలా అయిందనిపించి, ఇక అప్పుడు తెలుగు డబ్బింగు కోసమో, పత్రికల కోసమో తాను బతకడానికో, వాటిని బతికించడానికో తెలుగు సాహిత్యం మీదా, కవిత్వం మీద శ్రద్ధ కలిగించుకొని కొటేషన్ల కోసమో, శ్రీశ్రీ కోసమో శ్రీశ్రీని చదవాలనుకునే శిష్య ఆటంబాబు (పరమాణువుల) కోసం శ్రీశ్రీ గురించి కొన్ని ముచ్చట్లు జయంతి సందర్భంగా..
శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి వెంకటరామయ్య గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్న స్కూల్లోనే శ్రీశ్రీ చదువుకున్నారు. 15వ ఏటనే వెంకట రమణమ్మను వివాహం చేసుకున్నారు. తరువాత కారణాంతరాల వల్ల సరోజినిని పెళ్లాడారు. వారికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు కలిగారు. ఉన్నత విద్య కోసం 1928లో మద్రాసు వెళ్లి 1931లో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. 1938లో ఆంధ్రప్రభ పత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరారు. ప్రభవతో ప్రారంభమైన ఆయన సాహితీ ప్రస్థానం దాదాపుగా 1983 జూన్ 15న మరణించే వరకూ అంచలంచెలుగా, గమ్మత్తుగా, గంభీరంగా, వాదోపవాదాల మధ్య సాగింది. శ్రీశ్రీ ఆధునిక యుగంలో ఆధునికంగా, అభ్యుదయంగా కవిత్వం రాశారనడంలో బహుశా ఎవరికీ అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ‘కష్టజీవి’కి అటూ ఇటూ నిలిచినవాడే ‘కవి’ అంటూ పతితుల కోసం, బాధాసర్పద్రష్టుల కోసం విప్లవ శంఖం పూరించినవాడు శ్రీశ్రీ. ‘మహాప్రస్థానం’, ‘ఖడ్గసృష్టి’, ‘సిప్రాలి’ వంటి కవితా సంపుటాలు శ్రీశ్రీని తెలుగు సాహితీ హిమనగంపై నిలిపాయి.
1950లో ‘ఆహుతి’ డబ్బింగ్ సినిమాతో చిత్రసీమలోకి ప్రవేశించిన శ్రీశ్రీ వేయికి పైగా పాటలు రాశారు. నవల, కవిత, కథ, రేడియో నాటికలు.. ఇలా ఆయన చేపట్టిని ప్రక్రియే లేదు. చల్లని రాజా ఓ చందమామా.., వాడిన పూలే వికసించెనే.., ఓ రంగయ్యో! పూల రంగయ్యో!.., నా హృదయంలో నిదురించే చెలీ.., మనసున మనసై..’ వంటి పాటలు ఈ తరం వారికి ఇంకా గుర్తున్నాయి. ఇక ఆయనకు వచ్చిన లేదా ఇచ్చిన అవార్డులూ, రివార్డులూ ఆయన ప్రతిభకు తులతూగేవి కావు. అంటే వామపక్ష కవి కావడం వల్ల ఎన్నో సంస్థలు పక్షపాతం (వాతం) వహించాయి. ఇచ్చినవి కూడా వారి అవార్డులకు ఈయన పేరుతో కీర్తి తెచ్చుకోవాలనే ఉద్దేశమే ఎక్కువ. ఒకటీ అరా శ్రీశ్రీపై మక్కువతో వచ్చి వుండవచ్చు. ఈ మాటలు కొందరికైనా బాధ కలిగిస్తే మరీ మంచిదే. నా ఉద్దేశ్యం కూడా అదే. ఏదిఏమైనా ఒక్కోసారి, లేదా సదా ప్రతిభను వాటితోనే తూస్తారు కాబట్టి - కొన్నింటిని ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం కాకపోవచ్చు. 1972లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి దానికే గౌరవం తెచ్చుకున్నారు. సోవియట్ అండ్ నెహ్రూ అవార్డు, రాజ్యలక్ష్మి అవార్డులు మక్కువతో ఇచ్చినవే. నేషనల్ ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులు చిత్రపరిశ్రమలో ఆయన రాసిన పాటలకు ఇచ్చారు. నేటికీ, ఏనాటికీ విన్నప్పుడల్లా ఉల్లము ఝల్లనిపించే పాట ‘తెలుగు వీర లేవరా..’. శ్రీశ్రీ రాసిన న-న-న నత్తి మాటలు, ‘హుష్ హుష్.. అను కేకలు’ డాడాయిజం ప్రభావంతో వెలువడినవే. మహాప్రస్థానం యోగ్యతాపత్రంలో చలం ‘కొద్దిరోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతిఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నుంచి తమ ఉనికిని సమర్థించుకోవలసిన గతివొస్తుంది’ అని అన్నమాట తరువాత కాలంలో ఎంత నిజమయిందో సాహితీ ప్రియులందరికీ తెలిసిందే. శ్రీశ్రీ తన వెంట తెలుగు సాహిత్యాన్ని రాకెట్ స్పీడులో నడిపించాడు. అయితే శ్రీశ్రీ భౌతికంగా నిష్క్రమించగానే ఆ వేగం తగ్గిందనే చెప్పాలి. శ్రీశ్రీ కంటే ఉన్నతులమని చెప్పుకున్నవారు ‘కనబడుట లేదు’! వారసులమని ప్రకటించుకున్న వారి చిరునామాలు దొరుకుట లేదు.
నేటి యువ రచయితలంతా శ్రీశ్రీ రేపిన ‘అలజడి’ని అందిపుచ్చుకొని తెలుగు సాహితీ క్షేత్రంలో సరికొత్త విప్లవాల పూలు పూయించాలని ఆశిస్తూ..!

- మండవ సుబ్బారావు
**

జీవనమూల్య రుచుల
కథన విజయం
*
‘సహనాభవతు’ పేజీలు: 264
విరించి (తల్లాప్రగడ గోపాలకృష్ణ)
సెల్: 98487 89094
ప్రాప్తి స్థానం:
1) సాహితీ ప్రచురణలు, 4-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ - 520 002
2) ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలు
*
తెలుగు కథ - కథన రీతులు సాహిత్య ప్రక్రియలలో విశిష్టతను పొందాయనే చెప్పాలి. వివిధ సామాజిక, సాంస్కృతిక స్ఫూర్తి ఉద్యమాల నేపధ్యం ఆలంబనలైన ఏడు తరాల కథకులు, వారి కథలు చదవడం, గుర్తుంచుకొన్న వాటిలో మేలిముత్యాలు చరిత్రలో స్థానాన్ని సుప్రతిష్టం చేసుకున్నాయి. గతాన్ని వర్తమానం లోనుంచి విశే్లషించుకుంటూ కథన రీతి - నీతి పరిణామాలు - ప్రమాణాలు సంతరించుకున్న వేలాది కథలు - సంపుటాలు వచ్చి చేరుతూనే ఉన్నాయి. ఇటీవల విరించి ‘సహనాభవతు’ 25 కథల విశిష్టతను రచయిత తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు మాటలు రాయాల్సి వచ్చింది. ‘గుర్తుకొస్తున్నాయి’ కథని - పఠిత దృష్టి నుంచి సమీక్షణ దృష్టిలో కూడా అర్థం చేసుకోవడం జరిగింది. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల చదువుల గురించే కాక ఉద్యోగాల గురించి పెద్ద ఆశలే పెట్టుకుంటుంటారు. తనదాకా వస్తే గాని అన్నట్లుగా ఆ పిల్లలు పెద్దలై పేరాశలు పెట్టుకున్న పెద్దరికాల్ని వృద్ధాశ్రమాలకు నడిపించడంలో ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్న సామ్యాన్ని అక్షరబద్ధం చేసినట్లయింది.
అలాగే ‘కులాంతరం’ సమస్య ముఖ్యంగా ప్రేమ వివాహాలు - ఆపై జరిగే పరిణామాలను ఊహించకుండా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు అంశం కథావస్తువయింది. వర్తమానంలో ‘కులాంతరం’ నేరమే కాదు. ఎందుకంటే వ్యవస్థలోని తరాల మార్పులకు జీవన సరళికి అన్వయించుకోవడమే దీనికి హేతుబద్ధత, పరిస్థితుల ప్రభావం వల్ల రాజీపడే మనస్తత్వం - చక్కటి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే గత కాలం ప్రశ్న - వర్తమానం జవాబు నుంచి మరొక ప్రశ్నగా మారకూడదన్నదే రచయిత అభిప్రాయంగా తెలుస్తుంది. మానవ సంబంధాలన్నీ మనీ.. సంబంధాలుగా మారి, పరిస్థితుల ప్రభావంతో అంతరంగ భేషజాలు పోయే మనిషి నుండి అవసరం మేరకు అందిన సంపదలు, సుఖ సౌఖ్యాలు మించిన ఉదారతను తెలియజేసిన కథ ‘అంతా మామూలే’. ఈ కథలో మామూలు మనుషులుగా చెలామణి అవడానికి త్యాగశీలత కావాలన్న సందేశం, నిస్వార్థ జీవనం మనిషికి సహజాభరణం అయిన పోస్ట్‌మెన్ సుబ్బారాయుడి పాత్ర ద్వారా తెలియజెప్పిన వైనం కొసమెరుపు.
ఇక ‘జీవన సత్యం’. సగటు భార్యాభర్తలు, వారి సంతానం, వారి ప్రవర్తనలు ఇత్యాదులతో సతమతమవుతూ రెండు కళ్లలాంటి కొడుకులు, వారి సొంత వైఖరులు చిత్రించడంలో రచయిత కృతకృత్యులయ్యారు. దీనికి దేవాలయంలో పూజలందుకుంటున్న శిల, ఆరుబయట పద ఘట్టనల కింద నలుగుతున్న శిల సౌమ్యంతో మలిచారు.
ఒక్కొక్కసారి జీవితంలో మనకేమీ కాదనుకున్న వాళ్లు యథాలాపంగా చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని కృతజ్ఞత చూపించడం, మానవత్వపు పరిమళంగా భాసించిన కథ ‘రుణానుబంధం’. ‘రుణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయా’ అన్న ఆర్యోక్తికి సాదృశ్యాక్షరంగా నిలిచిన హృదయ సంబంధమైన కథ.
సమాజంలో చాలామంది మనుషులుంటారు. అయితే మనిషి హితైషిగా మనీషిగా మారడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఒక స్నేహితుడు అతని కష్టనష్టాలు స్నేహానికి విలువలు నిలువెత్తు సాక్ష్యాల్లా నిలిచి అభిమానాన్ని ఆత్మీయతని, స్నేహం పట్ల నిస్వార్థ ప్రేమ, గౌరవం పెంపొందించిన అంశాలు ‘అతడే హితుడు’లో ఉన్నాయి.
సాధారణంగా జీవితంలో దర్శించిన ఉదాత్త పాత్రలు, కథాసృష్టిలో జీవితాల్ని ఏ వాదాలకు, ప్రభావాలకు లోనుకాకుండా అన్యాయ దృక్పథంతో కథావస్తువుని ముడి సమస్యగా ఎంచుకున్నారు విరించి. ఎందుకంటే మధ్య తరగతి మందహాసాలు, ఆర్థిక వ్యవస్థల లోటుపాట్లు, ఏదో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు, కేంద్రీకృత కుటుంబ వ్యవస్థ వంటి అంశాలు పలుపాత్రల్లో, సంభాషణల్లో వ్యక్తిత్వ నిర్మాణాన్ని తెల్పడం రచయిత కథన శైలిగా తోస్తుంది. మనిషిని వింతైన ప్రవృత్తిలోకి దింపే ‘దృక్పథం’ కథలో సగటు స్ర్తి మనస్తత్వం, అదీ భర్తను కోల్పోయి ఉద్యోగస్తురాలైన స్ర్తిపట్ల సహోద్యోగుల దృక్పథం, నిస్సహాయ స్థితిలో పరిస్థితుల ప్రభావం, తనని ఇష్టపడే, తను ఇష్టపడే వ్యక్తి బాసటగా ఉంటాననడం, అదే స్ర్తి స్నేహితురాలి భర్త వింతైన ప్రవర్తనతో తన సహోద్యోగి పట్ల వ్యామోహం పెంచుకున్న స్నేహితురాలు ప్రేమతో సమాజాన్ని, సంసారాన్ని స్వర్గంగా మార్చుకోవడంలో అనుమానాలు, అహంకారాలు ఏవైనా సరే అన్వయ దృక్వథంతో సాగాలన్న ‘్భష్యం’ అన్ని కథల్లోకి మేలుబంతిగా నిలిచింది.
కథా సంపుటి మకుటం ‘సహనాభవతు’ కథ. సాధారణంగా ఎవరైనా సరే ఆదర్శప్రాయంగా నిలవాలనుకుంటుంటారు. చక్కటి మనస్తత్వ విశే్లషణతో సాగింది. సుడిగుండాల్లో చిక్కుకున్న మనిషికి చేయూతనివ్వడానికి వచ్చిన పాత్ర ఒక స్నేహితుని కాపురంలో జీవన సుడిగుండాల్నించి గట్టెక్కించే ప్రయత్నంలో స్నేహితుడు - అతని చెల్లెలి పాత్ర ప్రవేశపెట్టి, మానసిక జాఢ్యాలకు సరైన మందు సహనమే, సహానుభవ శీలతే అని దాంపత్యబంధం యొక్క విలువను పెంచిన కథ. ‘ఈవారం’ వారపత్రిక కథానికలో పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కథ.
ఇలాంటి కోవలో మంచం పట్టిన మానవత్వం, పేగుబంధం వంటి కథలున్నాయి. మొత్తం మీద సాహిత్యాన్ని జీవితాంతర్గతంగా అన్వయించుకుంటూ వర్తమానంలోని కథాపరిణామ క్రమాన్ని పాఠకుల అవగాహనకు, మనో విశే్లషణలకు దర్పణాలుగా నిలిచాయి. వౌలిక వస్తువులతోపాటు విభిన్న పార్శ్వాల కథలు మచ్చుతునకలుగా పలు పత్రికల్లో ప్రచురించబడి ప్రశంసలందుకున్నాయి. కళ్లముందు కడుపు మంటల్ని కంటతడుల్ని గుండెలోతుల్లోకి మానవత్వాన్ని నిలబెట్టడంలో రచయిత కృతకృత్యులయ్యారు.
ఎమెస్కో వారి ప్రచురణతో వెలువడిన ఈ కథల సంపుటికి గొప్ప ముఖచిత్రం ప్రత్యేక ఆకర్షణ.
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.
email: merupurjy@andhrabhoomi.net