విజయవాడ

‘విద్వత్కవిరాజ’వర్యులు.. కొమాండూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాల మృణాళతంతువును బాఱని నీకుచమధ్యమందు నీ
లాలకలగ్నమైన హృదయాంబు జమున్ మఱలింపఁజాలనో
బాల! ధనంజయాత్మజుఁడు వైరులు పన్నిన తమ్మి మొగ్గరం
బాలము సేయఁజొచ్చినటులయ్యెను వెల్వడనేర్పు చాలమిన్’
మన ప్రాచీనాధునికాంధ్ర సాహిత్యంలో ఎనె్నన్నో నవరస శృంగార మధుర భక్తి పూర్వక పద్యకావ్యాలు వచ్చాయి. ఆయా కావ్యాల్లో అమోఘ వర్ణనలున్నాయి. కానీ పైరీతిగా ఒక శృంగార రసాత్మక సంభాషణ సన్నివేశంలో యుద్ధవీర రస ప్రతిపాదక సన్నివేశాన్ని నిరుపమాన రీతిలో ఉపమాలంకార రూపంలో సమకూర్చిన ఇటువంటి హృద్య పద్యం మరెక్కడా కానరాదు. పై పద్యం ‘వైజయంతీ వైభవము’ అనే పేరుగల రెండాశ్వాసాల విప్రనారాయణ చరిత్ర పద్యకావ్యంలోనిది. విష్ణ్భుక్తి పరాయణుడైన విప్రనారాయణుడు వేశ్యయైన దేవదేవికి వశుడై ఆమె సౌందర్యానికేవిధమైన అనుభూతిని పొందుతున్నాడో ఆమెతోనే పలికే సందర్భంలోనిది. లేత తామరతూడు దారం కూడా దూరడానికి ఖాళీలేనంత బిగువుగా ఒత్తుకొని ఆ దేవకీదేవి కుచములున్నాయట. అటువంటి కుచమధ్యమందు లగ్నమైన తన హృదయ పద్మాన్ని విప్రనారాయణుడు మరలింపలేక పోతున్నాడట. ఆనాడు కౌరవులు పన్నిన పద్మవ్యూహంలోకి యుద్ధం చేయడానికి అభిమన్యుడు ప్రవేశించినట్లుగా ఆ దేవదేవీ కుచమధ్యంలోకి విప్రనారాయణుని హృదయ పద్మం ప్రవేశించింది. ఆనాడు పద్మవ్యూహంలో నుండి బయటికి రావడానికి అభిమన్యునికి ఎలా నేర్పు చాలడం లేదో విప్రనారాయణుని హృదయ పద్మానికి ఆ దేవదేవీ కుచమధ్యం నుండి బయటికి రావడానికి నేర్పు చాలడంలేదని పై పద్య భావం. ఆనాడు కురుక్షేత్రంలో అభిమన్యుడు ఫలితంగా పొందింది మరణం. ఆమె కుచక్షేత్రంలో ఫలితంగా విప్రనారాయణుడు పొందుతున్నది కామరణం. చిత్రంగా లేదూ! ఈ విభిన్న రసాల పోలికకు చెందిన కల్పనం! ఆ కవి ఎవరో గానీ- గొప్ప రసజ్ఞుడు, ప్రతిభా వ్యుత్పన్నుడూ అని తెలుస్తుంది.
ఆ కవియే పది రంగాల ‘పాంచాలి’ నాటకంలో సుధేష్ణ మందిరంలో కాముకుడైన కీచకుని భయపెడుతూ మాలిని పలికినట్లుగా ..
‘దండ ధరోపమాన బలదర్ప విషూర్ణిత శాత్రవుండు దో
ర్దండ గదావిదారిత రథద్విరదాశ్వ పదాతి సైన్యుఁడా
ఖండల తుల్య విక్రముఁ ఖండ మహాసమర ప్రచండుఁడు
ద్దండ కృపాణఖండిత మదావళు లేవురు మత్పతుల్ సుమీ!’
రచించిన పద్యం - కవిబ్రహ్మ తిక్కన సోమయాజి భారత విరాట పర్వంలో కీచకునితో పలికిన ద్రౌపది పలుకులుగా రచించిన ‘దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్’ అన్న శార్దూల పద్య గర్జనతో దీటుగా విరాజిల్లింది. ‘చారుతుషార బింబరుచి సాంద్రములున్ బరిపక్వశాలి కేదారములుల్ల సత్తరళ తారక పంక్తులు ఫుల్లమల్లికాహారులు, మోదమానకు ముదాకరముల్, శరపుష్ప రేణువుల్ భార సమీరముల్ పొలిచె భాసుర శారద వాసరావళుల్! అన్న పద్యం - నన్నయ్య భారతంలోని ‘శారదరాత్రులు జ్జ్వల లసత్తర తారక హారపంక్తులన్ జారుతరంబులయ్యెన’న్న పద్యంలోని అక్షర రమ్యతను పుణికిపుచ్చుకున్నట్లుగా లేదూ! కానీ ఇది ఆ కవి రచించిన ‘ఆంధ్ర హర్ష చరిత్ర’ పద్యకావ్యం లోనిది. మూల సంస్కృత హర్ష చరిత్రలోని శరదృతు వర్ణనాత్మక గద్యాన్ని హృద్యంగా అనుసరించింది.
ఆ కవి ‘కావ్యకుసుమాంజలి’లోని అన్ని ఖండికలూ ఇక్షుఖండాలే అయినా ‘ఊర్వశి’ కవితా ఖండిక పేర్కొనదగింది. తల్లివంటిదైననూ దేవతాస్ర్తిలకు వావి వరుసలు లేవంటూ తనంతట తానుగా వలచి వచ్చి పలికిన ఊర్వశి మాటలు, ఆమెను గౌరవంగా, సున్నితంగా తిరస్కరించిన అర్జునుని సందర్భోచిత సంభాషణలూ - మనుచరిత్రలోని ప్రవర వరూధినీ సంభాషణలను తలపింపజేస్తున్నాయి.
‘అఖిల గీర్వాణ విద్యాపీఠ మెచ్చోట
భాషా సతీకృపా పాత్రమయ్యె
శంకర రామానుజ ప్రోక్త భాష్యంబు
లెచ్చోట శిరసావహింపఁబడియె
మమ్మట ప్రముఖులౌ మహిత సాహిత్యార్థ
వాచస్పతులకెద్ది వాసభూమి
సర్వంకషంబైన సకల శాస్తజ్ఞ్రాన
నికషోపలంబన నెగడెనెద్ది
కాలగళవౌళి విన్యస్త గాంగపూర
శీకరాసార వర్ధితా శేషవనము
లెచట సందర్శనీయమై యింపుగొలుపు
నట్టికాశ్మీరమున మహాహవము బుట్టె’.. అని ‘కలివిడంబన’మన్న ఖండికారంభంలో ఉన్న ఉదాత్త భావ సుందరమైన కాశ్మీర వర్ణనం ఈ కవి అచంచల దేశభక్తిని నీటుగా చాటిచెబుతోంది. ఇంతకీ ‘జగత్కర్ణామృతంబౌ కుహూరవ’మీకవికోకిల రచనా ప్రస్తారం. అటువంటి ఈ కవి - భాగవత లీలలను రసవత్తరంగా పోతపోశారు. వేదాంత దేశికుల వారి కృతికనువాదంగా ‘ఆంధ్ర హంస సందేశ’ పద్యకావ్యాన్నీ, స్వతంత్ర కృతిగా భగవద్రామానుజ వైభవ పద్య కావ్యాన్నీ, మాఘుని శిశుపాల వధను ‘మాఘామోద’ పద్యకావ్యంగానూ, ‘ప్రమద్వర’ కథను అయిదు రంగాల నాటకంగానూ, ‘ఆంధ్ర దశకుమార చరిత్ర’ గద్యకావ్యాన్నీ, ఇంకా అనేకం రచించారు.
సుమారుగా 1950-60 ప్రాంతాల్లో గుంటూరులో ఓ వెలుగు వెలిగిన శ్రీ పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్యుల వంటి వారి మెప్పు పొందిన విద్వత్కవి మిత్రులీయన. పేరు- శ్రీమాన్ కొమాండూరు కృష్ణమాచార్యుల వారు. ఒక్కమాటలో చెప్పాలంటే సమానులలో ఉత్తమ శ్లోకులై, లోకావలోకన దృక్పథంతో అనేక రసవత్తర రచనలు గావించిన ‘విద్వత్కవిరాజ’వర్యులు కొమాండూరు కృష్ణమాచార్యుల వారు.
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండిమెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- డా. రామడుగు వెంకటేశ్వరశర్మ, గుంటూరు. చరవాణి : 9866944287