రాజమండ్రి

ప్రమాదంలో ప్రమోదం (బాలకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువకుడు గోవిందయ్య పరమానందస్వామి ఆశ్రమంలో జ్ఞాపకశక్తి లేమి కారణంగా చాలాకాలంగా విద్య కొనసాగిస్తున్నాడు. గోవిందయ్య ఆశ్రమానికి శాశ్వత విద్యార్థి అని సాటి విద్యార్థులు ఆట పట్టించినా గొడవ పడేవాడు కాదు. వౌనంగా చింతించటం తప్ప జ్ఞాపకశక్తి పెంచుకునే ప్రయత్నాలు చేసేవాడుకాదు.
ఒకనాడు స్వామి పక్క గ్రామం వెళ్లగా శిష్యులు అతిగా అవహేళన గావించే సరికి తీవ్ర మనస్తాపానికి గురైన గోవిందయ్య తనకిక పూర్తి విద్య రాదు అన్న నిరాశతో కూడిన ఆవేశం, ఉద్రేకం భరించలేక ఆత్మహత్యకు నిర్ణయం తీసుకున్నాడు. పరమానంద స్వామికి వేద విజ్ఞాన శాస్త్రాలే కాదు మూలికావైద్యం కూడా తెలుసు.. చేస్తుంటారు.
ఈ మధ్య స్వామి సర్పగరళంలో కొన్ని మూలికా చూర్ణాలు కలిపి మందబుద్ధి నివారణ ఔషధం తయారుచేసి ఒక సీసాలో భద్రపరిచి పరిశీలనలో ఉంచారు. శిష్యగణానికి ఔషధం తయారు చేయడం తెలుసుగాని అది ఏ రోగ నివారణకో తెలీదు.
ఏవిధంగా చావాలా అనుకుంటున్న గోవిందయ్యకు చటుక్కున ఆ ఔషధం గుర్తుకొచ్చింది. తయారుచేయడం చూసి ఉన్నాడు. ఆ మందులోని గరళం ప్రాణాలు తీస్తుంది గనుక ఆ ఔషధం మింగాలనుకున్నాడు.
వెంటనే ఎవరూ చూడకుండా రహస్యంగా గురువుగారి కుటీరంలోకి పోయి సీసాతో బయటకు వచ్చి వెర్రి ఆవేశంతో మొత్తం ఔషధం మింగేశాడు. మరుక్షణం నోటి నుండి నురగలు రాసాగాయి. శరీరం నల్లబడసాగింది. చావు తథ్యం అని దైవప్రార్థన మొదలుపెట్టాడు. కాని గోవిందయ్య తలిచినట్టు ఊపిరాగలేదు. విచిత్రంగా నురగలు, శరీరం నల్లబడటం ఆగిపోయి యావత్తు దేహం వేడెక్కిపోయి శరీరం కుతకుతలాడిపోతుంటే భరించలేక పరుగున వెళ్లి ఆశ్రమం బావిలో దూకాడు. అది గాంచిన విద్యార్థులు భయంగా అరుస్తూ పరుగున వచ్చి నూతిలోకి చూసి నిర్ఘాంతపోయారు.
గోవిందయ్య నూతిలో మునిగిపోయి మరణించలేదు. బతికి ఉన్నాడు. నిక్షేపంగా నీటిలో నిలబడి ఉన్నాడు. నూతిలో నీళ్లు గోవిందయ్య సగం వరకు ఉన్నాయి. అందువల్ల బతికి బట్టకట్టాడని విద్యార్థులు ఊరటపడ్డారు. తదుపరి మితిమీరిన వేళాకోళం వల్ల గోవిందయ్య చావబోయాడని బాధపడ్డారు. గోవిందయ్య ఔషధం మింగిన సంగతి వారికి తెలీదు. గోవిందయ్య చెప్పబోయాడు.
అదే సమయంలో ఊరు నుండి తిరిగివచ్చిన పరమానంద స్వామి గబగబా నూతి వద్దకొచ్చి చూసి అక్కడ జరిగిందేమిటో క్షణాల్లో గ్రహించి నవ్వుకున్నారు. ఈలోగా శిష్యులు గోవిందయ్యని పైకి లాగడానికి తెచ్చిన మోకు బావిలో జారవిడవబోతే వద్దని వారించి
‘నేను తయారుచేసిన జ్ఞాపకశక్తి ఔషధంలో సర్పగరళం మోతాదు తక్కువ. వనమూలికల చూర్ణం మోతాదు ఎక్కువ. అందువల్ల గోవిందయ్య మరణించలేదు. కాని మోతాదు మించి ఔషధం సేవించినచో క్షణాల్లో శరీరం వేడెక్కిపోతుంది. ఆ వేడిమి భరించలేక గోవిందయ్య బావిలో దూకాడు. నీరు పూర్తిగా లేకపోవడం మంచిదయింది. అదే నీరు విరుగుడుగా పనిచేయడం వల్ల ఉష్ణోగ్రత తగ్గిపోయి రక్షింపబడ్డాడు...’ అంటుంటే గోవిందయ్య అవునన్నాడు.
స్వామి ఆగలేదు ‘అందుబాటులో ఔషధం ఉంది గనుక గోవిందయ్య వేరే ప్రయత్నం చేయలేదు. బతికాడు. నూతి నిండుగా నీరుంటే ఈతరాని గోవిందయ్య మునిగిపోయి చనిపోయేవాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఔషధం, బావినీరు గోవిందయ్యను కాపాడాయి. ఈ దుర్ఘటనకు హేతువు శృతిమించి మీ హాస పరిహాసాలు! అవి మనిషి ఆత్మనిబ్బరాన్ని దెబ్బతీస్తాయి. మానసిక ప్రశాంతత కొరవడి కాని పనిచేస్తారు. కానీ అది తప్పు. పరిచితులు, అపరిచితులు ఏదో అన్నారని, నవ్వారని, కించపరిచారని, తుంచివేశారని సిగ్గుపడి బాధపడిన క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడే ముందొక్క క్షణం ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుని ఆలోచించాలి. ఉద్రేకం, ఆగ్రహం చల్లారిపోయి వివేకం, ఆత్మస్థైర్యం మానసిక పరిణతినిస్తాయి. ప్రమాదం జరగదు. ప్రమోదం మిగుతుంది’ అని ముగించారు.
ఇక నుండి ఎవరినీ హేళన, అవహేళన గావించబోమని వాగ్దానం చేసిన శిష్యులు మోకుతో గోవిందయ్యను పైకి లాగి క్షమాపణలు చెప్పుకున్నారు. గోవిందయ్య కూడా ఆత్మహత్య తలపెట్టనని ప్రమాణం చేశాడు. అనంతరం గోవిందయ్య, స్వామి మరల తయారుచేసిన ఔషధం సేవించి కృతార్ధుడయ్యాడు.

- కృష్ణ మాధవరపు
8-21-12, పూళ్లవారివీధి, గాంధీనగరం
కాకినాడ - 533004

పుస్తక పరిచయం

వికసించిన
‘నవ పారిజాతాలు’

పువ్వులు ఇష్టపడని వారు అరుదు. పువ్వులంటే పడి చచ్చే వారు మాత్రం కోకొల్లలు. పువ్వును చూసినట్టే పసిపాప, పువ్వు అందాన్ని మోజుపడే మగువ మనకు తారసపడే పువ్వుల ప్రేమికులు... మరి అన్ని పువ్వుల్నీ ఒకే గాటన కట్టలేం. ఒకో పువ్వుదీ ఒక పరిమళం. ఒక ప్రమాణం. పారిజాతం మనసు దోచేసే మనిషిని పారవశ్యపు పులకరింతకు గురిచేసే పుష్పం. పలకరించుకొంటే పలువుర్ని పిలుచుకొనే పుష్పం పారిజాతం. ఆ పేరుతో ‘నవ పారిజాతాలు’ శీర్షికన జిఆర్కే రాజు గారు జీవిత పరిమళాలు జీవన ప్రమాణాలు జీవిత సత్యాలు నవ జీవనం అందాలు ఆనందాలు అన్నీ కలగలిపి అందించారు.
నవ్వుల్ని పువ్వుల్లో ఒలకపోసి సుగంధ పరిమళాలు కవిత్వ పాదాలపై అద్ది మనసారా ఆరబోసారు ఈ పారిజాత పరిమళాల్ని ఆస్వాదించడానికి, ఆఘ్రాణించడానికి మనసు సన్నద్ధమైంది. పువ్వులో ప్రణమిల్లిదే భక్తి ప్రపత్తులతో ఆ తర్వాత ప్రేమ తపనలతో సమర్పించుకుంటాం. నవ పారిజాతాల్ని ముందుగా ‘గురువుకు మించిన దైవం లేదు / గురువుకు మించిన పదమే లేదు / జ్ఞానం విజ్ఞానం కలబోసిన / గురువు లందరికీ వందనం’ అంటూ ప్రణమిల్లుతూ ముందుకు తీసుకుపోతున్నారు. ఆహ్లాదంగా జీవికి ఎన్ని వంకలున్నా జీవిక కోసం అగచాట్లు తప్పవు. ఆలోచనలు తప్పవు. ఆ విషయాల్ని చాలా సాదాగా అయినా సౌందర్యవంతంగా చెబుతున్నారు. ‘నడకలో కుంటి ఐనా / కోరికలు కుంటు పడవులే / కనులు మెల్ల అయినా / కలలు మెల్లగుండవులే’ సహజ సిద్ధమైన సంగతుల్ని కవితాత్మంగా ‘తూనీగలు’లో చూపారు. ఒక ఉప మానాన్ని నిండైన వ్యంగ్యాన్ని జోడించారు. ‘నున్ననైన గుండుకు / నూనె ఎందుకు దండగ / నిండైన మైదానంలో / పిల్ల గోల కూడా పండగే. అదే పండుగ ప్రేరణకు కొలమానంగా ‘యాంత్రిక జీవితానికి / పండగ పేరుతో హుషార్’ చేశారు. ఎందుకో మరణాన్ని అసహనంలోకి గెంటి సుఖప్రాప్తి అంటున్నారో ... ‘నలిగిపోయిన ప్రాణికి / మరణమే గొప్ప రిలీఫ్’ తెలియడం లేదు. ఎంత వేదన ఎంత దిగులు ఎంత కష్టం కలిగినా స్వాంతన మరణంలో దొరుకుతుందనటం ప్రాణులకు చికిత్స కారకుడైన వైద్యుడు చెప్పాల్సిన పదం కాదు.
ఈ దేశంలో పుట్టినందుకు భరత మాతకు వందనం అంటున్నారు. రుణాన్ని తీర్చుకొనే గొప్ప సుగుణాన్ని తల్లిని కీర్తిస్తూ చెప్పిన ‘వందనం భరత మాతా’ శీర్షిక ఓ చక్కని గేయాలాపన గీతం. దేశమన్నా, ప్రాంతమన్నా భాషన్న ఎంత ప్రేమో ఆ తత్వాన్నంతా దీనిలో జాతీయతగా ఒలకపోసారు. ‘మతాలు గతాలు వేరైనా అభిమత మొకటే కాద / భాషలు యాసలు వేరైనా లోభావమొక్కటే కాద / దూర దేశాల ఉన్నా మన మందరమొక్కటే కాద / ప్రేమ తత్వాన్ని భువికందించిన భారత మాతకు వందనం’ ఆధ్యాత్మికత ఆహ్లాదకర జీవనాన్ని ఆరోగ్యం ఆనందకర జీవితాన్ని ‘కలికాలం’లో పొందే తాత్వికతను పనె్నండు వాక్యాల్లో చెప్పినా దాని అంతస్సూత్రాన్ని కింద నాలుగు లైన్లో చాలా గడసరిగా చెప్పారు. ‘ఆరోగ్యం అందరి సొత్తు / దానికి చేయాలి కొంత కసరత్తు / తలుపులు మూసిన గది భద్రం / తలపులు ఆగిన మది బ్రహ్మం’ దేన్ని మూయాలో దేనికి తెరవాలో మదిని స్పష్ట పరచిన కవిత. ప్రేమ ఒక తియ్యని పదం. మనసుకు ఆహ్లాదం కలిగించి ఆనందం మిగిల్చే పదం. జగతికి ఎలా మూలమయిందో విశదీకరిస్తున్నారు. తనను తాను ప్రేమించుకోవడమంటే సహజంగా ఆకర్షించడం. అంతర్లీనమైన ఆప్యాయత అనురాగం అందులో ఇమిడిపోతాయి. ఆత్మీయానుబంధం దానిలో ఇమిడి పోతుంది. ఇది సరిగ్గా అమరిపోతే ఆత్మలో ప్రేమ నిండిపోయి విశ్వజనీయతను సంతరించుకుంటుంది. అదెలాగో చూడండి... ప్రతి జీవుడు తన తనువుపై ఎంతో ప్రేమ జూపును / తనదనుకొన్న వారికి ప్రేమ పంచును బంధనలతో / తెలిసిన తదుపరి విశ్వమంతను ప్రేమించును ఆత్మరూపుడై’ అంటారు ‘ప్రేమేరా జగతికి మూలం’ అని ఆలపించిన గేయం.
డబ్బు జట్టు గట్టిగా అంటుకొని గబ్బు కొడుతున్న సమాజాన్ని బాగా నాడి పట్టుకొన్నారు డాక్టరు గారు. అన్ని అవలక్షణాలు బయట పడ్డాయి. రోగ నిర్ధారణ చేస్తున్నారిలా... ‘గుండె పలికే చప్పుళ్లు / రెండు లబ్ (ప్రేమ) డబ్ (డబ్బు) / మొదటి చప్పుడు వీక్ అయ్యింది / రెండో దాని మోత ఎక్కువయింది అంటున్నారు. ఏది పెరిగి ఏమి తరిగిందో కూడా చెప్పాక ధనమా? దైవమా? అని ప్రశ్నించి లోకం ధనానికి దాసోహమయిందని ఆక్రోసిస్తున్నారు. నవ పారిజాతాలను కృతజ్ఞతగా తల్లిదండ్రులకు ఒకటి, భక్తి సామర్యంతో దైవానికొకటి, అభిమానంగా మనకొకటి. సమాజానికొకటి, ప్రేమ కొకటి, ఆధ్యాత్మికత కొకటి, మానవీయత కొకటి, జన్మభూమి కొకటి, ఆత్మజ్ఞానానికి ఒకటి అన్నట్టుగా అర్పించారు. నవ్వడం ఒక వరం, నవ్వలేకపోవడం ఒక రోగం అని కవోత్తముడన్నాడు. డాక్టరు కవి ఏమంటున్నారంటే జీవన ప్రమాణాన్ని పెంచుతుంది నవ్వు అని. ‘మొహంలోన మొదలై శరీరాన్ని / అదుపు లేని కుదుపుతో కదుపుతుంది. / వర్తమానంలో ఉంచుతుంది’ లోపల కుమిలిపోయి మానసిక వ్యర్థాలు నవ్వులో పోతాయి. అన్ని రుగ్మతలకు ‘నవ్వు’ టానిక్‌లా పనిచేస్తుంది. అందుకే అంటున్నారు డాక్టర్ రాజుగారు ‘నవ్వా కావాలి నువ్వు’ అని. ప్రశాంత పసిపాప, ముదుసలి ముతె్తైదువ, పండు ముసలి ఎందుకు నవ్వుతారో ఆ నవ్వుల అర్థమేమిటో అసలు వివరణలిచ్చారు.
మచ్చుకు కొన్ని మాత్రమే ఎన్నుకొని స్పర్శించాను. తరగని ఎన్నో సుగంధాలు, మాలికలు గీతికలు మిగిలే ఉన్నాయి. వాటిని మనసారా ఆస్వాదించటానికి పారిజాతాలు నయనాలకు అద్దుకుని చదవాల్సిందే. రచయిత్రి వాణి ప్రభాకరి తను ఇష్టపడి నన్ను సమీక్షించమని పంపటంలో తను అనుభవించిన ఆనందాన్ని పదుగురిలో మురళీగానంగా మోగించ ప్రయత్నించాను. ఆ గాన మాధుర్యాన్ని మీరూ పంచుకోవచ్చు. ఆ క్రమంలోనే పిల్లల సంక్షేమ వృద్ధి పథకాన్ని ప్రారంభించారు. గ్రోత్ ఓరియంటెడ్ డిపాజట్ (జిఒడి) ఫర్ చిల్డ్రన్ వెల్ఫేర్ స్థాపించారు. ఈ పుస్తకంపై వచ్చే ప్రతి పైసాను దానికి వెచ్చించటం కోసమే పుస్తక వెలను ప్రకటించలేదు. ఉదారంగా పిల్లలకోసం ఆర్థిక సాయం అందిస్తారని కవి డాక్టర్ ఆశ.

- అమృత్, సెల్: 9494842274

జనవాక్యం

మద్యపానం - అనర్థాలు

మత్తును, మదమును కలిగించేది మద్యం. కల్లు, సారా వంటి స్వదేశీ పానీయాలు, విస్కీ, బ్రాంది వంటి విదేశీ పానీయాలు కూడా మద్యాలే. వీటిని తాగడం, మద్యపానం అంటారు. కాబట్టి అటువంటి పానీయాలు తాగరాదని చట్టం తీసుకుని వచ్చి అమలు చేయాలనడమే ‘మద్యపాన నిషేధం’ అంటారు.
స్వాతంత్య్ర సమరంలో మద్యపాన నిషేధం ఒక ఉద్యమంగా సాగింది. ‘కల్లు మానండోయ్ బాబు కళ్లు తెరవండోయ్’ అని తెలుగు కవులు ఎలుగెత్తి ప్రబోధించారు. మహాత్మా గాంధి సంపూర్ణ మద్యపాన నిషేధం పాటించాలని 1925లోనే పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం సాధించిన పిమ్మట కూడా చాలా రాష్ట్రాలు మద్యపాన నిషేధాన్ని అమలు పరచడంలో ఘోరంగా విఫలమయ్యాయి.
మద్యపానం వల్ల చాలా అనర్థాలున్నాయి.
మద్యపానం మనిషి కాలేయాన్ని క్షీణింప చేసి, అనారోగ్యానికి గురిచేస్తుంది.
మద్యపానం వలన నాడీ మండలం సరిగా పనిచేయక జ్ఞాపకశక్తి నశిస్తుంది.
తాగుడు అకాల మరణానికి కారణం అవుతుంది.
మద్యపానం వలన అసభ్య ప్రవర్తన ఏర్పడి సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు.
మద్యపానం వల్ల ఆర్థికంగా చితికిపోయి కుటుంబం కష్టాలపాలవుతుంది.
మద్యపానం వలన సాంఘిక దురాచారాలు పెచ్చుపెరిగి మన సంస్కృతికి కళంకం ఏర్పడుతుంది.
ఈ దురలవాటు వలన వ్యక్తి ఆర్థికంగా, శారీరకంగా, నైతికంగా, మానసికంగా, సామాజికంగా పతనమవడమే గాక కుటుంబంలో తన స్థానాన్ని కూడా క్రమంగా కోల్పోతాడు.
కాబట్టి దీనిని మన నుండి పాలదోలుటకు మనమందరం సమిష్టిగా కృషి చేద్దాం.

- వి నిరోష
ఫస్ట్ బికాం
రాజమండ్రి

మనోగీతికలు

రహదారి ప్రమాదాలు
ఎక్కడ చూచిన దారులు, రక్తమోడుతున్నాయి
రోజు రోజు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి
నరకానికి మార్గాలుగ మారిపోవుతున్నాయి
చూచే వారికి గుండెలు తరుక్కుపోతున్నాయి
కట్టుదిట్టమైన భద్రత సర్కారు వారు కల్పించిన
రోడ్డు ప్రమాదాలు రోజూ జరుగుతూనే ఉన్నాయి
మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుకొంటు
తనకు తాను ప్రమాదాలకు, తావిస్తూ ఉన్నాడు
నలు వీధుల కూడళ్లలో జనులు వెళ్లు దారుల్లో
విజ్ఞతను కోలుపోయి, మనసు మృగ్యమై పోగా
వాహనాన్ని దారిలోన అడ్డంగా నిలుపుతాడు
ఎదుటి వాహనాల కెపుడు, ఇబ్బందిని కలిగిస్తూ
విజ్ఞత కలిగుండి కూడ, మూర్ఖుని వలె ప్రవర్తిస్తూ
రాకపోకలన్నిటికీ అవరోధం కలిగిస్తూ
హోరను మోతలతోటి, చెవులు చిల్లుపడుచున్న
వాహనాన్ని పక్కనపెట్టి, అడ్డును తొలగించబోడు
మోటారు సైకిలెక్కి, సెల్ఫోను చెవికి అతికి
పరాచకలాడుకొంటు, పరుగులు తీయిస్తుంటే
ప్రమాదము ముంచుకొచ్చి, ఎముక విరిగి కూలబడి
వైద్యశాలలో చేరి, వేలు వేలు విదుల్చుకొని
అంగ వికలునిగ మారి, దారిద్య్రంలో మ్రగ్గుచు
దుర్భరమైనట్టి బతుకు, బ్రతుకుచున్న వార్ని చూసియు
తన్ను ఆవహించినట్టి, నిర్లక్ష్యం వదలబోదు
మత్తు మందు సేవించి, మిత్రులతో బైకునెక్కి
ప్రాణాలకు ముప్పు వచ్చునను, విషయం పక్కకెట్టి
వేగంగా మునుముందుకు, దూసుకుపోతూ ఉంటే
గాలిలోన ప్రాణాలు కలిసిపోతూ ఉన్నాయి
రోడ్డుపైన శవాలుగా, పడిపోతూ ఉన్నారు
బంధు జనులు గుండె పగిలి, రోదన చేస్తున్నారు
సెల్ఫోను చెవికెట్టక, మత్తులోన బైకెక్కక
రోడ్డు మధ్య అడ్డంగా వాహనాన్ని నిలబెట్టక
ప్రతి పౌరుడు విజ్ఞతతో, రోడ్డు నిబంధనలు పాటిస్తే
ప్రమాదాలు నిరోధించి, సురక్షితంగ ఉండవచ్చు

- వెలగల ప్రదీప్ శంకర్‌రెడ్డి
కొంకుదురు, బిక్కవోలు మండలం, తూ.గో.జిల్లా

మన గమ్యం - ఆత్మ సౌఖ్యం
బ్రతుకు నీ చేతిలో బంతి కాదు
నూతిలో విసిరేసి పారేయడానికి
సంతోషాల్లోనే జీవించే నైజం
విషాదంలో పారిపోయే నిజం
ఇక్కడ మారాల్సింది నీ హృదయమే కాదు
నీ ప్రతి కదలికలోని ‘ఉదయం’ కూడా
జీవితంలో ఓ సిపాయిలా పోరాడు
విజయం వెన్నంటి ఉంటుంది నీ శౌర్యంలా
పిడికెడు మట్టిగా మారాలనుకున్నప్పుడు
ఉడికెడి రక్తాన్ని మరిగించటం మానుకో
జీవన వనంలో ముళ్లూ, రాళ్లూ రెండు ఉంటాయి
తొలగించుకుని ముందుకు సాగు
గెలుపు నీ తలపాగా అవుతుంది
నీ ప్రక్కగా మారి నీ ప్రక్కనే ఉంటుంది
శోకంలో శ్లోకం పుట్టించిన వాల్మీకి
అక్షరాలను, శిల్పాలను చేసిన బ్రెయిలీ
అవయవాలే లేని అందాల హృదయాలెన్నో
నీకు నిలబెట్టి స్ఫూర్తినిస్తాయి
గాయాలెప్పుడూ గమ్యాన్ని నిర్దేశించాలి
సాయాలుగా మారి సంయమనాన్నివ్వాలి
కష్టానికే కష్టం కలిగి నినుమెచ్చి
ఇష్టంగా దూరం జరగాలి!
మన గమ్యం ఆత్మహత్య కాదు ఆత్మ సౌఖ్యం

-బిహెచ్‌వి రమాదేవి, సెల్: 94415 99321

ఆశిస్తున్నానమ్మా జననీ!
ఆశ చిగురించినయట్లు
కోరిన నెరవేరినయట్లు
మనసు స్వాంతన పొందినయట్లు
మది హర్షాన్ని వ్యక్తపరచినయట్లు
నేను ఆనందానుభూతి పొందినయట్లు
ఈ జగమంతా సంతోషం
తాండవించినయట్లు
ప్రజలంతా సుఖ సంతోషాలతో
తేలియాడినయట్లు
ఆశిస్తున్నానమ్మా జననీ!
కాంక్షిస్తున్నానమ్మా అవనీ!

- పంపన సాయిబాబు
వీరవాసరం
సెల్: 96528 01014

పుణ్య గోదావరి
గలగలా పారేటి గోదావరి తల్లి
ఎనలేము మనలేము నీదు జీవన నిరతి
గౌతమ మహాముని తపయోగ బలమున
హరహర మహాశివుని జడ నుండి విడివడి
గో ముఖాకృతి నుండి
బాహ్యముకు బయలెల్లి
గోదావరీ నదిగా విరాజిల్లు ఓ తల్లీ!!
త్రయంబకమున నీవు ఉద్భవించితివమ్మ
పాపికొండల నడుమ పయనాలు సాగించి
పరవసమ్మున నీవు పరవళ్లు తొక్కుతూ
సంగమించితివమ్మ సాగరుని వడిలోన
పదకొండు నదులకు జరిగేను పుష్కరము
పనె్నండు ఏండ్లకు ఒకసారి పండుగగ
నీకు మాత్రం జరగు అంత్యపుష్కరము
నీ తీరజనులకది ఏడాది సంబరము
కోర్కెలను తీర్చేటి కోటి లింగేశ్వరుడు
కొంగు బంగారమై నిలిచాడు నీ వడిన
బాధలను తీర్చేటి భద్రాద్రి రామయ్య
వెలసాడు నీ చెంత వొద్దికై ముద్దుగా
పచ్చనీ పైరుకు వెచ్చని ప్రాణమై
జీవ కోటికి నీవు జీవనాధారమై
మా పాప ఖర్మలను పరిహరింపగ నీవు
ఉభయ తీరములలో ఉరక లేసితివమ్మా
(గలగలా పారేటి గోదావరీ తల్లీ
ఎనలేము మనలేము నీదు జీవన నిరతి)

- ఆనాపు అప్పారావు, రాజమండ్రి
సెల్: 92471 82469

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.

email: merupurjy@andhrabhoomi.net

- కృష్ణ మాధవరపు