రాజమండ్రి

వినరా సుమతీ! ( కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డోర్ లోంచి పైకి రావాలి’ గట్టిగా అరిచాడు కండక్టర్ కిషోర్.
బస్సు వేగంగా పరుగులు తీస్తోంది... అంతకంటే వేగంగా టిక్కెట్లు ఇస్తున్నాడు.. బస్సు రష్‌గా ఉంది...
వెనక సీట్ల దగ్గర టికెట్లు ఇస్తున్న కిషోర్ మరోసారి అరిచాడు...
మెట్లమీద వేలాడుతున్న స్టూడెంట్లు పైకి వచ్చారు...
తృప్తిగా తలాడించి తన పనిలో నిమగ్నమైపోయాడు..
కాసేపటి తర్వాత చూస్తే కుర్రాళ్లు మళ్లీ మెట్ల మీదే కనిపించారు... జోకులేసుకుంటూ, నవ్వుకుంటూ, సెల్ ఆపరేట్ చేస్తూ నానా అల్లరి చేస్తున్నారు...
‘మెట్ల మీద ఉన్న వాళ్లు పైకి రండి’ మళ్లీ అరిచాడు కండక్టర్ కోపాన్ని నిగ్రహించుకుంటూ...
బలవంతంగా పైకివచ్చారు కుర్రాళ్లు...
కాసేపటికి టికెట్లు ఇవ్వటం ముగించి, సీటు దగ్గరకి వచ్చాడు.. కుర్రాళ్లు మళ్లీ ఫుట్‌బోర్డు మీదే నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు...
‘పైకి రండి అబ్బాయిలూ’ ఫుట్ ప్రయాణం ప్రమాదకరం’ అన్నాడు అసహనంగా..
ఈసారి అంగుళం కూడా కదల్లేదు.. కండక్టరు వైపు నిర్లక్ష్యంగా చూశారు... వెనకనుండి రకరకాల కూతలు ప్రారంభమయ్యాయి.
‘ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వినబడటంలేదా? లోపలికి రండి’ అన్నాడు గట్టిగా..
కుర్రాళ్లు హర్టయిపోయారు... ఉడుకు రక్తం ఉరకలేసింది..
‘ఏంటి కేకలేస్తున్నావు... ప్రయాణీకులతో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో తెలిసిందా’ విసురుగా అన్నాడో కుర్రాడు.
‘అంత మర్యాద తెలిసిన వారైతే ఒకసారి చెబితే వినాలిగా’ అన్నాడు కండక్టర్ తమాయించుకుంటూ...
‘మీకు స్టూడెంట్స్ అంటే లోకువ... పాసులని హీనంగా చూస్తారు... మీ కండక్టర్లంగా ఇంతే’ విరుచుకుపడ్డాడు మరో కుర్రాడు.
కండక్టర్ ఏదో అనేంతలో మరో కుర్రాడు దూసుకొచ్చాడు...
‘నెల రోజుల ఛార్జీలు మేం ముందే కడుతున్నాం... మేం బస్సెక్కకపోతే మీకు జీతాలుండవు’ అన్నాడు బెదిరిస్తున్నట్టుగా.
‘ప్రయాణీకులే దేవుళ్లు తెలుసుకో... స్టూడెంట్స్‌తో పెట్టుకుంటే ఉద్యోగం ఊడుతుంది ఖబడ్దార్’ హెచ్చరించాడు మరో కుర్రాడు.
నాలుగువైపుల నుండి ఒక్కసారిగా దాడిచేయడంతో బిక్కచచ్చిపోయాడు కండక్టర్ కిషోర్.. నిస్సహాయంగా బస్సంతా కలయచూశాడు... కానీ ఎవరూ పట్టించుకోలేదు.. వీళ్లనెలా కంట్రోల్ చేయాలా అని ఆలోచిస్తుండగా ఒక ఐడియా వచ్చింది...
వచ్చే స్టేజిలో రోడ్డు పక్కనే ఉంది పోలీసు స్టేషన్, బస్సును ఆపి అక్కడ కంప్లయింట్ ఇస్తే వీళ్ల తిక్క వాళ్లే కుదురుస్తారు’ అని అలోచించాడు.. కానీ పోలీసులు చర్య తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుందేమోనని సంకోచించాడు...
కండక్టరు వౌనాన్ని చేతకానితనంగా తీసుకున్న కుర్రాళ్లు మరింతగా రెచ్చిపోయి ఏడిపించడం మొదలుపెట్టారు...
పక్క సీట్లో కూర్చున్న బుర్ర మీసాలాయన్ని చూసి ధైర్యం తెచ్చుకున్న కండక్టర్ ‘చూశారా సార్... పైకి జరగమన్న పాపానికి ఎలా యాగీ చేస్తున్నారో... వాళ్ల మంచికేగా నేను చెబుతున్నాను’ అన్నాడు దీనంగా...
బుర్ర మీసాలాయన భుజం మీద కండువా ఓసారి దులిపి, మళ్లీ వేసుకుని మీసాలనోసారి సవరించాడు... ‘చూస్తున్నానయ్యా నీ యవ్వారం.. నోరేసుకు పడుతున్నావు పిల్లల మీద.. పడితారు, జారిపోతారు, యాక్సిడెంట్లు అయిపోతాయని శాపనార్ధాలు పెడుతున్నావు... ఆ మాత్రం ఓపిక లేనివాడికి కండక్టర్ ఉద్యోగానికి ఎందుకొచ్చావ్... అన్నాడు చులకనగా చూస్తూ...
మరింత బిత్తరపోయాడు కండక్టర్ కిషోర్... ‘అదేంటి సార్.. పెద్దవారు మీరైనా పిల్లల్ని మందలిస్తారనుకుంటే వారికి వంతపాడుతున్నారు’ అన్నాడు...
బుర్రమీసాలాయన కులాసాగా ‘చేస్తారయ్యా! కుర్రాళ్లన్నాక అల్లరి చేస్తారు.. ఆట పట్టిస్తారు... ఆ వయసలాంటిది... ఇప్పుడు చేయకపోతే నా వయసొచ్చాక చేస్తారా? కండక్టర్‌కి సహనముండాలి’ అన్నాడు తేలిగ్గా... బస్సులోని ప్రయాణీకులు చోద్యం చూశారే తప్ప ఎవరూ కలగజేసుకోలేదు...
బస్సు సాగిపోతోంది... కండక్టర్ వేదన అరణ్యరోదనైంది...
దేవుడిపై భారంవేసి, తన పని తాను చేసుకుపోతున్నాడు... డోర్‌లో స్టూడెంట్స్ ఇంకా పేట్రేగిపోతున్నారు... బస్సు వేగంగా పరిగెడుతోంది...
కొంత దూరం పోయేసరికి, రోడ్డుప్రక్కన మేస్తున్న పంది ఒకటి హఠాత్తుగా రోడ్డు మీదికి వచ్చేసింది...
అకస్మాత్తుగా జరిగిన సంఘటనకి డ్రైవర్ కంగారుగా సడన్ బ్రేకు వేశాడు..
బస్సులోని జనమంతా తూలి ఒక్కసారిగా ముందుకుపడ్డారు... మెట్లమీది కుర్రాళ్లంతా అదుపుతప్పి రోడ్డుమీద పడిపోయారు.. బస్సులో హాహాకారాలు చెలరేగాయి... స్టూడెంట్స్‌కి దెబ్బలు తగిలాయి, ఒక కుర్రాడికి కాలు విరిగిపోయింది...
కండక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే ఓ టక్ అండ్ టై శాల్తీ అరిచింది... ‘కుర్రాళ్లని అదుపుచేయలేని నువ్వేం కండక్టరువయ్యా... నువ్వు గట్టిగా అరిస్తే వాళ్లు పైకొచ్చి ఉండేవాళ్లు... ఈ ప్రమాదం జరిగుండేది కాదు... కేవలం నీ చేతకానితనం ఇది’ అని విరుచుకుపడ్డాడు...
కండక్టర్ నిర్వికారంగా చూస్తూ తన పని తాను చేసుకుపోయాడు...
‘తనకి కొద్దిగా సపోర్టు చేసివుంటే కుర్రాళ్లు కదిలేవారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే... తప్పు చేయడం ఎంత తప్పో, తప్పుని తప్పు అని ఖండించకపోవడం కూడా తప్పే... పైగా ఇతరుల మీద తోసెయ్యటం తప్పున్నర తప్పు’ విరక్తిగా నవ్వుకుంటూ బుర్ర మీసాలాయన వైపు చూశాడు.. తేలు కుట్టిన దొంగలా కిమ్మనకుండా ఎటో చూస్తున్నాడు...
మర్నాడు అసమర్థుడైన కండక్టరుని, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌ని సస్పెండ్ చేశారు అధికారులు.

-కౌలూరి ప్రసాదరావు
వేళ్లచింతలగూడెం (పోస్టు)
గోపాలపురం మండలం, ప.గో.జిల్లా
సెల్-73829 07677

జనవాక్యం
ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

ఎయిడ్స్ మహమ్మారి వైద్య ఆరోగ్యశాఖ పరిధి దాటి నేడొక సామాజిక సమస్యగా ముందుకొచ్చింది. సంవత్సరాల క్రితం అమెరికా, ఫ్రాన్స్‌లలో అక్కడక్కడా బయటపడిన ఈ భయంకర వ్యాధి అనతికాలంలోనే ఆఫ్రికా, ఆసియా దేశాలకు చాపకింద నీరులా పాకింది. ఎయిడ్స్ వ్యాధిని మొదట 1981లో అమెరికాలో కనుగొన్నారు. 1986లో మొదటి ఎయిడ్స్ కేసును భారతదేశంలో గుర్తించారు. పాశ్చాత్య దేశాల నుండి ఎయిడ్‌తోపాటు ఎయిడ్స్ కూడా దిగుమతి అయ్యింది. హెచ్‌ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్. మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను క్షీణింప జేసే సూక్ష్మ క్రిమి ఇది. ఈ క్రిమి బయట వాతావరణంలో కొద్ది నిమిషాలకు మించి బ్రతకలేదు. ఈ వైరస్ అత్యంత బలహీనమైనది. అయితే మానవ శరీరంలో ప్రవేశించిన తరువాత విజృంభిస్తుంది. మానవ శరీరంలో ప్రవేశించిన తరువాత ఈ వైరస్‌ను నాశనం చేయలేము. శరీరంలో తనకు అనుకూలంగా ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుంది. అందువల్ల వైద్య శాస్త్రానికి అంతుపట్టని సమస్య అయినది. ప్రతి మనిషిలోను ఈ వైరస్ ఉంటుంది. పరిస్థితులు అనుకూలించినపుడు బయటకు వస్తుంది. 80 శాతం యువతకు అసలు ఎయిడ్స్ గురించి తెలియదు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. అంటించుకునే వ్యాధి. ఒకే భర్తకు ఒకే భార్య కలిగి ఉండాలి. ఇతరులతో లైంగిక సంబంధాల వల్ల ఎయిడ్స్ వ్యాపిస్తుంది. ఎయిడ్స్ రోగులు తమ వ్యాధి గురించి బయటకు వెల్లడించకుండా వౌనం మహించినట్లయితే వారికి మరణం తప్పదు. విద్యకు నోచుకోని వారు, శారీరక పరిశుభ్రతపై, ఆరోగ్యంపై సరైన అవగాహన లేని వారు, ఆర్థిక భద్రతలేని ప్రజలే ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధికి గురవుతున్నారు. ఎయిడ్స్‌పై నోరు విప్పకపోవడం వల్లనే ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేక పోతున్నారు. దాని విస్తరణను ఎలా అరికట్టాలనే అంశాలను ప్రజలు తెలుసుకొనక సంఘ బహిష్కృతులై అనాథ ప్రేతాల్లా మారుతున్నారు. చాలా మంది సెక్స్ అనేసరికి సిగ్గుపడటం, సెక్స్ విషయాలు చర్చించడం మానివేసి గుప్తంగా ఉంచడం వల్ల ఎయిడ్స్ వ్యాధి ఒకరి నుండి ఒకరికి సంక్రమించే పరిస్థితి ఉంది. కండోమ్స్ వాడటంలో సిగ్గుపడటం, వాటి వాడకాన్ని తెలుసుకోలేక పోవడం, ఒకరికొకరు చెప్పుకోకపోవడం వల్ల చాలా మంది ఎయిడ్స్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎయిడ్స్‌పై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలి. అప్పుడే దానిని అరికట్టడానికి అది సోకిన వారిని ఆదరించడం సాధ్యపడుతుంది. ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి ఇప్పుడు ఉన్న మందులు నివారణకు కాదు. కేవలం వ్యాధి తీవ్రత తగ్గించడం, జీవితకాలాన్ని పెంచడం మాత్రమే చేయగలుగుతాయి.
జీవితంలో క్రమశిక్షణను అలవాటు చేసుకోవడమే ఎయిడ్స్‌కు తగిన మందు. రోగులు హాస్పిటల్‌కు వెళ్లేటప్పుడు కొత్త సూది కొని తీసుకువెళ్లాలి. డిస్పోజబుల్ సిరంజిలను వాడాలి. సొంత రేజర్లు వినియోగించాలి. నివారణ తప్ప నిర్మూలనకు అవకాశం లేదు. అక్రమ సెక్స్ పట్ల అప్రమత్తంగా ఉండి కండోమ్‌లను, ఇతర గర్భ నిరోధక పరికరాలను వాడి ఎయిడ్స్‌కు దూరంగా ఉండాలి. పరీక్ష చేసి హెచ్‌ఐవి వైరస్ లేదని నిర్ధారించిన తర్వాతనే వేరొకరి రక్తం శరీరంలోకి ఎక్కించుకోవాలి. మానవ మేధస్సుకు సవాలుగా మారిన ఎయిడ్స్ మహమ్మారి అన్ని ప్రాంతాలలో విలయ తాండవం చేస్తోంది. ప్రపంచంలో సకల ప్రదేశాలను చుట్టబెట్టి వికట్టాట్టహాసం చేస్తున్నది. ఎయిడ్స్ రోగులు తమకు భవిష్యత్తు లేదని, మరణమే శరణ్యమని తెలిసి జీవించాలంటే ఎంతో మానసిక స్థైర్యం కావాలి. అందువల్ల ఎయిడ్స్‌పై మనసు విప్పి మాట్లాడుదాం. అవగాహన పెంచుకుందాం. ఎయిడ్స్ లేని సమాజాన్ని స్థాపిద్దాం.

- పంపన సాయిబాబు
వీరవాసరం
సెల్: 96528 01014

మనోగీతికలు

గుండెల్లో తుఫాన్
మట్టిని
నమ్ముకుని బతుకుతున్న
బడుగు రైతు
గుండెల్లో తుఫాను
వానలు రాకతో
కోతకొచ్చిన పంట మట్టిపాలు
కలసిరాని కాలంలో
రైతుల కన్నీళ్లు
పెట్టుబడిక
సున్నా
మళ్లీ నులక మంచం మీద
ఆకలి
నిద్రపోతోంది
విధి వక్రించిన వేళ
విషాదం జీవితం
అన్నదాతకు అన్నం లేదు
గుండెలో
పచ్చదనం చీకటైంది
ప్రకృతి
పగబట్టి కెరటంలా
జలఖడ్గం కాలం చీకటితో
పచ్చని దీపాన్ని
గాలిదుమారంలో
నిశ్శబ్దంగా ఆర్పేసింది
గత అప్పుల చీకటి తడారనే లేదు
ప్రకృతి నగ్నంగా రైతును
నడిపిస్తోంది
కాలం సాక్షిగా...

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం

నేటి రైతు
పల్లె లోపల పచ్చదనమే
పైరున పంటల వెచ్చదనమే
హలము తోడుగ నిలిచి చూడగ
ఎంత గొప్పది రైతుల మార్గం

అప్పు చేసేను అరక దునె్నను
పురుగు పట్టగ మందు చల్లెను
పురుగు చావక మొక్క మాడెను
ఏమి చోద్యము చూడు నరుడా

విత్తు నాటెను వింత చూడగ
మొక్క మొలిచెను మోడు కాగా
మదిన పూచిన పూవులన్నియు
నేల రాలెను వింత గొల్పగ

కంటి వెంబడి నీరు గారెను
గుండె యంతయు గాయ మాయెను
నడగ సాగెడి శక్తి పోయెను
బ్రతుకు బాటలు చీకటాయెను
పాడి పంటల మాట మాయం
బీడు బంజరు లెక్క ఖాయం
ఎదురు చూచిన కనుల చీకటి
పోవు మార్గము జాడ శూన్యము

చూడ చూడగా అంత రించెను
హాలి కుడనెడి హాయి మాటలు
మరిచి పోయెను లోకమంతయు
వౌనము మంత్రము కాగా

ఊరు లేదుర గూడు చెదిరెర
మెతుకు జాడలు చేయి జారెర
బతుకు గతుకులు నడక సాగదు
పాప మెవరిది? ఎవరి నడగను?

కాయ కష్టము కాళ్ళు చేతులు
గుడిసె లోపల బతుకు మంచము
తినెనొ లేదో ఎవరి కెరుకౌను
నిండు కుండగ ఉన్న జీవుడు!
(ముత్యాల సరం ఛందస్సులో)
చరవాణి - 92475 77501

- ఎస్.ఆర్.పృథ్వి, రాజమండ్రి

ప్రకృతికి ప్రణామం
సూర్యుని కిరణాల తాకిడికి
తారలతో సయ్యాటలాడిన
చంద్రుని రూపం నెమ్మదిగా
కరిగి కనుమరుగైంది!

వెలుగు సంతరించుకున్న నింగి
ధవళవస్త్రంలా తళతళ లాడింది
వివిధ వర్ణాల మేఘాలు విలాసినులవలె
ఒయారపు నడకలతో విహరిస్తున్నాయి!

భానుడి కౌగిట్లో బందీ అయేందుకు
సిద్ధమై తమకంగ నిరీక్షిస్తున్నాయి
అప్పుడే వికసించిన పూవుల పుప్పొడి
తాకిన నామది నందనమై పరిమళించింది!

రంగు రంగుల పక్షులు పోటీపడి ఎగురుతూ
ప్రకర్షంగ ఆకర్షిస్తూ డెందాన్ని అందగిస్తున్నాయి!
ఎటుగాంచిన ఆహ్లాదం హాయి గొల్పుతుంటే
నా ఎద మనోజ్ఞ్భావాల మాధుర్యానికి నెలవైంది!

చల్లని సన్నని గాలుల శీతల స్పర్శ సోకి
నా చిత్తాన్ని చేస్తుంటే చవితం
కాళీ అయిన నా కళాత్మక హృదయాన్ని
అనుభూతుల పూర్ణం కోసం
ప్రకృతిలో మమేకమై చేస్తున్నాను ప్రణామం!

శరత్కాల సౌందర్య చమత్కృతి
వాడని ఎన్నడూ వీడని సుమ పరిమళాల స్మృతి!

- మల్లెమొగ్గల గోపాలరావు, 9885743834

భూమాత
ఎన్నాళ్ళుంటామో భూమాత వొళ్ళో
లిప్తకాలమైనా విశ్రాంతెరుగక
నిత్య బాలింతై సృష్టిని సృష్టిస్తూనే ఉంది

తనకు తానే సృష్టి, స్థితి
లయ కొరకు రాలవుతూ ఉంది

నవమాసాలూ మోసి రెక్కలొచ్చే వరకూ
సాకిన అమ్మను పూజిస్తామే
అలాంటి అమ్మల్ని కన్న అమ్మగదా
అయినా నేలతల్లినింకా మట్టిగానే చూస్తున్నాము

సన్మార్గుల్నీ దుర్మార్గుల్నీ ఆధునికుల్నీ
సనాతనుల్నీ అందరినీ
అంతెందుకు అండపిండ బ్రహ్మండాలనూ
విభేదాల్లేక ఆదరిస్తుంది కదా భూమాత

కానీ అతిసాధారణమైన జీవిగా
జన్మించిన మనిషి మాత్రం
కులమతాలను సృష్టించుకుంటూ
అహంకారంలో తన ఔన్నత్యానికి తానే పరవశిస్తూ
పెంచుకోవాల్సిన జ్ఞానానికి బదులు
అజ్ఞానపు అహంకారాన్ని పులుముకుని
ఎక్కడికి పోతున్నట్లు?

మతగ్రంథాల సారాన్ని నిరంతరం వింటూ
పరాయి మతాలపై చేసే యుద్ధాలు
ఏ విజయాన్నందిస్తాయి
ప్రవహిస్తున్న రక్తపాతంతో
ఎవర్ని పునీతుల్ని చేస్తావు?

ఒక్కసారి నీ నుండి నువ్వు బైటికిరా
చుట్టూ ఉన్న ప్రకృతిని చూడు
ప్రతి జీవిలోనూ పరమాత్మ ప్రతిరూపం
దర్శనమిస్తుంది
నువ్వూ ఈ ప్రకృతిలో భాగమైనందుకు
మనల్ని నడిపించే అద్భుతశక్తికి ప్రణమిల్లు

ఒకడికి రాముడు, ఒకడికి అల్లా
మరొకడికి జీసస్, వేరొకడికి బుద్ధుడు..
ఈ అవధులు దాటి మనిషికి మనిషే
భగవంతుడని గ్రహించు

నీవనుభవిస్తున్న చీకటి
మనసుకు పట్టిన గ్రహణమే!

నీ విజయాలకూ పతనాలకూ కారణం
నీ మనసేనని గ్రహిస్తూ
హృదయ వాకిలిలో
జ్ఞాన జ్యోతులు వెలిగించుకో

ఆ వెలుగులో విచక్షణ తెలుసుకుని
మానవత నిండిన మనిషిగా మారు
మానవసేవలో తరించు
మనిషిగా జీవించు

- ర్యాలి వెంకటరావు. కాకినాడ, సెల్: 9059906973

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

email: merupurjy@andhrabhoomi.net

-కౌలూరి ప్రసాదరావు