విజయవాడ

కోరిక! (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రెండ్‌ని చూడటానికి వృద్ధాశ్రమానికి వెళ్లింది జానకి. అక్కడి ప్రశాంతత, సీనియర్ సిటిజన్స్‌తో కబుర్లు చెపుతుంటే కాలమే తెలియలేదు. ఇంటికి వచ్చాక భర్తతో అంది ‘నాకు కొన్నాళ్లు ఆ వృద్ధాశ్రమంలో వుండాలని వుందని’!
ఉలిక్కిపడ్డాడు రామారావు.
‘ఇదేం కోరిక? సీతాదేవి మళ్లీ వనాలకి వెళ్లి కొంతకాలం విహరించాలని వుందని రాముడిని కోరినట్లు’ అన్నాడు.
‘ఏం జరగనుంది? ఈ కోరిక జానకికి భవిష్యత్తులో’ ఆయన వేదనకి గురయ్యారు.
వారం తరువాత ఆఫీసులోనే హార్ట్‌ఎటాక్ వచ్చి వెళ్లిపోయారాయన.
కర్మకాండలకి వచ్చిన కొడుకు సొంత వూరికి బదిలీ చేయించుకున్నాడు. అత్తగారి పొడ నచ్చలేదు కోడలు అర్చనకి. పిల్లలు మాత్రం మామ్మ ప్రేమలో మునిగితేలేరు.
‘పిల్లలిద్దరూ మనకంటే మీ అమ్మనే ఎక్కువగా లైక్ చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు. మీ అమ్మని ఎక్కడికైనా పంపించేయండి. లేకుంటే నాకు మనశ్శాంతి లేదు’ అంది భర్తతో.
‘ఆశ్రమంలో నీ ఫ్రెండ్‌తో కలిసి వుంటే నీకు సంతోషంగా వుంటుంది కదమ్మా’ అని వృద్ధాశ్రమంలో చేర్పించేశాడు ఆనంద్. ఆ రాత్రి ‘నీ కోరిక తీరిందా జానకీ’ వేదనగా భర్త అడిగినట్లు అనిపించింది. డిసెంబర్ నెల చాలా చలి. ఒక్క బంగారు గాజు అమ్మి అందరికీ దుప్పట్లు, స్వెటర్లు కొంది. అందరికీ ఆత్మీయురాలైంది జానకి.

- చావలి సూర్యం, విజయవాడ.

పాపయశాస్ర్తికి నివాళి

కరుణశ్రీ కవిత్వం కమనీయ భావ మకరందం

(21న వర్ధంతి
సందర్భంగా..)
తన యెదయెల్ల మెత్తన, కృత ప్రతి పద్యము నంతకంటె మె
త్తన, తన శిష్యులన్న నెడదంగల ప్రేముడి చెప్పలేని మె
త్తన యని సాహితీపర వితానము పాపయ శాస్ర్తీ పేరునున్
మననము జేసికొంట మఱిమానదు గర్తపురిన్నినాళ్ళకున్
(‘ఆలోచనలు - అనుభూతులు’ గ్రంథంలోని పద్యం)
కరుణశ్రీ జంధ్యాల పాపయశాస్ర్తీ గారి ఖండ కావ్యం ఉదయశ్రీ నిజంగా ఆయన రచనల్లో ఒక మ్యాగ్నం ఓపస్. అందులోని ప్రతి కవితా ఖండిక కమ్మని రసార్ద్ర కవితా వీచిక. ఇక స్ర్తి పాత్రలైతే - అనసూయ గాని, సావిత్రి గాని, ఊర్మిళా కుమారి గాని - కుంతీకుమారి గాని - మఱి ఏదైనా - చిత్రీకరించిన తీరు అద్భుతం. ఉదాహరణకు ‘అనసూయే’ తీసుకుందాం.
‘గర్భము లేదు; కష్టపడి కన్నది లేదిక బారసాల సం
దర్భము లేదహో! పురిటి స్నానములున్ నడికట్లు లేవె! ఏ
స్వర్భువనాల నుండి దిగివచ్చిరి నీప్రణయాంక పీఠికీ
యర్భకులంతులేని జననాంతర పుణ్య తపః ఫలమ్ములై!’
‘గర్భము లేదు; ప్రసవ వేదన, కాన్పు బాధ పడలేదు; పురిటి స్నానాలు, నడికట్లు లాంటి బాదరబందీ అసలే లేదు; ఇంక బారసాల అనే దాని ఊసే లేదు’ అనటంలో నెలతప్పటం దగ్గర్నుంచి బిడ్డడి పుట్టుక, ఆ తరువాతి సందడి, హడావుడి, అప్పటి అమ్మలక్కల పరిభాషా పదాల వినికిడుల గలగలలు - ఇవన్నీ లేవంటూనే ఆయా పదాల ప్రయోగంతో అలాంటి రోజుల ఆహ్లాద సందర్భ భావస్ఫూర్తి యొక్క రుచులూరిస్తాడు కవి ఇక్కడ.
నీ ఒడికి ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఈ ‘అర్భకులు’ అంటాడు. ‘అర్భకులు’ అనటంలో ఉంది చమత్కారం. సాక్షాత్తు త్రిమూర్తులే అనసూయకు అర్భకులయిపోయారు. అర్భకుడు అంటే బాలుడు, పీలగా ఉన్నవాడు, దుర్బలుడు అని అర్థాలు. సాధారణంగా లోకంలో తన పిల్లవాడు ఎంత దృఢంగా ఉన్నా, దుండు ముక్కలా ఉన్నా ‘మావాడు అసలే అర్భకుడు’ అంటూ ఉంటుంది ప్రతి తల్లి. తల్లి ప్రేమ అలాంటిది. తన పిల్లవాడికి ‘దృష్టి’ తగలకుండా ఉండాలని కూడా కావచ్చు తల్లి ఉద్దేశం. ఇక్కడ అనసూయ మనసులోని మాతృభావాన్ని కవి తన మాటలలో అన్నాడు. అది - కరుణశ్రీ అనసూయ (పాత్ర)తో పొందిన తాదాత్మ్యము, ఆత్మీయత.
‘ఆదియు నంతమే ఎఱుగనట్టి మహా మహిమాఢ్యులైన బ్ర
హ్మాదులకుగ్గువెట్టి యొడియందిడి జోలలఁ బాడు పెద్ద ము
తె్తైదువ! ధన్యురాలవుగదమ్మ! త్వదుజ్జ్వల కీర్తి గీతికా
నాదము మ్రోగె స్వర్గ భువనమ్మున దైవతవౌని వీణపై’
‘బ్రహ్మాదులకే ఉగ్గు పోసి జోలపాట పాడే పెద్ద ముతె్తైదువా! నాగలోకంలో నారదుడు నీ కీర్తిని తన వీణమీద పలికిస్తున్నాడు’ అంటాడు కవి. ఇది త్రిమూర్తుల ఇల్లాళ్ళ మనస్సులు ఇంకా కుతకుతలాడేట్టు చేసే ప్రయత్న వాక్యం పరోక్షంగా. ఇలా జంధ్యాల వారు తన పద్య ధారలతో అంబాదులనే ఆటపట్టిస్తాడు ఈ ఖండికలో. ఇదొక ధ్వని శిల్పం.
‘అగ్గిని గల్పి మట్టు మరియాదలు పుణ్య పురాణ పూరుషుల్
ముగ్గురు సేయ వచ్చిన అమోఘపుటగ్ని పరీక్షలోపలన్
నెగ్గితివీవపూర్వములు నీ చరితమ్ములు సోక మేనులన్
గగ్గురుపాటు పుట్టినదిగా ముగురమ్మల కొక్క పెట్టునన్.
‘కొంగులు పట్టి ‘మా పసుపు-కుంకుమతో పతిభిక్ష బెట్టి మా
మంగళ సూత్రముల్ నిలుపుమం’చు సరస్వతి సర్వమంగళా
మంగళ దేవతల్ ప్రణత మస్తకలై పడియున్నవారు నీ
ముంగిటి ముందు నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్’
ఇలా రెండు పద్యాలలో గూడా వాళ్ళను ప్రస్తావించి పరోక్షంగా ఉడికిస్తూ, సాధ్వి అనసూయను మహోదాత్త పురాణయుగ పుణ్యమూర్తిగా మనముందు నిలబెడతాడు. కరుణశ్రీ సంప్రదాయ వాదపు పునాది మీద నిలచిన ఒక మానవతావాది.
‘అమ్మవైనావు చతురాస్య హరి హరులకు
అత్తవైతివి వాణీ రమాంబికలకు
ఘనతమై అత్తగారి పెత్తనము చూపి
క్రొత్త కోడండ్రనిక దిద్దుకోదమ్మ!’
అత్తగారి పెత్తనం చూపిస్తూ ఇక కొత్త కోడళ్ళను దిద్దుకుంటావు కదూ అంటూ చిఱునవ్వు లొలకబోస్తూ సతీ అనసూయకు సకారాత్మక ప్రశ్న (పాజిటివ్ కొశ్చన్) వేస్తారు పాపయశాస్ర్తీ. ఇలా పాత్రను ప్రశ్నించటం ఒక ముచ్చట, ఒక చమత్కారం, కవి ఆత్మీయతా ముద్ర. ఇక్కడ కొత్త కోడళ్ళు అనటం ఒక భావగంభీర పదప్రయోగం.
కొత్త కోడళ్ళు అంటే మామూలుగా కనిపించే అర్థం సరేసరి. ‘కొత్త రకమైన కోడళ్ళు’ అని ఒక విశిష్టార్థం. త్రిమూర్తులు అనసూయకు కన్నకొడుకులు కానేకాదు. కఠోర పరీక్షకు గురిచేసిన మాయదారి వేల్పులు. మరి వాళ్ళ భార్యలు కోడళ్ళు ఎలా అవుతారు?! అయితే మరో గడుసరి వేల్పులే కావాలి. కానీ కథాక్రమం ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కోడళ్ళే. ఎందుకంటే త్రిమూర్తులను తాను పసిబాబులుగా చేసి లాలించింది కనుక.
ఇది అనసూయ అనుకోకుండా జరిగిన సంఘటన. కనుక అలా చూసుకున్నా వాళ్ళు కొత్త కోడళ్ళే. అందుచేత ఈ ‘కొత్త కోడళ్ళు’ పదం ఒక చమత్కార పూర్వక విశిష్టార్థ సమాస పదం అవుతుంది.
‘మాతృప్రేమ పునీతవౌ సఫల దాంపత్యమ్ము నీ సొమ్ము; నీ
పాతివ్రత్యములోన అత్రి తపముల్ పండెన్; వియద్గంగకే
ఏతామెత్తెను నీ యశస్సులు; గుమాయించెన్ జగమ్మెల్ల నీ
యాతిథ్యమ్ము; నమస్సులమ్మ! అనసూయా! అత్రి సీమంతినీ!’
అసలు మాతృప్రేమ అనేదే మహత్తరమైనది, మహోదాత్తమైనది. అందునా జగదీశ్వరులకే అమ్మ అయి వాళ్ళను ఆలించి, లాలించి, పాలించటంతో అనసూయ మాతృప్రేమ అతిలోకతను, పవిత్రతను, ఉన్నతిని సంతరించుకున్నది. ఆమె పాతివ్రత్యం ద్వారా ఆమె పతియైన అత్రి మహామునికి త్రిమూర్తులను ప్రత్యక్షం చేయించుకోవాలనే తప్ఫఃలం కూడా వచ్చి ఒడిలో పడింది. ఆ దంపతుల యశోధార ఆకాశగంగకే ఏతామెత్తి పోసింది. గంగానదే డొల్లబోయింది అనసూయా దంపతుల కీర్తి సరశ్రీ్శముందు.
నారదుడికి ఇనుపరాళ్ళ గుగ్గిళ్ళ ఆతిథ్యం, ఆదిదేవులు ముగ్గురికీ అన్నాతిథ్యం - ఈ రెండు ఆతిథ్యాలు అఖిల జగత్తులోను ఆధ్యాత్మిక శక్తి సౌరభాలుగా వ్యాపించాయి.
అంత గొప్ప సతీత్వము సతీఅనసూయ ఆధ్యాత్మిక ధనం. ఆ దాంపత్యం ఒక అలంకారం అంటారు కరుణశ్రీ. పద్యంలోని ‘సొమ్ము’ అనే పలుకుకు ఉన్న ధనము, ఆభరణము అనే రెండు అర్థాల శే్లష వచోశిల్పంగా మెఱుస్తోంది ఇక్కడ.
‘ఏతామెత్తిపోయటం’ మరో తెలుగు జాతీయం; అందమైన మాటలో పొందికగా చెప్పటం చూస్తాం ఇక్కడ.
‘నమస్సులమ్మ అనసూయా! అత్రి సీమంతినీ!’ అంటూ వినమ్రతతో శిరసు వంచి నమస్కరిస్తాడు కవి చివరి వాక్యంలో. అసలు ‘నమ్’ అంటేనే కొంచెం వంగటం. ఆ ధాతువులోంచి వచ్చిందే నమస్సు - లేక - నమస్కారం. అందుకని ఈ నమస్సు అనే మాట సాభిప్రాయ ప్రకటన.
సీమంతిని అంటే పాపట గలది - స్ర్తి - అని అర్థం. ఇక్కడ అత్రి సీమంతిని అంటే అత్రి మహాముని భార్య అని సామాన్యార్థం.
అత్రియే సీమంతముగా (పాపటగా) కలది అని కూడా విశేషార్థంగా చెప్పుకోవాలి. పతివ్రతా స్ర్తికి మానసికంగా తన భర్తే తనకు పాపట, తనకు అలంకారం, తనకు సౌభాగ్యం, తనకు ‘శిరోధార్యం (తలమీదిది)’. అందుకనే ఇక్కడ అనసూయా మహాసాధ్విని ‘అత్రి సీమంతినీ!’ అంటూ సాభిప్రాయంగా సంబోధించారు కరుణశ్రీ.
ఇలా ఇంకా ఎన్నో ఎన్నో చాలాచాలా స్వచ్ఛ కవితా శిల్ప ప్రభాశ్రీలు ఈ పది పద్యాల కవితా ఖండికలో కళకళలాడుతూ తళతళలాడుతూ దర్శనమిస్తాయి విశే్లషిస్తూపోతే.
అందుకనే కరుణశ్రీ కవిత్వం కడు కమనీయం. ఆయన రచనలో, కనులలో అనసూయ దర్శనీయం.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం
చరవాణి : 9849779290

గుంటూరు జిల్లా
రచయితల సంఘం
సాహిత్య పురస్కారాల
విజేతలు
గుంటూరు జిల్లా రచయితల సంఘం ప్రతి యేటా ఇస్తున్న సాహిత్య పురస్కారాలు ఈ ఏడాది కవితా పురస్కారానికి గాను శ్రీ ఎంవి రామిరెడ్డి రచించిన ‘అరామరం’ కవితా సంపుటికి, కథా పురస్కారానికి గాను శ్రీ పివి సునీల్‌కుమార్ రచించిన ‘నీలవేణి’ కథా సంపుటికి లభించాయని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, కోసూరి రవికుమార్, కార్యదర్శి ఎస్‌ఎం సుభాని ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ పురస్కారాలను శిలాలోలిత, బండ్ల మాధవరావు, డా. నక్కా విజయరామరాజు, డా. సి భవానిదేవి, తదితరులు అందుకున్నారు. ఈ నెలాఖరులో గుంటూరులో జరగబోయే పురస్కార ప్రదానోత్సవ సభలో శ్రీ ఎంవి రామిరెడ్డి, శ్రీ సునీల్‌కుమార్‌లను చెరి రూ.5 వేల నగదు, జ్ఞాపికతో సత్కరించనున్నట్లు వారు తెలిపారు.

పుస్తక పరిచయం

కవిత్వం - చిత్రం సంయోగ పూజితం.. ‘వికల కూజితం’!
రచయిత : ఆత్మకూరి రామకృష్ణ
పుస్తకం వెల : రూ. 150/-
ప్రతులకు : ఆత్మకూరి రామకృష్ణ,
8-8/1-101,
ప్రణీత రెసిడెన్సీ,
పండిట్ నగర్, గుంటుపల్లి,
విజయవాడ - 521241.
చరవాణి : 9493405152

ప్రపంచ రికార్డుల ధారి, ప్రముఖ చిత్రకారులు ఆత్మకూరి రామకృష్ణగారు వెలువరించిన ‘కలరావాలు’ అనే కవితా సంపుటి, ‘తుఫాను రాత్రి’ అనే దీర్ఘ కవిత పుస్తకాలు మరువకముందే వారి కలం నుండి కాగితాలపై అక్షర దృశ్యమాలికలుగా కనువిందు చేసిన 44 కవితల సమాహారమే ‘వికల కూజితం’! చదువరులను ఉత్కంఠభరితంగా ఆసాంతం చదివించేదిగా వుంది. ఈ సంపుటిలో వారు ప్రస్తావించిన సామాజిక అంశాలు ఎనె్నన్నో. వాటిలో మచ్చుకు కొన్ని ఇక్కడ ఉదహరించాను. నింగి, నేల, గాలి, నీరు, నిప్పు సహజ ధోరణిలో ఈ లోకాన్ని శాసించిననాడే మనిషికి, సకల జీవరాసులకు మనుగడ. వాటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకుంటే ఎలా? సర్వజీవులు ప్రకృతికి సమానమే అనే అంశాన్ని చక్కగా వివరించారు ‘చెరిపెయ్ హద్దులు.. చేతనైతే’ కవితలో. ప్రకృతి ప్రసాదమైన చెట్లు, వాటి ఫలాలు కాలాలవారీగా మనిషికి సాయం చేస్తూనే వున్నాయి. అనవసరంగా చెట్లను నరకడం, వాటి పునరుత్పత్తిని అడ్డుకోవడం మనల్ని మనం నాశనం చేసుకోవడమే. రాబోయే కాలం నష్టదాయకంగా చేసుకోవద్దని, ప్రకృతిని ప్రేమించండి, లేకుంటే దాని అనర్థాలు ఎలా ఉంటాయో ‘పురిటి నొప్పులకాలం’ కవితలో హితవు పలికారు.
మట్టి, మనిషి మధ్య అనుబంధం, మానవీయ కోణాలు, అంతర్లీనంగా మనిషి మనుగడకు అవసరమైన అంశాలను హృద్యంగా ఆవిష్కరించారు. మనిషికి మనిషికి బంధాలు అనేకం. అవే మనిషిని నడిపిస్తుంటాయి. ఏ బంధము లేని మనిషి ఉండడేమో. అలాంటి బంధాల గురించి కవి ఆవిష్కరించిన పదబంధం ‘బంధమా.. బంధించుమా’ అనే కవిత వివరిస్తుంది. మట్టిని నమ్ముకొన్న రైతు దాన్ని అమ్ముకొని విశాలమైన పొలాన్ని అడుగులు, అంగుళాలలో చూసుకోవాల్సి రావడం అతని దురదృష్టం. పాలకుల నిర్లక్ష్యం, అతివృష్టి, అనావృష్టి వెరసి రైతు కనుమరుగయ్యే దుస్థితి. వారి వెతల కథలను చెప్పారు ‘నేలకు దూరమైన రైతు’ కవితలో. సమాజంలో వేళ్లూనుకొన్న ఆధునిక పోకడల పర్యవసానాన్ని, వాటిద్వారా యువత పోతున్న పెడ ధోరణులపై నిక్కచ్చిగా, నిర్మొహమాటంగానే చురకలు అంటించారు. ఆధునికత ముసుగులో అందివచ్చిన అంతర్జాల ఆధారిత వివిధ దృశ్య, శ్రవణ రూపాలతో పొద్దుపోనిస్తున్న యువత చదువు మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను తెలియజెపుతూ నేటి విద్యార్థి లోకం మీద ఆ బాధ్యత ఎంతైనా వుంది అని తేటతెల్లం చేసిన కవిత ‘చెప్పిరాని కష్టానికి మాటే మంత్రం’! జీవితపు మలిసంధ్య సమయాన సహకరించని శరీరం, సహనం వద్దనే మనసు మధ్య సంఘర్షణగా జీవుని మానసిక వేదనను అక్షరీకరించిన విధానం ‘చిలకా.. ఎగిరిపో’ కవితలో కన్పిస్తుంది. ‘కవిత రాయాలంటే పొందాలి మనసు ద్రవిత’ అంటాడో కవి. ఎన్నో కథలు, ఎనె్నన్నో వెతలు నిండిన ఈలోకంలో కవి కాంచని చోటే లేదు. కవి దర్శించని దార్శనికతకు లోటులేదు. ప్రతి వెత ఒక కవితే.. ప్రతి కథా ఒక కవితే.. ఓ మిత్రమా ఇవికాక మరే కవిత్వం రాయగలను.. అంటూ ఆర్ధ్రంగా ప్రశ్నించిన కవి హృదయం ‘కవినెరుగని కవిత్వం’ కవితలో కనిపిస్తుంది. తినడానికి తిండి, పడుకోటానికి జాగా లేని వీధి బతుకులు సాగించే అనాధల బతుకు వెతలను చెప్తూ ‘తనకే లేకుంటే తనవారికేం పెడతాడు’ అంటూ వేదనతో ప్రశ్నించారు.
విదేశీ వ్యాపారంతో విదేశీ విత్తనాలు, రసాయనాలు, రూపాయి విలువ తగ్గి స్వదేశీ మారకం విలువలు పతనం కావడం, వీటికి రైతు, అతని ఉత్పత్తులు కూడా మినహాయింపు కాదు. ఆరుగాలం పంట పండించే పనిలో వుండే రైతు అనావృష్టి, అతివృష్టికి తోడు విదేశీ విపణి కూడా కుంగదీసేదే! విదేశీ వస్తువులను బహిష్కరించడమే మార్గం అని ‘విదేశీ విపణిలో స్వదేశీ రైతు’ కవితలో వివరించాడు రామకృష్ణ. ‘ఊరు వదిలిన పల్లె పుత్రుడు నడిబజారున నిలిచిన దాసిపుత్రుడు.. కానరాని పచ్చదనం.. కరువుతో వెల్లబారుతున్న రైతు దీనగాథలు.. బక్కచిక్కిన పశువుల స్థితి’ని కళ్లకు కట్టినట్లు తెలిపారు. ‘కరవు సీమలు’ కవితలో కరవు కాటేస్తుంటే బతుకు జాడను వెతుక్కుంటూ వెళ్లే వలస జీవులు పడే కష్టం వర్ణనాతీతమని వివరించారు. ‘జీవన మజిలీలో వారి కష్టాలను తీర్చి పల్లె వైపు పంపే మనుషులు ఎవరు?’ అనడంలోనే పల్లెమీద ప్రేమను వ్యక్తపర్చింది వలస జీవులు కవిత. అతివృష్టి, అనావృష్టి.. ప్రకృతి ప్రకోపాలు.. నిర్లక్ష్య ప్రభుత్వాలు వీటన్నింటి మధ్య బతుకీడుస్తున్న రైతన్న వెతలను, ఊరిమీద ఆయనకున్న మమకారాన్ని ఈ కవితల్లో దర్శింపజేశారు. అవినీతి, దేశభక్తి, విశ్వజనీనత, ప్రేమతత్వం వంటి అంశాలపై కవిత్వీకరించిన విధానం వొడలు వుప్పొంగేలా స్ఫూర్తి రగిల్చింది. మతం, స్వార్థం, అవినీతి, వేర్పాటువాదం, రాజకీయాలు, ఆడపిల్లలపై అకృత్యాలు, భాషాభిమానం, లింగ వివక్ష, మానవీయ అంశాలపై కవితల్లో రామకృష్ణ లోతైన భావాలనే పలికించారు. కవిగారి ఆత్మావలోకనం వారి ప్రయత్న మూలాలను, సంకల్ప బలాన్ని, అవి నెరవేర్చుకోవడంలోని నేర్పుని తెలియచెప్పాయి. స్వతహాగా చెయ్యి తిరిగిన చిత్రకారుడు కనుక ఇందులో వాడిన చిత్రాలన్నీ భావయుక్తంగా, అర్థవంతంగా ఉండి పుస్తకానికి తేజాన్ని కలిగించాయి. సామెతలను వాడుకున్న తీరు, పదవిన్యాసం, భావ ప్రకటన, కొత్త పదాల సృష్టి, ఎత్తుగడలు, ముగింపులు, ముద్రణ.. అన్నీ ఉన్నత స్థాయిలో ఉండే చదువరిని మంచి పుస్తకం చదివాం అనే తృప్తినిస్తాయి. ఆత్మకూరి రామకృష్ణగారు మున్ముందు మరిన్ని పుస్తకాలు వెలువరించాలని ఆశిస్తూ, వారి సాహిత్య ప్రస్థానం దేదీప్యంగా వెలగాలని ఆకాంక్షిస్తూ వారికి వందనాలు.

- ఆచార్య మక్కెన శ్రీను,
విజయవాడ.
చరవాణి : 98852 19712

మనోగీతికలు

నాన్నకు ప్రేమతో..
బొమ్మై నన్నాడించే ఆనందం నాన్న
కథలు చెప్పి నిదురపుచ్చే కమ్మని ప్రేమ నాన్న
నను పాలించే మకుటం లేని మహారాజు నాన్న
కంటికి రెప్పలా నను కాచే కవచం నాన్న
ప్రణాళికతో నా జీవితాన్ని నిర్మించే నిర్మాత నాన్న
నా జీవితంలో వెలుగునింపే జ్యోతి నాన్న
ఓనమాలు దిద్దించిన గురువు నాన్న
తన చల్లని నీడనిచ్చే తరువు నాన్న
మెదడులో లక్ష్యాన్ని ముద్రించే శిక్షణ నాన్న
లక్ష్యసాధనకు దారిచూపే దైవం నాన్న
నీతిమాటలు నేర్పే పుస్తకం పుటలు నాన్న
సన్మార్గాన నను నడిపే గ్రంథం నాన్న
సంప్రదాయాలు నేర్పే సంస్కృతి నాన్న
జీవిత పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడు నాన్న
ఒప్పును సూచించే కూరిమి నాన్న
తప్పును మన్నించే ఓరిమి నాన్న
కళ్లలో ఆనందం నింపే చెలిమి నాన్న
కలతతో ఉంటే కన్నీటిని తుడిచే చేయి నాన్న
ఈ సృష్టిలో అపురూపమైన
నాన్న ప్రేమ అందించింది ఆ బ్రహ్మే
ఇంతటి రుణాన్ని
ఎన్ని జన్మలకూ తీర్చుకోలేను
నా తలరాతను రచించింది ఆ బ్రహ్మే!
- కట్టా శ్రావణి
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
చరవాణి : 9912450428

భావనలో.. బ్రహ్మ
నాన్న నువ్వు మళ్లీ రావాలి!
మనీకి తప్ప మనసుకు విలువివ్వని
అనుబంధాల బంధుగణాల మధ్య
నా మనసు తెలిసిన నువ్వు
నా కోసం మళ్లీ రావాలి!
సమయం నిన్ను చూసి తను సరిచేసుకుంటుంది
నిశ్శబ్దం నీ తోబుట్టువుగా మారింది
ఆధ్యాత్మికత మదినిండా ఉన్నా
అడ్డుపడే అనుబంధాలకు దాసోహం అన్నావు
బంధువులంటూ రాబంధులై
తరాల తరబడి నిను తింటున్నా
అప్పులతో నీ జీతాన్ని, మా జీవితాన్ని
పంచభక్ష్యాలుగా వడ్డించావు
దైవాన్ని మనసులో ఉంచుకో
పనినే దైవంగా భావించుకోమన్నావు
ఆడపిల్లలపై ప్రేమున్నా
నన్ను అదిలించిన సందర్భం లేదు
అప్పులతో కుటుంబాన్ని నడిపినా
అభాసుపాలు కానివ్వలేదు
అందరూ ఎదగమని చెప్పినా
మానసికానందానికి మించింది లేదన్నావు
చినిగిన లాగు, చొక్కాలతో స్కూల్ పిల్లల
నవ్వులు ననే్నడిపించిన జ్ఞాపకాల కంటే
అప్పుడప్పుడు జరుపుకునే పుట్టినరోజుకి
కొనిపించే మిఠాయి తీపిగుర్తులే నాకు గుర్తు
ఎందరు ఎన్నన్నా
మాట తూలని మహారాజువి
వౌనం వీడని రుషివి
నా బతుకు ప్రయాణంలో
మంచి నడక, నడత నువ్వు పెట్టిన భిక్షే
నేటి నా బతుకు బండి గతుకుల్లోపడి దొర్లుతున్నా
బతికేందుకు దారి, ఉండేందుకు నీడ
ఇవ్వలేదని ఏమూలో మనసు మూల్గినా
పంచెకట్టులో ప్రశాంతమైన నీ మోము
జీవన సమరంలో
అప్పుడప్పుడు మనసులో పుట్టే మంటకు
పై లేపనమైంది
ఈ నా జీవన సమరంలో
అప్పుడప్పుడు బతుకుతున్నా
మానసికంగా నిత్యం మరణిస్తుంటే
మరణించినా
మా బతుకు ప్రయాణంలోని
అనుభవాల్లో నిత్యం చిరంజీవివే!
మహారాజులా పుట్టావు,
మా కోసం బికారిలా చనిపోయావు
బంధువులెవ్వరేమన్నా
అందరిలో నువ్వు వెలకట్టలేని రూపానివి!
నా మనసు గుడి దేవుడివి!

- శ్రీరామం

అర్హత
ఇచ్చిన మాటపై
నిలబడలేను
ధర్మపథాన
నడువలేను
న్యాయాన్ని నిలువునా
పాతరేసి
అన్యాయాలతో
ద్రోహం చేసి
సత్యాన్నొదిలి
అసత్యాల ఊబిలో
కూరుకుపోయి
అసహనంతో
అడుగడుగునా
అల్లకల్లోలాల
అరాచకాలు
సృష్టించి
నేను, నాదనే
స్వార్థంతో
సంపద మత్తులో
నిండా మునిగి
నీ మార్గాన
నడవని నాకు
నిను స్మరించే
అర్హత
ఎక్కడుంది
ప్రభూ!

- ఎస్‌ఎం సుభాని,
గుంటూరు.
చరవాణి : 9490776184

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- చావలి సూర్యం