విశాఖపట్నం

గుణపాఠం! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ ఓ రోజు అడిగింది ‘‘ఉద్యోగం ఉందికదమ్మా మీ నాన్నగారు ఓ సంబంధం చూసారు. నువ్వు ఉ అంటే ఆ పెళ్లి చేసేస్తే కొంత బాధ్యత తగ్గుతుందని ఆయన ఉద్దేశ్యం’’
పావని ప్రభుత్వ శాఖలో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం చేస్తోంది. ఆఫీసులో అందరూ పావని అంటే ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే పావని ఆ విధంగానే తన సెక్షన్‌లో పని పెండింగ్ లేకుండా చేస్తుంది. తనకు తెలియని విషయాలు సూపరింటెండెంట్ గార్ని కాని తన కంటే పెద్దకేడరులో ఉన్నవాళ్లని కానీ అడిగి తెల్సుకుని మరీ పూర్తి చేసి నీట్‌గా ఫైలు తయారు చేసి సూపరింటెండెంట్ టేబుల్‌కు పంపేస్తుంది.
ఉద్యోగంలో చేరిన తరువాత తోటి ఉద్యోగులు కొన్ని మంచి విషయాలు ఆమెకు బోధపరిచారు. ఫైలు ముందు పేజీల్లో ఏముందో చదివి అర్థం చేసుకుంటే అప్పుడు కొత్తగా వచ్చిన టపాలను సులువుగా అటెండ్ కావచ్చని, ఆ విధంగా పని నేర్చుకుంటే తనపై ఎలాంటి ఆఫీసరు వచ్చినా, ఆఫీసరు హోదా వచ్చినా మంచి పేరు తెచ్చుకోవచ్చని చెప్పారు. నేర్చుకోవాలనే తపన ఉండాలిగాని రాని విద్యంటూ ఉండదని, పాడగా... పాడగా రాగం ఎలాగో అలానే చేయగా చేయగా పెర్‌ఫెక్షన్ వచ్చి ఆఫీసర్ల మన్ననలను పొందేది పావని.
ఎదిగిన పిల్ల ఉద్యోగం చేస్తున్నదైనా తల్లిదండ్రులకు బరువే అంటారు. తనక్కూడా మనసులో మరో భావం లేకపోవడంతో తల్లిదండ్రుల్ని కాదనడం ఎందుకని సరే నంది. పెళ్ళైన సంవత్సరం వరకూ తన జీతం నెల నెలా అమ్మా నాన్నలకే ఇవ్వాలని కండిషన్ పెట్టింది. ఆమాట చెప్పి ఒప్పిస్తే తనకేం అభ్యంతరం లేదని కచ్చితంగా అమ్మకు చెప్పింది.
ఉన్నంతలో బాగానే జరిగింది పెళ్లి. పావని అత్తగారు వేరింటి కాపురం పెట్టించారు. అత్తగారు టీచరుగా రిటైర్ అవ్వడంతో ఆమె పెన్షన్, భర్త జీతం కొంచెం తక్కువైనా సరే హాయిగా కాలం గడిచిపోతుండేది.
భర్త అనురాగం ప్రేమలతో పావని ఆనందం అంచులు చూస్తోంది. తను కోరకుండానే పావనికి ఏం నచ్చుతాయో ఊహించి చీరలు, వస్తువులు కొనిచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తు తుండేవాడు భర్త మూర్తి.
పావని నెల తప్పిందని తెలిసి అమ్మ నాన్న, అత్తగారు, భర్త అంతా ఎంతో అపురూపంగా చూసేవారు. నెలలు నిండి ఓ బాబుకి తల్లయింది.
బాబు చాలా హుషారుగా ఉండేవాడు. అత్తగారికి వాడే సర్వస్వం. వాడు ఆవిడికి నాన్నమ్మ హోదా నిచ్చాడని వాడితో వేగ లేకపోతున్నా ఇంటికి వారసుడని అమెకు మరీ మరీ ముద్దు. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతల ప్రమోషన్లు సంసారజీవితం గడిపే ప్రతి వ్యక్తికీ చెప్పనలవికాని ఆనందాన్నిస్తాయి అన్నది నిజం. అందుకే పెళ్లిళ్లల్లో దీవించేటప్పుడు సంవత్సరం తిరక్కుండా ‘నా చేతుల్లో ఓ మనవడ్నో, మనవరాలినో పెట్టాలి’ అని దీవిస్తుంటారు.
ఓ రోజు రాత్రి తనూ, భర్త మూర్తి ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటుండగా మూర్తికి ఫిట్స్ వచ్చింది. పావని అత్తగార్ని పిలిచింది. చాలా భయపడిపోయింది. అతనికి ఆ జబ్బుందని వాళ్లు తెలియనివ్వలేదు. అతను మెడిసిన్స్ వాడుతున్నాడని, ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని ఆ రోజు అవగాహనకు వచ్చింది. అతను భార్యాభర్తల సంబంధానికి దూరంగా ఉండాలని ఆరోజే డాక్టరు గారు తెలియజేసారు. ఆ రోజు నుంచి తను దృఢంగానే ఉండేది కానీ తనలో ఏదో పొందలేక పోతుందన్న బాధ. తన జీవితం అంతా వృథాగా గడిచిపోతుందన్న బాధ. జీవితం అంటే సెక్స్ ఒక్కటే కాదు. తను భర్తని తన మాటలతోనే మానసికంగా ఉత్సాహపరస్తుండాలి అనుకుంది.
ఆఫీసరుగారు పిలుస్తున్నారన్న మాటతో వెళ్లింది పావని. ఆఫీసరు రాఘవకు పావని అంటే చాలా ఇష్టం. ‘‘పావని గారూ! మిమ్మల్ని చూసిందగ్గర్నుంచీ మనిద్దరి మధ్య ఎన్నో జన్మల బంధం ఉందనిపిస్తోంది. మీతోడు నాక్కావాలన్పిస్తోంది. మీకూ నాకు చిన్నప్పట్నుంచీ పరిచయం ఉన్నట్లే అన్పిస్తూంటుంది. పావనీ! నా భార్య నా మాట వినదండి. తనలో రాక్షసత్వం తప్ప మానవత్వం ఏ కోశానా కన్పించదు. తనో మానసిక రోగి. తనతో నేను సుఖపడలేకపోతున్నాను’’ అన్నాడు.
భార్య వైపు నుంచి సుఖం ఉండటం లేదని చెప్తే ఆ సానుభూతితో ఎదుటి ఆడదాని మనసులో స్థానం సంపాదించొచ్చు అనుకుంటారు చాలా మంది మగాళ్లు. అవకాశం ఉన్నంత వరకూ జరగనిస్తారు. అక్కర్లేదనుకుంటే దూరం జరిగిపోతారు. తనకు తెలిసి ఎక్కువ మంది మగాళ్ళు అంతే.
అతని మాటలకు జవాబు చెప్పకుండా బయటికి వెళ్లిపోయింది పావని.
అయితే ఆమెలో అప్పుడే అలజడి మొదలయింది. తను కోల్పోతున్నది పొందే అవకాశమా ఇది? అనిపించేది. ఎటూ నిర్ణయించుకోలేకపోతుండేది.
అలా కొన్ని రోజులు గడిచాయి.
పిల్లాడు పెరుగుతున్నాడు కానీ పావని మనసు ఎప్పుడూ అశాంతిగా ఉండేది. ఉద్యోగంలో ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తోంది. మరీ డల్‌గా కనిపిస్తే అందరూ కారణాలు తెల్సుకోవాలనుకుంటారు.
అందుకే సాధ్యమైనంత వరకు పావని ఏదో ఒక పని కల్పించుకుని బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తుండేది.
ఆ రోజు తర్వాత రాఘవ మళ్లీ ఆమెని ఒంటరిగా తన ఛాంబర్‌లోకి పిలవలేదు.
దాంతో పావనికి అతను మంచివాడే అన్న భావన కలిగింది.
అతను మళ్లీ పిలిస్తే బాగుండును అనిపించింది.
ఒకసారి ఆ బ్రాంచ్ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ జరిగింది. అంతా సరదాగా, హుషారుగా ఎంజాయ్ చేశారు.
రాఘవ మాత్రం డల్‌గా కనిపించాడు.
‘అయ్యో పాపం’ అనిపించింది పావనికి. అతను భార్య వల్ల సుఖపడలేకపోతున్నాడని చెప్పాడు. భార్యాభర్తల బంధం సక్రమంగా లేకపోతే ఎవరైనా అలాగే ఉంటారేమో అనుకుంది.
తనే అతనితో మాట కలిపింది. పావని పలకరించగానే అప్పటి వరకు డల్‌గా ఉన్న రాఘవ హుషారుగా మాట్లాడాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. పార్టీ అయిన తర్వాత తన కారులో దింపేస్తానని అతనన్నాడు. పావని వద్దనలేదు.
మనసులోనే ఉందో, ఏకాంతమే అవకాశం కల్పించిందో కాని పావని ఆ రోజు రాఘవతో హద్దులు దాటింది.
అయితే అలా జరిగిన వెంటనే ఆమె తనని కమ్మిన ఏదో మైకపు ముసుగును ఛేదించుకుని బయటికి వచ్చింది.
‘ఎంత తప్పు చేశాను?’ అనుకుని ఆపాదమస్తకమూ కంపించిపోయింది.
పొరపాటు పనివలన తన మీద తనకే ఏవగింపు కలుగుతోంది. తనెందుకు చేసిందా పొరపాటు?
తను ఓడిపోయింది. తన భర్త, అత్తగారు, బాబు ఎవరూ ఆ సమయంలో గుర్తుకు రాలేదు. తను తప్పు చేసేసింది. ఎందుకు చేసిందా పని? ఎవరి మనసు వాళ్లకు కోర్టువంటిది, కాబట్టి నిలదీసుకుంది. రాఘవ తనని పూర్తిగా కన్విన్స్ చేసేసాడు.
ఈ మానసికమైన రంపపుకోత తను భరించలేదు. తానవాళ్లకి అన్యాయం చేయలేదు. తనకి పావని పేరు తగదు. అమ్మ నాన్న ముచ్చటపడి పెట్టినందుకైనా, ఆ పేరు పెట్టుకున్నందుకైనా తను పవిత్రంగా ఉండలేకపోయింది. రాఘవ తనని వదలడు. ఆ విషయం తనకి తెలుసు. అమాయకుడైన భర్తను మోసం చేసిన తను కులట కంటే అథమాథమం.
జరిగిన దారుణం తనని బ్రతక నవివ్వడంలేదు. తను మోసకారి. భర్తను, అత్తగార్ని మోసం చేస్తోందనే అలోచన ఇంట్లో వాళ్లతో తలఎత్తి మాట్లాడనివ్వటం లేదు. అత్తగారు తను ఆఫీసు నుంచి కష్టపడి వచ్చిందని కాఫీ తెచ్చి యిస్తే సిగ్గుతో మరింత కుంచించుకు పోతోంది.
ఏం చేయాలి?.... ఏం చేయాలి?? .... ఏం చేయాలి బుర్ర బాధుకుంది. అటు సుఖ పడలేకపోతోంది. ఇటు ఈ సిగ్గు భరించలేకపోతోంది.
తను తప్పు చేయడానికి పూర్తిగా తనే కారణమా? అనారోగ్యపు భర్తని కట్టబెట్టిన అమ్మా నాన్నలదా? అత్తగారిదా? భర్తదా? పెళ్ళి చేసేస్తే కొడుకు ఆరోగ్యం బాగుపడ్తుందనుకుని నిజం చెప్పని అత్తదా?
భర్త నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో శారీరక సుఖం ఒక్కటే ముఖ్యమనుకుని తాపత్రయపడిన తనదా? తప్పు ఎవరిదైనా తను మాత్రం ఇలాంటి పాపం చేయకూడదు.
ఇలా పావని మనసులో అగ్నిపర్వతాలు బద్ధలవుతూ బాధపడుతుండగా రాఘవ ఆమెతో మాట్లాడాలని, ఏకాంతంగా కలవాలని మళ్లీమళ్లీ ప్రయత్నించడం మొదలుపెట్టాడు.
పావనికి అది ఇష్టంలేదు. ఆ పాపపు బంధం మరి కొనసాగించాలని ఆమెకి అనిపించలేదు.
‘ఎలా ఈ సాలెగూడును వదిలించుకోవాలి’
ఆ ఆలోచన ఆమెని నిలువనీయడంలేదు.
‘ఎలా ఎలా ఎలా...?’
* * *
ఆ తర్వాత సంఘటనలు చకచకా జరిగిపోయాయి. పావనికి ఏక్సిడెంట్ జరిగింది. ఆమె లాంగ్‌లీవ్ పెట్టేసింది.
కొలీగ్స్ ఒకరిద్దరు ఆమెని చూడడానికి వెళ్లారు. అయితే ఆమె పాత అడ్రస్‌లో లేదని తెలిసింది. ఆమె ఎక్కడుందో ఎవరికీ అర్ధం కాలేదు.
అంతా ఆమె లీవ్ పూర్తయి తిరిగి జాయినవుతుందేమో అని చూడసాగారు.
సరిగ్గా అప్పుడే
బాస్ రాఘవకి హైదరాబాద్‌లోని హెడ్డ్ఫాస్ నుండి ఫోనొచ్చింది.
చేతివాటం ఉన్న రాఘవ దీంతో బెంబేలెత్తిపోయాడు.
భయం భయంగా హెడ్డ్ఫాసుకి వెళ్లాడు.
రీజనల్ డైరెక్టర్ కె.పి. లత అని రాసున్న ఛాంబర్ బయట వెయిట్ చేయసాగాడు.
కొద్దిసేపటికి అతనికి పిలుపొచ్చింది.
లోపలికి వెళ్లాడు.
అంతే షాక్ తిన్నాడు.
రీజనల్ డైరెక్టర్ ఎవరో కాదు పావనియే!
‘‘పావని’’ ఎగ్జయిట్‌మెంట్‌తో అన్నాడు.
‘‘సే పావని మేడం’’ సీరియస్‌గా అంది పావని.
అతను భయపడిపోయాడు.
‘‘వైజాగ్‌లోని బ్రాంచ్‌లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని కంప్లైంట్లు వస్తున్నాయి. ఇదే రిపీట్ అయితే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీ తీరు మార్చుకుని బ్రాంచ్‌ని లాభాలబాట పట్టించండి. నేను మూడు నెలలు టైమిస్తున్నాను. మూడు నెలల తర్వాత నేనే నేరుగా బ్రాంచ్‌కి వస్తాను. మార్పు కనిపించిందా వెల్ అండ్ గుడ్. లేదంటే తర్వాత మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు’’ అపరకాళిలా చెబుతున్న పావని మాటలకు గంగిరెద్దులా తలూపాడు రాఘవ.
‘‘నౌ యుకెన్ గో’’ అంది పావని.
రాఘవ బయటికి నడిచాడు.
* * *
‘‘మన బాస్ లంచాలు తీసుకోవడం మానేసాడట గదా’’ ఆఫీసు లంచవర్‌లో అన్నాడు సీనియర్ అసిస్టెంట్ సుబ్బారావు.
‘‘అవునట! గురుడికి హెడ్డ్ఫాసులో బాగా కోటింగ్ అయిందట. రీజనల్ మానేజర్‌గారు మనోడికి బాగా అక్షింతలు వేసారట’’ అన్నాడు రామారావు.
‘‘ఇంతకీ రీజనల్ మానేజర్ ఎవరో తెలుసా?’’
‘‘ఎవరట?’’
‘‘మన పావనియే’’
‘‘ఏమిటి మన దగ్గర పని చేసిన పావనా ఎవరో కె.పి. లతని విన్నాను?’’ అన్నాడు రామారావు.
‘‘కె.పి. లత అంటే కలువకొలను పావనీలత. మనకి పావనిగానే తెలుసు. ఆమె ఇక్కడ పని చేస్తుండగా ఏక్సిడెంట్ అయింది కదా. లాంగ్‌లీవ్ పెట్టింది. ఆ సమయంలోనే శ్రద్ధగా చదివి డిపార్ట్‌మెంటల్ టెస్టులన్నీ పాసై ఏకంగా హెడ్డ్ఫాసుకే రీజనల్ మానేజర్‌గా ఎంపికయింది’’
‘‘్భలేగుంది! ఆడవాళ్లు అలా అంచెలంచెలుగా ఎదగాలి. అప్పుడే నలుగురికీ ఆదర్శవంతంగా నిలుస్తారు’’ అన్నాడు రామారావు.
అవునన్నట్లు తలూపాడు సుబ్బారావు.

పుష్ప గుర్రాల, ఇస్మాయిల్‌కాలనీ,
రాజ్యలక్ష్మీ థియేటర్ దగ్గర,
విజయనగరం-2
సెల్ : 9949040924.

కథానిక

చిల్లర కావలెను
‘‘అయ్యా ధర్మం చెయ్యండి బాబూ ఆకలితో నకనకలాడుతున్నాను’’ అరుస్తున్నాడు వాడు.
‘‘పోవయ్యా! చిల్లర కోసం మేమే అడుక్కుంటుంటే మధ్యలో నీగోలేంటి’’ విసుక్కున్నాడు ఆసామి.
‘‘్ధర్మం చెయ్యండి బాబూ! మంచి మారాజులు’’ ముందుకెళుతూ అరుస్తున్నాడు వాడు.
ఊహూ! ఎవరూ ధర్మం చేయడంలేదు. అందరూ దర్జాగా ఉన్నారు కానీ అందరి ముఖాల్లో ఆందోళన, నైరాశ్యం, చిరాకు.
‘ఆ ప్రభువు ధర్మం చేస్తాడు’ అనుకుంటూ కారు దగ్గరున నిల్చున్న ఆసామి దగ్గరకెళ్లాడు.
‘‘్ధర్మం చెయ్యండి బాబూ’’ అంటూ అరిచాడు.
అతను ఎగాదిగా చూసి జేబులోంచి అయిదు వందల నోటు తీసి బొచ్చెలో వేశాడు. మరో నెల ముందు అయితే బిచ్చగాడు ఎగిరి గంతేసేవాడు. మురిసిపోయేవాడు. కానీ ఇప్పుడు అలా చెయ్యలేదు.
‘‘బాబూ ఈ అయిదు వందలు నేనేం చేసుకోను. నన్ను ఎగతాళి చేయడానికి మీరీ నోటిచ్చారు. ధర్మ ప్రభువులు మీరే ఈ నోటు ఉంచేసుకోండి. దీనివల్ల నాకు కష్టాలు తప్పితే నోటుకు చిల్లర రాదు’’ అంటూ ఆ నోటును తిరిగి ఇచ్చేసాడు.
కారు దగ్గర నుంచున్న ఆసామి ఆశ్చర్యపోయాడు.
‘ఈ నోటును ఇప్పటికి పది మందికి ఇచ్చాను. ఎవరూ తీసుకోవడంలేదు. కనీసం బిచ్చగాడు కూడా తీసుకోవడం లేదు. ఎంతటి మార్పు ఈ సమాజంలో’ అనుకున్నాడు.
తన దగ్గర ఏభైవేలు ఉన్నాయి. అన్నీ అయిదు వందల నోట్లే. బ్యాంకుల దగ్గర పెద్ద క్యూలు. ఎలా వీటిని వదిలించుకునేది అని గింజుకున్నాడు.
* * *
‘‘దొండకాయలు కిలో ఎంతయ్యా?’’ అడిగాడు ఆసామి బజార్లో.
‘‘రేటు సంగతి తర్వాత. ముందు మీ దగ్గర చిల్లరుందో లేదో చెప్పండి’’ అన్నాడు వ్యాపారి.
‘‘పాత అయిదు వందలు. కొత్త రెండు వేల నోటు ఉంది. ఏది కావాలి?’’
‘‘రెండూ వద్దు. సరిపడా చిల్లర ఇవండి. లేకపోతే వెళ్లిపోండి. అంతేగానీ కొత్తనోట్లు ఇచ్చి నన్ను భయపెట్టకండి సామీ’’
అది కాదయ్యా’’ ఏదో అనబోయాడు.
‘‘వద్దు సామీ నా దగ్గర చిల్లర లేదు. ఈ సరకులన్నీ అమ్ముడుపోవడం లేదు. ఆదాయం లేదు. కడుపు కాలిపోతోంది. ఏం చేస్తాను’’ ఏడుపు ముఖంతో అన్నాడు వ్యాపారి.
‘‘నా బాధ ఎవరికి చెప్పుకోనయ్యా! వందలు లేవు. వారం రోజుల నుండీ కూరలు లేవు. మా ఆవిడ ఇంట్లో కేకలు బయట మీరు కోతలు. ఏం చేస్తాం? డబ్బులుండి ఏమీ కొనలేకపోతున్నాను’’ నిట్టూర్చాడు ఆసామి.
* * *
‘ఐదు వందల నోటు తీసుకోబడదు- కొత్త రెండు వేలకి చిల్లర లేదు. చిల్లరతోనే లోపలికి రండి’ హోటల్ బయట బోర్డు చూసి ఆశ్చర్యపోయాడు కానిస్టేబుల్. జేబులో వందలు నిండుకున్నాయి. అయిదు వందలు ఆరు నోట్లు, రెండు వేల నోటు ఉన్నాయి. ఎవరూ తీసుకోవడంలేదు. ఏం ఖర్మరా బాబూ అనుకున్నాడు. ఆకలి కడుపుతో పట్టణమంతా తిరిగాడు. ఎవరూ వాటిని తీసుకోలేదు.
* * *
గ్రామానికి కలెక్టరుగారు వచ్చారు. సేకరించదలచిన భూములను పరిశీలించి వెనుదిరిగారు. చెప్పులు అరిగాయి. చుట్టూ జనం గాబరా పడ్డారు. ఒక గ్రామవాసిని కలెక్టర్‌గారి చెప్పులు పట్టుకుని, ముందుకెళ్లాడు. తప్పదు మరి. కలెక్టరుగారు ఉత్త కాలితో నడవసాగారు.
చెప్పులు కుట్టేవాడు రెండు చెప్పులు కుట్టేసాడు.
‘‘అయిదు వందల నోటుందయ్యా తీసుకుంటావా?’’ దర్పంగా అడిగాడు.
‘‘నాకెందుకు బాబయ్యా పది రూపాయలు ఇప్పించండి’’ వినయంగా అన్నాడు.
‘‘అవే లేవయ్యా’’ అంటూ ఎవరి దగ్గరైనా పది రూపాయలున్నాయా?’’ అడిగారు. ఎవరూ ముందుకు రాలేదు. తమ దగ్గరున్నది ఇచ్చేస్తే తమకెవరిస్తారని వాళ్ల బాధ. మరో సందర్భంలో అయితే ఇచ్చేవారే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా ఉంది.
‘‘పాపం వీడికి డబ్బులెలా ఇవ్వడమయ్యా’’
‘‘్ఫర్వాలేదు బాబయ్యా’’ వినయంగా అన్నాడు వాడు.
కలెక్టర్ బాధపడుతూ ముందుకు కదిలాడు. అంతా చిల్లర సమస్య. నా పరిస్థితే ఇలా ఉంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి?
ఆరోజు రాత్రి న్యూస్ చూస్తున్న కలెక్టర్‌గారికి ఓ వార్త నవ్వు తెప్పించింది. ఎక్కడా చిల్లర సమస్య లేదు. ప్రజలంతా హాయిగా ఉన్నారని బ్యాంకు అధికారులు, నాయకులు చెప్పుకుంటూ పోతున్నారు.

- మల్లారెడ్డి రామకృష్ణ,
బుడితి-532427.
శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 8985920620.

మనోగీతికలు

అమ్మా అమ్మా!
ఆప్తుల పాలిట సన్నిధివై
పేదల పాలిట మహా పెన్నిధివై
బతుకు బండి ఒడిదుడుకులకు లోనైనా
అందరూ ఉండి లేని దానివై నా అనేవారు కరవై
బతుకు దుర్భరమై
ఆప్యాయతానురాల లేమితో
ఎంత నిరాదరణకు గురియైనా
అందరూ నీవారనే భావనతో
మసలిన నీవు చరితార్థురాలివమ్మా
నీవు లేని లోటు సర్వజనావళి
జీవన స్రవంతికదో వెన్నుపోటు
బతుకు గతిలో చీకటి నిండినా
పేదల పాలిట వెలుగువై కిరణ్మయివై
శివునిలా గరళం నిండినా
జీవన మరణ సమస్యల లెక్కగొనక
అమృతం పంచి ఇచ్చే అమృతమయివమ్మా నీవు
భార్యగా, తల్లిగా స్థానం పొందకున్నా
అమ్మగా మారి అందరి మన్ననలనందావు
అమ్మగా ఎంతటి ఘనతనొందావు
సినీ రంగమందు కళకు అంకితమై
సాటి లేని మేటి నటిగా రాణించావు
రాజకీయ రణరంగమందు
దుష్టకీచక దుశ్శాసన
దుశ్చర్యలనధిగమించావు
పట్టుదలే వజ్రంలా వజ్రాయుధంలా
ఎనలేని ఆత్మస్థైర్యంతో
నిస్వార్ధంతో ఇడుమలెన్నో ఎదుర్కొని
నీ జీవితమే పణమొడ్డి
అందరి జీవనగమనంలో వెలుగులు నింపిన
ఎంతటి ఘన చరిత్ర నీదమ్మా
నీకు లేని సక్రమ జీవనగతిని అందరికీ అందించి
సఫలత నొందించి పేదల కడగండ్లు రూపుమాపి
భళిరా భళిరా! అమ్మా అని పిలిచే
పిలిపించే ఎంతటి త్యాగశీలివమ్మా
ఎంతటి దయ గల తల్లివమ్మా
వేనోళ్ల శ్లాఘించే
ధన్యచరితవమ్మా నీవు
ఎంతటి భవ్య చరితవమ్మా
దేవతలు తథాస్తు తథాస్తు అందురుగాక
నీజన్మ చరితార్థతనొందుగాక

- యలమంచిలి శివాజీ,
డోర్ నెంబర్ 6-26, పినగాడిరోడ్డు,
పెందుర్తి, విశాఖపట్నం-530047.

కూతురు
స్వాముల దీవెనలు, అనుగ్రహంతో
అమ్మాయి రూపంలో కలిగింది సత్సంతానం
ఆడపిల్ల మహలక్ష్మి అన్న నోళ్లే
తర్వాత గుండెలపై కుంపటి
ఎలా భరిస్తావు, ఎలా సాకుతావన్నాయి
బంధువులు, స్నేహితుల వచనాలు పక్కన పెట్టి
విద్యాబుద్ధులు నేర్పితే ఉన్నతి సాధించి
బతికుండగానే నరకం చూపే కొడుకుల కంటే
అంత్య దశలో జన్మనిచ్చిన కన్నవారిని ఆదుకుని
ముందు తరాలకి ఆదర్శంగా నిలిచింది
అందుకే కంటే కూతుర్నే కనాలి!

- జి. ఎస్.కె. సాయిబాబా, అనకాపల్లి.
సెల్ : 9248173116.

మధుర కవిత
ఊహల లాలనలో ఊగిసలాడెను
ఓ మధుర జ్ఞాపకం
కనుల కలల్లో తారసపడెను
ఓ మధుర దృశ్యం
పూల ఒడిలో తొణికిసలాడెను
తియ్యని మకరందం
ఆకాశవీధిలో మినుకు మినుకలాడెను
నక్షత్రకాంతులు
పేద రైతన్న మోములో
మిలమిల మెరిసెను అభివృద్ధి కాంతులు
ఆశావహ దృక్పథంతో
జరిగెను అంతా మేలు
జనజీవనంలో నిండెను కొత్తకాంతులు
పూబంతులు విరిసెను
చామంతులు విరిసెను
బాలల బోసినవ్వులు మురిపించెను

- మజ్జి పాపినాయుడు,
గడసాం, దత్తిరాజేరు,
విజయనగరం జిల్లా.
సెల్ : 9100475182.

కార్తీకమాసం
కన్నులకింపైన వనభోజన విహారం
హైందవ సంస్కృతికి నిదర్శనం
వివిధ రకాల మనస్థత్వాలు
విభిన్న రుచుల పదార్థాలు
కలసి మేలు చేసే సంగమ వేదిక
వన భోజన మహోత్సవం
మనసులో మలయమారుతం నింపి
ఆనందపు అంచులు చేరి
ఆనంద డోలికల్లో ఊరేగించే వినోద విహారం
పిల్లల ఆటపాటలు పెద్దల మనోభావాలు
కనె్నపిల్లల సోగకళ్ల సోయగాలు
కనులారా తిలకించే నవయవ్వన సుకుమారులు
అమ్మలక్కల ముచ్చట్లు
వయోభేదం మరచి ఆనందంగా ఆడే
పెద్దలు, పిల్లల అంత్యాక్షరి పాటల సరాగాలు
అందరికీ ఆనందం పంచి
కొత్తస్నేహితులతో చుట్టరికాలు కలిపే
మానసిక ఆనంద వేదిక కార్తీక వనభోజన మహోత్సవం

- వేగినూకరాజు,
38-25-20/2, గవరవీధి, బుచ్చిరాజుపాలెం,
విశాఖపట్నం-530 027.

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

పుష్ప గుర్రాల