రాజమండ్రి

పరమ గురువు-2 (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనె్నన్ని కలలు కన్నాను. చిన్నతనం నుండీ చాలా తెలివైన వాణ్ణని అందరూ పొగుడుతుంటే ఉబ్బితబ్బిబ్బు అయ్యేవాణ్ణి. నాన్న కష్టపడి అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ చదివించాడు. తనను ఇంజనీరుగా చూడాలన్న నాన్న కోరిక తీర్చడానికి హైదరాబాదు వెళ్లి చేసిన ఉద్యోగానే్వషణ తాను పేరుకు మాత్రమే ఇంజనీరునన్న సత్యాన్ని తెలియచేసింది. నాన్న మాట వినకుండా అనుభవంలేని డిపార్ట్‌మెంట్ స్టోరు వ్యాపారం చేసి, ఉన్న కొద్దిపాటి ఆస్తిని బ్యాంక్ తనఖా పాల్జేసి మొత్తం కుటుంబానే్న వీధినపడేశాను. ఏం సాధించాను? అక్కకి పెళ్లి చేయాలి. చెల్లెల్ని చదివించాలి. అప్పులు తీర్చలేక నాన్న పడే యాతన మనసును పిండేస్తోంది. కన్నీళ్లు కారకుండానే ఏడుస్తున్నాడు సుకుమార్. అతనిది ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి సన్నకారు రైతు. రెండెకరాల పొలం, చిన్న కూరగాయల వ్యాపారం. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేయాలి. పెద్దగా చదువుకోలేదు. రామన్న అని సంతకం చేయడం మాత్రం నేర్చుకున్నాడు. కొడుకును ఇంజనీరుగా చూడాలని ఆశపడ్డాడు. కాని పరిస్థితులు నిరాశే మిగిల్చాయి. రోజురోజుకీ నిరాశ, నిస్పృహలు ఆవరిస్తున్నాయి.
ఎప్పుడూ తనను పల్లెత్తుమాట అనని నాన్న ‘నువ్వు నష్టజాతకుడివిరా!’ అన్న మాటలు సుకుమార్‌ను వేధిస్తున్నాయి. అవును నేను నష్టజాతకుడినే! ఏం సాధించాను? పదేపదే అదే ప్రశ్న మనసును కకావికలు చేస్తోంది. అయ్రపత్నంగానే ఇంట్లోంచి బయటపడ్డాడు సుకుమార్. సమయం మధ్యాహ్నం పనె్నండు గంటలు కావస్తోంది. రాజమండ్రి వెళ్లే బస్సు ఎక్కాడు. కోరుకొండ నుండి నలభై నిమిషాల్లో వచ్చేసింది. మెల్లగా నడుచుకుంటూ గోదావరి రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి మీదకు చేరాడు. నాన్నకు చెప్పులు లేకపోయినా నాకు వేలుపోసి కొన్న షూస్, బట్టలు గుర్తుకు వస్తున్నాయి. దేవుడు ఎంత నిర్దయుడు. నేనేం పాపం చేసానని! అందుబాటులోనున్న చదువు చదివించాడు నాన్న. చదువు చెప్పిన కాలేజీది లోపమా? అసలు ఇంజనీరింగ్‌లో చేరడమే పొరబాటా? మస్తిష్కం తీవ్ర గందరగోళంలో పడింది. బ్రిడ్జి మధ్యకు చేరాడు. ఈ నష్టజాతకునికి ఈ భూమి మీద స్థానం లేదు. ఈ లోకాన్ని విడిచి వెళ్లడమే మార్గం అనుకుంటూ బ్రిడ్జి గోడ మీదుగా గోదావరిలోకి చూసాడు. ఒక్కసారి కళ్లు తిరిగాయి. ఆత్మహత్య చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలనిపించింది. ఆ ధైర్యాన్ని పరిస్థితులు కల్పిస్తాయేమో అనుకున్నాడు. ‘నువ్వు నష్టజాతకుడివిరా!’ నాన్న మాటలే రింగురింగుమని మ్రోగుతున్నాయి. ఇక ఆలోచనలకు స్వస్తి చెప్పి గోదావరిలోకి దూకబోయాడు సుకుమార్. ఒక్కసారిగా కళ్ల నుండి నీళ్లు జలజలా రాలి గోదావరిలో పడటం స్పష్టంగా కన్పించింది. బిందువులు గాలిలో కలిసి అనేక బిందువులుగా విడిపోయి గోదావరిలో కలసిపోయాయి. నా ప్రాణాలు కూడా అలాగే గాలిలో కలిసి గోదావరికి అంకితం అవుతాయనుకున్నాడు. మరలా దూకడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి కళ్ల ముందు కనపడ్డారు. దీనంగా తనకేసి చూస్తున్నట్టు అనిపించింది. కాళ్లు వెనక్కి తగ్గాయి. తన ప్రమేయం లేకుండానే బ్రిడ్జి మీద ప్రపంచం వాహనాల రూపంలో అటూ ఇటూ వేగంగా తిరుగుతూనే ఉంది. ఎవడి మానాన వాళ్లు ఉన్నారు. తనను ఎవరూ పట్టించుకున్నట్లు లేదు అనుకున్నాడు. చావడానికి గుండె దిటవు చేసుకోలేమా? అన్నీ మరిచిపోవడం చాలా కష్టంగా ఉంది. ‘నా సమస్యకి చావే పరిష్కారమా? అవును అంతకంటే ఏం చేయగలను? ఏమి చేయలేనా? మెదడు మొద్దుబారిపోతోంది. స్వర్గానికా దారి! నరకానికా! అన్నట్లు చూస్తోంది. తిరిగి బ్రిడ్జి గోడ దగ్గరకు చేరి గోదావరిలోకి తొంగిచూసాడు. ఈసారి రా.. రామ్మని... ఆహ్వానిస్తున్నట్లుంది గోదావరి గట్టిగా కళ్లు మూసుకున్నాడు. వళ్లంతా గాలిలో తేలిపోతున్నట్లుంది. భయమా? బాధా? అర్థంకాని పరిస్థితి. హఠాత్తుగా కళ్లు తెరిచాడు. పోయేముందు ఒక్కసారి నన్ను పుట్టించి నట్టేట ముంచిన ఆ కనపడని దేవుణ్ణి కనీసం చనిపోయిన తరవాతైనా స్వర్గానికి పంపమని ప్రార్థించాడు. సమయం రెండు గంటలు దాటుతోంది. హఠాత్తుగా మబ్బులు ఆవరించాయి. సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా బ్రిడ్జి గోడ పక్కన కూలబడ్డాడు. ఎవర్ని ప్రార్థించాడో తెలియదు. అసలు ప్రార్థనో కాదో తెలియని పరిస్థితి. కళ్లు గట్టిగా మూసుకుని తిరిగి లేవడానికి ప్రయత్నించాడు. వర్షం పెరిగింది. లేచి బ్రిడ్జి గోడ పక్కన ఉన్న చిన్న మెట్టుపైకెక్కాడు. హఠాత్తుగా పెద్ద శబ్దం. వెనక్కు తిరిగాడు. ఒక వ్యాను టైరు పంచరయి మెల్లగా ఆగింది. అది ఇస్కాన్ వారి ప్రచార రథం. డ్రైవరు మైకును ఆపకుండా వ్యాన్ దిగి టైరును పరిశీలిస్తున్నాడు. మైకుల్లో భగవద్గీత చాలా శ్రావ్యంగా వినపడుతోంది. శ్రీశ్రీశ్రీ ప్రభుపాదులవారి వ్యాఖ్యానానికి విశే్లషణ చేస్తున్నారు ఇస్కాన్ స్వామి. ‘సాంఖ్య యోగం’లోని ముఖ్యమైన శ్లోకమిది.
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః
అనాశినో ఒప్రమేయస్య తస్మాద్యుద్ధ్య స్వభారత!
అర్జునా! శరీరి... ఆత్మ అది నిత్యము. దానికి నాశనం లేదు. అది ఏ ప్రమాణాన్ని ఆపేక్షించనది. ఆ శరీరి యొక్క ఈ భౌతిక శరీరం అంతమయ్యేది కనుక యుద్ధం చేయి. భగవంతుడు ఈ శరీరమిచ్చింది ధైర్యంతో జీవిత యుద్ధం చేయడానికి తప్ప పిరికివానిలా పారిపోవడానికి కాదు. యుద్ధం నుండి పారిపోవడమంటే అది ఆత్మహత్యా సృదృశ్యమే! ఆత్మహత్య మహాపాపం. అది నిన్ను నరకానికి తీసుకువెడుతుంది. మరలా అనేక జన్మలు ఎత్తి కష్టాలు అనుభవించవలసిందే! అందుకే యుద్ధం చేయి! యుద్ధం చేయి!’ సుకుమార్ చెవుల్లో జీవిత యుద్ధం చేయి! జీవిత యుద్ధం చేయి అని మారుమ్రోగుతోంది. తాను ఎవర్ని ప్రార్థించాడో తెలిసింది. తాను పరమగురువును ప్రార్థించాడు. అంతవరకూ తనలో జరుగుతున్న అంతర్యుద్ధంలో పరమగురువైన భగవద్గీత తనకే విజయాన్ని చేకూర్చాడు అనిపించింది.
జేబులోంచి సెల్‌తీసి నాన్నకు రింగ్ చేశాడు. ‘అర్జంటు పనిమీద రాజమండ్రి వచ్చాను నాన్నా! సాయంకాలానికి వచ్చేస్తాను. నిన్న మావయ్య లోను పెట్టి గేదెలు కొందామన్నాడు కదా! కొందాం నాన్నా! రేపు నేను వస్తున్నానని మావయ్యకు చెప్పండి నాన్నా!’ అంటూ ఫోన్ ఆఫ్ చేసి ఇస్కాన్ ప్రచార రథం పైనున్న కృష్ణ్భగవానుని అభయహస్తంకేసి చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని టైరు మారుస్తున్న డ్రైవర్‌కి సహాయం చేయసాగాడు సుకుమార్.

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
సీతంపేట, రాజమహేంద్రవరం
చరవాణి: 9491171327

మనోగీతికలు

మట్టి శిఖరం
మట్టిని నమ్ముకొని
బ్రతికే ఊపిరి
అప్పుల ఊబిలో మునిగిపోయింది
కాలం నిప్పులకుండ మంటలో
పంట పండక
చినుకు పడక
జీవితం చిరిగిపోయింది కాగితంలా
అన్నదాత గుండె మంట
ఆక్రందన నడుమ
ఆకలికేకలు
నులక మంచం మీద
నిరాశ దుప్పటి చిరిగిపోయింది
కల్తీ విత్తనాలు
కల్తీ ఎరువులూ
కలలన్నీ కల్తీలే
లెక్కలులేని విహంగంలా
ఒంటరి బ్రతుకు అశ్రుకణాల్ని రాల్చుతుంది
కాలం వేళ్ల సందుల్లోంచి
ధాన్యం రాలిపోతోంది
మట్టిని ప్రేమించిన రైతుకు
కన్నీళ్లు వెలుగుతున్నాయ్
జనం కడుపులు నింపాలని
క్షణక్షణం మట్టితో
యుద్ధం చేసే సైనికుడు రైతు
బ్రతుకులో మట్టిలో
ఓడిపోయాడు
చెమట సాక్షిగా
మట్టి శిఖరం కూలిపోయింది
నిశ్శబ్దంగా
పొలం గట్టు కంటతడి పెట్టింది
ఆకాశంలో పక్షి
వౌనం పాటించింది

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, సెల్: 9247577501

ఊరట మార్గాలు
కలల సామ్రాజ్యంలో
నయన తారలు పరిభ్రమిస్తున్న వేళ
వయసు తాపాన్ని
మనసు వౌనంగా విలపిస్తున్నప్పుడు
కలుగుతుంది మధుర భావన
రగులుతుంది మనోవేదన.

పరువాల వరం తెచ్చుకున్న కాలం
గమ్మత్తు ఊహలతో
గుండెల్ని గుసగుసలాడిస్తుంది
స్వచ్ఛతా పరిష్వంగంలో
కాంక్షా స్వప్నాలు జ్వలిస్తుంటాయి
ఆదరంగా ఆలోచనల్ని ఆహ్వానించి
స్వప్న లోకాల్లోకి..స్వాగతిస్తాయి.

వేగిర పరిచిన తీపి తలపులు
తేనే పలుకులై వేదన తీరుస్తాయి
అవి మంత్ర ముగ్థమై మైమరిపిస్తాయి
ఉద్వేగాలు చల్లపరిచి
ఊరట మార్గాలు అనే్వషింపజేస్తాయి.

- అనంత్, 96424 89244

ఎదగడం అంటే
ఎవరికీ అన్యాయం చేయకుండా
ఎపుడూ ఓటమికి చలించకుండా
కన్నీరుని పన్నీరుగా భావించి
మునే్నటిలో కూడా ఒడ్డుకు చేరి
విజయాన్ని వరించాలనే తహతహలు
అపజయాన్ని జయించాలనే ఉత్సుకతతో
మళ్లీమళ్లీ పడిలేచిన కెరటమై
బాధలను భరించి నిలిచే ఊరటయై
పదిమంది మేలు కోరుతూ
హృదిలో స్థానం సంపాదించుకుని
నిలువెత్తు సత్యంలా, శాంతిలా
నిబిడీకృతమైన గరళకంఠునిలా
నవ్వులు చిందిస్తూ నిలవడం
నలుగురికీ ఆనందాన్నివ్వడం
ఎదగడమంటాను
ఎదిగే కొద్దీ ఒదగమంటాను

- బి.హెచ్.వి.రమాదేవి
సెల్: 9441599321

మినీ కవితలు

మూలిగే నోటుపై
సర్జికల్ దాడి
సామాన్యుడు ఢమాల్ బిడ్డా

పెద్దనోట్ల రద్దులకు
బడాబాబులు బెదర్రు
చిక్కులు చిన్నవాళ్లకే బిడ్డా

పెద్దనోట్లు చిత్తయ్యె
చిన్న నోట్లు మీసం తిప్పె
జనాలు బ్యాంకుల పాలయ్యె బిడ్డా

బక్కోడైనా
బండోడైనా
చిల్లర దెబ్బకు కుదేల్ బిడ్డా
పైకెదిగేందుకు
ప్రాబల్యం పెరిగేందుకు
ఫోకస్ కావాల బిడ్డా

వినిపించే వాళ్లే
వినే వాళ్లుండరు
కవి సమ్మేళనం బిడ్డా

- శంకర వెంకట నారాయణ
ఆచంట, ప.గో.జిల్లా
99591 63676

పుస్తక సమీక్ష

అభ్యుదయమే ఆకాంక్షగా...
సిరివెనె్నల స్వరం

కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను గుర్తు చేస్తాయి ఆమె కవితలు. సమాజ పోకడలు, అందులోని అసమానతల గురించి ఆ కవితలు సందేశమిస్తాయి. హెచ్చరిస్తాయి కూడా. ప్రస్తుతం మనుషుల తిరోగమన స్థితిపై ఆ కవితలు కొన్నిచోట్ల ఆక్రోశిస్తాయి. సిరి లాభాల కలం నుండి జాలువారిన ‘సిరివెనె్నల స్వరం’ కవితా సంపుటిలోని కవితలు నేటి సమాజానికి అద్దం పడతాయి. గర్భంలోని శిశువు భ్రూణహత్యకు గురవబోతుందని తెలిసి ‘నేను ఆడపిల్లని నన్ను చంపకండి ప్లీజ్’ అని బతిమాలుతూ చేసే ఆర్తనాదం చదువరుల కళ్లు చెమ్మగిల్లింపజేస్తాయి. ‘్భరతమాత’ కవితలో అపరంజి బొమ్మలను అంగడిబొమ్మలు చేస్తున్నారని, కూలి కోసం వెళ్లిన అబలలను చెరిచి వారి పసిపిల్లల్ని వారి చేతుల మీదుగానే చెత్తకుప్పల పాల్జేస్తున్నారని కవయిత్రి ఆవేదనను వ్యక్తం చేస్తారు. కన్నతల్లి వంటి భరత ఖండానే్న ముక్కలు చేస్తున్న వంచకుల చేతిలో నలిగిన నేను ‘నిన్ను ఊపిరి పోసుకోనివ్వలేను... నన్ను క్షమించు తల్లీ అంటారు కవయిత్రి ఒక కవితలో. పసితనం నుండి పడుచుదనం వరకు స్వప్నంగా అయినా తిరిగి రావాలని కోరుకుంటున్న వైనం ‘మధురం’ కవితలో హృద్యంగా చెప్పారు కవయిత్రి. అలాగే స్ర్తిలు ఓ వరంలా భావించే మాతృత్వం కొందరి వల్ల కళ తప్పుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ‘అమ్మ మాత్రమే ఇవ్వగలిగే అమృతం’ అనే కవితలో వ్యక్తం చేశారు. అందం తరిగిపోతుందని జన్మనిచ్చిన పిల్లలకు కూడా అమ్మపాలు పట్టని మాతృమూర్తుల వైనాన్ని కవయిత్రి వ్యక్తీకరించిన తీరు ఆవేదనకు గురి చేస్తుంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య గతంలో చూసిన అనుబంధాలు, ఆప్యాయతలు నేడేవి అని ప్రశ్నిస్తూ కవయిత్రి వెలువరించిన ‘అనురాగబంధం’ కవిత అందరినీ ఆలోచింపజేస్తుంది. ఇంకా డాడీ, నీ ప్రేమకు గుర్తుగా, అమ్మా నాన్నల ప్రాణాలు, మహిళా శిరోమణులు, అవని తడిలో అతివ, నవతరపు నారీమణి, భార్య వంటి కవితలు పాఠకులను ఆకట్టుకునేలా రాశారు. ఈ కవితా సంపుటిలో ఆర్భాటం లేదు, ఉన్నది ఉన్నట్లు మనసులను రంజింపజేసేలా ఉన్నాయి. ఎందరో ఆడపిల్లలు కపటప్రేమ, కల్మష ప్రేమలను నిజమైనవిగా నమ్మి కని పెంచిన తల్లిదండ్రుల ప్రేమ, అనురాగాలను తృణప్రాయంగా వదిలివేసి శలభాల్లా మాడిపోతున్న వైనాన్ని తెలివిగా, కళ్లు విప్పి గమనించమని పలు కవితల్లో కవయిత్రి హెచ్చరించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి కవయిత్రి తాపత్రయపడడం కనిపిస్తుంది. సమాజం పట్ల నిబద్ధత, ప్రేమ వ్యక్తమవుతుంది. సంపుటిలోని కవితలన్నింటినీ చదివితే ఈ విషయం తేటతెల్లం అవుతుంది.

- పుష్పగుర్రాల

మనసుకు హాయినందించిన
శ్రీశ్రీ పదాలు

తెలంగాణలో సినారె, శ్రీకాకుళంలో కారా, విశాఖలో సనారా పేరు వినని వారుండరు. అయిదు దశాబ్దాల సీనియర్ కవి మాధవీ సనారా. రానాస ప్రచురణలు (అనకాపల్లి) ద్వారా ఇప్పటి వరకు తన స్వీయ రచనలు 17 పుస్తకాలను ప్రచురించి ప్రాచుర్యం పొందిన సనారా తన 18వ పుస్తకంగా దీనిని ప్రచురించారు. సాహిత్యంలో కొత్త ఒరవడి ఎక్కడ కనిపిస్తే అక్కడ మనకు సనారా కనిపిస్తారు. ఆరుద్ర కూనలమ్మ పదాలకు ఆకర్షితులై అదే బాణీలో ఇందులోని కవితలను ఆయన రాశారు. శ్రీశ్రీపై పదాల పద సంపదను మనకందించారు. ఇక పుస్తక సమీక్ష విషయానికి వస్తే శ్రీశ్రీ జీవితాన్ని మన కళ్ల ముందు అక్షరీకరించారు కవి. చివరి పాద రెండు శ్రీలోడు అంటూ 117 పద్యాలను అక్షర వెలుగుల ద్వారా అందించారు. 27వ పద్యంలో కవి ఇలా అంటారు. అతను నడిచిన బాట/సామ్యవాదపు తోట/పాలకులతో వేట / రెండు శ్రీలోడు అంటారు. ఇది యదార్ధం. మరో పద్యంలో ఆయన శ్రీశ్రీ గురించి ఇలా రాశారు. కవిలోక సూరీడు కైత రాజ్యపు రేడు శ్రీలున్న పేదోడు రెండు శ్రీలోడు అంటూ అద్భుతమైన వర్ణన చేస్తారు. అలాగే 39లో ఇలా అంటారు విప్లవాలే బాట విప్లవమ్మే నోట క్రాంతి పైనే పాట రెండు శ్రీలోడు అని చెబుతారు. 75వ పద్యం ద్వారా అతను తెలియని వారు తెలుగు వాళ్లలో లేరు ఉంటే తెలుగు వారు కాదు రెండు శ్రీలోడు అంటారు. శ్రీశ్రీకి శ్రీశ్రీ పదాలంటూ అక్షర నివాళి అర్పించిన సనారా పాఠకుల మది దోచుకున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు.

- మహ్మద్ రఫీ (ఈవేమన), సెల్ : 7893451307

పుస్తక పరిచయం

మదిని సంప్రోక్షణ చేసే
శైలజ ‘మధుర పత్రాలు’

ప్రతులకు :
యు.శైలజ
యు.ఆర్.ఎన్.కె.విహార్
ఫ్లాట్ నెం-311,
దండు అపార్ట్‌మెంట్స్
పద్మానగర్, హైదరాబాద్-25
సెల్: 7032834460

సాహిత్యమంటే అభిమానమున్నవారు ఎందుకు అక్షరీకరించలేరు? అక్షరాన్ని ప్రేమించేవారు ఆలోచనలెందుకు చెయ్యరు? అక్షర సాగర మథనంలో అమూల్యమైన విషయ సేకరణ చేసుకున్న హృదయం ఊరుకుంటుందా? అందుకే ఆలోచనలను సాయుధం చేసుకున్నారు. అక్షరాలకు పదును పెట్టుకున్నారు. అంతే కలాన్ని ఝుళిపించారు. చుట్టురా ఉన్న సంఘాన్ని పరిశీలించారు. కవిత్వంతో సమాజాన్ని మార్చాలనుకున్నారు. మార్పును అనే్వషించారు. అనే్వషణి ఫలాన్ని అందరికి పంచాలనుకున్న ఆమె ఉప్పులూరి శైలజ. పత్రికల్లో వచ్చినవి ప్రొదిచేసినవి కలిపి సంకలనంగా తెచ్చిన కవితా సంపుటి ‘మధుపత్రాలు పేజీలు త్రిప్పుతూ నచ్చిన కవిత్వం చదువుతూ ముందుకుపోతుంటే కవయిత్రి హృదయం ఆవిష్కరణమవుతుంది. స్పందించే హృదయం ఉంది కనుకనే వ్యక్తీకరించటానికి అది భాషను వెతుక్కుంది. అనుకొన్న దాన్ని పదుగురికి చెప్పే తపనను తీసుకొంది. తనదైన స్థానాన్ని పొంది కోరికను లాక్కుంది. సమాజ పురోగతిలో ‘్భగస్వామి’ కావాలనే ‘ఆకాంక్షిత’ అయింది. ఆ మూలగది కవితను చదువుతుంటే భరతమాత స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రాణాలర్పించిన వీరసావర్కను చూస్తాం. ఆ మూలగది జైలుగది దానిలో ఎంత నరక యాతన పడ్డాడో వందేమాతరాన్ని ‘మంత్రం’గా ఎన్ని లక్షలసార్లు జపించాడో గుర్తుకు తెచ్చిన మంచి కవిత ‘ఆ గది నాటికి, ఏ నాటికీ పదుగురుకి/స్ఫూర్తినింపే ధ్యాన మందిరమే’ననటం బావుంది.
ఎవరు ఎవరి కోసం పహరా కాస్తారో ఎవరి ఆకలి దప్పికల కోసం పోరాటం చేస్తారో మానవతా సేవ కోసం ఆర్రులు చాస్తారో ‘దేశం కోసం’ కవితలో నినదించారు. ‘మానవతా జ్యోతులను వీధివీధినా వెలిగిద్దాం’ అంటూ వారి ఆశయ సాధనను అందిపుచ్చుకుందామంటారు. ఇంతవరకు కుళాయిల దగ్గర ఆడవాళ్ల జగడాలు మాత్రమే చూసాం. నీటి ట్యాంకర్ల వద్ద కొట్లాటలూ చూసాం. రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలు జరుగుతాయనే సంకేతాలు పొరుగు రాష్ట్రాల్లో డామ్‌ల ఎత్తు పెంచటం, నీటి విడుదలలో గొడవలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు దినపత్రికల్లోను న్యూస్‌ఛానల్స్‌లోను చూస్తున్న సంగతులు. నీటి సమృద్ధినే కాదు నీటి పొదుపును జల మదుపరులుగా తయారుకమ్మని చెప్పే పర్యావరణ స్పృహతో రాసిన కవిత. పిల్లలకు ప్రతీది దాచిపెట్టడం తల్లి అలవాటు ‘చెలిమి కలిమితో జలమును నింపు/కన్నతల్లిలా కాచును నిన్ను’ అనడంలో తల్లి రహస్యాన్ని అలా విప్పగలిగారు. పొదుపు అంటే భవిష్యత్‌కు ఇచ్చే సంపద ‘ఒక్కో వాన బొట్టును నింపుకో/్భవితరానికది నీవీయబోయే సంపదని తెలుసుకో!’మని సుద్దులు చెప్పటంలోని మర్మం. నీటి అవసరత చాటే గొప్ప కవిత ‘బొట్టు బొట్టు బంగారమే!’ ‘ఇంకుడు గుంతలే, ఇలలోన జల బ్యాంకులు’ మంచి ప్రతీకతో కవితా పాదం. లోతైన అర్ధాన్ని ఇమడ్చారు. ఈ పద కవితను చూస్తే ఎంత ముచ్చటేస్తుందో. ‘బొట్టు బొట్టు దాచిపెట్టు బంగారంలా/నేలతల్లి గర్భమే సిసలైన పెన్నిధిలా!’ అనడం ఒక్క శైలజకు మాత్రమే చెల్లు.
అమ్మ గురించి ఒక ఆడది మాత్రమే చెప్తుందనుకోవడం తప్పు. అమ్మతనం తెలిసిన స్ర్తిమూర్తి ‘అమ్మ’ గురించి ఏమి చెబుతున్నారో చూడండి. సేద్యంతో అందరు పంట పండిస్తారు. మానవీయంతో అమ్మను కొలవడమే కాదు తలవడమూ కొందరు మాత్రమే అమ్మను పండించగలరు. ‘నిలువునా చీలి మొలకెత్తే విత్తులా/వత్తిలా కాలుతూ జ్యోతినందించే దీపంలా/కరిగిపోతున్న కర్పూర హారతిలా/పండ్లను అందించి నేలకొరిగే కదళీ వృక్షంలా’ అని అమ్మ గుణంలోని త్యాగపరిచారు. ఇక నాన్న గురించి అంతే మార్మికతతో చెప్పి పాఠకులను ఆర్థ్రత పరుస్తారు. ‘శోకాలను తరిమి జీవన శ్లోకాలను నేర్పి/వేదనలు వద్దని జీవన వేదాన్ని బోధిస్తూ/ వారి జీవితం మాకో లిఖించని భగవద్గీత!’ అనటం మమకారపు మాధుర్యతనీ స్వరాజ్య కాంక్షను స్వతంత్రేచ్ఛను సులభశైలిలో ‘పాట’ ద్వారా పదునుపరిచి స్వేచ్ఛను కోరిన ‘గరిమెళ్ల’ గొప్ప దేశ భక్తుడు. ఒక ఆదర్శవాది బ్రిటీషు ముష్కరుల ఆగడాలను, దౌష్ట్యాలను, ఎనె్నన్నో క్రూరత్వాలను ఒక పాదఫంక్తిలో ‘మాకొద్దీ తెల్లదొరతనం’ అని చెప్పిన గరిమెళ్లపై అక్షర నీరాజనం వొలికించడం కవయిత్రిలోని దేశభక్తికి కొలమానం. తనకు ఎదురైన సంఘటనలు తను అనుభవించిన సంగతులకు అక్షరాలు తొడిగి అనుభూతీకరించారు కవయిత్రి శైలజగారు ఎన్నో విషయాలు. అలా రాసిన అరవై కవితల్లో దేశభక్తి, పర్యావరణం, ఆధ్యాత్మికం, కుటుంబం, ప్రజాసేవ, భారతీయ అంశాలు ప్రజలకు చేరువ చేసి ఆచరణాత్మకం చేయాలనేది ఆమె ఆశయం. ఆధ్యాత్మిక అంశంతో రాసిన ‘అత్యద్భుత దానము’, ‘పంచేద్రియపూజ’, ‘లోకేశ్వరుని సేవకులు’, ‘హృదయాంజలి’, ‘అంతర్యామి’ తదితర కవితలు పాఠకుల హృదయ మందిరంలో కొలువవుతాయి. కుటుంబం గురించి రాసిన మా మహాలక్ష్మి, కుటుంబ చిత్రం మొదలైన కవితలు మదిని హత్తుకుంటాయి. దేశం కోసమే, వందేమాతరమనరా! వంటి కవితలో భారతీయతను గట్టిగా విన్పిస్తారు. ఇక సాహితీకవనంలో తెలుగు కవులను కీర్తించి, వారి స్ఫూర్తిని తేజోదాయకం చేసిన కవితలు ‘సాహితీ సార్వభౌములు’ గురజాడ నాడు-నేడు, గురజాడ నవశక్తి స్వరూపాలు, అడుగుజాడలు లాంటి కవితలు సాహితీ కుతూహాలాన్ని తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించే దిశగా ప్రేరేపిస్తాయి.
విషయాన్ని శిల్పంతో చెప్పడమే కవిత్వం. మంచి పరిణత భావాలతో సాహితీవనంలో కవితా సుమాలు పూయిస్తున్న శైలజగారి కలం వయస్సు మూడేళ్లు. ఆమె తొలి రచనకు ఆహ్వానం పలికి, తొలి అచ్చుకు స్వాగతించిన ఆంధ్రభూమి. తన అక్కున చేర్చుకొని ‘మెరుపు’లో ఆదరిస్తూనే ఉంది. కవయిత్రిగా తాను రాసిన రచనలను గుదిగుచ్చి మొత్తం అన్నింటిని కలిపి ఒకేసారి చదువుతున్నప్పుడు తాను మొదలుపెట్టిన క్రమం ఎలా నడిచి ఏ దిశగా ప్రయాణించి ఎక్కడకు చేరుకున్నదీ లాంటి మార్పులను గమనించవచ్చు. పుస్తకంలో మొత్తం అరవై కవితల్లో ఒకట్రెండు మినహా అన్ని వివిధ పత్రికల్లో అచ్చు అయినవి. ఆమె కలం మరింత పదునుదేలి మంచి కవిత్వంతో మనల్ని అలరిస్తారని ఆశిద్దాం.

- రవికాంత్, సెల్: 9642489244

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు