ఉత్తర తెలంగాణ

మధుర స్మృతులు ... జ్ఞాపకాల నెమలీకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం తీరుబడిగా.. పాత ఆల్బం ఏదో తిరగేస్తుంటే చిన్ననాటి ఫోటోలను చూసి ఆనాటి బాల్యపు స్మృతుల్లోకి మది ప్రయాణించింది. అవి ఎప్పటికి పాతబడని ఊహలు! మదిని రసాలూరించే ఆ పాత మధురాలు! నిజమే కదూ! ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఏవైనా వాటి చుట్టూ మనం పోగు చేసుకున్న కొన్ని జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. వాటితో అల్లుకున్న మన స్మృతుల పరిమళం గొప్పది. ఒక ఆదివారం పూట తీరుబడిగా ఆస్వాదిద్దామని పాత ఆల్బంలు తిరగేస్తుంటే ఎన్నో జ్ఞాపకాల నెమలీకలు మదిని సుతారంగా స్పృశించాయి. మరెన్నో అనుభూతుల స్వాంతనలను అది పంచి ఇచ్చింది. ఇంట్లో అద్దాల బీరువాలో దాగిన పాత పుస్తకాలు బైండింగ్ చేసినవి వెతుకుతుంటే పాతకాలం నాటి బైండింగ్ చందమామ కథల సంపుటి నా చేతిలోకొచ్చింది. ఒక్కసారిగా నా దోసిలిలో తడి ఆరని జ్ఞాపకాల ప్రవాహం వెల్లువై నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. రాజులు, మంత్రనగరులు, మాయాతివాచీలు, భేతాళ కథలు, మర్యాద రామన్నల చమత్కార సంభాషణలు, అరేబియన్ నైట్స్ అన్నీ కలగాపులగంగా మదిలో సవ్వడి చేసే అద్భుత ఊహా ప్రపంచం ఏదో నాలో మేల్కొన్నట్టుగా, చిత్తుగా నన్ను తడిపేస్తున్న అనుభూతుల ఆనవాళ్లు! ఇప్పుడొచ్చే హ్యారీ ప్యాటర్ సిరీస్‌కేం తీసిపోవన్నట్లుగా అలనాటి మలయాళ మాంత్రిక, సాలభంజికల కథలు.
అలాగే అటకెక్కిన పాత రాగి చెంబులు, ఇత్తడి లోటాలు, తాతలకాలం నాటి రాచిప్పలు, కొప్పెరలు, గంగాళాలు దిగిరానంటూ మారాం చేస్తున్న అల్లరి పిల్లలుగా అక్కడక్కడ అటకపై పడి ఉన్న చిందరవందర జ్ఞాపకాల దొంతర!
అవన్నీ చూస్తుంటే మనవుడు నాగరికతతో క్రమంలో రాతియుగం నుండి లోహయుగానికి ఎలా మారాడోనన్న సంభ్రమ విభ్రమాశ్చర్యాలు కలుగకమానవు! రాచిప్పలో ఊరవేసుకొనే నిమ్మకాయ పచ్చడి నుండి కట్టెల పొయ్యిపై నీళ్లు కాచుకొనే కొప్పెర వరకు అన్నీ ఒక జ్ఞాపకాల జడివానగా మదినిండా ఆ కాలం నాటి తలపోతలే! ఎవరో మనల్ని టైం మెషిన్‌లో ఎక్కించి, బ్లాక్ అండ్ వైట్ జమానాకు తీసుకెళ్లినట్లు రీళ్లు రీళ్లుగా గతకాలపు జ్ఞాపకాల లోలకాలు రెటీనా తెరపై ఆవిష్కృతమవుతాయి. ఇవన్నీ మనతో బాటే ఇన్నాళ్ల బట్టి సహజీవనం చేస్తూ, వౌనముద్రదాల్చిన మునుల్లా మన చుట్టూ ఒక నిశ్శబ్దఝరిని ప్రవహింపజేస్తాయి! గదిలో ఒక మూలన వౌనగీతాన్ని ఆలపిస్తున్న తీగెను గుదిగుచ్చిన ఉత్తరాల గుచ్ఛం గతకాలం మేలు.. వచ్చు కాలం కంటెన్ అంటూ తత్త్వబోధనేదో తెల్పుతున్నట్లుగా ఉంది! పుట్టింటి నుండి తెచ్చుకున్న ట్రంకుపెట్టె, పాత చెక్క అల్మరా, అందులో నలగని జ్ఞాపకంలాంటి అమ్మచీర, ఇంకా.. ఇప్పటికీ భద్రంగా పదిలపర్చుకున్న నాయనమ్మ కుట్టిన బొంతలు, అవి చూసినప్పుడల్లా, నాయనమ్మ ఒడిలో ఆడుకున్న పసిపాప జ్ఞాపకాలు, వేగవంతమైన జీవనంలో అప్పుడప్పుడు ఆగి మిమ్మల్ని పలకరించేందుకు, జీవితం పట్ల కొంత భరోసాని, నమ్మకాన్ని మనకిచ్చేందుకు పాతబడని ఊహలాంటి ఈ జ్ఞాపకాల జల్లు, ఒక ఆదివారం తీరుబడిగా, మదితీరా ఆస్వాదించేందుకు కమ్మని మార్నింగ్ కాఫీతో బాటు దూరదర్శన్ వారి రంగోళీ క్లాసిక్ గోల్డ్ ఆనాటి మధురగీతమేదో వీనులవిందుగా విన్పించసాగింది!

- బి.కళాగోపాల్, నిజామాబాద్
సెల్.నం.9441631029

పుస్తక సమీక్ష

పేజీలు: 66, వెల: అమూల్యం
ప్రతులకు:
దాసరి శ్రీనాథ్ గౌడ్
1ఎ-120/20
ఆర్‌ఆర్ నగర్
శ్రీనివాస గార్డెన్ ఎదురు రోడ్
గ్రామం తిమ్మాపూర్
మండలం: మందమర్రి
మంచిర్యాల జిల్లా - 504209
సెల్.నం.9701781696

విరిసిన మల్లెలు

పువ్వు రాలింది
ఎందుకోసమో?
పూజ్య భావంతో నేలతల్లి
రుణం తీర్చుటకై.. అంటూ అద్భుతమైన భావాలతో..కవి దాసరి శ్రీనాథ్ గౌడ్ ‘విరిసిన మల్లెలు’ పేరుతో ఓ నానీల సంపుటిని వెలువరించారు. మధురాక్షర, గీతమాలిక.. గ్రంథాలతో ఇదివరకే సాహితీ లోకానికి పరిచయమైన శ్రీనాథ్ గౌడ్ చుక్కల వంటి.. దోస్తులు ఎందుకు?.. చంద్రుని వంటి మిత్రుడొక్కడు చాలు అని ఓ నానీలో చెప్పడం బాగుంది.
కాలం విలువైందా?
ఐతే..
భద్రంగా
దాచుకోరెందుకు? అని ప్రశ్నించారు.
నే హృదయం లేని మనిషిని
ఎందుకంటే..
దాన్ని ఎప్పుడో
నా భార్యకిచ్చానని చమత్కరించారు.
డబ్బుతో చక్కని మంచం
కొనగలం..
కాని..
మంచి నిదుర కొనగలమా? నిజమే మంచి మంచంముంటే.. బాగా నిద్ర పట్టాలని లేదు కదా!
మడతలు లేని
మనిషికైనా
ముడతలు తప్పవు
ముసలి తనంలో.. అంటూ ఓ నానీలో జీవన సత్యాన్ని ఆవిష్కరించారు.
దీవించడం తప్ప
చెడగొట్టడం తెలియని వాడు
ఆయనే..
ఉపాధ్యాయుడు! అంటూ మరో నానీలో ఉపాధ్యాయుడిని ఉన్నతంగా చిత్రించారు.
స్వచ్ఛత మాటల్లో ఉంటే
సరిపోదు!
ప్రవర్తనలో కూడా
ఉండాలి.. అని హితవు పలికారు.
మనం కనే కలల గురించి కవి ఒక నానీలో..
కలలు కమ్మగానే ఉంటాయి..ఎందుకు
శ్రమా, ఖర్చూ
రెండూ
ఉండవు కాబట్టి! అని చెప్పడం బాగుంది.
కొన్ని నానీల్లో కవి ప్రకటించిన భావాల్లో స్పష్టత కొరవడినప్పటికీ..చాలా నానీల్లో కవిత్వాంశ లేక పోయినప్పటికీ..కవి యొక్క లోక పరిశీలనను అభినందించి తీరుతాము..నానీల ప్రక్రియకు సంబంధించిన అక్షర సంఖ్యా నియమం 56వ పేజీలోని ఒక్క నానీలో తప్ప (కనీసం..ఇరవై అక్షరాలు గరిష్టం 25) పాటించారు. కాయకన్న తొడిమె పెద్ద అన్న చందంలా ముందుమాటలు సగం ఆక్రమించాయి!
‘నానీలు
మర్రి విత్తనాల్లాంటివి
భావాలు
మర్రి వృక్షాల్లాంటివి.. అని స్వయంగా ప్రకటించిన కవి శ్రీనాథ్ గౌడ్ అలతి అలతి పదాలతో గాఢమైన కవిత్వం పండిస్తే బాగుండేది!
‘జన్మదినం అంటే / అమ్మ / మన పుట్టుక కోసం / మరణంతో పోరాడిన రోజు’ అని అమ్మ యొక్క ఔన్నత్యాన్ని ఈ నానీలో చక్కగా చిత్రించారు.
రాజు / పూల పల్లకిలో ఊరేగు / కవి..
మాటల పల్లకీలో జగమేలు! అన్న నానీలో.. కవి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. ఇలా ఇందులోని నానీలు సాదా సీదాగా వున్నప్పటికీ.. కవి యొక్క ప్రయత్నాన్ని ప్రశంసించి తీరుతాం! మున్ముందు మరింత కవిత్వాంశతో శ్రీనాథ్ గౌడ్ గారి కలం నుండి రచనలు జాలువారాలని కోరుకుందాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

అంతరంగం

పాఠకుల హృదయాలను కదిలించేదే కవిత్వం

చిరునామా:
డాక్టర్ కాంచనపల్లి
ఫ్లాట్.నం.2
స్నేహ దీప అపార్ట్‌మెంటు
స్ట్రీట్ నం.1, సండే మార్కెట్
గోకుల్‌నగర్, తార్నాక
సికింద్రాబాద్-17
సెల్.నం.9676096614

ప్రముఖ కవి డాక్టర్ కాంచనపల్లి

కదిలేది, పాఠకుల హృదయాలను కదిలించేదే అసలైన కవిత్వమని ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్ కాంచనపల్లి అభిప్రాయపడ్డారు. వృత్తిరీత్యా ఘట్‌కేసర్‌లోని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతల్ని నిర్వహిస్తూ.. సాహిత్య సృజనను ప్రవృత్తిగా మలచుకున్న ఆయన కరీంనగర్ జిల్లా జూలపల్లికి చెందినవారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘తండ్లాట’ తెలంగాణ ఉద్యమవాద దీర్ఘకావ్యాన్ని వెలువరించి.. అందరినీ చైతన్యపరిచారు.. ఉద్యమ ఉద్వేగంతో.. తెలంగాణ రచయితల వేదిక అప్పటి అధ్యక్షులు ప్రోత్సాహంతో.. ఉద్యమ వ్యాప్తికి ‘తండ్లాటతో పాటు తన రచనల ద్వారా కృషి చేశారు.. సాహితీ మిత్రుల సహకారంతో ‘మునుం’ అనే గొప్ప సంకలనం వెలుగులోకి రావడానికి ఆయన విశేష కృషి చేశారు. ఇతర కవుల ఆనాటి పొక్కిలి, మత్తడి, ముంగిలి కోవలోనే వీరి ‘తండ్లాట’ నిలిచింది. డాక్టర్ దామోదర్, డాక్టర్ ఎలనాగ వంటి కవుల ద్వారా ‘తండ్లాట’ అంగ్లంలోకి అనువదింపబడింది. ఉద్యమ వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, కథలు రాసిన అనుభవం ఉన్న ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించింది. ఆయనతో ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే.. మెరుపు పాఠకులకు అందిస్తున్నాం..

ఆ మీ అసలు పేరేమిటి?
కాంచనపల్లి గోవర్ధన రాజు.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
కవిత్వం కానిది ఏమిటో చెప్పగలం, కానీ కవిత్వం అంటే ఏమిటో చెప్పడం కష్టం కదా! కవిత్వమంటే నా దృష్టిలో కదిలేది.. పాఠకుల హృదయాలను కదిలించేది!

ఆ మీ మొట్టమొదటి రచన ఎప్పుడు
వెలువడింది?
నేను జూలపల్లిలో 8వ తరగతి చదువుతున్నప్పుడు కాబోలు.. ఠాకూర్ భిక్షపతి సింగ్‌తో కలిసి ఒక ‘ఉత్తరమాల’ రాశాను. అప్పుడే కొంత ఛందస్సు నేర్చుకుని ఒక కంద పద్యం రాశాను. 1981లో మొట్టమొదటి గ్రంథం ‘్భవమంజరి’ పద్యగేయమంజరిని ప్రకటించాను.

ఆ ఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై
మీ అభిప్రాయం?
ఇప్పుడు మంచి వచన కవిత్వం వస్తున్నది.. వ్యక్తీకరణలో వచన కవిత్వం చాలా విస్తృతి సాధించింది. వస్తువును బట్టి శిల్పాన్ని సంతరించుకుని.. విభిన్న ప్రతీకలతో మిరిమిట్లుగొలుపుతుంది. కాగా.. కొంత వచన మాత్ర కవిత్వం కూడా వస్తోంది.. తప్పదు కదా మరి! అన్ని రకాల చెట్లుంటేనే తోటకు అందం కదా!
ఆ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కవిగా
మీరు నిర్వహించిన పాత్ర?
నిజానికి నా ‘చేదబావి’ గ్రంథం తరువాత సాహిత్య సృజనకు ఒకింత విరామం ఇచ్చాను.. తెలంగాణ ఉద్యమం నన్ను ఉత్తేజపరిచి, నన్ను కవిగా పునఃప్రవేశించడానికి వీలు కలిగించింది. ఉద్యమ నేపథ్యంలో నేను జూలూరు గౌరీశంకర్ ప్రోత్సాహంతో ‘తండ్లాట’ ఉద్యమ వాద దీర్ఘకావ్యాన్ని వెలువరించి అందరి దృష్టినాకర్షించాను. అనేక మంది ప్రముఖులు ‘తండ్లాట’పై సమీక్షా వ్యాసాలు రాశారు. చాలా పట్టణాల్లో ఉద్యమానికి ఊపిరులూదడానికి ‘తండ్లాట’పై గ్రంథ పరిచయ సభలు నిర్వహించారు. ఉద్యమ సమయంలోనే.. ‘మునుం’ అనే ఉద్యమ సంకలనానికి సహకరించాను. ఉద్యమ వ్యాసాలు, కథలు, రాసి నా వంతు పాత్రను పోషించానన్న తృప్తి వుంది.

ఆ మీ పరిశోధన గ్రంథాల వివరాలు
తెలుపుతారా?
‘ఆంధ్రాంగ్ల సాహిత్యంలో దీర్ఘకావ్యాలు - విశ్వంభరతో సమన్వయం’ అంశంపై ఎం.్ఫల్ చేశాను. ‘ఆంధ్రాంగ్ల సాహిత్యంలో కాల్పనిక కవితా ప్రక్రియ పరిణామం’ అంశంపై తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక కేంద్రం ద్వారా పిహెచ్‌డి పూర్తిచేశాను.

ఆ మీ ముద్రిత గ్రంథాలు?
భావమంజరి, ఆచూకి, చేదబావి, తండ్లాట, కల ఇంకా మిగిలే వుంది.. ఐదు గ్రంథాలు వెలువరించాను. బల్మూరి కొండల రాయుడు, కాంచనపల్లి కథలు త్వరలో ముద్రణకు నోచుకోనున్నాయి.

ఆ మీకు నచ్చిన కవులు?
ప్రాచీనంలో శ్రీనాథుడు- పోతన, ఆధునికుల్లో.. కృష్ణశాస్ర్తీ, సినారె, అత్యాధునికుల్లో.. కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్.

ఆ రచనలో ఇజాలు, వాదాలు
అవసరమంటారా?
ఇజం, వాదం అనేవి కవులు, రచయితల్లో ఒక పార్శ్వం మాత్రమే... కవి సమగ్ర వ్యక్తిత్వమే మనకు ప్రామాణికం..

ఆ సాహితీ పురస్కారాలపై
మీ అభిప్రాయం?
పురస్కారాలు అవసరమే.. అవి కవులు, రచయితల సామాజిక బాధ్యతను పెంచుతాయి.

ఆ సాహితీ సంస్థలు క్రియాశీలకంగా
పనిచేయాలంటే మీ సూచనలు,
సలహాలు?
నిర్దేశిత లక్ష్యమే గమనానికి కేంద్రం కావాలి.

ఆ మూల మూలలో ఉన్న పరిణత కవులు, రచయితల రచనలు వెలికితీయాలి. తెలంగాణ బహుజన, దళిత కవులలోని ప్రాంతీయ ప్రతీకలను, అభివ్యక్తులను గుర్తించి ప్రోత్సహించాలి. ప్రాంతీయ కవులు, రచయితల జయంతులు, వర్ధంతులు నిర్వహించి ప్రేరణ పొందాలి. తెలుగు సాహిత్య అకాడమీని నెలకొల్పాలి.

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే
సలహాలు సూచనలు?
ఏ కవికైనా వాచ్యం ప్రధాన శత్రువు.. దాన్ని అధిగమించగలగాలి. వస్తువుతో పాటు అభివ్యక్తికి ప్రాధాన్యతనివ్వడానికి అధ్యయనంపై దృష్టి సారించాలి.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

మనోగీతికలు

కరుణ లేని కాలం
ఉన్నట్టుండి వాతావరణం మారుతుంది
వనాలకు కొత్త రుతువు వచ్చి
సర్వసమస్యలూ పరిష్కారమైనట్టుగా
అనిపిస్తుంది
చెవుల్లో హోరు వినిపిస్తుంది
సామాన్యుడు
దీనమైన చూపుల్తో నిద్ర లేస్తుండగా
వాతావరణం మారిపోతున్నట్టు
చేతల మనుషులు
పగ్గాలు చేపడుతున్నట్టు
అతని చుట్టూ ప్రచారం జరుగుతుంది
సుందర దృశ్యాల భవితవ్యం
గురించి ప్రసంగాలు వినిపిస్తాయి
వెతలతో సతమవుతూ
అతడు కాలం గడుపుతూ వుంటాడు
కేలండర్‌లో తేదీలు తప్ప ఏవీ మారవు
కట్టు కథలు వింటూ
చిన్నదానికీ పెద్దదానికీ క్యూలతో నిల్చుంటూ
అతడు నిస్పృహకు గురవుతుంటాడు
నిరాశతో స్మశానానికి దగ్గరవుతుంటాడు!

- తురాయి మురళీధర్
వరంగల్
సెల్.నం.8897465104

స్వచ్ఛ భారత్

శరీరం స్వచ్ఛంగా ఉంటే ఆరోగ్యం
మనస్సు స్వచ్ఛంగా అయితే నిర్మలత్వం
హృదయం స్వచ్ఛమైతే దైవత్వం
పర్యావరణం స్వచ్ఛతతో ఉంటే పచ్చదనం
స్వచ్ఛత దైవత్వానికి మరోపేరు
మనిషి స్వచ్ఛతతో జీవిస్తే భూమి స్వర్గతుల్యం
కులమత విబేధాలు లేక అందరూ ఏకమైతే స్వచ్ఛత
ఇదే భరతావని బంగారు భవిత
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే స్వచ్ఛత
స్వచ్ఛమైన పనులు చేస్తే సేవా తత్పరత
అహంకారం అజ్ఞానం విడిచిపెడ్తే స్వచ్ఛత
ఎవరి బాధ్యతను వారు సమగ్రంగా నిర్వర్తిస్తే స్వచ్ఛ్భారత్
నేటి బాలలే రేపటి పౌరులు అవుతారు
వారికి మనం స్వచ్ఛత పాఠాలు నేర్పాలి
యువత స్వచ్ఛతకి ఆదర్శంగా నిలవాలి
భారతదేశ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి

- ఎస్.పి.అన్నపూర్ణ, పోచారం (జీడిమెట్ల ఎక్స్ రోడ్),
హైదరాబాద్, సెల్.నం.9390170836

నా నువ్వు!
కనురెప్పల వాకిట్లో
కలత నిదురవి నువ్వు!
అలసిన నా మేనుకి
నీ ఒడినే పాన్పుగా పరిచి
పాడే జోల పాటవు నువ్వు!
ఆకలి మరిచే నాకు
అమ్మలా గోరుముద్దవి నువ్వు!
నిరాశలలో నిలిచిన వేళ
ఆశ ప్రవచనానివి నువ్వు!
వౌనం నువ్వు
మాటవి నువ్వు
నిశీధిలో
వెనె్నల చలువ నువ్వు!
నాకు నువ్వు
నాలో నువ్వు
చిరునవ్వులోకనిపించే
నా నవ్వులే నువ్వు!!

- కాట్రాజు లావణ్య సైదీశ్వర్
హాలియా.. నల్లగొండ జిల్లా
సెల్.నం.9603763848

నిశ్శబ్ద గీతికలు!

నా ఎదలో
పల్లవించిన నా ఆలాపనలు
ఒక్కొక్కటి ఎదగీతికలై...
నన్ను తాకుతుంటే..
నా మదిలోని భావాలు
నిశ్శబ్ద గీతికలై
సుప్రభాతంలా ఉషోదయం వైపు
నన్ను లాక్కొని వెళ్తుంటే..
వేవేల తలపులతో
ఆశల వలయంలో చిక్కుకుని..
గమ్యం చేరని దారుల్లో
తీరం తాకని సంద్రంలో
తడి ఆరని కన్నులతో..
నన్ను నేను వెతుక్కుంటున్నా..!

- గంజి భాగ్యలక్ష్మి
వరంగల్, సెల్.నం.9441993044

మానవ నైజం
పీల్చేగాలి, తినేతిండి
త్రాగేనీరు, వాగే నోరు
ఉండే ఊరు, పారే ఏరు
విషయం ఏదైనా విషతుల్యమే
రోగంతో పుట్టే శిశువు
రోగాలతో పెరిగే తనువు
అనురాగాల మాట అటుంచితే
కూనిరాగాలు కూడా తీయలేని బతుకు
తలలు పండినా, తరాలు మారినా
మారని ప్రకృతి విరుద్ధ ప్రవర్తన
నమ్మడం మోసపోవడం నిత్యకృత్యమైనా
అస్థిత్వం కోసమే ఆరాటం, పోరాటం
స్వార్థం, అవినీతులే
ఉచ్ఛ్వాస, నిశ్వాసలుగా మారిన సమాజంలో
ఇంకెక్కడి సహజత్వం!
అంతా కృత్రిమత్వం
ఇక మారదు ‘మానవ నైజం’..
మానవత్వపు దరి
చేరితే తప్ప
ప్రేమ తత్వాన్ని అలవర్చుకుంటే తప్ప
ఇక ‘మానవ మనుగడే’ కష్టం..
పశువులాగాక
మనిషి, మనిషిగా బ్రతికితే తప్ప
ప్రకృతిని ప్రేమిస్తూ
అనుకరిస్తే తప్ప..

- అడప రాజు
సీతారాంపురం, వరంగల్ జిల్లా
సెల్.నం.9177825265

రెండు వేల నోటు

రెండు వేళ్ల మధ్యన
రెండు వేల నోటు...!
రెండు మనసుల మధ్యన
రెండు సెల్ఫీ ఫోటోలు దిగింది
రెండు వేల నోటు..!
రెండు కుటుంబాల మనస్సుల్లో
రెండు చిచ్చులు రేపింది నోటు..!
రెండు నిండు ప్రాణాల్ని తీసింది
రెండు వేల నోటు చిల్లర దొరకక..!
రెండు రంగుల్లో ఒకటి తెల్లనిది
రెండు పింక్ రంగుతో మెరిసిపోతోంది..!
రెండు నోటు పేదవాడికి దూరమై
రెండు బడాబాబులకు దగ్గరైంది..!
ఏది ఏమైనా రెండు వేల నోటు
రెంటికి చెడ్డ రేవడిలా మారింది..!

- గుండు రమణయ్య
పెద్దాపూర్, జూలపల్లి
పెద్దపల్లి జిల్లా
సెల్.నం.9440642809

మనిషి రూపాలు
మనిషికి రెండు రూపాలు
ఒకటి స్వార్థం
రెండవది త్యాగం!
మనిషికి రెండు ప్రవృత్తులు
ఒకటి ధర్మం
రెండవది అధర్మం!
మనిషికి రెండు నాల్కలు
ఒకటి నిజం
మరొకటి అబద్ధం!
మనిషికి రెండు జీవితాలు
ఒకటి పారదర్శకం
మరొకటి రహస్యం!

- అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557

అందరి కోసం
మనసంతా మట్టి తత్వం
అమ్మా కొమ్మా రెమ్మా తత్వం
తిండి ఠికాన లేకున్నా అన్ని మరచి
ప్రాణాన్ని ఫణంగా పెట్టి
ఏకె.ఆర్‌ఎల్, మోటారు గర్జనలతో
అవనికోసం విజృంభించే సమరయోగ్యుడు
మంచులో మంచై, కొండలో కొండై
హద్దు సరిహద్దు ఎక్కడైనా
విధిని ఆరాధించే వీరుడు
ఆరాటంతో పోరాటం చేస్తూ..
ఆకాశాన్ని అధిరోహించే ధీరుడు
చక్కని చుక్కై చీకటిని చీల్చే
భరతమాత అస్లీ బిడ్డ
స్ట్రైక్ చేయనివాడు లోకంలో
ఒకే ఒక్క సైనికుడు
ఎంత జీతం! ఎన్ని పదవులు!
ఫీల్డ్‌లో ఫీల్డరే!
పీస్‌లో బతుకు వసతులెన్ని!
ఎండి, తడిసి, వణికే రైతన్నలా
అహర్నిశలు అందరికోసం
అద్దమై నిలిచేవాడు
దీపమై వెలిగేవాడు

- పెరుక రాజు
వెల్లింగ్‌టన్, తమిళనాడు
సెల్.నం.9849618364

సాహిత్య సమాచారం

వసునందన్‌కు సినారె
కవితా పురస్కారం
కరీంనగర్ సాహితీ గౌతమి ఆధ్వర్యంలో ప్రతి ఏటా రాష్టస్థ్రాయలో ఇవ్వబడుతున్న ప్రతిష్ఠాత్మక సినారె కవితా పురస్కారం-2016కు ప్రముఖ కవి రావికంటి వసునందన్ ఎంపికైనట్లు పురస్కార కమిటీ కన్వీనర్ డా. ఎడవెల్లి విజయేంద్రరెడ్డి, సంస్థ అధ్యక్ష కార్యదర్శులు దాస్యం సేనాధిపతి, గాజుల రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. సినారె కవితా పురస్కారం రజతోత్సవాలు పూర్తిచేసుకున్నందున విశిష్ట సినారె కవితా పురస్కారం కోసం వసునందన్ రచించిన మన తెలంగాణ తల్లి కావ్యాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. కమిటీ సమావేశంలో కన్వీనర్, అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు డా. గండ్ర లక్ష్మణరావు, వారాల ఆనంద్, కె.ఎన్. అనంతాచార్య పాల్గొన్నారు.

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

email : merupuknr@andhrabhoomi.net

- బి.కళాగోపాల్