విజయవాడ

అపసంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోగీతికలు

అపసంస్కృతి

ఇంగ్లీష్ కోసం
మెడలు నరుక్కొని
బంగారు కిరీటాలు
ఏనాడో పెట్టుకున్నాయి
మన జంబూద్వీప భాషలు

సంస్కృతి
అపసంస్కృతిగా మారిన వేళ
మనుషులు మోయాల్సిన శవాలను
కార్లూ వ్యాన్లు మోస్తాయి
నవమాసాలు
తల్లి మోయవలసిన బిడ్డను
అద్దెతల్లి మోస్తోంది

వాడు సూటూ బూటూ తొడిగితే
మనమూ తొడిగాము
వాడు టీ తాగితే
మనమూ తాగాము
వాడు సిగరెట్ పొగించితే
మనమూ పొగించాము

వాడు రాక్ అండ్ రోల్ ఆడితే
మనమూ ఆడాము
వాడు బ్రేక్ డ్యాన్స్ చేస్తే
మనమూ చేశాము

వాడు క్రికెట్ ఆడితే
మనమూ ఆడాము
వాడు ఫుట్‌బాల్ ఆడితే
మనమూ ఆడాము

వాడు ఫోర్క్‌తో తింటే
మనమూ తిన్నాము
వాడు పర్యావరణ విధ్వంస సైన్సుని
నెత్తినెక్కించుకొని ఊరేగితే
మనమూ ఊరేగాము
వారు పురుగుమందులు
రసాయనిక ఎరువులు
జన్యుమార్పిడి విత్తనాలు జల్లితే
మనమూ జల్లాము
వాడికి జలుబు చేస్తే
మనం తుమ్ముతాం

మన గోలీలాట
మన కఱ్ఱాబిళ్ళాట
మన బొంగరాలాట
మన ఒంగుళ్ళూ దూకుళ్ళాట
మన దాగుడు మూతలాటలు
మన పులివేషాలను
వాడు అనాగరికమైనవని అంటే
మనమూ అనేశాము

వాడు ఏం చేయమంటే
మనం అది చేస్తాం
మన మెదళ్ళు
వాడి ఆధినంలోనే ఉన్నాయి
వాడు ఏనాడో
వాటిని కబ్జా చేసుకున్నాడు

వాడు వినియోగ బానిసత్వాన్ని
ప్రపంచీకరించి
ఆ రొచ్చుగుంటలో
మనల్ని విసిరేశాడు
దానికి మూలమైన ఫ్యాక్టరీని
రద్దు చేసినపుడే
వినియోగ బానిసత్వం
అంతవౌతుంది

- అల్ ఫతా, విజయవాడ

మన కోసం
మానవ మేధ సృష్టించిన
అంతరాల విస్ఫోటనాల మధ్య
అంతఃకలహం అంటుకుందిక్కడ
వేలాది అణచివేతల అంతరంగాల నుండి
అధోజాతుల ఆత్మనిర్వేదం
ప్రజ్వలిస్తుందిక్కడ
క్షణాలను యుగాలుగా గడిపిన
అవమాన శకం పోదు
యుగాలను క్షణాలు చేసే
ఉత్సాహశక్తి పుడుతుందిక్కడ
నివురుగప్పిన నిప్పుల్లాంటి శక్తులు
నేడు ప్రజ్వలించి
అగ్నిస్తంభాలై నిలబడుతున్నాయ్
ఇన్నాళ్లూ ఊహల్లో మిగిలిన
ఆశల మిణుగురులు
నేడు ఉల్కాపాతంగా వర్షించి
కలల్ని పండిస్తయ్
చేపనెత్తురు లాంటి మా రక్తం
నేడు కవోష్ణ రుధిరమైంది
న్యాయం కోసం
అది సముద్రంలా ఎగుస్తోంది
చెదిరిన సమాజ పటం కింద
నలిగిన జీవితాలు
పునరుజ్జీవం పొంది
కొత్త మొక్కలై మొలుస్తున్నయ్
ఈ పిల్లమొక్కలు త్వరలోనే ఎదుగుతయ్
మహావృక్షాలై మన సామాజిక చిత్రానికి
కొత్త రూపునిస్తయ్

- సిహెచ్‌ఎంకెఎస్ చలం,
దుగ్గిరాల, గుంటూరు జిల్లా.
చరవాణి : 8125752234

చదువులమ్మ తిరునాళ్లు

గ్రంథాలయ ప్రభువులూ... పుస్తకాలు కొనండి!

కొత్త సంవత్సరానికి ప్రతి ఏడాదీ పుస్తకాలు స్వాగతం పలకడం తెలుగువారి అదృష్టం. జనవరి 1 నుండీ బెజవాడలో చదువులమ్మ తిరునాళ్లు జరుగుతాయి. తెలుగునేల నలుచెరగుల నుండీ పుస్తకాల మోజుపరులు తరలిరావటం పాతికేళ్లకు పైబడిన కాలం నుండీ ఒక రివాజు. బెజవాడకు గర్వకారణమైన పుస్తక ఘన మహోత్సవం 27వసారి మళ్లీ మొదలైంది. జనవరి 1న పుస్తక ప్రేమికులు అక్కడ కలుసుకుని కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొనే ముచ్చటైన సన్నివేశం ఇది. పుస్తక ‘పెరుమాళ్ళు’కు ఈ తిరునాళ్ళు అంకితంగా సాగుతున్నాయి. ప్రముఖ ప్రచురణకర్త, జయంతి పబ్లికేషన్స్ అధినేత దివంగత మువ్వల పెరుమాళ్ళుగారి పేరుని పుస్తక మహోత్సవ ప్రాంగణానికి నామకరణం చేసి ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
పుస్తకాలు పండితే, మస్తకాలు నిండుతాయి. లోకానికి అదే సంక్రాంతి.. అదే వెలుగు.. అదే చైతన్యం! 1988లో పుస్తక ప్రచురణ సంస్థ ప్రముఖులు కొందరు కలిసి కలకత్తాలో జరిగే పుస్తక ప్రదర్శనకు వెళ్లి చూసినప్పుడు కలిగిన ఆలోచనకు సాకారమే ఈ పుస్తక మహోత్సవం. నేషనల్ బుక్ ట్రస్ట్ సహకారంతో 1989లో మొదటి మహోత్సవం ఇదే స్వరాజ్య మైదానంలో చిన్నదిగా మొదలయ్యింది. అలా మొదలైన ఈ ప్రస్థానం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నేతృత్వంలో అత్యంత పరిణతి కలిగిన నిర్వహణా సామర్థ్యంతో నిరాఘాటంగా సాగుతోంది. మధ్యలో రెండు మూడు దఫాలు భారీ వర్షాలు కురిసి మైదానం జలమయమైనా పుస్తక విక్రేతలు మొక్కవోని దీక్షతో ఈ మహోత్సవాన్ని కొనసాగించగలిగారు. ఏ యేటికాయేడు పుస్తకాల కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. పుస్తకానికి ఆదరణ లేదని, చదువరుల సంఖ్య పడిపోతోందనే అభిప్రాయానికి ఈ గణాంకం ఒక జవాబు. చదివే వారి సంఖ్య కూడా పెరుగుతోందనేది నిజం.
బెజవాడ రాజధాని కావటం దాని చారిత్రక ప్రాధాన్యతని, సాంస్కృతిక వైభవాన్ని దెబ్బతీస్తుందని ముందునుంచీ భయపడుతున్నట్టే ఇక్కడ జరుగుతున్న పరిణామాలున్నాయి. 2014లో రజతోత్సవం జరుపుకున్న ఈ పుస్తక మహోత్సవం ప్రాంగణంలో అత్యధికంగా గత సంవత్సరం 389 స్టాళ్లు ఏర్పరచగలిగారు. కానీ, వాటిలోంచి నూటయాభై స్టాళ్లను ఈసారి తగ్గించాల్సి వస్తోంది. అందుకు రాజధాని నిర్మాణమే ఒక కారణం. కాగా, ప్రభుత్వానికి పుస్తకం పట్ల గౌరవం లేకపోవటం అంతకుమించిన కారణం అవుతోంది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అనే స్వచ్ఛంద పుస్తక సేవా సంస్థ ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్న ఈ పుస్తకాల పండుగ ప్రజా సంబంధమైన ఒక సేవా కార్యక్రమం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పుస్తక వ్యాపారుల కార్యక్రమంగా చిన్నచూపు చూడటం బాధాకరమైన విషయం. ఎప్పుడూ జరిగే పుస్తక ప్రదర్శన ఈ ఏడాది సగానికి చిక్కిపోవలసి వస్తోందంటే ఇందులో ‘పబ్లిక్ ఇంట్రస్ట్’ అనే మూలసూత్రాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని అర్థం. అనేక రకాలుగా ఆక్రమణలకు గురైన స్వరాజ్య మైదానంలో తాజాగా ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం కూడా చేరింది. పండిత జవహర్‌లాల్ నెహ్రూ ఆనాడు ప్రసంగించిన వేదిక ఇప్పటికీ స్మృతి చిహ్నంగా నిలబడి ఉంది. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్, ఆనాటి ప్రధాని మొరార్జీదేశాయ్, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభృతులు ప్రసంగిస్తుంటే లక్ష మంది నిలబడి విన్న ఉదంతాలు ఈ స్వరాజ్య మైదాన జ్ఞాపకాల్లో ఇమిడి ఉన్నాయి. ఇంక అంతటి అవకాశం లేదు. రేపెప్పుడైనా అలాంటి మహనీయుడు బెజవాడకొస్తే చాలినంత మైదానాన్ని ఇప్పుడు బెజవాడ కోల్పోయింది. కాబట్టి, మహా పెద్దలారా.. మా ఊరికి రాకండి!
1993లో నాలుగో పుస్తక మహోత్సవం సమయంలో పుస్తక ప్రియుల పాదయాత్రను ప్రారంభించారు. కలకత్తా బుక్‌‘ఫేర్’లో సత్యజిత్ రే నాయకత్వంలో జరిగిన వాక్ ఫర్ బుక్స్ కార్యక్రమం అందుకు ప్రేరణ. ఆ మొదటి పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహణలో నాక్కూడా భాగస్వామ్యం ఉండటం నాకు గర్వకారణం. ప్రతి ఏడాదీ జనవరి 4న ప్రెస్‌క్లబ్ నుండి పుస్తక ప్రియుల పాదయాత్ర ప్రారంభమై ప్రదర్శనగా మైదానికి చేరుకుంటుంది. పుస్తక ప్రియులు వౌనంగా గవర్నర్‌పేట వీధుల్లో ఊరేగింపుగా వెడతారు. పుస్తక ప్రాధాన్యత గురించిన ప్లకార్డులు పట్టుకుని ఊరేగింపు చేస్తారు. ఈ ఏడాది కూడా యథాతథంగా పుస్తక ప్రియుల పాదయాత్ర ప్రెస్‌క్లబ్ నుండి సాయంత్రం సరిగ్గా నాలుగ్గంటలకు ప్రారంభవౌతుంది. ఇందులో రచయితలు బాధ్యతగా పాల్గొనాలని సాహితీవేత్తలందరికీ విజ్ఞప్తి. పాఠకులు లేని రచనా వ్యాసంగం ప్రజలు లేని రాజ్యం లాంటిది. ఇది ఊరేగింపు కాదు, పాఠక దేవుడికి భక్తితో చేసే ప్రదక్షిణం. పోయిన ఏడాది కేంద్రమంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, కేంద్ర హిందీ సంస్థాన్ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పాదయాత్రలో సాహితీవేత్తలతో, పుస్తక ప్రియులతోనూ కలిసి అడుగులు వేశారు.
ఆరుద్ర, కాళోజీ లాంటి ప్రముఖులెందరో పుస్తక మహోత్సవానికి అతిథులుగా వచ్చి అభిమానులను పులకింపజేశారు. ఈ ఏడాది రాచపాళెం, ఓల్గా ప్రభృతులు వస్తున్నారు. సాహితీవేత్తల శత జయంతిని నిర్వహించటం, వారి సాహితీ సేవను స్మరించుకోవటంతో పాటు శత జయంతి సంవత్సరాన్ని ప్రారంభించే అవకాశం కూడా పుస్తక మహోత్సవానికే దక్కుతుంది. దివంగత సాహితీవేత్తలు, ప్రచురణకర్తలకు నివాళులు సమర్పించుకోవటం ఒక బాధ్యతగా నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకు అభినందనలు. ఇది బుచ్చిబాబు గారి శత జయంతి సంవత్సరం, మహాకవి గురజాడ శత వర్ధంతి కూడా! వారిద్దరికీ ఘనమైన సంస్మరణను ఈసారి చూడబోతున్నాం. సాహితీ సభల వేదికపై గ్రంథావిష్కరణలూ, సీడీల ఆవిష్కరణలు, వివిధ అంశాలపై చర్చావేదికలూ జరుగుతాయి. చల్లని సాయంకాలాల్లో అక్కడ సాహిత్యం పరిమళిస్తూ ఉంటుంది. ప్రతిసారీ ప్రతిభ వేదిక మీద విద్యార్థుల కోసం ప్రతిభా పాటవాల పోటీలు నిర్వహించేవాళ్లు. ఈ ఏడాది మైదానం స్థలంలో ప్రభుత్వ కోత కారణంగా అందుకు అవకాశం లేకుండా పోతోంది.
గత మూడేళ్లుగా పుస్తకాల కొనుగోళ్ల కోసం, సైటేషన్ నెంబర్లు ఇచ్చే ప్రక్రియ ఆగిపోయింది. గ్రంథాలయ నిధుల్లో అధిక భాగం పాఠ్య గ్రంథాలకే వినియోగిస్తున్నారు. సృజనాత్మక సాహిత్యాన్నీ, పరిశోధనా గ్రంథాలనూ గ్రంథాలయ సంస్థలు కొనుగోళ్ల విషయంలో చాలా చిన్నచూపు చూస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. జనవరి 1న మొదలైన పుస్తక మహోత్సవంలో సాహితీ విలువలున్న గ్రంథాలను, కథలు, నవలలను ఇంకా ఇతర సాహితీ ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలను, భాషా సాంస్కృతిక గ్రంథాలను ప్రాధాన్యతనిచ్చి కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని రచయితల సంఘాల పక్షాన కోరుతున్నాము. ఇందుకోసం ఒక కొనుగోళ్ల కమిటీని వేసి మూడేళ్ల లోటునూ తీర్చటం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. సంకల్ప బలమే ఇక్కడ ప్రధానం. మంచి సాహిత్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వకపోతే తెలుగులో జ్ఞానపీఠాలు, ఇతర జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలూ ఎలా వస్తాయి? రచయితలు ‘రాయని భాస్కరులు’ కాకముందే పుస్తకాల పట్ల వివక్ష ఆపగలగాలి. పుస్తక మహోత్సవాన్ని చూడటం, పుస్తకాలు కొనటం అనేవి ప్రజలు కూడా చేసుకోవలసిన మంచి అలవాట్లు.

- డా. జి.వి. పూర్ణచందు,
ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా రచయితల సంఘం,
విజయవాడ. చరవాణి : 9440172642

పురస్కారం

నరసింహస్వామికి
మల్లెతీగ పురస్కారం
నిజామాబాద్‌కు చెందిన జి.నరసింహస్వామి రచించిన ‘పుట్టినట్లు’ కవితకు మల్లెతీగ ప్రధాన పురస్కారం లభించింది. ఆత్మీయ పురస్కారానికి డా. ఎంబిడి శ్యామల (తెనాలి) రచన ‘వర్ణాలను రాశిపోసినవాడు’, చిన్ని నారాయణరావు (నెల్లూరు) రచన ‘మహోదయాన్ని సృష్టిద్దాం’, సరికొండ నరసింహరాజు (నాగార్జునసాగర్) రచన ‘కవిత్వమే నా ఊపిరి’, సవ్యసాచి (హైదరాబాద్) రచన ‘బలిచక్రవర్తి’, సిరికి స్వామినాయుడు (పార్వతీపురం) రచన ‘ఎదురీత’ కవితలు ఎంపికయ్యాయి. ప్రధాన పురస్కారానికి రూ.5000/- నగదుతో సత్కారం, ఆత్మీయ పురస్కారానికి రూ.1000/-ల నగదుతో సత్కారం వుంటుంది. జనవరి మూడో వారంలో విజయవాడలో జరిగే ప్రత్యేక సభలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు. పాల్గొన్న కవులందరికీ ధన్యవాదాలని మల్లెతీగ సాహిత్య వేదిక అధ్యక్షులు కలిమిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.

విజ్ఞత

పుస్తకాన్ని ‘కొని’ చదువుదాం!
‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము’
అని సుభాషితం. అది ఒక సంపద. దాన్ని గడించటానికి పుస్తక పఠనం మేలైన సాధనం. అన్నిటినీ మించి
పుస్తక పఠనం విజ్ఞతని
పెంచుతుంది అని విదురనీతిలో
ఒక పరోక్ష ఉటంకింపూ ఉంది.
మనిషి ఉన్న తత్వాన్ని విజ్ఞతే
నిరూపిస్తుంది.
పుస్తకాన్ని ‘కొని’ చదివే విజ్ఞతని
పరిరక్షించుకుందాం. కదలండి!!

పుస్తక పఠన ఫలితం ఒక జ్ఞాన సమాహారం. విజ్ఞానం, వినోదాహ్లాదం, సమాచారం, లోకవృత్తం, రీతీరివాజూ, మనిషీ, సమాజం, మనిషి స్వభావం, సమాజం పోకడ... ఇలా ఎన్నిటినైనా అందుకోవచ్చు. అది వ్యక్తి చైతన్య పరిధిని విస్తరింపచేస్తుంది. హృదయ పరివర్తనకూ దోహదం చేస్తుంది.
బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చిందని సినారె గారి ఉవాచ! పుస్తక ప్రదర్శనలో కూడా లుక్ కల్చర్ కలిసే వుంది. విండో షాపింగ్ కూడా ఎక్కువే. పుస్తకాన్ని ‘కొని’ చదువుదాం. కొనటం కేవలం ‘పుస్తకం హస్త్భూషణం’ కోసం కాకూడదు. చదవటం ఒక అనుభవం. అనుభవం ఆనందాన్నిస్తుంది. ఆనందం అనుభూతిని కలిగిస్తుంది. అనుభూతి మనసుకూ, గుండెకీ ఒక చెప్పలేని అనిర్వచనీయతని పంచుతుంది. ‘కథలు చదివితే కళ్లకు వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి. మనసుకు ఉత్సాహమూ, ఉల్లాసమూ కలిగిస్తాయి’ అని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు అంటారు. కథలనే కాదు, విషయం ఏదైనా పుస్తక పఠనం ఈ ‘రసాయన క్రియ’ని జరుపుతుంది. చదువు ప్రతిఫలాన్ని అక్షరాలతో చెప్పలేము. ఆ భావస్పందన వర్ణనాతీతం’! అందుకనే చదువు ఆవశ్యకతని అంతనూ కలగలిపి - భాగవతంలో హిరణ్యకశిపుడంతటి వాడు ఇలా చెప్పేశాడు. ‘చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్/ చదువగ వలయును జనులకు...’ అని! చదివితేనే- మంచీ చెడూ తెలిసేది మరి!
పుస్తకం మంచి మిత్రుడు అంటారు. మాటా, మనసూ కలబోసుకుంటేనే మిత్రుడైనా ‘మంచి’ చేయగలుగుతాడు. పుస్తకమూ అంతే. దానితో మాట్లాడాలి. అది చూపే దృశ్యాన్ని చూడగలగాలి. అది చెప్పే రహస్యాల్ని అంతరాంతర జ్యోతిస్సీమలో అందుకోవాలి. ఆ ‘మూడ్’ని స్వీకరించాలి. అప్పుడు పుస్తక పఠనం చెత్త ఆలోచనల్నీ, నెగెటివ్ భావాల్నీ ఊడ్చేస్తుంది. అనారోగ్యాన్ని కలిగించే ఒత్తిడి స్థాయినీ, ఉద్వేగ ఉద్రేకాల్నీ తగ్గిస్తుంది. పుస్తకం మంచి మిత్రుడు. ఒంటరితనంలో ఆప్తమిత్రుడు. అయితే ‘మంచి’ని అందించే పుస్తకం ఎంపిక- మనం ఇప్పటికే సంపాదించుకున్న చదువూ, సంస్కారం మీద ఆధారపడి వుంటుంది. వేపవిత్తు నాటుకుని మామిడి పండుని ఇమ్మంటే ఇవ్వదు కదా! సుప్రసిద్ధ కవి బాలగంగాధర తిలక్ అంటాడు, ‘తెరిచే కిటికీని బట్టి పరతెంచే పరాగం ఉంటుంది’ అని.
‘యు లివ్ సెవరల్ లైవ్స్ వైల్ రీడింగ్’ అంటాడు ఒక ఆంగ్ల కవి. ఏకకాలంలో అనేక అనుభవాల్ని ప్రసాదించే మహత్తర శక్తి పుస్తకానికి వుంది. కాగ్నిటివ్ లెవల్‌లో పఠనం అలాంటి కుదుపుని కలిగిస్తుంది. జ్ఞాపక శక్తినీ పెంచుతుంది. ఇటీవలి వైద్యశాస్త్ర పరీక్షలు పుస్తక పఠనాన్ని ఆల్జీమర్స్ వ్యాధి చికిత్సలో ఒక సాధనంగా పరిగణిస్తున్నాయి. అలాగే పఠనంలో మనం సమకూర్చుకునే ఏకాగ్రత్త, చిత్తశుద్ధికీ, సానుకూల భావభావనలకీ అవకాశం కలిగిస్తుందంటున్నారు వైజ్ఞానికులు. జ్ఞాన సాధనకు కేవలం మూడే మార్గాలున్నై. వాటిలో విద్యార్జన (పఠనం) ముఖ్యమైనది. మిగిలినవి ఇతరులు చెప్పేది వినటం, తనకు తానుగా అనుభవాన్ని పొందటం. ఎగైన్ ఆ అనుభవానికి పఠనమే తోడ్పడవచ్చు!
‘అరచేతిలో (స్వర్గం.. కాదు!) సమాచారం’ యుగం కదా ఇది! అన్నీ ఒక్క క్లిక్‌తో లభ్యం.. అంటారు, అనుకుంటారు గానీ, నూరుపాళ్లు నిజం కాదు. ఇంతకుముందే ఎవరన్నా చదివి, రాసిపెట్టి వుంటేనే కదా ఆ సమాచారం మన ‘క్లిక్’కి ‘సిద్ధము సుమతీ’ అనేది! అలాగే, పుస్తకం ‘కొని’ చదువుకోవాల్సిన అవసరం లేదు అనే భావనా ఉంది. నెట్‌లో కూరుకుపోయిన కనుచూపుకీ, పుస్తక పఠనాన్ని అంగీకరించే చూపుకీ- రానున్న ఆరోగ్య స్థితిలో చాలా తేడావుంది. (ఉంటుంది కాదు). నెట్ పరిమిత స్థాయిలో వుంటే మాత్రమే సౌలభ్యాన్ని కూరుస్తుంది. జోక్ అనుకోకూడని ఒక నిర్వచనాన్ని ఎన్నడో ఇచ్చారు ఆరుద్ర, ‘ఆధునికుడు ఒక జిరాఫీలా తయారవుతున్నాడు. రోజురోజుకూ అతని మెదడుకీ, హృదయానికీ దూరమెక్కువవుతోంది’ అని. ఎంతో అర్థవంతమైన భావం!
పుస్తక ప్రదర్శనలో అనేకానేక విషయ ప్రాధాన్యతని సంతరించుకున్న వేలవేల పుస్తకాలు. మనకు (అభి)రుచికరమైన పుస్తకాన్ని మనం ఎంచుకుంటాం. మంచిది! అయితే, మనం ఎన్నుకున్న పుస్తకం మెదడులో ఆచరణాత్మకమైన, ఆరోగ్యదాయకమైన ఆలోచనల్ని కలిగించేదిగా ఉండి, మనల్ని క్రియాశీలురుగా పురోగమింపచేసేదిగా ఉంటే- ఇంకా ఇంకా.. మంచిది అవుతుంది! పుస్తకం చదవగానే ఉద్యానవనంలో విహరించినట్లయింది అనీ, జీవితం, ప్రపంచం సరికొత్తగా గోచరించాయి- అనీ శ్రీమతి కసిరెడ్డి లలిత అనే విదుషీమణి తమ ఆనందాన్ని వెల్లడించారట. అదీ అసలైన పుస్తకానందం! ఈ వాస్తవాన్ని సాహితీ మిత్రుడు కోట పురుషోత్తం తమ ‘వ్యక్తిత్వ వికాసానికి సంఘటనే మూలం’ అనే పుస్తకంలో నమోదు చేశారు!.
‘విద్య నిగూఢగుప్తమగు విత్తము’ అని సుభాషితం. అది ఒక సంపద. దాన్ని గడించటానికి పుస్తక పఠనం మేలైన సాధనం. అన్నిటికీ మించి పుస్తక పఠనం విజ్ఞతని పెంచుతుంది అని విదురనీతిలో ఒక పరోక్ష ఉటంకింపూ ఉంది. మనిషి ఉన్నతత్వాన్ని విజ్ఞతే నిరూపిస్తుంది. పుస్తకాన్ని ‘కొని’ చదివే విజ్ఞతని పరిరక్షించుకుందాం. కదలండి!!

- విహారి, హైదరాబాద్,
చరవాణి : 9848025600

పుస్తక పండుగ...
ఆనందం దండిగ!

పుస్తకం అక్షర విషయాల సమస్తం
పుస్తకం మనిషిలోని సు-వర్ణాల మస్తకం
అచ్చంగా అచ్చుయంత్రాలు
పుస్తెకట్టగా ఏర్పడింది పుస్తకం
పురాతన తాళపత్ర ప్రతులకు
మారురూపమైన వాస్తవం పుస్తకం
పొత్తపుగుడిలో విగ్రహం పుస్తకం
చైతన్య సింధూరం
అది జ్ఞానానుగ్రహ బంధురం
పుస్తకం సత్యం-శివం-సుందరం
మానసికానందారోగ్యభాగ్యాన్ని
సమకూర్చడంలో
బుక్ కల్చర్ పల్లెతల్లి అయితే-
గరంగరం నగరంలోని
ప్రియురాలి రాగవల్లి లుక్ కల్చర్
గాజులూ-ఉంగరాలూ-గడియారాలూ
కావు హస్తాలకు భూషణాలు
పుస్తకమే నిజమైన శాశ్వతమైన భూషణం
దాన్ని సరిగా వినియోగించుకుంటే
మనిషి సమస్త పరిజ్ఞాన భోషాణమే మరి
పుస్తకంతో కరచాలనం చేస్తే
సకల కళా ప్రపంచమంతా
అవుతుంది మనిషి ఆస్తి
అంతర్జాల మహేంద్రజాలాలు
ఎన్ని దాడిచేసినా
పుస్తకమిచ్చే ఆరోగ్య భాగ్యశీలం
వాడిపోదు - వీడిపోదు
పుస్తకం నరునికి మిత్రుడు
ప్రశాంతి గుణ పాత్రుడు
మంచి పుస్తకం ఒక్కటైనా లేని గేహం
ఆత్మలేని దేహం
ఇందులో లేదు ఆవంతైనా సందేహం
చినిగిన చొక్కానైనా తొడుక్కో
మంచి పుస్తకాన్ని ఒక్కటైనా కొనుక్కో
ఇది స-రసాల పుస్తకాల సంబరం
ఇది చదువరుల
‘విజయా‘ల’వాడ’ల సువర్ణ వర్ణాంబరం
ఇది పుస్తకం పండుగ
ఇక్కడ ఆనందం దండిగ!
వివేకానందం మెడుగ!

- డా.రామడుగు వేంకటేశ్వరశర్మ
గుంటూరు, చరవాణి : 9866944287

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupuvj@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- అల్ ఫతా