రాజమండ్రి

మెరుపు - రాజమండ్రి -- వినదగునెవ్వరు చెప్పినా... కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరుపు - రాజమండ్రి

వినదగునెవ్వరు చెప్పినా...

కథ

ఆకాశం నుండి వాన చినుకుల మెరుపు కళ్లల్లో తళుక్కుమంది. చినుకు తడికి మధుశాంతి శరీరం వణుకుతోంది. చూస్తుండగానే వాన వెలిసింది. హృదయంలో వెచ్చదనం. ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఇంతలోనే ఆటో ఎక్కింది బరువైన గుండెతో... ఎక్కడికి వెళ్లాలో చెప్పింది. ఇంటికి రానే వచ్చింది మధుశాంతి. ఇంకా ఆలోచనలు ఆమె వెనుకే నడుస్తున్నాయి. తలుపు తీసుకుని మంచం మీద వౌనంగా ఆలోచనల తాకిడికి కళ్లు మూసుకుంది. నిశ్శబ్దంగా...
మధుశాంతి హృదయంలో అలజడికి కారణం తనకు పెళ్లి సంబంధం రావడమే. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోరాదని నిర్ణయించుకుంది. ఉద్యోగంలో చేరి నెల రోజులు కాలేదు. అప్పుడే పెళ్లి చేసుకుని జీవితంలో ఆనందాన్ని దూరం చేసుకోవడం తనకు ఇష్టం లేదు. తన స్నేహితురాలు లత తనకు గట్టిగా చెప్పింది పెళ్లికి తొందర పడవద్దని. అప్పుడే పెళ్లి చేసుకుని నరకంలోకి వెళ్లడం మధుశాంతికి ఇష్టం లేదు. లతతో తనకు స్నేహం ఈనాటిది కాదు. ఇంటర్మీడియెట్ చదువుకునే రోజుల నుండి పిజి వరకు ఆమెతో కలిసి ఉంది.
మధుశాంతి, లత ఇద్దరూ ఒకే కళాశాలలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. లతకు పిజి కాగానే తన బావతో పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని బాధలు అనుభవిస్తూ జీవితంలో శాంతి లేకుండా కాలం గడుపుతున్న లత తన జీవితంలా మధుశాంతి జీవితం కాకూడదని అప్పుడే పెళ్లి చేసుకోవద్దని, పెళ్లికి కొంత సమయం తీసుకోమని లత ఒత్తిడి చేస్తోంది.
ఒకపక్కన స్నేహితురాలు లత మాటలు, మరోపక్క తల్లిదండ్రులు వెంటనే పెళ్లి చేసుకోమని ఒత్తిడి. బంగారం లాంటి సంబంధం వచ్చిందని, ఈ సంబంధాన్ని వదులుకుంటే మళ్లీ మంచి సంబంధం దొరకదని చెప్పడంతో ఆలోచనలో పడిపోయంది మధుశాంతి. తల్లిదండ్రులతో ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇంతకాలం పెంచి, చదివించి, ఉద్యోగం ఇప్పించిన వారికి ఇంకా పెళ్లి చేసుకోనని చెప్పడం ఎంతవరకు సమంజసం. ఒకపక్క స్నేహితురాలు. మరోపక్క తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియడం లేదు. మనస్సులో ఆలోచనలు, చిగురిస్తున్నాయ్. హృదయంలో అశాంతి నిండి ఉంది. మానసిక ఒత్తిడి కొనసాగుతోంది.
‘అమ్మాయికి పెళ్లి కొడుకు ఫోటో చూపించావా?’ అని భార్య కామాక్షిని అడిగాడు శ్రీనివాసమూర్తి.
‘నిన్ననే చూపించాను. అమ్మాయి అంతగా పట్టించుకోవడం లేదనిపిస్తోంది’ అని బదులిచ్చింది.
‘పెళ్లిమాట వింటే ఏ పిల్లయినా సిగ్గుపడటం సహజం. వౌనం అంగీకారంగా భావించాలి’ అన్నాడు.
ఏదో వంకపెట్టి సంబంధం వదులు కోవాలని చూస్తోందని మళ్లీ భర్తకు చెప్పాలనుకుంది. కానీ, వౌనం వహించింది.
‘మంచి సంబంధం. అమలాపురంలో పెద్ద కాలేజీలో అబ్బాయి లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఒక్కడే కొడుకు. పైగా తండ్రి తనకు మంచి మిత్రుడు. పెళ్లయిన తరువాత ఇద్దరూ ఆ కాలేజీలోనే పని చేసుకోవచ్చునని మరీ చెప్పారు వారు’ అన్నాడు భార్యతో.
అన్నీ బాగున్నాయ్! కానీ, అమ్మాయి ఏం చెబుతుందోనని ఆందోళనలో ఉంది కామాక్షి.
రెండు రోజులు గడిచాయి.
ఒక రోజున తండ్రి శ్రీనివాసమూర్తి ‘పెళ్లి వారికి ఏం చెప్పమంటావమ్మా?’ అని అడిగాడు కూతురిని.
రెండు నిమిషాలు వౌనం పాటించి, ‘ఇప్పుడే నేను పెళ్లి చేసుకోలేన’ని చెప్పింది మధుశాంతి.
‘కాళ్ల దగ్గరకొచ్చిన మంచి సంబంధం. కాదంటే మళ్లీ మనకు మంచి సంబంధం రాకపోవచ్చు. మన మంచితనం, సాంప్రదాయాలను మెచ్చి వచ్చిన సంబంధం. మళ్లీ ఒకసారి ఆలోచించు! నీవు చదువుకున్న దానివి. నేను చెప్పడం, నీవు కాదనడం మంచిది కాదు’ అన్నాడు.
‘అంతా నా ఖర్మ! పెద్ద చదువులు చదివించ వద్దని చెప్పినా నా మాట వినకుండా కూతురిని నెత్తికెక్కించుకుని చదివించినందుకు మీ మాటకు ఇచ్చిన విలువ ఇదా!’ అంది భార్య కామాక్షి.
‘వచ్చింది ఒకే ఒక సంబంధం. మంచి సాంప్రదాయం కలిగిన కుటుంబం. కాదంటే మళ్లీ మనకు అంతమంచి సంబంధం రాదు’ - అంది కామాక్షి మళ్లీ.
‘అమ్మాయిని మళ్లీ ఆలోచించి చెప్పమన్నాను కదా! ఈసారి మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను. నా క్రమశిక్షణలో పెరిగింది కదా! కామాక్షీ, కంగారు పడకు... మానసిక ఒత్తిడికి గురి కాకు... కాలమే మన సమస్యను పరిష్కరిస్తుంది’ అన్నాడు శ్రీనివాసరావు.
తన పనిచేస్తున్న కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్‌గా నాగమణి కొత్తగా చేరింది. అందరినీ పరిచయం చేసుకుంది నాగమణి. మధుశాంతిని పరిచయం చేసుకునే సమయంలో ఆమె ఏదో మానసిక ఒత్తిడికి గురైనట్టు ముఖం చూసి గమనించింది నాగమణి. అయినా తెలియనట్లు నటించింది.
మధుశాంతితో ‘ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా! నా చేత్తో నీకు ‘టీ’ ఇవ్వాలని కోరికగా ఉంది’ అని అంది. అలాగే వస్తానంది మధుశాంతి. ఈరోజే నాతో రమ్మని కోరింది నాగమణి.
అలాగే అంది మధుశాంతి.
నాగమణితో కలిసి వాళ్లింటికి వెళ్లింది మధుమతి.
ఇంటికి వెళ్లగానే ‘ఏదో ఆలోచనలో ఉన్నావు. నీ కళ్లల్లో ఆందోళన కనిపిస్తోంది. కారణం ఏమిటి? అని అడిగింది నాగమణి మధుశాంతిని.
ఇద్దరి మధ్య నిశ్శబ్దం కొంతసేపు.
‘నాతో చెప్పుకోలేని సమస్య అయితే వద్దు. నేను ఈ రోజు నుండి నీ అక్కను అనుకో’ అంది.
ఆ మాటతో మధుశాంతి హృదయంలో ఏదో ఆత్మీయత చిగురించింది.
తన ఆందోళనను విప్పి చెప్పింది...
ఒక్కసారిగా చిరునవ్వు నవ్వింది నాగమణి!
వింతగా చూసింది మధుశాంతి!
నీవు భావిస్తున్నట్టు నీ సమస్య అసలు సమస్య కాదు.
‘స్ర్తికి పెళ్లి దేవతలు నిర్ణయిస్తారు. నీకు మంచి సంబంధం వచ్చింది. తప్పక పెళ్లి చేసుకో చెల్లీ. నీ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు! నీవు పెళ్లి ఇంకా చేసుకోకపోవడానికి కారణం లేదు. చదువు పూర్తయింది. ఉద్యోగం చేస్తున్నావు. ఆలస్యం చేయడం మంచిది కాదు. తల్లిదండ్రులు మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడం మంచిది. అశాంతిలోకి దిగబడకు. ఆలోచనతో ప్రవర్తించడమే జీవితం.
పెళ్లి విషయంలో నీ మనస్సులో ఎవరో విషబీజం నాటారు. దాని ఫలితమే ఇది’ అంది.
‘నిజమే అక్కా... నా స్నేహితురాలు లత చెప్పింది’ అంది!
‘ఆమె ఉద్యోగానికి ముందే పెళ్లి చేసుకుంది కదా. నీ విషయంలో ఇంకా పెళ్లి చేసుకోవద్దని చెప్పడం న్యాయమా? ఆమె కష్టాలు నీకు కూడా వస్తాయని భావించడం తప్పు. ఎవరి జీవితం వారిది... పెళ్లయిన తరువాత పిల్లలు పుట్టడం సహజం. ఇది జీవితంలో ఒక భాగం. పిల్లల్ని పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. జీవితంలో కష్ట సుఖాలు త్రాసులో పళ్లెములు వంటివి. చీకటి వెలుగుల కలయిక జీవితం’ అంది. అక్క మాటలకు మధుశాంతి మనస్సులోని అశాంతి, అలజడి, ఆందోళన తొలగిపోయాయి.
మనస్సు తెల్లకాగితంగా మారింది. చీకటి దూరం జరిగింది. వెలుగు దగ్గరకు చేరింది...
నాగమణి తన జీవితానికి వెలుగు ప్రసాదించిన దేవత. ఆమె అక్క కావడం తన అదృష్టంగా భావించింది. గుండె అలజడి సముద్రం కళ్లకు ఆనందం కాటుక పూసినట్టు మధుశాంతి మనస్సు ప్రశాంతంగా ఉంది. తన జీవిత పుస్తకంలో ఒక పేజీ దొరికినట్టు తనకు నాగమణి దొరకడం ఒక వరంగా భావించింది.
ఆరోజు రాత్రి హాయిగా నిద్రపట్టింది. తెల్లవారింది. కిటికీలోంచి చల్ల గాలి వీస్తోంది.
ఇంతకాలం గుండెల్ని చీల్చే బాధ ఈరోజు లేదు. కాలం ఆనందాన్ని మోసుకొచ్చింది నీకోసం అనుకుంది మనస్సులో... కొనసాగిన అశాంతి తొలగింది.
తల్లి ఉదయం ‘టీ’ పట్టుకొచ్చింది కూతురికి. నవ్వుతూ కనిపించిన కూతురు కళ్లల్లో ఆమెకు రాత్రి వెనె్నల కనిపించింది...
‘అమ్మా.. నేను పెళ్లి చేసుకుంటాను’
కూతురి మాటలకు ఆమె హృదయంలో కోటి ఆనందాల వీణలు మోగుతున్నట్టు అనిపించింది.
‘ఏమండీ... మన అమ్మాయి పెళ్లికి అంగీకరించిందండీ!’ అని అరిచింది భర్తకు వినిపించేలా.
తండ్రి ఆనందం ముందు ఆకాశం చిన్నబోయింది.

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం
చరవాణి: 92475 77501

మనోగీతికలు

జన బాంధవి

గోదావరి పుణ్య జలధారి
గోవుకు జీవమిచ్చి గంగే గోదారైనది
పశ్చిమ కనుమల జనియించి
బ్రహ్మగిరికి ఆభరణమై
ఔదుంబర ఔషధ శక్తి
మిళితము చేసుకుని
ఇంతింతై వటుడింతై
కుడి ఎడమల చెలులతో కూడి
కలసి మెలసి
నాసిక నాందేడ్‌ల సేద తీర్చి
తెలంగాణను మాగాణిగా చేసి
ఆంధ్రను అలరించి
యానాంను కలుకరించి
రాజమహేంద్రవరమునకు వరమై
అఖండ గోదావరిగా అవతరించి
తుల్య
ఆత్రేయ
భరద్వాజ
గౌతమి
వృద్ధగౌతమి
కౌశిక
వశిష్టులుగా
రుషి నామములు ధరించి
సప్త గోదావరులై
జీవన యామినిగా
యుగయుగాల జన జీవమై
నన్నయ ఆదిగా కవులెందరినో
అందించిన జ్ఞాన జలధి
నిత్యహారతుల మంగళదాయిని
యుగ యుగాలకు నిలయమై వెలుగు గాక
కలియుగ కల్మషంబు
వడివడిగా జనుల జీవనమున క్రమ్మి
అవలీలగ జీవ జలమును కలుషితము చేయ
ఉక్కిరి బిక్కిరై భరించుచున్న
జన బాంధవి గోదావరి
పుష్కర సమయాన పుణ్యస్నాన మాచరించి
మూటగట్టిన పాపములను
ఒక్క మునకతో పరిమార్చి
మానసావాచా కర్మణి కలుషమును నివారింప
ప్రతిజ్ఞ నొకటి ఆవిష్కరించి
అయినదేదో అయినదని
కానున్నది ముందుందని
తనువును మనసును
పవిత్రముగ చేసి
గోదావరి జలముల పవిత్రతను కాపాడ
ప్రాణముల ఫణమెట్టె
సప్తగోదావరుల
సప్త రుషుల సమమెంచి
అంతర్వేదికి సాగనంపుదము
సాగర సంగమము కొరకు

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
సీతంపేట, రాజమహేంద్రవరము,
చరవాణి : 94911 71327

గోదావరి అందరిది
సహ్యాద్రి కాడ పుట్టింది సుకుమారముగ
ఆ ప్రాంతాలనే దాటింది సునాయాసముగ
రామభద్రుని మురిపించింది
ప్రాణహిత, మంజీర లెన్నింటినో
తల్లి ఒడిలో చేరిన బిడ్డల్లాగ దాచుకొంది
నాగరికతకి కొత్తపుట్టములు గట్టి
అణువులందు దేశభక్తిని నింపింది
నీట తడిసిన మట్టికి ప్రాణవాయువు అయింది
పచ్చని కోనసీమ గుండెపైన
చల్లని కొబ్బరి బొండమై నిలిచింది
వెచ్చని రైతు గుండెపైన
తియ్యని వరికంకై మొలిచింది
జల సంపద మెండుగ ఉన్న నిధి
జనాలకి నిత్య జీవనోపాధి
కోటి లింగాలను నీట కరిగించి
వీరేశలింగాన్ని జాతికందించింది
తీయని నీరు త్రాగి భారతం తెలుగు అయింది
సాహిత్యం, తరగని సంపదగా నిలిచింది
నీటి చుక్కల్లో అమృతం కలిసి కాలువలై పారింది
కాలాలెన్ని మారినా అమ్మగానే నిలిచింది
మనుషుల స్వార్థపు రాళ్లు తగిలి
శరీరమంతా గాయాలతో మిగిలింది
పుష్కరాల పండుగ వచ్చిందని
పాలనతో ప్రయోజనం జత కట్టింది
నెత్తురోడుతున్న గాయాలకు
ఆదరా బాదరా కట్లుకట్టి
బొమ్మను చేస్తే నిలబడింది
నిత్యం హారతి అందుకొంటూ
అమాయకంగా చూస్తోంది

- ఎస్.ఆర్.పృథ్వి
రాజమండ్రి, సెల్:99892 23245

తృష్ణ

మేడలు - మిద్దెలు - కార్లు, సమస్త సంపదలున్నా
తృష్ణకు లోనైన వాడు, నిత్య దరిద్రుడు వాడు
సంపదతో కూడి ఉన్న, సుఖం పొందనే లేడు
ఎరను చూసి అత్యాశతో, చేపదాన్ని చేరుకొని
గాలం ముల్లుకు చిక్కి, కొట్టుమిట్టులాడునట్లు
ఎండమావులను గాంచి, నీరు తాగు లాలసతో
జింకలు పరుగులు పెట్టి, అలసి సొలసి కూలునట్లు
మరీ మరీ కూడబెట్టి, మురిసిపోవు పిసినారి
చేపలు - జింకలు వోలె, జీవితాన్ని కోల్పోవును
సంపదేమి లేకున్నా, శరీర కష్టం చేస్తూ
ఉన్నదానితో తృప్తిని, పొందునట్టి పేదవాడు
సంపద ఉన్నట్టు తలచి,
సుఖ - సంతోషాలనుభవించు
సంతృప్తియె ధన సంపద, పేరాశే దారిద్య్రం
ధనికులు - పేదలు - రాజులు, రాక్షస తృష్ణకు చిక్కి
దుఃఖంతో తల్లిడిల్లి, నేలరాలి పోయారు
తృష్ణకు వశమై ఎన్నడు, ఆనందం కోలుపోకు
సంతృప్తి చెంది జీవితాన్ని, సంపన్నమయం చేసుకో

- వెలగల ప్రదీప్ శంకర్‌రెడ్డి
కొంకుదురు

కవులంతా కదిలొస్తే!

శ్రీశ్రీకి వారసులొచ్చారు
చిలుంపట్టిన సమాజంపై
క్రాంతి రేఖల్ని విసిరి భుజం తట్టి
మునుముందుకు నడిపించడానికి
దేవులపల్లికీ వారసులొచ్చారు
వినీలాన చంద్రుణ్ని సినీగీతాల్లో
జనతమానసాల్ని
సదా రంజింప చెయ్యడానికి
దాశరథికీ వారసులొచ్చారు
నా తెలంగాణ కోటి రతనాల వీణంటూ
తెలుగుజాతి గౌరవాన్ని
దశ దిశలా చాటడానికి
గురజాడకూ వారసులొచ్చారు
దేశమంటే మట్టి కాదనీ,
జనతంతా సమైక్య జీవనాన్ని సాగిస్తూ
భారతమ్మ విలువల్ని
పురోగమింప చెయ్యాలనీ
రాయప్రోలుకూ వారసులొచ్చారు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
భారతమ్మ ప్రగతి నీ తెలుగు నేల కీర్తినీ
దశ దిశలా ఇనుమడింప చెయ్యడానికి
అల్లూరికీ వారసులొచ్చారు
క్షణికోద్రేకాన్ని మాని
జనతంతాప్రతిన బూని
అవినీతి అక్రమాలపై
నిరంతరం పోరు చెయ్యాలని
వెరసి ఇంత మందినీ కన్న నా భారతిని
ఇసుమంతైనా కనికరించక
ప్రగతి పేరుతో జగతికి కుదువ పెడుతూ
మతం మత్తూ కులయేళ్లూ స్వార్థావినీతి లంచగొండి తనంతో
చరితార్థులైన నాటి కవుల స్ఫూర్తితో
కవులంతా కదిలొస్తే జనియించేదే
సువర్ణ భారతం!

- దోసపాటి సత్యనారాయణమూర్తి
రాజమండ్రి, సెల్: 98666 31877

గుండెల్లో గుర్రం

చల్ చల్ గుర్రమంటూ
వీపుపై ఎక్కి నువ్వు సవారీ చేస్తుంటే
నీ నవ్వుల మూటను మోకాళ్లపై మోశాను
మబ్బుల్లేని చల్లని గదులన్నింట్లో
నక్షత్రకాంతులు కళ్లనిండా నింపుకుంటూ
బొమ్మగుర్రాన్నై ఊరూరు తిరిగొచ్చాను
మరోసారి ఎక్కేస్తానని కాలు దువ్వినప్పుడల్లా
కాలాన్ని ఏలే ధైర్యం నీలో కనిపించింది
ఈనల్లా కాంతులు కిటికీల గుండా
గదుల్లోకి చొరబడుతున్నపుడు
అనురాగతరగలు రేగుతూ
నిత్యం పలకరిస్తున్నాయి
కాసిన్ని గుప్పెట్లోకి తీసుకుని
కాలక్షేపానికి కావల్సినపుడు తలుచుకుంటున్నాను
అవి చిగురుల్లా పుడుతూనే ఉన్నాయి
గుండె గదులు మారవచ్చేమో కాని
చినుకుల్లో తడిచిన తొలకరి నేలన
మొలకలు పరుచుకున్నట్లు
అమ్మ - నాన్నల
జీవనప్రవాహం సాగిపోతుంది

- బండికట్ల రవి కుమార్ (బరకు)
సెల్:83328 54601,
ఏలూరు, ప.గో.జిల్లా
పుస్తక పరిచయం

అరాచకాన్ని ఎండగట్టిన ‘జారుడు బల్ల’

ఆలోచనాత్మకంగా ఆలోచించకపోవడమే ఈ దేశ మేధోపర దారిద్య్రం. కాకపోతే ఉన్నదల్లా భావ దారిద్య్రం. ఆ బురదలోనే పొర్లుతూ దొర్లుతూ కొట్టుకుంటారు. చావగొట్టు కుంటుంటారు. ఇదే చదువు‘కొన్న’ వారి దౌర్భాగ్యం. అది చదవ ‘లేని’ వారి దురదృష్టం. ప్రజల పక్షాన తన గొంతును పలికిస్తున్నారు. ఆశించి, శాసించి నాశనం చేసే రాజకీయ చట్రంలో కొల్లగొడుతున్న జీవితాల్ని గొల్లుమంటున్న జీవుల ఆర్తనాదాల్ని అక్షర బద్ధం చేశారు కాటూరి సూరన్న పంతులు అనే కెఎస్‌ఎన్ మూర్తి. ‘జారుడు బల్ల’ శీర్షికన వెలువడిన ఈ పుస్తకంలో తన ఆవేదనా భరితమైన ఆలోచనల్ని రెండు వ్యాసాల్లో పొందుపరిచారు. తర్వాత కొన్ని కవితలు, పాటలు గీతాల్లో దిగజారిపోయిన పరిస్థితులపై తన అక్షర బాణాలు సంధించారు.
రాజకీయ పార్టీల తీరుతెన్నుల్ని దుయ్యబడుతూనే వాళ్ల అరాచక విధానాలను ఎండగట్టారు. అనేకానేక విద్వేషాల్ని, విభేదాల్ని ఎలా ‘పావులు’గా చేసుకుంటాయో ‘తిరోగమనము’ వ్యాసంలో వివరించారు. పది కాలాలు తమ పదవులతో పాలన సజావుగా సాగడానికి కుటిల యత్నాలు, ఎత్తుగడలు ఎన్నయినా సాగించే రాజకీయ తంత్రాల్ని ఏకిపారేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల్ని తూర్పారపడుతూనే అవి నిర్వీర్య పరిచే చర్యల్ని విశే్లషణాత్మకంగా వివరించారు. మతతత్వాన్ని, కులతత్వాన్ని, జాతి విభేదాల్ని సృష్టించి అందలం ఎక్కే వారికి గుణపాఠం అవుతాయి దీనిలోని సంగతులు. ఉన్నవి రెండే కులాలు. ఒకటి డబ్బున్న వారైతే రెండోది డబ్బులేని వారు. ధనికులు, పేదవారు. ఈ దృష్టితో సమపాలన చేయాలి. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి రాజ్యాధికారం చేపట్టాలనుకోవడం తగదంటారు. ‘జరుగుతున్న చరిత్ర - భారత రాజ్యాంగం’ పేర రాసిన వ్యాసం ఆలోచన రేకెత్తించే విషయం. కులపరంగా, మతపరంగా అనుకూలమైపోయి ‘సెక్యులర్’ భావానికి ఎలా తూట్లు పొడుస్తున్నారో ప్రభుత్వాలను ఒక సూటి ప్రశ్నతో నిలదీసి అడుగుతున్నారు. మత ప్రసక్తి లేకుండా పాలన చేయలేరా అని ఆయన నిలదీస్తున్నారు. మతం మనిషికి వదిలి వాళ్లను భారతీయులుగా చూసి పాలన చేయడం అవసరమనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ దేశ దౌర్భాగ్యాన్ని నిరసించి నిలదీయమంటున్నారు. భారతదేశంలో అందరికీ ఒకే నియమావళి ఒకే విధానం ఉండాలంటారు. భారతీయతలోని విశ్వసనీయత అప్పుడే అగుపడుతుందంటారు. కుల, మత ప్రాతిపదికపై కాకుండా లేని వాటికి చేయూత నందించాలంటారు. లేదంటే మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోయే ప్రమాదముందంటారు. ఇలా చాలా విషయాలపై తనదైన బాణిలో విమర్శలు సలహాలు, సూచనలు పేర్కొని చైతన్య స్ఫూర్తిని కలిగించడానికి ప్రయత్నించారు పంతులు గారు. విలువల పతనంపై రచయిత కెఎస్‌ఎన్ మూర్తి ఆవేశ భరితుడై రాసిన అక్షర పటాసులు ఇందులో పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. జారుడుబల్లలో ప్రధానంగా కవిత్వీకరించిన ఎన్నో పద చిత్రాలు కొలువుదీరి ఉన్నాయి. రెండు వ్యాసాల్లో చర్చించిన విషయాలే కవితలుగా వెల్లువెత్తాయి. మొత్తం 38 శీర్షికల్లో కొన్ని గేయరూపం ధరిస్తే మరికొన్ని పాటలై ధ్వనించాయి. వీటినొక ఉద్యమ కాంక్షతో రగిలించడానికి ఉద్వేగ పరిచేందుకు రాశారు.
చాలా కవితలకు భావస్ఫోరకమైన ‘ఇలస్ట్రేషన్స్’ వేయించి ఆయా కవితలకు మంచి బలాన్ని సమకూర్చారు. పాఠకుని గ్రహింపులోకి భావం ఇనుముడింప చేయడానికి దోహదపడ్డాయనడంలో సందేహం లేదు. వ్యాసకర్తగా ఇంతకు మునుపు రాణింపు, గుర్తింపు ఉన్న కాటూరి సూరన్న పంతులుగారు కవితాంశంలోని పలుకుబడిపై దృష్టి పెడితే బావుండేది. అలాగే కవితా పీఠానికి పెద్దపీట వేసుంటే మరింత బావుండేది. పాఠకుడి మనసు గెలవటానికి మదిలో నిలవడానికి కవిత్వం చేసే పని ప్రత్యేకమైనది. అది పుష్కలంగా కనిపిస్తున్నా ప్రముఖం చేయలేక పోవడం లోపమనే చెప్పాలి. సుప్రసిద్ధ కార్టూనిస్టు శేఖర్ గారి కార్టూన్లు దీనిలో చోటు చేసుకున్నాయి. ఆయన గీతల్లో వ్యంగ్యత ఆయన రాతలో హాస్యం ఆలోచనకు పదును పెడుతుంది.
అయితే ఈ కార్టూన్లు పుస్తకానికి అందం పెంచడానికా మరెవెరికైనా ఆనందం పంచడం కోసం చేశారో తెలియదు. కవితలకు ప్రముఖ చిత్రకారులు పుప్పాల బాపిరాజు వేసిన చిత్రాలు కొత్తదనాన్ని తెచ్చిపెట్టాయి. ఎందుకో రచయిత అన్ని ప్రక్రియల్ని ఒకేచోట చొప్పించిన ప్రయత్నంగా కన్పిస్తుంది. వ్యాసాలు కార్టూన్లు కవితలు మిళితం చేసే వారు కెఎస్‌ఎన్ మూర్తిలోని కవిని కనుమరుగు పర్చేసి గాంధీజీ ఆత్మ రాసిన రచయితనే వెలుగు పరిచారు. కాని కవిని బహిర్గత పర్చలేదు. నిజానికి ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక సాహిత్య ప్రక్రియల్ని సృష్టించిన క్రమంలోనే ‘జారుడు బల్ల’ను వెలువరించారు.

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net