దక్షిన తెలంగాణ

శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ ఆ రోజు హుషారుగా ఉంది. అవును తన స్నేహితురాలు రమను కలువబోతున్నందుకు. అది పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా వారు చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్నేహితులందరు కలువబోతున్నారని ఊహించుకుంటూ.. బస్సు ఎక్కింది ఉమ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ..
ఆర్ట్స్ కాలేజి విద్య పూర్తి చేసుకుని విశ్వవిద్యాలయాన్ని వదిలిన 2016 రెండు దశాబ్దాల పిదప కలువడం కార్యక్రమానికి ఎక్కడెక్కడో స్థిరపడిన స్నేహితులందరు వస్తారని ఊహించుకుంటూ ఉమ కళాశాల ప్రాంగణం చేరింది. ఉమ కళ్లు తన ప్రాణ స్నేహితురాలు రమకోసం వెదుకుతున్నాయి. రమ కనబడగానే దాని దగ్గరకు వెళ్లి ఒక్కసారి దానిని చుట్టేసుకుంది. మిగతా స్నేహితులు రావడం కబుర్లు ఆనాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వాళ్లని వాళ్లు మరచిపోయారు. కాని రమ అందరితో అంతగా హదృయం విప్పి మాట్లాడలేకపోయింది!
రమను ఉమ పక్కకు తీసుకువెళ్లింది.. విశ్వ విద్యాలయం ఆవరణలో రమ, ఉమ ఓ సిమెంట్ బెంచీపై కూర్చున్నారు. ఆ ఇద్దరి మధ్య వౌనం ఆవరించింది!
ఉమ కలుగజేసుకుని, ‘ఏమిటి రమా డల్‌గా కన్పిస్తున్నావు? ఆరోగ్యం బాగా లేదా?’ అంది. ‘రమా... మీ వారు గొప్ప రచయిత అతని గురించి పత్రికవాళ్లు, టివి వాళ్లు గొప్పగా చెబుతుంటే మేము చూస్తూ చాలా మురిసిపోతున్నాం. ఎందుకంటే నా స్నేహితురాలికి ఇంత గొప్ప రచయిత భర్తగా దొరకడం అతను ప్రతి ‘ముఖాముఖి’లో నీ గురించే చెబుతుంటాడు. సంచలనాత్మక కథలు, నవలలు రాయడానికి నాకు ప్రేరణ నా భార్య అని. రమ నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి’ అంది ఉమ. ‘ఈ మధ్య మీ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆయన ఒక నవల రాస్తున్నాడని ఓ పత్రికలో చదివాను.. రాయడం పూర్తి అయ్యిందా?’ అని ప్రశ్నించింది ఉమ. ‘ఏమిటి రమా... నేను ఇంతగా మాట్లాడుతుంటే నువ్వేమి స్పందించవు’ అంది.
‘ఏమని చెప్పను? ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. విశ్వ విద్యాలయంలో చదువుతున్నప్పుడు అతని రచనలు చదువుతూ అతని భావాలకు ముగ్ధురాలిని అయ్యేదాన్ని.. తను ఏ కథ రాసినా చదివి పరవశించిపోయేదాన్ని ప్రతిస్పందిస్తూ ఉత్తరం రాసేదాన్ని. అలా మా మధ్య పరిచయం ప్రేమగా మారి పెండ్లి చేసుకున్నాం.
విశ్వవిద్యాలయంలో జరిగిన సంగతులు, మా జీవితంలో జరిగిన వాస్తవాలను నవలగా రాస్తున్నాను అంటే సంతోషించాను.
అతను రాయడం మొదలుపెట్టాడు సగం పూర్తయింది’ అంటూ చెప్పడం ఆపింది రమ.
‘ఇంకెందుకే బాధపడతావు.. సంతోషపడాల్సింది పోయి’ అంది ఉమ!
‘ఎలా సంతోషంగా ఉండను? ఒక్క క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నా... ఆ క్యారెక్టర్ పేరు శాంతి. ఆ నవలలో శాంతి అనుకోకుండా కలువడం... ఆమె బాధల్లో తాను పాలు పంచుకోవడం... శాంతి అనే క్యారెక్టర్ భర్త యాక్సిడెంట్‌లో... చనిపోవడం అలా తాను ఒంటరిగా ఉండడంతో ఈ మహానగరంలో తనకు తెలిసిన వాళ్లు ఎవరూ లేకపోవడం.. హీరో అంటే నా భర్త తనకి కావల్సిన సహాయ సహకారాలు చేస్తున్నట్టుగా తనకి ఆప్తుడిగా ఆత్మీయుడిగా ఉంటున్నట్టు రాశాడు’ అంది రమ!
కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుంటే తుడుచుకుంటూ రమ తన మాటల్ని కంటిన్యూ చేస్తూ..
‘నేను ఒక రోజు అడిగాను. ఈ నవల మన జీవితంలో జరిగిన సంఘటనల రూపం కదా! మరి ఈ శాంతి క్యారెక్టర్ మనకు కావాల్సిన వాళ్లలో ఎవరూ లేరు కదా! మీకెలా పరిచయం అయ్యింది?’ అని. అప్పుడు తను ‘నిజంగా మన జీవితంలో జరిగిన వాస్తవాలే ఈ నవలకి నేపథ్యం. కానీ, శాంతి క్యారెక్టర్‌ను కల్పితంగా సృష్టించాను. చదివే పాఠకులకు ఉత్కంఠ కోసం’ అని చెప్పాడు.
‘కానీ నాకు నమ్మాలి అన్పించడం లేదు ఉమా! శాంతి క్యారెక్టర్ ఏమిటో గాని నాకు మనశ్శాంతి లేకుండా పోయింది’ అంటూ ఉమ ఒళ్లో తల వాల్చింది రమ.. తెలియకుండానే ఇరువురి కళ్లూ వర్షించాయి!

- డాక్టర్ గంధం విజయలక్ష్మి
నిజామాబాద్
సెల్.నం.9948181458

---

పుస్తక సమీక్ష

కవిత్వపు సిరి...
వనఝరి!
పేజీలు : 72, వెల : 100/-
ప్రతులకు: కరిపె రాజ్ కుమార్
13-105, ఎన్‌టిఆర్ చౌక్
విద్యానగర్, ఖానాపూర్
ఆదిలాబాద్ జిల్లా-504203
సెల్.నం.81251144729
--
ఆయనకు అక్షరాలను ప్రేమించడం తెలుసు.. సామాన్య ప్రజల కష్టాలను తమ కవిత్వంలో ప్రతిబింబజేయడంలో మేటి! ఆయన కవితా పాదాల నీడలో సేద తీరుతాడు. తాత్త్విక తిలకాన్ని అద్ది కవిత్వాన్ని పండించడంలో ఆయన నేర్పరి! ఆయనకు ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలు తెలుసు! జిల్లా ప్రజల కల్లోల జీవితాలూ తెలుసు! ఆయనెవరో కాదు..గత మూడు దశాబ్దాలుగా కవిత్వ సేద్యం చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వాసి కరిపె రాజ్‌కుమార్..ఆయన భావోద్వేగాలను, అనుభూతులను అక్షర బద్ధం చేస్తూ.. ‘వన ఝరి’ పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించారు. కవిత్వపు సిరితో నిండుకున్న కవితా సంపుటి ‘వన ఝరి’లో ముప్పది కవితలున్నాయి!
‘అనంతుడు’ పేరుతో రాసిన మొదటి కవితలో కవిని విభిన్న కోణాల్లో ఆవిష్కరించారు. కవి అనుభూతిపరుడనీ.. రంగుల కలను ఆవిష్కరించే ఆవిష్కరుణుడిగా అభివర్ణించారు. కవిని పద్మవ్యూహాలను ఛేదించే వ్యూహకర్తగా మన ముందు నిలిపారు. కవి సుప్రసన్నుడు కనుక సృజన చేసి సంబరపడతాడని విడమరిచి చెప్పారు. కవి నిత్యనూతనుడైనా.. ఆపాత మధురం చేసే మాంత్రికుడని పేర్కొన్నారు. ఎవరినీ తిట్టని వాడు..మరెవరికీ పట్టని వాడు వనచరుడు గిరిజనుడని మరో కవితలో వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు ప్రణమిల్లి..కవి గోగుపూల రంగవల్లిని సమర్పించారు. కవి ఆదిలాబాద్ జిల్లా చారిత్రక, సాంస్కృతిక వాస్తవాలతో ఓ కవితను తీర్చిదిద్దారు. ఆదిలాబాద్ జిల్లా విశేషాలతో కవిత్వపు హారతి పట్టారు.
ప్రతిభకు కాలం ఎల్లకాలం పట్టం కడుతుందన్న నిజాన్ని ‘తెల్ల చీకటి’ కవితలో తేల్చిచెప్పారు. ‘తెలంగాణ విజయ ప్రస్థానం’ కవితలో కెసిఆర్ నాయకత్వాన నవశకం మొదలైన వైనాన్ని ఏకరువు పెట్టారు.
ఆదిలాబాద్ జిల్లా వాసినైనా.. వెనుకబడినోనే్న అయినా.. నేను మాటోనే్న.. ‘సదరు మాటోనే్న’ అంటూ ఓ కవితలో తమ ఖానాపూర్ పరిసర ప్రాంత ప్రజలు ప్రత్యేకతను చాటి చెప్పారు. బాల కార్మికులను రెండింతల దేశ భక్తులుగా అభివర్ణించారు. భారత దేశ ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూ..్భన్నత్వంలోని ఏకత్వాన్ని కొనియాడుతూ.. భారత మాతకు వందనం సమర్పించారు. ‘జయహో భారత్’ కవితలో భారతీయుడిగా స్వాభిమానాన్ని ప్రకటించారు. ఇంకో కవితలో తిరుపతి వెంకన్నను స్తుతించారు. అమరావతీ నగర అపురూప సంపదలైన శిల్ప సౌందర్యాలను మరియు మన దేశంలోని వివిధ స్థలాల్లో కొలువుదీరిన శిల్ప కళా నైపుణ్యాలను ప్రతిబింబిస్తూ రాసిన కవిత అందరినీ అలరిస్తుంది. ఆకట్టుకుంటుంది! కాలం యొక్క ప్రాశస్త్యాన్ని చివరి కవితలో చక్కగా ఆవిష్కరించారు. కాలం అమృత ధారావాహిక అనీ.. అది అజరామరం అని చక్కని ముగింపునిచ్చారు.
ఇలా ఇందులోని కవితలన్నీ కవి కరిసె రాజ్‌కుమార్ పరిశీలనా పటిమకు అద్దం పట్టేలా వున్నాయి.. కొన్ని కవితల్లో కవిత్వాంశ కొరవడినప్పటికీ.. ఆయన సామాజిక చింతనను అభినందించకుండా ఉండలేము.. అధ్యయనంపై మక్కువ చూపి.. మున్ముందు కవిత్వం రాయడంలో ఆయన మరిన్ని మెలకువలు తెలుసుకుని.. చక్కని అంశాలతో చిక్కని కవిత్వం పండిస్తారని ఆశిద్దాం! ఇక ఈ గ్రంథానికి నిర్ణయించిన ధర కొంచెం ఎక్కువేనని పాఠకులు పెదవి విరిచే అవకాశం ఉంది!

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544
-----

మే డే

కార్మికుల కన్నీటిపై...
కార్మికుల కన్నీటిపై
వంతెనల నిర్మాణాలు
దాహార్తిని తీర్చలేని ఎండమావులు
జీవనదులు బోసిపోయనా
చెరువులు కుంటలు వట్టిపోయనా
కార్మికుడిగా
నా స్వేదం మాత్రం మీ కోసం
జీవనదిలా చిందిస్తూనే ఉన్నా
నాలో ప్రాణం ఉన్నంతకాలం
నాలో రక్తం
కనుమరుగయ్యేంత వరకు
శ్రామికునిగా ఊడిగం చేయాల్సిందేనా?
జనం దృష్టిలో
నేనొక వెట్టిచాకిరీ చేసే గాడిదనా
నేనొక మరమనిషిని కాదని
మరుపురాని మనిషిగా నన్ను చూడరా?
నా చెమటతో
ధనవంతులు దాహం తీర్చుకుంటారే తప్ప
నా గురించి ఆలోచించరా?
ఇది ఇలాగే కొనసాగి...
ఒకనాడు ప్రకృతి సహకరించని రోజున...
మంచినీటికి కటకట ఏర్పడిన సమయాన
నా స్వేదాన్ని సైతం
శుభ్రం చేసే త్రాగునీటిగా వాడే రోజులు వచ్చినా... ఆశ్చర్యపడనవసరం లేదుగా!
ఇకనైనా... నేనూ మనిషేనన్న సంగతి గుర్తించండి
మనసున్న మనుషులుగా
నన్ను ఆదరించండి!

- గంప ఉమాపతి, కరీంనగర్
సెల్: 9849467551
----

మనోగీతికలు

సముద్ర స్నానం

సముద్రం దగ్గరుండుంటే
గుప్పెడు పల్లీలు నములుతూ గుండెనిండా
సముద్రపటం దించుకుని
లోలోపల ఉప్పొంగుతున్న మాటలు
నీళ్ల మనిషితో పంచుకునే వాన్ని
యుద్ధం ప్రకటించినట్టు
కెరటాలపైకి
పరుగెత్తి పడిపోయి ఓడిపోయి
జలసమూహంపై
ఊహల పడవల లంగరొదిలే వాడిని
ఇసుకగూళ్లు కట్టి
పిల్లలు కేరింతలు కొడుతూ వుంటే
బాల్యం చేజారి పోయిందే అని
దిగులు జెండా ఎగరేసి
జాలరి దులుపుతున్న వలలోంచి
జారిపడిన రొయ్యదేహంపై
జాలి చూపుల తండ్లాట పూయించే వాడిని
సముద్రం దగ్గరుంటే
ఉరుకులూ పరుగుల జీవనంలో
పూలకొమ్మ పై వాలిన సీతాకోకలా
కాసేపు
ఉప్పు పంటకు కాపలా ఉండేవాడిని
చెవుల లేత హృదయాలపై పరుగెడుతున్న
వాహన శబ్ధ రాగాలకు దూరంగా
సంధ్యా ప్రేయసితో
అలల బృందగానం చెవిలో వొంపుకుని
సముద్ర గీతం పాడుకుంటూ
రెండు పొదసంచులు నింపుకుని
ఇంటిదాకా
ఇసుక ప్రాణుల్ని ఈడ్చుకెళ్లే వాడిని
సముద్రం వుంటే
జలదీపమని అనిపించేలా
సూర్యకమలం విరబూసే దృశ్యం
కళ్లలోకి చేదుకుని
సామాన్యుడి స్నానపు తొట్టిలా
వొళ్లంతా నానబెట్టుకుని
సముద్ర స్నానం అనిపించే వాడిని
ప్చ్...
సముద్రం దగ్గర ఇల్లుంటే బాగుండు!
- గజ్జెల రామకృష్ణ
భూదాన్ పోచంపల్లి, నల్లగొండ జిల్లా
సెల్.నం.8977412795

మరో వేకువ కోసం..

కొత్త రాష్ట్రంలో
అమరుల..
ఆశయమే ఆలంబనగా
ప్రగతి మార్గాన పయనిద్దాం!
కుళ్లు కుతంత్రాలకు
స్వస్తి పలికి..
ఇకనైనా
యువత భవిత కోసం..
ప్రణాళికలు రూపొందిద్దాం!
జనం మోముల్లో వెలుగు రేఖలు
చూసేందుకు..
మరో వేకువకోసం శ్రమిద్ధాం!
స్వార్థం పడగనీడలోంచి..
పాలకులు బయట పడి
ప్రజాసంక్షేమం కోసం
అడుగేయాలని ఆకాంక్షిద్దాం!!

- మొగిలి స్వామిరాజ్
బోధన్, సెల్.నం.9963642205

ప్రకృతి
నింగిలోన..
వెనె్నల పంచే ‘చందమామ’
నిప్పులు కురిపించదు!
అలాగే..
మండే ‘్భనుడు’
వెనె్నలనూ పంచలేడు!
ఆకాశంలోని తారలు
ధరణి పైకొచ్చి
మెరుపులు కురిపించవు!
మానవ ధర్మం మరిచి
మనిషి ప్రకృతిపై కనె్నర్రజేస్తే..
తాను ఎక్కిన కొమ్మను
నరుక్కున్నట్లుంటుంది!
ప్రకృతితో
ప్రతి మనిషి చేసే మైత్రే..
జీవితాన్ని ఆనందమయం వైపు
నడిపిస్తుంది!

- గుండు రమణయ్య
పెద్దాపూర్, జూలపల్లి

చినుకులు

చినుకు చినుకు అని
చిన్నదే అనుకోకు!
వర్షించే..
చిన్న చినుకులే భారీ జడివానై
నదీ నదములు
పొంగి పొరలిస్తాయి!
వర్షం
రైతులకే కాదు..
జగమంతా హర్షాన్ని
పంచుతాయి!
సౌభాగ్యాలను
కూర్చుతాయి!
- ఎన్. జగన్ మాధవరావు, బోయినపల్లి సెల్. 9491698839

అన్యోన్య బంధానికి..
కోవెల లాంటి బడిలో
తరగతి గది బడిలో..
కొలువుదీరిన ఓ ‘నల్లబల్లా’
నలుపు వర్ణమని
నీకెందుకంత దిగులు!
అమావాస్యను తలపిస్తాయి
నీ అందాలు!
పౌర్ణిమను ప్రతిబింభించే
నా చిరు కిరణాలు నీకు సదా తోడుంటాయి!
మనిద్దరం జతకడితే..
ఇగ వెలుగు జిలుగులకు కొదువుండదు!
నేనే గొప్ప అని..నల్ల బల్లగా
ఎన్నడూ..విర్ర వీగకు సుమా!
ఓరుూ సుద్ద మొద్దు అంటూ..
బక్కచిక్కిన ‘సుద్ద ముక్కనని’
నన్ను కొట్టి పారేయకు!
నలుపు, తెలుపు కలిస్తేనే కదా
ఏం చక్క సుందర అక్షరాల ఆవిష్కరణం!
అవే మన అన్యోన్య బంధానికి నిదర్శనం!

- ఎన్.హరిప్రియా గిరిధర్ రావు
కరీంనగర్, సెల్.నం.9133293384

ఆచూకి మీకు తెలుసా..?
నేను వెతుకుతున్నాను
నా కళ్లు వెతుకుతున్నాయి
నా మనస్సు వెతుకుతూనే ఉంది
అయినా ఎక్కడ కనిపించుటలేదు
తరచి తరచి చూస్తున్నాను
మానవతా విలువల కోసం
అణగారి పోతున్న ఆత్మీయతకోసం
మరుగునపడిపోతున్న మమకారం కోసం
మనిషికి మనిషికి మధ్య కనుమరుగౌతున్న
కనీసపు మానవ విలువల కోసం
విద్యార్థులలో కొరవడిన క్రమశిక్షణ
వృద్ధులకు అందని ఆదరణ
తల్లిదండ్రులకు దక్కకుండా పోతున్న గౌరవం
గురువులపట్ల ఉండే గౌరవం కోసం
ఆడపిల్లల పట్ల కొరవడిన మానవత్వం ప్రేమకోసం
అసలు మనిషంటే ఏమిటో?
మానవ జన్మకు సార్థకత ఏంటో?
ధనార్జనలో దాక్కున ఆ విలువలు
ఎక్కడున్నాయో, ఏమైనాయో?
ఆలోచిస్తే నాకు ఏమి తోచటం లేదు,
కనిపించటం లేదు..
ఆచూకీ మీకు తెలుసా..?

- డాక్టర్ అడువాల సుజాత, జ్యోతినగర్, కరీంనగర్, సెల్.నం.9989558678

కనువిప్పు

దేశం ఎటు పోతుందనే బెంగ
నాకెప్పుడూ లేదు
నేను ఎటు పోతున్నాననేదే
నాకు ప్రధానమయ్యింది
దేశం దారి తప్పిన సంగతి
స్వాతంత్య్రం మరునాడే కనిపించింది
దీపాల నార్పటం అప్పుడే ప్రారంభమయ్యింది
వెలుగును చెరబట్టటం ఆనాడే మొదలయ్యింది
తూర్పును కబ్జా చేసుకుని
సూర్యున్ని ఇంట్లో దాచుకోవటం
ప్రజాస్వామ్యం కుప్పిగంతులు
విషాదకర పరిణామం!
కోటీశ్వరుల దోపిడిలో..
‘రాజ్యాంగం’ విలవిలా కొట్టుకుంటోంది!
దేశం దారి తప్పిన సంగతి
దశాబ్దాలుగా అంచెలంచెలుగా
జరుగుతున్నదే!
నేను ఎటుపోతున్నాననేదే అసలు విషయం
ప్రవాహంలో కొట్టుకపోతున్నానో
ఎదురు నిలబడగలిగానా?

- సిహెచ్.మధు, నిజామాబాద్
సెల్.నం.9949486122

నేను నేనే !
నువ్వొక లెక్కా? అనుకునే వాళ్లకి
నిజంగానే అర్థం కాని
లెక్కను నేను!
నీలో ఏముందిలే? అనుకునే వాళ్లకి
నాలో ఉన్నదెంతో
తెలుసుకోలేనంత
జటిలత నేను!
‘అర్థం’ కోసం
తెగ ఆరాటపడే వాళ్లకి
ఎంత శోధించినా
అర్థం కానంత ‘పరమార్థం’ నేను!
అణువునూ నేనే
పరమాణువునూ నేనే!
నేనందరి వాడిని కాకున్నా
అంతా నావాళ్లే అనుకునే
అమాయక జీవినీ నేనే!
సామాజిక స్పృహనేపథ్యంగా
అందరిలో ఉదయించే
కోటానుకోట్ల ప్రశ్నలకు
సాహిత్యమే ఊపిరిగా
మనుగడ సాగించే
జవాబుదారును నేనే!
నేను నేనే!!

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం, జగిత్యాల, సెల్.నం.9492457262

సిరులొలికె
సింగరేణమ్మా!
సిరులొలికె సింగరేణమ్మా
నల్ల బంగారాల ఓ అమ్మా
గుండెలో తరగని గనులెన్నో పొదిగిన
మహిమగల మహారాణివమ్మా
నీవు లేకుంటే మా బ్రతుకేదమ్మా
- ఓ కరుణగల సింగరేణమ్మా
మణిమాణిక్యాలున్న మాగాణి నిచ్చావు
రక్షణతో పనిచేసే పనిముట్లనిచ్చావు
టార్గెట్‌లను పెంచి ఇన్‌స్సెంటివ్ నిచ్చావు
థర్మల్ కేంద్రాలతో వెలుగులే పంచావు
నిండు మనసుతో మాకండగా నిలిచావు
మమ్ము కడుపులో పెట్టుకొని కాపాడేవమ్మా
- ఓ కరుణగల సింగరేణమ్మా
కోల్ వాషరీలతో నాణ్యతనే పెంచి
తేలికపాటి క్యాప్ లాంపులతో
వెలుగులే పంచి
గుడ్డు, రొట్టె, పల్లిబెల్లాల మరిపించే
ఆధునిక క్యాంటీన్ల నిచ్చినావు
మా ఆరోగ్యానె్నంతో పెంచినావమ్మా
- ఓ కరుణగల సింగరేణమ్మా

- సిహెచ్. సాంబశివారెడ్డి
మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9959381560

సమరనాదం!
మనిషి మనిషికీ మధ్య బంధం
చెరుపుకున్న గీతలై..
ఎడారి మీద సముద్రపు ఆశలు
గొలి మేడలవుతుంటే.. కారు చీకటై..
కాలాన్ని బంధించిన నేపథ్యంలో
ప్రపంచీకరణ మాయలో పడి పల్లెలు
పట్టణాలు సంస్కృతికీ దూరమవుతూ..
అస్తిత్వాన్ని కోల్పోతూ చెట్లు గుట్టలు
నామరూపాలు లేకుండా పోతున్నాయి!
బ్రతుకు లేని బడుల్లో
అరువు భాషతో రాలిన సుద్దముక్కలై
అరక మీద అరచేతులు కాయలై
ఉరికొయ్యలపై.. ఉమ్మెత్త పూలవుతున్నాయి!
ఊడిగానికి బాడుగలు కట్టే
ప్రైవేటీకరణ పుణ్యమా అనీ..
ఓపెన్ కాస్ట్ భూతం యాంత్రీకరణ
పడగనీడలో..
పల్లెల ఉనికినే సంకెళ్లు వేస్తున్నాయి!
చాపకింద నీరులా చరిత్రను
ఆనవాళ్లు లేకుండా చేస్తే..
మా భవిష్యత్తుకై కలంతో పాటు
గళాలనెత్తుతాం! సమర నాదం పూరిస్తాం!
ప్రపంచీకరణకు..
చరమగీతం పాడుతాం!

- వజ్జీరు ప్రదీప్
వరంగల్, సెల్.నం.9989562991

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net