విజయవాడ

అప్పు.. కందిపప్పు ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మాయ్.. కరుణా! ఏం చేస్తున్నావ్?’ అంటూ వచ్చింది ఇంటి ఓనరు భార్య సుభద్ర.
‘రండి పిన్నిగారూ! కూర్చోండి’ అని కుర్చీ చూపించింది.
‘ఇప్పుడు కూర్చోనులేమ్మా! త్వరగా వెళ్లాలి. ఇంటికి చుట్టాలొచ్చారు. వంట చేయాలి. ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇవ్వమ్మా!’ అంటూ చీరకొంగు చాటు నుంచి స్టీలు గినె్న బయటకి తీసింది. ఆ గినె్నలో దాదాపు పావుకిలో దాకా పడుతుంది. అదామె దృష్టిలో ఓ కప్పుతో సమానం.
‘అయ్యో పిన్నిగారూ! కందిపప్పంటే గుర్తుకొచ్చింది. మా ఇంట్లో కూడా నిండుకొని నాలుగు రోజులైంది. మావారికి తెమ్మని చెపితే ‘అప్పుడే అయిపోయిందా?’ అంటున్నారు. రేపు కార్తీక సమారాధన చేస్తున్నామని వనమహోత్సవం భోజనాలకు పిలిచారు. పప్పు, బియ్యం ఇచ్చి మనకే చేతనైన సహాయం చెయ్యమన్నారు. ఇప్పటివరకు మీరు నా దగ్గర 16 సార్లు కందిపప్పు అప్పు తీసుకున్నారు. పదహారు కప్పులంటే మీ దృష్టిలో కొంచెమే! అయితే పదహారు పావు కేజీలు అది. అంటే నాలుగు కేజీలు అన్నమాట. అంత కందిపప్పు బాకీ ఉన్నారు మీరు’ లెక్కలు తీసింది కరుణ.
‘నాలుగు కేజీలా? అమ్మో.. అమ్మో! కప్పుతో ఇచ్చి ఇప్పుడు లెక్కలు వేస్తున్నావా?’ డీలాపడిపోయింది సుభద్ర.
‘అవునండీ! మీ చేతిలో గినె్న తెచ్చి దానే్న మీరు కప్పు అని అడిగితే కాదనలేకుండా ఇచ్చాను. అసలే కందిపప్పు ధర మండిపోతున్నది. నాలుగు కేజీల కందిపప్పంటే మాటలా! దాదాపు ఎనిమిది వందల రూపాయలు. గుప్పెడు పప్పయితే వదిలేస్తాను. బంగారంలా పెరిగిపోయిన కందిపప్పు ధరకి తినేటట్లులేదు. చూస్తూచూస్తూ ఎలా వదులుకోమంటారు చెప్పండి? అందుకని ఇన్నాళ్లూ మీరడిగినప్పుడల్లా లేదనకుండా ఇచ్చాను. ఇప్పుడు నాకు అవసరం పడింది. నాకు రేపు ఉదయానికల్లా నేనిచ్చిన కందిపప్పు బాకీ తీర్చేయాలి. ఏంచేస్తారో ఏమో నాకు తెలీదు. మావారికి తెలిస్తే బాగుండదు’ అంటూ కొంచెం కటువుగానే హెచ్చరిక చేసింది కరుణ.
సుభద్రకి గుండెలో రాళ్లు పడ్డాయి. వడ్డీకి చక్రవడ్డీ కలిపినట్లు నాలుగు కేజీల కందిపప్పు కొనివ్వాలంటే మాటలా!
‘ఏమండీ! ఆ కరుణా వాళ్లను ఇల్లు ఖాళీ చేయమని చెప్పండి. వేరే వాళ్లకిస్తే అద్దె ఎక్కువ వస్తుంది. ఇంటి పన్నులు పెరిగిపోయాయి. మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా’ భర్తను సాధించింది సుభద్ర.
‘ఏం? ఏమైనా అప్పు అడిగితే ఇవ్వనన్నారా ఏమిటి? బహుశా అదే అయి ఉంటుంది. కిందటి నెలలో వెనకాల రేకులింట్లో వాళ్లని రోజూ ఉల్లిపాయల కోసం వెళ్లి, వాళ్లు తిరిగి ఉల్లిపాయలు అడిగారని అలిగావు. ఉల్లిపాయల ధర మండిపోతున్నదని కొనివ్వలేక, ఆ వంకపెట్టి వాళ్లని ఇల్లు ఖాళీ చేయమన్నావు. ఇప్పుడేం వచ్చిందని వీళ్లని ఖాళీ చేయించమంటున్నావు?’ సుభద్ర వాలకం తెలిసిన భర్త గట్టిగానే నిలదీశాడు.
‘ఎందుకంటారా? వాళ్లకి నాలుగు కేజీల కందిపప్పు బాకీ ఉన్నాం గనుక’ ముక్తసరిగా బదులిచ్చింది.
‘అమ్మో! నాలుగు కేజీలే..!’ నోరెళ్లబెట్టాడు సుబ్బయ్య.
‘వీళ్లని ఖాళీ చేయిస్తే మరొకరొస్తారు. అప్పుడు వాళ్ల దగ్గర ఏం అప్పు తీసుకొందామని? ఇలా రోజూ అప్పు కోసం వెళ్లి నా పరువు తీస్తున్నావా? ప్రతినెలా ఇంట్లోకి సరుకులు తెచ్చి పడేస్తున్నాగా! ఇంకా ఎందుకీ దేబిరింపు? ఇంకోసారి ఎవరింట్లోనన్నా అప్పుకి వెళ్లావని తెలిస్తే తీసుకెళ్లి నిన్ను అద్దె కొంపలో ఉంచుతాను, జాగ్రత్త’ అంటూ సుభద్రను హెచ్చరించాడు.
‘అదికాదండీ అసలు రహస్యం! కరుణా వాళ్లు అద్దెకి వచ్చి సంవత్సరం దాటింది. అప్పుడే అద్దె పెంచమంటే పెంచరు. అందుకే వీళ్లని ఖాళీ చేయించామంటే కొత్త వాళ్లకి మళ్ళీ అద్దె పెంచి ఇవ్వచ్చు. అప్పుడు మన ఆదాయం మరింత పెరుగుతుంది కదా!’ తన ఐడియా బయటపెట్టింది సుభద్ర.
‘ఆహా! ఓసి నా భార్యామణీ! నీ తెలివితేటలకి మెచ్చుకొన్నానులేగాని ఇలా ఆశకి పోతే చివరికి మిగిలేది దుఃఖమే. నెలరోజులు ఇల్లు ఖాళీగా ఉందనుకో, ఆ నెల అద్దె డబ్బులు నష్టమేగా? కొసరుకి పోతే అసలుకే మోసం వచ్చినట్లవుతుంది. ఇరుగుపొరుగు వారంతా నీ సంగతి (అప్పు, అద్దె) వచ్చిన వాళ్లందరికీ చాటింపు వేస్తారు. దాంతో వచ్చిన వాళ్లంతా వెనక్కి తిరిగి వెళ్లటం ఖాయం’ అన్నాడు.
‘అంతేనంటారా’ అంటూ ముఖం దిగాలుగా పెట్టింది సుభద్ర.
‘ముమ్మాటికీ అంతే! ఈసారికి వాళ్ల కందిపప్పు బాకీ తీర్చేసి ఇంకెప్పుడూ అప్పుల కోసం వెళ్లమాక. ధరలు పెరిగాయని వాళ్ల బాకీ తీర్చకపోతే వాళ్లూరుకుంటారా?’ చీవాట్లు పెట్టాడు సుబ్బయ్య.
‘అలాగేనంటూ..’ పక్కకెళ్లిన సుభద్రకి కందిపప్పు బాకీ తీర్చాలంటే కళ్లెంట నీళ్ళొచ్చాయి!!

- తాటికోల పద్మావతి,
గుంటూరు.
చరవాణి : 9441753376

మనోగీతికలు

వాడు పిచ్చోడు కాదు
అందరూ పిచ్చోడు, పిచ్చోడు అంటారు
కానీ.. వాడు పిచ్చోడు కాదు
వాడే ప్రపంచంలో
అందరికంటే ఆనందంగా బతికేవాడు
ఎందుకంటే..
భార్యాబిడ్డల బంధం లేదు
అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల
అనురాగాలు లేవు
తనను చేరదీసి
ఒక ముద్ద అన్నం పెట్టినవాళ్లే
తన వాళ్లనుకుంటూ
ఊరిబయట చెట్టుకింద
కాలుమీద కాలు వేసుకుని
తన ఊహా ప్రపంచంలో
విహరించే మహరాజు అతను!
రేషన్ కార్డు అవసరం లేదు
ఆధార్ కార్డు అక్కరలేదు
ఇందిరమ్మ ఇల్లు
పించను పథకాలతో -పనేలేదు
పచ్చని పచ్చిక పరుపులో
పక్షుల కిలకిలారావాల
సంగీత స్రవంతిలో
ఎసి గదులు కూడా ఇవ్వలేని
చల్లదనాన్ని ఆస్వాదిస్తూ
దేవాలయ ప్రాంగణంలో
జతకూడే స్వాముల
జీవితానుభవాల నుండి
జీవిత పరమార్థాన్ని
ఆకళింపు చేసుకున్న
అపర వేదాంతి
స్వార్థపరత్వంతో
సంబంధ బాంధవ్యాలను విడిచి
ఉచ్ఛనీచాలను మరచి
మృగాల కంటే నీచంగా ప్రవర్తిస్తున్న
మనకంటే.. వాడే ఉత్తమం
అందుకే అంటానే్నను
వాడు పిచ్చోడు కాదు
వాడ్ని పిచ్చోడు అన్నవాళ్లే
పరమ పిచ్చోళ్లు..!

- యనమాల సుందర్
ఫిరంగిపురం, గుంటూరు జిల్లా.
చరవాణి : 9032319507

వర్తమాన భారతి
కడుపులోని ఆకలిని
కళ్లలో చూపుతూ
చిరునవ్వుల ఆర్తనాదాలను చిమ్ముతూ
గగుర్పాటు కలిగించే
విన్యాసాలు చేస్తున్న
ఈ పసికందు ఆకలి
ఎవ్వరి కన్నులకూ కానరాదేం!

గంటల చొప్పున అమ్మిన దేహాన్ని
వంతులవారీగా కొన్న మృగాల్లారా
దళారీ దౌర్జన్యానికి
కడుపు నిండక కన్నీళ్లు తాగిబతికే
వేశ్యామతల్లుల వడిని పంచుకున్నప్పుడైనా
తిన్నావా అని
ఒక్కరైనా అడగరేం!
మండే ఎండలో ఎండే దేహంతో
మరిగే రక్తాన్ని చెమటగా చిందిస్తూ
బతుకు బండిని వందల ఏళ్లుగా
లాగుతున్నా బరువు తగ్గదేం అని
ఎవ్వరైనా ఆలోచించరేం!

పట్టుపరుపుల్లో పడుకొని
పసిడి కంచంలో తిన్నా ఆకలి తీరక
పేదవాడి రక్తమాంసాలను పెప్పరు సాల్టుతో
చప్పరించే ధనిక పిశాచుల
తెగవేయను పోటున రారేం!

మానవత్వం మచ్చుకైనా లేని
జనారణ్యమిది
నోరుండి అడగలేనిది
కళ్లుండి చూడలేనిది
చెవులుండి వినలేనిది
ఈ వర్తమానంలో
నా భరతమాత భావితరం
పేదరికం కోరల్లో చిక్కి
కట్టుకోడానికి కనీసం బట్టలు లేక
భవిష్యత్తు నా ముందు
నగ్నంగా నర్తిస్తుంటే
కన్నులు మూసినా తెరచినా
గుబులు గుబులుగా మదిలో మెదిలే
ఈ వ్యథలే తీవ్రమై
గుండెను పీడిస్తుంటే
కదలక మెదలక
నిర్జీవమై నిలుచున్న రాత్రికి
చైతన్యలేమి జాతికి
ఇదే నా సలాం...

- పెరుగుపల్లి బలరామ్, చరవాణి : 9676636816

మన భారత్
స్వచ్ఛ భారత్
రండి.. రారండి!
రండి.. రండి.. రారండి
కలసిమెలసి పనిచేద్దాం
‘స్వచ్ఛ భారత్’ సాధనకు
కదంతొక్కి అడుగేద్దాం
మన గ్రామం
మన రాష్ట్రం
మన దేశం
పరిశుభ్రంగా ఉంచుదాం
మన గ్రామం స్వచ్ఛం
మన రాష్ట్రం స్వచ్ఛం
మన దేశం స్వచ్ఛం
ఇది నా కల
ఇది మీ కల
ఇది మనందరి కల
సాకారం చేసుకుందాం
చేరుూచేరుూ కలుపుదాం
ప్లాస్టిక్ వద్దు చేతిసంచి ముద్దు
అని నినదిద్దాం
అదే నిజం చేసేద్దాం
ఈ నేలని ఈ గాలిని
ఈ నీటిని
పరిశుభ్రంగా ఉంచుదాం
ప్రకృతి సంపదను పరిరక్షిద్దాం
సహజ వనరులను సంరక్షిద్దాం
మరుగుదొడ్లను వినియోగిద్దాం
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
పెరటి మొక్కలను పెంచుదాం
పచ్చదనాన్ని పంచుదాం
నీటిని పొదుపుగ వాడుదాం
భావితరాలకు అందించుదాం
ఆలకించండి - ఆలోచించండి
ఆదరించండి - ఆచరించండి
స్వచ్ఛ్భారత్ కారాదు ఒక నినాదం
స్వచ్ఛ్భారత్ కావాలి
ఆచరణ వాదం
నేటి మన ఆచరణ
భావితరాలకు ప్రేరణ!

- వేజళ్ల ఉమామహేశ్వర్,
స్వచ్ఛ్భారత్ కార్యకర్త
తెనాలి, గుంటూరు జిల్లా.

చిన్న కథ

గుండె గడియారానికి టైము పెడితే..

‘ఒరేయ్ మందులు అయిపోయాయిరా’ అన్నది అనసూయమ్మ కొడుకుతో. ‘ఇవాళ ఆదివారం మెడికల్ షాపులుండవు’ అన్నాడు విసుగ్గా.
‘డాక్టర్ దగ్గరకి తీసికెళతానన్నారు. మరచిపోయాను, ఇవాళ ఆదివారం కదా!’ అంది భార్య.
‘రోగాలకి సెలవు లేదు. డాక్టర్లకి సెలవులుండవు. హాస్పటల్స్, మెడికల్ షాపులు వుంటాయి. పదింటికి బయలుదేరుదాం’ అన్నాడు భార్యతో.
ఆ మాటలు వినబడ్డాయి అనసూయమ్మకి. ఒక్కడే కొడుకు. చాలా గారాబంగా పెంచింది.
‘వీడిలా మారడానికి కారణం ఏమిటి? వాడికి నా అవసరం తీరిపోయింది. భార్యతో చాలా అవసరాలున్నాయి. సమయానికి వంట చేసి పిల్లలకి, వాడికి క్యారేజీలు సర్ది బళ్లకి, ఆఫీసుకి పంపాలి. ఇంట్లో అయిపోయిన సరుకులు తెచ్చుకోవడం, కూరలకి రైతుబజారుకెళ్లడం.. చాలా పనులు చకచకా చక్కబెడుతుంది. అందుకే దాని ఆరోగ్యం గురించి అంత శ్రద్ధ’ మనసుకి సర్దిచెప్పుకుంది.
‘శీతాకాలం, ఇంత చీకట్లో మార్నింగ్ వాక్‌కి వెళితే ఎవడో కర్రతో బుర్రమీద రామకీర్తన పాడి మెళ్లో గొలుసు, వేళ్లకున్న ఉంగరాలు తీసుకుపోతాడు’ కొడుకు హితవు చెపుతున్నాడు. అతని మాటల్లో నిజం ఉండచ్చు కానీ, పలికే పద్ధతిలోనే.. ఆ మాటలనే సౌమ్యంగా, ఆప్యాయంగా మరోవిధంగా చెప్పచ్చు, కానీ కొడుకు అవహేళనగా మాట్లాడుతున్నాడు.
‘ఈ వెధవ ఈటెల్లాంటి మాటలతో ఆరోగ్యం చెడిపోతోంది. కాంతారావు ఆశ్రమానికి వచ్చెయ్యమన్నాడు. కానీ కోడలు మంచిగానే చూస్తోంది. అంటే పెన్షన్‌లో రూ.10వేలు ఆమె చేతిలో పెట్టబట్టి అంటాడు కాంతారావు. ఆ మాటల్లో నిజముంది మరి.
‘ఏంచేస్తే బాగుంటుంది?’ ఆలోచిస్తోంది అనసూయమ్మ.
పాత నులక మంచాన్ని స్టోర్‌రూంలో వేసినట్లుగా పేరెంట్స్‌ని చూసేవారు కొందరుంటే.. ‘పాపకి సీమంతం చేసి తీసుకొద్దాం, మంచిరోజు చూడండి అత్తయ్యా’ అనే కోడళ్లూ కొందరు అక్కడక్కడ కనిపిస్తున్నారు.
‘మీ కోడలు మంచితనం గురించి చెప్పకు. నీకు ఆడపిల్లలు లేరు. నీ తరువాత ఇల్లు, నగలు వాళ్లవే కనుక ఆ ఆప్యాయత..’ అంటుంది జయమ్మ.
జయమ్మ కోడలు నోరున్న మనిషి. ‘ఎప్పుడూ ఫ్యానేసుకుని ఇంట్లో కూర్చోకపోతే ఒక గంట వరండాలో కూర్చుంటే ప్రాణం పోతుందా?’ ఇలా వుంటుంది ఆవిడ కోడలి భాష.
అందుకే నా కోడలి గురించి చెప్పగానే అలా చిరాగ్గా.. ‘ఎలావున్నా సర్దుకుపోవాలి. అందరూ వుండి వృద్ధాశ్రమానికెడితే బంధువుల్లో పిల్లలకి విలువ ఏం వుంటుంది? తామరాకు మీద నీటిబొట్టులా.. అరవై రాగానే గుండె గడియారం ఆగిపోయేలా మనిషిని తయారుచెయ్యవయ్యా విధాతా..’ మనసులోనే వేడుకుని చిన్నగా నవ్వుకుంది భ్రమరాంబ.

- వేమూరి అనూరాధ,
శ్రీనగర్ కాలనీ, విజయవాడ.

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- తాటికోల పద్మావతి