విజయవాడ

వన సమారాధన (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోజు దీపావళి పండుగ. ఊరంతా ఆనందోత్సాహాలతో కళకళలాడుతోంది. ఇళ్లన్నీ అల్లుళ్ల, కూతుళ్ల, మనుమలు, మనుమరాళ్ల రాకతో కొత్త శోభ సంతరించుకున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకల్లా అందరూ టపాసులు కొనుక్కుని దీపావళి పండుగ సంబరంగా జరుపుకునేందుకు ఉత్సాహంగా సన్నద్ధమయ్యారు. సాయంత్రం అయ్యేసరికల్లా పండుగ సంబరం మొదలైంది. అమావాస్య నాడు వచ్చిన పున్నమిలా వుంది వాతావరణం. ప్రతి ఇల్లూ దీపాల అలంకరణతో, కాంతులు విరజిమ్మే బాణసంచా వెలుగులతో కనువిందు చేస్తోంది.
ఐతే ఒక ఇంట్లో మాత్రం పండుగ సందడే లేదు. దానికి బదులుగా నిరాశా నిస్పృహ కనిపించాయి. పండుగ ఆనందానికి బదులు చిరాకులు, చీదరింపులు, అరుపులు, అల్లర్లు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఒక పిల్లవాడు మతిస్థిమితం కోల్పోయి అసందర్భంగా మాట్లాడటం, ఊరిలో ఏదోఒక పిచ్చిపని చేసి గొడవలు ఇంటి మీదికి తేవడం. ఇలా ఆ పిల్లవాడితో సతమతమవుతోంది కుటుంబం.
పిల్లవాడికి వైద్యం చేయించేందుకు ఆర్థిక ఇబ్బందులు సమస్య అయినా సరే అప్పులు చేసి చికిత్స చేయించారు. మందులు వాడినప్పుడు మంచిగానే వున్నాడు. అన్ని పనులూ సక్రమంగానే చేసేవాడు. ఇక అప్పులు చేసే స్థితిలేక బంధువులను సాయం అడిగినా ఎవరూ ముందుకు రాకపోవడంతో కుటుంబం గడవటమే అతి కష్టం కావటంతో ఆ పిల్లవాడిని అలాగే పిచ్చివాడిలా వదిలేశారు కుటుంబ సభ్యులు. పిల్లవాడు ఊరిలో పిచ్చిమాటలు మాట్లాడుతూ తిరగడం, ఎవరన్నా జాలిపడి భోజనం పెడితే తినడం, నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం, తన్నులు తినడం- ఇదే అతని నిత్యకృత్యంగా మారిపోయింది.
అది కార్తీక మాసం కావడంతో వనభోజనాల సందడి. కార్తీక నోముల హడావుడి. దేవాలయాల్లో భక్తుల సందడి. ఊరంతా సంబరంగానే ఉంది. కానీ ఆ పిల్లవాని కుటుంబం మాత్రం నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది.
ఒకరోజు అయ్యప్పస్వామి భక్తులు కొందరు కలిసి వనసమారాధన నిమిత్తం ఊరిలోని ధనవంతుల ఇళ్లలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కో వస్తువు - అంటే బియ్యం, బెల్లం, పప్పు, చింతపండు, పాలు, సగ్గుబియ్యం, గ్యాస్, ఇస్తళ్లు ఇలా సమారాధనకు కావలసిన మొత్తం పెద్దపెద్ద షావుకార్ల దగ్గర చందా రూపంలో వసూలుచేసి కార్యక్రమాన్ని నిర్వహించటానికి నిర్ణయించారు.
వంట మేస్ర్తిలు వంటకాలు ప్రారంభించడానికి వంట సరుకుల మూటలు ఊడదీశారు. అది గమనించిన కాకులు, ఇతర పక్షులు అవి తినడానికి గుమికూడాయి. వంటమేస్ర్తిలు వాటిని తోలుతూనే వున్నాడు. అయినా సరే అవి వాటిపని చేస్తూనే ఉన్నాయి. ఇక విసిగిపోయిన ఒకతను అక్కడ వున్న తెడ్డును పక్షులు ఉన్నవైపు విసిరేశాడు. దాని ప్రభావంతో వాటిలో ఒక పక్షికి కాలు విరిగింది. పక్షులు గోల చేయటం ప్రారంభించాయి. అన్ని పక్షులూ ఆ పక్షి చెంత చేరి ఆవైపు మనుషులను రానీయటం లేదు. పైగా తిరగబడి పొడుస్తున్నాయి. తోటి పక్షి పట్ల తమ ఐక్యత, సానుభూతి ప్రదర్శిస్తున్నాయి. ఇక చేసేదేమీ లేక వంటవాళ్లు సామగ్రి మొత్తాన్ని వేరేవైపు పెట్టుకొని వంటకాలు ప్రారంభించారు.
ఇక భోజనాల కార్యక్రమం మొదలైంది. దేవుని భోజనం ఊరికే తినలేక తలా ఒక వంద, యాభై, ఐదువందల వరకు అలా ఎవరికి తోచిన విధంగా వారు శక్తి మేరకు విరాళాలు సమర్పించి స్వామికి నమస్కరించి వచ్చారు. భోజనాల కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఆరోజు సాయంత్రం స్వాములు, పెద్దలు, పెత్తందారులు జమా ఖర్చులు చూసుకున్నారు. సమారాధన నిమిత్తం జమా ఖర్చుల్లో పెద్దమొత్తంలోనే డబ్బు మిగిలింది. మిగిలిన డబ్బును బ్యాంకులో వేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. అలాగే మరుసటి సంవత్సరం వనభోజనాల కార్యక్రమానికి ఆ డబ్బు వినియోగించాలని నిర్ణయించారు.
ఇది గమనించి మరొక ముఠా పెద్దలు, పెత్తందారులు మేము వనసమారాధన చేయతలపెట్టామంటూ పెద్దపెద్ద షావుకారులందరి దగ్గరకు వెళ్ళి చందాలు అడిగారు. షావుకారులు వాళ్లకు ఇచ్చి, వీళ్లకు ఇవ్వకపోతే బాగోదుకదా అనీ, వీళ్లకు కూడా అదేవిధంగా విరాళాలు ఇచ్చి సంతోషపర్చారు. ఇక భోజనానికి వచ్చినవారు ఊరికే తినరాదు అని ఎవరికి తోచినంత వారు విరాళాలు సమర్పించి భోజనం చేసి వచ్చారు. జమా ఖర్చులు అయిన తరువాత వీళ్లకి కూడా పెద్ద మొత్తంలోనే డబ్బులు మిగిలాయి. కమిటీవారు ఈ డబ్బుని దేవుని పేర బ్యాంకులో వేయాలని నిర్ణయించారు. ఒకరిద్దరు మాత్రం మిగిలిన డబ్బుని పిచ్చి పిల్లవాని వైద్యం నిమిత్తం ఖర్చు చేయాలని అభిప్రాయపడ్డారు. కానీ మిగిలినవారు ఇది దేవుని డబ్బు, దీన్ని పిచ్చివాడి వైద్యానికి ఖర్చు చేయటానికి కుదరదని తెగేసి చెప్పారు. ఇది విని మిగిలినవారు ఏమీ మాట్లాడలేదు. పిల్లవాడి గురించి ఆలోచించిన వాళ్లు కూడా ఏమీ మాట్లాడలేదు.
అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలవారు వన భోజనం కార్యక్రమాలను పైవిధంగానే నిర్వహించనారంభించారు. అందరికీ అదేవిధంగా డబ్బులు మిగలసాగాయి.
పిచ్చిపిల్లవాడు మాత్రం పిచ్చి ముదిరి రోడ్ల వెంట తిరుగుతూనే ఉన్నాడు.
దేవాలయాల్లో భజన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ముఠాల వారీగా సమారాధనలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని పేర డబ్బులు మిగులుతూనే ఉన్నాయి. పిల్లవాడు పిచ్చివాడిలానే స్థిరపడిపోయాడు. భక్తులు పరమ భక్తులవుతున్నారు. గురువులవుతున్నారు. స్వాములు, గురుస్వాములవుతున్నారు. కానీ మనిషికి దేవుడే వచ్చి సహాయం చేయాలా? మనిషికి తోటి మనిషి ఎలాంటి సహాయం చేయలేడా? చేయనీయరా? మనుషుల్లా, మానవత్వం ఉన్న మనుషుల్లా ఆలోచించండి.
‘ఇంతమందికి ఇన్నిసార్లు వనభోజనాలకి వచ్చిన చందా డబ్బు మనుషులు ఇచ్చినవే కదా! మళ్లీ భోజనం చేసినవాళ్లు దేవుని పేర జరిగే అన్నప్రసాదాన్ని ఊరికే తినరాదనే భావనతో తమకు తోచిన విరాళం ఇచ్చిన ధనం మతిస్థిమితం తప్పి అనారోగ్యంతో బాధపడే మానవుడికి ఖర్చుపెడితే పాపమా? ఆలోచించండి’ అన్నారు మరికొందరు.
‘ఎన్నో వేల మందికి మనం భోజనం పెట్టాం. ఆ భోజనాన్ని ఆకలితో అల్లాడుతూ, మనం పెట్టిన అన్నాన్ని అమృతప్రాయంగా భావించి స్వీకరించి, ఆరగించి ఆనందించినవారు ఎంతమంది ఉంటారు. వారిని మనం వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. వారికి పెట్టే భోజనమే మనకు దక్కే పుణ్యం. వారు మినహా మనం ఎన్నివేల మందికి పెట్టినా అది నిరుపయోగం’ అని వివరించారు ’ ఇంకొందరు.

- వంగర యతేంద్రబాబు,
ఐలవరం, గుంటూరు జిల్లా
చరవాణి: 8185031590

పుస్తక పరిచయం

ఎస్‌ఆర్ పృథ్వి నానీలు..
శ్రీశ్రీకి ఘన నివాళులు

మహాకవి అన్న మాటకు అసలు సిసలు అర్థంగా నిలబడి కవులందరిలో మణిపూసగా ప్రకాశించినవారు శ్రీశ్రీ. ఆయన గురించి నూట పధ్నాలుగు నానీలు రాసి ఆయనపై తన అభిమానాన్ని, అచంచల ప్రేమను అద్భుతంగా చాటుకున్నారు ఎస్‌ఆర్ పృథ్విగారు.
పుడమితల్లికి/ కొత్తసృష్టి/ పుట్టింది/ నవజీవన దృష్టి!
‘పూర్వం కవులు తమ కవిత్వ ప్రతిభను రాజుల విలాసాలనూ, అతివల అందాలనూ వర్ణించడానికే ఎక్కువగా ఉపయోగించుకునేవారు. సామాన్య ప్రజలు వాళ్ల కళ్లకు ఆనేవారు కాదు. కానీ, శ్రీశ్రీ అలా కాదు. పేద, పీడిత ప్రజల పక్షాన నిలబడ్డారు. వారి కష్టాలకూ, వారి దుఃఖాలకూ చలించిపోయారు. కత్తి లాంటి కలాన్ని ఝుళిపించి వారికి కొండంత అండగా నిలిచేవారు’ అన్నారు పృథ్వి ఈ నానీలో.
పేదల గుండెలు/ కన్నీటి కుండలు/ తరం మారినా/ మారని బండలు! ప్రస్తుత పరిస్థితుల్లో కోటీశ్వరులు ఇంకా ఇంకా కోట్లు సంపాదించుకుంటున్నారు గానీ, ఇరవై నాలుగ్గంటలూ రెక్కలు ముక్కలు చేసుకున్నా ఆర్థిక బాధలు తీరని బడుగు జీవులెందరో ఉన్నారు. ఎన్ని దశాబ్దాలు గడిచినా, శతాబ్దాలు మారినా రాతిబండల్లో మార్పుండనట్లే, పేదల బతుకులూ బాగుపడటం లేదని ఎంతో ఆర్ద్రంగా చెప్పారు పృథ్వి ఈ నానీలో.
ద్రోణుడికి/ ఒక్కడే ఏకలవ్యుడు/ శ్రీశ్రీకి/ వందలు, వేలు!
శ్రీ రామాయణం, మహాభారతం గురించి కాస్తోకూస్తో తెలియని హిందువు లేనట్లే మహాప్రస్థానం చదవని, మహాప్రస్థానాన్ని అభిమానించని తెలుగు కవి ఉండడు. మహాప్రస్థానం స్ఫూర్తితో గొప్ప కవులైన వారి గురించి మనకు తెలుసు. అలా వర్ధమాన కవులకు దిక్సూచిగా నిలబడినవారు శ్రీశ్రీ- అంటూ అపూర్వంగా వివరించారు ఈ నానీలో.
ఒకప్పుడవి/ నీడలే/ ఇప్పుడవి/ సమానత్వపు జాడలు!
‘్భస్వాములు, పటేళ్లు పెత్తందార్లుగా కూలినాలి జనాల్ని కాలికింద తొక్కిపెట్టి, వారిచేత వెట్టిచాకిరీ చేయించుకుంటూ ‘బాంచన్ దొరా.. నీ కాల్మొక్తా’ అన్నవిధంగా అనేక వందల సంవత్సరాలు రాజ్యం చేశారు. ఆ చీకటి రోజుల్లో పొడిచిన వేగుచుక్క శ్రీశ్రీ. వాళ్ల వల్ల మీరు బతకడం లేదు, మీ చాకిరీతోనే వాళ్లు దర్జాగా జీవిస్తున్నారు- అన్న సామాజిక స్పృహ దీపాన్ని వెలిగించి, ఆత్మవిశ్వాసపు ఆయుధాన్ని అణగారిన ప్రజలకందించిన గొప్ప సామాజికవాది శ్రీశ్రీ అన్న సత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు ఈ నానీలో.
శబ్దంపై గెలుపు/ భావం బిగువు/ ప్రయోగాల విరుపు/ ఆయన కలం ఎరుపు!
అందమైన భావం, అద్భుతమైన అభివ్యక్తి, అనంత కవితాశక్తి. కానీ అంతా పేదల కోసమే. కార్మికుల పక్షమే. బడుగు జీవుల శ్రేయస్సు కోసమే శ్రీశ్రీ గారి కవిత్వ ఇంద్రధనుస్సు వెల్లివిరిసింది. ఖడ్గం రద్దు/ సైన్యం వద్దు/ పొలాన రైతు హలమే/ అందరికీ ముద్దు!
‘యుద్ధాల వల్ల కలిగేది జన వినాశం. యుద్ధం దుఃఖదాయకం. ఎవరూ కోరుకోనిది. ఎవరూ హర్షించనిది. ప్రపంచాన్ని పచ్చగా, ప్రశాంతంగా ఉంచగలిగేవాడు రైతు మాత్రమే’ అన్న అంశాన్ని అందంగా చెప్పారు ఈ నానీలో.
పృథ్విగారికి శ్రీశ్రీ అంటే ఎంత ఇష్టమో, అంత అభిమానం. అందుకే ఆయన ‘ప్రతి అక్షరం/ ఒక అస్త్రం/ ప్రతి వాక్యం/ ఒక వెలుతురు గవాక్షం’ అంటారు. ఇంకా ‘శ్రీశ్రీ అక్షరం/ పేదలకు గస్తీ/ సాహిత్యానికది/ తరగతి ఆస్తి’ అని వర్ణిస్తారు.
ఇలా శ్రీశ్రీగారి గురించి ఇన్ని నానీలు రాసి ఆయనపై, ఆయన తత్వంపై తనకున్న అభిమానాన్ని, ఆపేక్షను ఇలా అందంగా, అద్భుతంగా ప్రకటించిన పృథ్విగారికి హృదయపూర్వక అభినందనలు.

- కోపూరి పుష్పాదేవి,
విజయవాడ.
చరవాణి: 9440766375

మనోగీతికలు

స్వప్నలోకం
కులుకు తళుకులొలుకు కృష్ణవేణీ తటిని
కనులవిందు చేయు కళల నగరి
స్వప్నలోక మందు సాక్షాత్కరించెను
చూడముచ్చటనగ చూపరులకు

ఇంద్రనగరి బోలు ఇంపైన భవనాలు
హరిత ఉద్యానాలు హంగుమీర
రంగురంగుల పూల రమణీయ అందాల
నగరి శోభ వెలిగె నవ్యరీతి

తళుకులీను జలతరంగాల నడుమ
ఇనుని నాట్యలీల ఇంపుమీర
దుర్గతల్లి మేని ధగధగ కాంతులతో
ప్రజ్వలించె నగరి పసిడి కాంతి

పరుగుపరుగు పారు పంటకాలువలతో
పైరుపచ్చదనాల పరవశింప
ధాన్యరాశి తోడ ధనరాశి పెరుగంగ
సిరులు వెల్లువలై సుఖములొసగె

అందమైన బాట లారు సువిశాలములై
పట్టణాన పెరిగె పయన సుఖము
బాట ప్రక్కలందు బహువిధ పూపొదలు
పరిమళాలు చల్లె పరవశింప

సుందర నగరి చుట్టి శోభిల్లు గిరులు
కోటగోడ వోలె కొలువుతీరి
రాజధాని సహజ రక్షణ కోటవలె
ప్రకృతి సహజమగుచు పెంచె రక్ష

స్వప్న మందు కన్న సుందర నగరము
విజయవాడ తప్ప వేరుకాదు
తెలుగువారి గుండె వెలుగుల నడిబొడ్డు
ఆంధ్ర రాజధాని ఆ రాచనగరి

అమరవౌనది యనుచు అమరావతియని
నామకరణ మిడిరి ప్రేమ మీర
పాడి పంటలెల్ల పొంగిపొరలునచట
ప్రజల శాంతి సుఖము ప్రజ్వరిల్ల

- లక్కరాజు వాణీ సరోజిని,
విజయవాడ.
చరవాణి : 9491054829

కవితా సమార్చన!
కార్తీక పున్నమిరేయి
నడిరేయి నిశ్శబ్దంతో
వెనె్నల పాలలా పాకుతోంది
కళ్లతోనే నీ అందాన్ని తాగి
నీ ఒడిలో ఒళ్లు తెలియకుండా
మత్తుగా విశ్రమించాను!
కళ్లు తెరిచిన సమయాన
నా కళ్లల్లో కళ్లుపెట్టి నవ్వుతున్నావు
నీతోబాటు చంద్రుడూ నవ్వుతున్నాడు
అప్పుడే నా హృదయం స్పందించింది
రమణీయ కవితా స్రవంతి
నా అంతరంగం నుండి ప్రవహించింది
నా కవితా ఛందస్సుతో
నీ సుందర సుకుమార రూపాన్ని
మనోహరమైన నీ యవ్వన సోయగాలను
గానం చేస్తూ పరవశించిపోయాను
నీ హృదయం రాగరంజితమై
అరమోడ్పు కన్నులతో
అదురుతోన్న లేలేత అధరాలతో
నా మోమును స్పృశించావు
ధన్యమైంది చెలీ..
నీ స్పర్శతో నా జన్మ!

- విడదల సాంబశివరావు,
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 9866400059

ఓరి.. నీచులారా!
పిడికిలి బిగిస్తేనే
ప్రాణాలు విలవిలలాడీ
చచ్చిపోయే పిరికిపందల్లారా..
మీది ఏం యుద్ధంరా?
ఏం ధర్మంరా..?
వీరత్వమంటే
ప్రజల్ని రక్షించడం, ప్రేమించడం
దేశాన్ని కాపాడటం
మీ యుద్ధం ఎవరిపైరా
ఉగ్రమూకలారా..
దొంగచాటుగా మాటువేసి
మారణహోమం సృష్టించే
మీది పవిత్ర యుద్ధమా!?
ఛీ... ఛీ...
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా
పోరాడుతున్న వీరులదిరా యుద్ధమంటే
దేశంపై ప్రేమంటే
అమరులైన మా వీరజవానులదిరా
యుద్ధమంటే ప్రపంచాన్ని గెలవటం కాదురా
ప్రపంచానికి శాంతినివ్వడం!
యుద్ధమంటే ఏమిటో
పోరాడుతున్న మా వీరుల్ని అడగండ్రా
అమరులైన మా ధీరుల్ని అడగండ్రా!

(పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో అమరులైన
వీరజవాన్లకు జోహారులర్పిస్తూ..)

- తంగిరాల సోని,
చరవాణి : 9676609234

నగ్నసత్యం
ఈ దేశం మనకేమిచ్చిందంటూ
వెర్రి ప్రశ్న వేయకు ఓ నేస్తం
గాంధీజీ అహింసకు ప్రతిరూపంగా నిలిచింది
నెహ్రూజీ శాంతివాణి ప్రతిధ్వనింపజేసింది
నేతాజీ దేశభక్తి రంగరించిపోసింది
రుద్రమ్మ శౌర్యానికి ఉగ్గుపాలు పట్టింది
మగువ మాంచాలను సాధ్వీమణిగ మలచింది
శివాజీ సౌశీల్యానికి రాచబాట పరచింది
వివేకానందుని సందేశానికి విలువెంతో తెచ్చింది
కలాం కన్నకలలను కల్లలు చేయవద్దన్నది
ఇన్ని విశిష్ట గుణాల సమాహారమైనది
మన భారతదేశం
అవగాహన చేసుకుని ఆచరణలో పెడితే
మన జీవితమే కాదా చక్కని సందేశం!

- గాడేపల్లి మల్లికార్జునుడు,
తెలుగు టీచర్, నరసరావుపేట, గుంటూరు జిల్లా
చరవాణి: 9000749651

గురుబ్రహ్మః

ఉపాధ్యాయులే మార్గదర్శకులు

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.. దీని అర్థం తల్లిదండ్రుల తరువాత గురువు దైవంతో సమానమని. తల్లిదండ్రులు బిడ్డలకు జన్మనిచ్చి, పెంచి పోషించి జీవితాన్ని ఇస్తారు. గురువు తన వద్దకు వచ్చిన విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణను నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. ఎలానంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎపిజె అబ్దుల్ కలామ్ గారు గురువులుగా తమ జీవితాలను ప్రారంభించి దేశానికి రాష్టప్రతులుగా ఎదిగి ఎందరో విద్యార్థులకు ఆదర్శప్రాయులుగా నిలిచారు. పురాణాల్లో ద్రోణాచార్యుడు మంచి గురువుగా నిలిచాడు. నేడు విద్యారంగం వ్యాపార దృక్పథంతో సాగుతోంది.
ఉపాధ్యాయుల పట్ల ఎవరూ గౌరవంగా ప్రవర్తించటం లేదు. అలాగే సినిమాల్లో ఉపాధ్యాయులపై అసభ్యకరంగా పాత్రలు సృష్టించి గురువులను కించపరుస్తున్నారు. పిల్లల మంచి చెడులు చూసే ఉపాధ్యాయులను గౌరవించాలి. ఉపాధ్యాయులు ఏ విషయమైనా మన మేలుకోరే చెబుతారు. ఒక ఉపాధ్యాయుడు ఒక చిన్న తప్పు చెబితే కొన్ని వందల మంది విద్యార్థులు దాన్ని అనుసరిస్తారు. కనుక ఉపాధ్యాయుడి స్థానం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించాలి. విద్యార్థులు ఉపాధ్యాయుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు.

- సయ్యద్ సబిహా, 6వ తరగతి.

బాపూజీ విద్యాలయం, ఆత్మకూరు, మంగళగిరి, గుంటూరు జిల్లా.

గురువులను గౌరవిద్దాం

ఉపాధ్యాయులను ఎందుకు గౌరవించాలి? ఉపాధ్యాయులు మనకు ఏవి ఎప్పుడు చేయాలి, ఏవి ఎప్పుడు చేయకూడదో మనకు వివరంగా తెలియచెపుతుంటారు. వాళ్లకి అన్ని విషయాలూ తెలుసు కనుక మనకి మార్గదర్శనం చేస్తుంటారు. వారు చెప్పిన మంచిని మనం ఆచరించలేదూ అంటే ఒకటి, రెండు దెబ్బలు కొడతారు.
దానికే మనం తెగ బాధపడిపోయి గురువుల మీద ఫిర్యాదులు చేయకూడదు. వాళ్లు ఏమైనా మన మంచి కోసమే చెబుతారు. ఉపాధ్యాయులు మనకు దేవుడితో సమానం. వారు చెప్పే మంచి విషయాలు మనం ఆచరిస్తే మనకు లాభమే కాని చెడు మాత్రం జరగదు. మనం ఉపాధ్యాయులు చెప్పినవి చేయం. వాళ్లు చెప్పనివే చేస్తుంటాం. మనం దేవుడికి పూజ చేసినా, ఉపాధ్యాయులను ప్రార్థించినా ఒకటే. మనం బాగా చదువుతున్నాం అంటే వాళ్లే కారణం. మనం పెద్దయిన తరువాత గొప్ప చదువులు చదువుతున్నాం అంటే కూడా వాళ్ళే కారణం. ఉపాధ్యాయులను మనం గౌరవించడం లేదు. మనం వాళ్లని గౌరవించాలి. తద్వారా అందరితో గౌరవంగా మెలగాలి.

- నక్కా యశస్విని, 6వ తరగతి.

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- వంగర యతేంద్రబాబు