విజయవాడ

యువత కదిలితేనే.. - సందేశం-

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువత కదిలితేనే..

--సందేశం--

సర్వజన హితం కోసం సంక్షేమ రాజ్య నిర్మాణం లక్ష్యంగా నేటి యువత తమ శక్తిసామర్ధ్యాలను ఉపయోగించాలని సమాజం ఎంతో ఆశతో నేడు ఎదురుచూస్తోంది. అయితే ఈ సంధి యుగంలో యువతను పెడదారి పట్టిస్తున్న సంఘ వ్యతిరేక శక్తులను దునుమాడే గురుతర బాధ్యతను ఎవరు స్వీకరించాలి?! హింస, దౌర్జన్యం, పగ, ద్వేషం పెచ్చరిల్లిపోవడానికి అసలు కారణం ఎవరు? అందరూ ఆలోచించాల్సి వుంది.. రాజాలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
బి.కాం సంపాదించిన రాజా ఉద్యోగానే్వషణలో విసిగి వేసారిపోయాడు. పట్టణంలోని విద్యాసంస్థల కూడళ్లలో పోలీస్ స్టేషన్ సమీపంలో ‘టీ’ స్టాల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఒకరోజు రాజా టీ స్టాల్ వద్ద పాఠశాలలకు వెళ్లే సమయంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు గుమికూడి ఆనందపరవశంతో లయబద్దంగా అడుగులు వేస్తూ నృత్య విన్యాసాలు చేస్తున్నారు. అదే సమయంలో మొబైల్ పోలీస్ వ్యాను పెద్ద శబ్దంతో సైరన్ మోగిస్తూ రాజా టీ స్టాల్ వద్దకు చేరుకుంది. విద్యార్థులు పరుగులు తీస్తుండగా.. పోలీసులు వారిని అటకాయించారు.
ఓ పోలీస్ అధికారి ‘ఈ టీ స్టాల్ ఎవరిది?’ అని ప్రశ్నించాడు.
‘నాదే సార్’ అంటూ వినయంగా చేతులు కట్టుకొని సమాధానమిచ్చాడు రాజా.
‘మున్సిపాలిటీ వారికి పన్ను చెల్లిస్తున్నావా?’
‘లేదు సార్. నేను బి.కాం పూర్తిచేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను సార్. ఏదో ఒక పని చేయాలనే సంకల్పంతో’ చెప్పుకుపోతున్నాడు.
‘మిస్టర్! నీ సంకల్పం మంచిదే. నేను మంచివాణ్ణి కాబట్టి చెబుతున్నాను. నీ టీ స్టాల్ అల్లర్లకు ఆటపట్టుగా వుంది. రేపు ఇదే సమయానికి మళ్లీ నేను వస్తాను. టీ స్టాల్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు’ అని హెచ్చరిస్తూ పోలీసు అధికారి వెళ్లిపోయాడు.
పక్కకు తప్పుకున్న విద్యార్థులంతా మళ్లీ రాజా వద్దకు చేరారు.
‘రాజా! నువ్వు రిజర్వుడు కేటగిరికి చెందిన వాడవురా. చిల్లర వ్యాపారాలు మానివేసి ఉన్నత చదువులపై దృష్టి మళ్లించరా’ సూచించాడు ముఖ్య స్నేహితుడు శేఖర్.
‘అవున్రా రాజా! ఆర్థికంగా ఇబ్బందులు లేనివాడివి. కలెక్టర్ చదువుల వరకు దూసుకుపోవచ్చురా’ అన్నాడు మరో మిత్రుడు మదన్.
‘మీ సలహాలు చాలా గొప్పగా ఉన్నాయ్‌రా! కాలేజీలో చేరి ఉన్నత చదువులను తప్పక కొనసాగిస్తానురా’ మిత్రులకు ధీమాగా బదులిచ్చాడు రాజా.
రాజా తన మిత్రులతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు ఎంతగానో ఆనందించారు.
రాజా కళాశాలలో ఎం.కాంలో చేరి హాస్టల్లో ఉంటున్నాడు. కళాశాల వార్షికోత్సవం సందర్భంగా తాను రాసి పాడిన భావగీతం విద్యార్థులను, అధ్యాపకులను ఎంతగానో ఆలోచింపజేసింది.
ఒకరోజు సుభాషిణి అనే సహ విద్యార్థిని రాజా ఉంటున్న హాస్టల్ రూం వద్దకు వచ్చింది. అతన్ని ప్రత్యేకంగా అభినందించింది. క్రమంగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే ప్రేమ పేరిట సుభాషిణి అనుగ్రహం కోసం పరితపించిపోతున్న సుధాకర్ అనే విద్యార్థి ఇదిచూసి ఉడికిపోతున్నాడు. ఒకరోజు గ్రంథాలయంలో ఒంటరిగా కూర్చొని సుభాషిణి ఆసక్తిగా పుస్తకం చదువుతోంది.
‘రాజా ఎక్కడికెళ్లాడు సుభాషిణీ’ అంటూ అడిగాడు సుధాకర్. ఇంతలో రాజా అక్కడికి రావడంతో ఇద్దరూ కలిసి బైటికి వెళ్లారు. రాజా స్నేహితుడు రవి గ్రంథాలయంలోకి వస్తూనే.. ‘సుధా! ఏమిట్రా? అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్’ అన్నాడు.
‘అరే రవీ! సుభాషిణి వ్యవహారం అడ్డం తిరిగిందిరా’ నైరాశ్యంలో మునిగి తేలుతూ సుధాకర్ తన గోడు వెళ్లబోసుకున్నాడు.
‘రవీ! సుభాషిణి నన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ నాలో ఎన్నో ఆశలు కల్పించిందిరా!’ వాపోయాడు సుధాకర్.
‘సుధా! కాలేజీ కల్చర్ గురించి నువ్వు వంటబట్టించుకున్నట్లు లేదురా. సోషల్ బిహేవియర్ గురించి కొంచెం స్టడీ చేస్తే.. అమ్మాయిల మనస్తత్వం నీకు అర్థవౌతుందోయ్’ ఫన్నీగా అన్నాడు రవి.
‘రవీ! వేదాంతం బోధిస్తున్నావా నాకు?’ పిచ్చిగా నవ్వాడు సుధాకర్.
రవి వేదాంతిలానే నవ్వి.. ‘తొందరపడకురా చిన్నా! ప్రస్తుత కార్పొరేట్ సంస్కృతిలో నడుస్తున్న చరిత్ర గురించి ‘అచ్ఛీ బాత్.. మన్‌కీ బాత్..’ ఆలోచించడమే మన వంతు. ఆచరణ మాత్రం కాలగతి నిర్ణయం. తెలిసిందా సుధా?’ అంటూ తన ఆలోచనలు పంచుతున్నాడు. రవి, సుధాకర్ ఈ లోకం పోకడ గురించి ఓ మనసు కవి పాట పాడుకుంటూ గ్రంథాలయం నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
వారం రోజుల సెలవుల అనంతరం కళాశాలలు తెరవడంతో విద్యార్థులంతా వివిధ వాహనాలపై కళాశాలలకు పరుగులు తీస్తున్నారు. సుభాషిణి నివాసం ఆసుపత్రులు, సినిమా థియేటర్ల మధ్య ఉండడంతో మొబైల్ ట్రాఫిక్ పాయింట్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్ వేస్తూ ప్రజల రాకపోకలను నియంత్రిస్తున్నాడు. రాజా, సుభాషిణి మెల్లగా నడుస్తూ వెళుతున్నారు. వెనుక వైపు నుంచి మోటారు బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన సుధాకర్ చేతిలోని పెద్ద సీసాలో వున్న యాసిడ్‌ను సుభాషిణి ముఖం, ఒంటిమీద పోస్తూ ఉండగా అడ్డుకున్న రాజాపై కూడా చల్లి మెరుపువేగంతో పారిపోయాడు.
అప్పుడే అటుగా వస్తున్న ట్రాఫిక్ కంట్రోల్ వాహనంలోని పోలీసులు ఈ దృశ్యం చూసి పెద్దగా సైరన్ మోగిస్తూ సుధాకర్ బైక్‌ను వెంబడించి హెచ్చరికలు చేస్తూ ఛేజ్ చేసి చివరికి బంధించారు. యాసిడ్ దాడికి గురైన సుభాషిణి ముఖం, ఒళ్లంతా కాలిపోవడంతో ఆసుపత్రిలో మరణించింది. రాజా గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతను ఏ ఆశయ సాధనకు కళాశాలలో చేరాడో అది నిర్వీర్యమైపోయింది. రాజా స్నేహితుల వేదనకు అంతులేకుండా పోయింది.
‘వరంగల్లులో ప్రణతి, స్వప్నికలపై యాసిడ్ దాడిచేసిన దోషులను పోలీసులు కాల్చిచంపిన తర్వాత ఇలాంటి దాడులు ఇక జరగబోవని చాలామంది భావించారు. అయితే మహిళలు, విద్యార్థినులు, చిన్నారులపై విచక్షణా రహితంగా జరుగుతున్న దాడులను అరికట్టేలా దోషులకు కనీసం పదేళ్లు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు రావాలి. అంతేకాకుండా అంతర్జాలంలో అశ్లీల దృశ్యాలు చోటుచేసుకోకుండా, ప్రేమోన్మాదం పెచ్చుమీరకుండా చట్టాలు తెచ్చి, యువతను చైతన్యపర్చాలి. వారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించాలి. అందుకు మనవంతుగా యువత సహకరించాలి’ అని రాజా స్నేహితులు తీర్మానించుకున్నారు. యువత కదిలితేనే సామాజిక మార్పు సాధ్యమని మనమంతా గుర్తించాలని వారు సమాజానికి ఒక సందేశమిచ్చారు.

- డిఆర్ రాజ్‌పాల్, తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9502632202

మనోగీతికలు

త్యాగరాజా..
సంగీత సుధానిధి
రాగాల రారాజు
స్వరసృష్టిలో మేటి
గాన ఘనాపాటి
అతనికతనే సాటి!
కృతులనెన్నో రాసి
వర్ణాలు వెలయించి
అనర్గళ ఆలాపనతో
రసజ్ఞుల రంజింపజేశాడు
రస సృష్టిలో స్రష్ట
సంగీత సామ్రాజ్య
మణిమకుటధారి!
ఘనరాగ పంచకంగా
కీర్తినార్జించిన
పంచరత్న కీర్తనలను
ప్రజాకోటికందించిన
అపార సాహిత్య కళానిధి
గానకళాకోవిదుడు
రాజులాహ్వానింప
ఆస్థానములకు పోక
శాస్త్ర సంగీతాన్ని
సామాన్యులకు పంచి
కీర్తినందినవాడు!
భోగాలు త్యజించి
రాముణ్ణి స్తుతించి
భక్తజనులందరిని
తన గాన మహిమతో
తన్మయులజేశాడు
వాగ్గేయకారుడై
వాసిగాంచాడు!
లోకకల్యాణాన్ని
మనసారా కోరుకొని
చిరస్మరణీయుడై
జనహృదయాల్లో నిల్చిన
త్యాగరాజుకిదే
స్వర్ణాక్షర పుష్పాంజలి

- సువారపు
రామచంద్రరావు
తిరువూరు, కృష్ణా జిల్లా.
చరవాణి : 98854644400

అమరుడాయె దీనబంధు
ఆ.వె. మనుజ జాతి నందు మమతానురాగాలు
దూరమాయె బ్రతుకు భారమాయె
కనుల నీరు దాచి కడదాక అంబేద్కర్
అలమటించి తాను అమరుడాయె

తే.గీ. ఎంత సుందర రూపమెంత తెలివి
ఎంత నిండు విగ్రహమది విద్యబలము
ఎంత యోచించి గాలించ వివరపడని
పేద జాతుల రారాజు భీమరావు

సీ.మా. ఇతడు దీనుల దాస్య కింకను కడతేర్చ
గజ్జగట్టాడిన సజ్జనుండు
ఇతడిల కులతత్వ ఘాతుక పీడల
తెగటార్చ వచ్చిన దీనబంధు
ఇతడుర్వి నెగిరాడు సిసలైన శాస్త్రాల
పట్టుదలన పొందె పరమయోగి
ఇతడు రాజ్యాంగమనెడి పసిశిశువును
ప్రియముతో కన్నటి ప్రేమమూర్తి
ఇతడేకదా నిజవిడుముల నెదురాడి
అట్టడుగుజనుల ఆద్యుడాయె

తే.గీ. అతడె భీమరావు అంబేద్కరుండుగా
కీర్తిబడసె ప్రజల మూర్తిగెదిగి
జీవితాంతమితడు శిరమొంచి బ్రతికెడి
భావ సంద్రమీది నావ నడిపె

ఆ.వె. ఎంతమంది తనను యెనె్నన్ని తూలినా
తొణక లేదు మిగిలి తూలలేదు
హీనతనము చీల్చి హిందుత్వ నేలపై
పడని బాధలేదు కడన తాను

తే.గీ. కూడు గూడు గుడ్డ కొరవై కడననిల్చె
పేద కులముల వోట్లతో పెనిగి గెలిచి
రాష్ట్ర భవితను దిగజార్చి రచ్చలెక్కి
మనెడు నేలనెట్లు మనిషి మనుట తగును.

ఆ.వె. క్రీస్తు నెరుగవోయి మస్తుగా రక్తాన్ని
సిలువ మ్రానునెక్కి చిలకరించె
బుద్ధు నెరుగవేమి బోధించె దమ్మను
ధర్మశాస్త్ర పరిధి దలయుడనుచు

ఆ.వె. అంటరాని కులపు ఆరాధ్య దైవమై
దళిత గుండెలందు దాగియున్న
భరత దళితకుల ప్రవరుడీ మన్యుడు
పొగడదగిన గొప్ప పుణ్యమూర్తి

తే.గీ. త్యాగధనులైన మూర్తుల స్వాగతాలు
యుగయుగాలుగా జగతిపై స్వాగతించి
తృప్తిజెందెరు వారిచ్చు తీర్పులన్ని
కథలు కథలుగా వినుచుండ్రు కాలమంత
(నేడు డా. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి)

- దుబ్బల దాసు
వినుకొండ, గుంటూరు జిల్లా.
చరవాణి : 9885532923

పచ్చని ప్రకృతి కోసం..
భూమి నీరు
గాలి చెట్టు
ప్రాణికోటికి జీవనాధారం
ఈ నగ్నసత్యం అందరెరిగినదయినా
ఎరగనట్టు నడుస్తున్న యిజం
మానవ నిర్మిత విజ్ఞాన విహారం
సహజత్వాన్ని కప్పిపుచ్చుతుంటే
మనిషి నిండని గుండెతో
నిజాన్ని నిప్పులా గుప్పిటలో పెట్టి
ప్రగతిపథానికని పరుగు తీస్తున్నాడు
నీరు-చెట్టు విశే్లషణలో
గంతులేసిన హృదయం
గంపెడంత ఆశతో విహంగమై
రెక్కలార్చుకుంటోంది
పచ్చపచ్చని ప్రకృతి..
స్వచ్ఛ సలిలముతో
సేదతీర్చే మందమారుతంతో
అలరారుతుంది
ఇదే మన ప్రగతికి సోపానం
కల్మషం తెలియని
మనిషి మసలే మరో ప్రపంచం

- పెళ్లూరి శేషుకుమారి, నెప్పల్లి,
కృష్ణా జిల్లా. చరవాణి : 09392458160

(అ)సత్య హరిశ్చంద్రుడు

వెటకారంగా ...

విశ్వామిత్రుడు హరిశ్చంథ్రుడి సత్యవ్రతాన్ని పరీక్షించటం కోసం ఆన రాజ్యం సర్వస్వం స్వాధీనం చేసుకోవటమూ, ఇంకా బాకీ తీర్చమని వేధించడమూ, భార్యాపుత్రులను హరిశ్చంద్రుడు అమ్ముకోవడమూ, చివరకు తనకు తానే అమ్ముడుపోయి బాకీ తీర్చడమూ, విశ్వమిత్రుడు ఓటమి అంగీకరించడమూ ఇదంతా అందరికీ తెలిసిన కథే! చాలా మందికి తెలియనిది ఇంతకు పూర్వం జరిగిన కథ మరొకటి ఉంది. ఈ కథ ‘దేవీ భాగవతం’లో ఉంది. హరిశ్చంద్రుడికి చాలాకాలం పాటు సంతానం లేకపోతే వరుణ దేవుని గురించి తపస్సు చేశాడు. వరుణ దేవుడు ప్రత్యక్షమయి ‘నీకు పుత్ర సంతానం కలుగుతుంది. అయితే ఆ బాలుడిని బలి పశువుగా చేసి నా పేరుతో వరుణయాగం చేయాలి’ అని అన్నాడు. ‘అసలు లేనిదాని కన్నా ఇది కొంతనయం కదా. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు’ అనుకుని హరిశ్చంద్రుడు ‘సరే’ అన్నాడు. కొంతకాలానికి పుత్రుడు జన్మించాడు. వరుణుడు ప్రత్యక్షమై ‘నీవు యజ్ఞం చేస్తానన్నావు’ అని గుర్తుచేశాడు. ‘కొడుకు పుట్టి మూడురోజులైనా కాలేదు. కనీసం నామకరణం కూడా చేయలేదు. ఒక మాసం తర్వాత మీరు చెప్పినట్లే చేస్తాను’ అన్నాడు హరిశ్చంద్రుడు. ‘సరే’ అని వరుణుడు వెళ్లిపోయాడు. హరిశ్చంద్రుడు కుమారుడికి ‘లోహితాస్యుడు’ అని నామకరణం చేశాడు. ఒక నెల గడచిపోయింది. వరుణుడు వచ్చి ‘నీ మాట ప్రకారం నెలరోజులు గడచిపోయాయి. నరమేధ యజ్ఞం చెయ్యి’ అన్నాడు.
‘స్వామీ! నా కుమారుడికి ఇంకా దంతాలు కూడా మొలవలేదు. పసికందును చంపమంటారా! కొంతకాలం తర్వాత చేస్తాను’ అన్నాడు. వరుణుడు సరేనని వెనుదిరిగాడు.
కుమారుడి ముద్దుముచ్చట్లతో హరిశ్చంద్రుడికి రోజులు గిర్రున తిరిగిపోయాయి. ‘హరిశ్చంద్రా! ఇప్పటికి నీ కుమారుడికి దంతాలు వచ్చే ఉంటాయి. నీమాట చెల్లించుకో!’ అన్నాడు వరుణుడు.
‘పుట్టి వెంట్రుకలు తీయనివాడు యజ్ఞానికి పనికిరాడు కదా!’ అని హరిశ్చంద్రుడు పేచీ పెట్టాడు. కొన్నాళ్ల తర్వాత వరుణుడు మళ్లీ వచ్చాడు. ‘క్షత్రియులలో పదకొండవ ఏట ఉపనయనం చేయటం ఆచారం. ఉపనయనం చేయకపోతే ద్విజుడు కాడు. ఉపనయనం తర్వాత యాగం చేస్తాను’ అన్నాడు హరిశ్చంద్రుడు. ‘అలాగే కానీ!’ అని వరుణుడు వెళ్లిపోయాడు. పదకొండు సంవత్సరాలు గడచిపోయాయి. ఈసారి ఏ వంక పెట్టటానికీ తోచలేదు హరిశ్చంద్రుడికి. వశిష్టుడిని పిలిపించి ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాడు. ‘రాజా! కన్నకొడుకు ఒక్కడే కొడుకు కాదు. విద్యాదాత, అన్నదాత, ధన దాత తండ్రితో సమానమని శాస్త్రాలు చెపుతున్నాయి. కాబట్టి నీవు ఒక బాలుడిని కొని అతడిని యాగపశువుగా చేసి యజ్ఞం పూర్తిచెయ్యి’ అని సలహా ఇచ్చాడు వశిష్టుడు. హరిశ్చంద్రుడు వెంటనే సేనాపతులను నలుమూలలకూ పంపించాడు. వారు తిరిగి తిరిగి అజీగర్తుడు అనే పేద బ్రాహ్మణుడిని పట్టుకున్నారు. అతడు కోరినంత ధనం ఇచ్చి అతడి కొడుకు శునశే్శపుడు అనేవాడిని పట్టుకొచ్చారు. నరమేధ యజ్ఞం ప్రారంభమైంది. శునశే్శపుడిని యూపస్థంభానికి కట్టి వేశారు. సరిగ్గా బలి ఇచ్చే సమయానికి ఆ బాలుడికి విషయం అర్థమయి గొల్లుమన్నాడు. అప్పటిదాకా అతడికి తెలియదు పాపం! విడిచిపెట్టమని గింజుకున్నాడు. గగ్గోలు పెట్టి ఏడిచాడు. ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా! ఆ ఏడుపులు అటుగా వెళుతున్న విశ్వామిత్రుడికి వినిపించాయి. యాగం జరిగే చోటికి వచ్చాడు. విషయం తెలుసుకుని ‘హరిశ్చంద్రా! ఇది న్యాయం కాదు. ఇది నీ కీర్తికి మాయనిమచ్చ. ఈ బాలుడిని విడిచిపెట్టు’ అన్నాడు.
హరిశ్చంద్రుడు అంగీకరించలేదు. ‘యజ్ఞం చేస్తానని వరుణుడికి మాట ఇచ్చాను’ అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు శునశే్శపుడి చెవిలో వరుణ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రం జపించమని చెప్పాడు. శునశే్శపుడు వరుణ మంత్రం జపిస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి వరుణుడు ప్రత్యక్షమయి తానే స్వయంగా యూప స్తంభానికి బిగించిన తాళ్లను తొలగించాడు. హరిశ్చంద్రుడికి యజ్ఞం చేసిన ఫలం అనుగ్రహించాడు. అందరూ సంతోషించారు. ఇక్కడ హరిశ్చంద్రుడు అబద్ధాలు చెప్పకపోయినా అనేకసార్లు మాటతప్పాడు. అసత్య దోషం కలిగింది. అంతేకాక తన కొడుకుని దాచిపెట్టి,
డబ్బు ఆశ చూపించి మరో అభాగ్యుడి కడుపులో చిచ్చుపెట్టటానికి ప్రయత్నించాడు. కొంత స్వార్థంతో ప్రవర్తించాడు. ఈ కథ జనం మనస్సుల్లో లీలగానైనా ఉందేమో! అబద్ధాలు చెప్పేవాడిని చూసి ‘అబ్బో! ఆయనా! ఆయనో పెద్ద సత్యహరిశ్చంద్రుడండీ!’ అని వెటకారంగా అనటం లోకంలో రివాజు అయింది. అంటే అబద్ధాలకోరు అని పరోక్షంగా నిందించటం అన్నమాట!

- గోనుగుంట మురళీకృష్ణ
రేపల్లె, గుంటూరు జిల్లా.
చరవాణి : 9701260448
=============
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com