విజయవాడ

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి! -- కథ : మెరుపు - విజయవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశకంఠ కొడుకు ఇంద్రనీల్. చాలా తెలివైనవాడు. కొడుకుని పెద్ద చదువులే చదివించాడు. కానీ అతను చదువు పూర్తి చేసుకుని వచ్చేసరికి ఎన్నికల్లో నిలబడి ఆస్తినంతా పోగొట్టుకున్నాడు.
‘నీ ఆశ నేను నెరవేరుస్తాను. మంత్రినై నీకు ఆనందం కలిగిస్తాను, బాధపడకు’ అని తండ్రిని ఓదార్చాడు ఇంద్రనీల్.
అందుకోసం పారిశ్రామికవేత్త రఘునందన ఏకైక కుమార్తె సులోచనను బుట్టలో వేసుకుని, ఆ ఇంటికి అల్లుడై కోటీశ్వరుడయ్యాడు ఇంద్రనీల్. అల్లుడి తెలివితేటల మీద నమ్మకమున్న రఘునందన కూతుర్ని అప్పగించి తీర్థయాత్రలకని వెళ్ళినవాడు తిరిగి రాలేదు.
సులోచనలో చిన్నగా అనుమానం. మామగారు కొంతకాలం కనిపించలేదు. తిరిగివచ్చి చార్‌ధాం యాత్రలో కొట్టుకుపోయిన వారిలో నీ తండ్రి కూడా.. అంటూ కన్నీరు కార్చేడు.
డబ్బు విరజిమ్మి అనుయాయులను సంపాదించాడు. కొత్త పార్టీ పెట్టేడు. ఒక్క ఆడదైనా లేకుంటే పార్టీ కలర్‌ఫుల్‌గా వుండదని అందరూ చెప్పడంతో కోమలిని చేరదీశాడు.
ఈవిషయం సులోచనకి తెలిసింది. నువ్వు రాజకీయాల్లో ఎదగటానికి సహకరిస్తాను కానీ ఇటువంటి చెత్త వేషాలు వేశావంటే విడాకులిస్తానని బెదిరించింది భర్తను.
ఇది విన్నాడు దశకంఠ. ఆమె విడాకులిస్తే మళ్లీ రోడ్డున పడాలి. అందుకే ఆమెను కూడా తండ్రి దగ్గరికే పంపాలని నిర్ణయించుకున్నాడు.
భర్తతో గొడవపడి వచ్చిన కోడలితో తలనొప్పిగా వుంది. కాఫీ కావాలని అడిగేడు. వంటింట్లోకెళ్లిన సులోచన గదంతా నిండిన గ్యాస్ వాసన గ్రహించలేదు. మంటల్లో మండిపోతూ రక్షించమంటూ హాల్లోకి వచ్చింది.
ఆమెను చావనివ్వండి అన్నాడు ఇంద్రనీల్ కసిగా. నౌకరు నారాయణ కంబళి కప్పి మంటలార్పి అంబులెన్సులో హాస్పటల్‌కి తరలించాడు. పూర్తిగా కాలిపోయిన ఆమె ‘తన భర్తే తనను చంపేడ’ని మరణ వాగ్మూలం ఇచ్చి చనిపోయింది.
కటకటాల్లో ఇంద్రనీల్‌ని చూసి కంటనీరు పెట్టిన దశకంఠ ‘నేను అనుకున్నదొకటి.. అయింది ఇంకొక్కటి’ అన్నాడు. తెల్లబోయాడు ఇంద్రనీల్. ‘నువ్వే సులోచనను..,’ ఏదో చెప్పబోయాడు. ‘అయితే నువ్వు పోలీసులకి లొంగిపోయి నన్ను విడిపించు’ అన్నాడు. ‘ఈ పెద్దవయసులో జైలు జీవితం గడపడం నావల్ల కాదురా. ఏమీ అనుకోకురా’ అని వెళ్లిపోతున్న తండ్రిని అసహ్యంగా చూస్తూ తన దుర్మార్గానికి దేవుడు తననిలా శిక్షించాడని వేదనపడ్డాడు.

- నాగమల్లిక, గుంటూరు

నేను నిర్దోషిని! -- చిన్న కథ

‘మీ అమ్మమ్మ నిన్ను పెంచి పెద్ద చెయ్యొచ్చు. అందుకు నువ్వు ఆవిడ ఆపరేషన్‌కి ఆర్థిక సాయం చెయ్యి. వద్దనను. కానీ నీ కిడ్నీ ఆవిడకి దానం చేస్తానంటే ఒప్పుకోను. నా మాట కాదని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నువ్వు తిరిగి నా దగ్గరకి రానవసరం లేదు. అసలు ఈవిడ ఊపిరి ఆపేస్తే మాటిమాటికీ మనం రావడం, ఆవిడ గురించి ఘర్షణ పడటం వుండదు’ కోపంగా అరుస్తున్నాడు మనవరాలి భర్త.
‘పిచ్చి పిచ్చిగా వాగకండి. ఆవిడ మైండ్ అన్నీ గ్రహిస్తోంది. వింటే ఆవిడ తనే ఊపిరి ఆపుకునే రకం. అలా జరిగితే మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించలేను’ చిన్నగా ఏడుస్తోంది ఉమ.
భ్రమరాంబ మైండ్ అన్నీ గ్రహిస్తోంది. అప్పుడప్పుడే స్పృహలోకి వచ్చిన ఆమె తన గురించి మనవరాలు భర్తను కూడా వదులుకునే నిర్ణయానికి వస్తుందని భయపడింది. మనవరాలు రూంలోంచి వెళ్లగానే మెల్లగా ఆక్సిజన్ తొలగించుకుంది.
అరగంట తరువాత రూంలోకి వచ్చిన ఉమ ఆక్సిజన్ తీసేసి వుండటం చూసి కోపంతో ఊగిపోయింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది.
వాళ్లు రాగానే తన భర్తే ఈ పని చేశారని చెప్పింది. పోలీసులు శంకర్‌ని అరెస్టు చేశారు. ‘మన బాబు మీద ఒట్టు ఉమా.. నేనాపని చేయలేదు. నిన్ను బెదిరించానంతే. నేను నిర్దోషిని’ సెల్‌లో నుంచి అరుస్తున్న భర్తను అసహ్యంగా చూసింది.
మనవరాలి వెంట వచ్చిన భ్రమరాంబ ఆత్మ విలవిలాడిపోయింది. వాళ్లిద్దరూ ఎక్కడ విడిపోతారోనని. తాను చేసిన పిచ్చిపని ఇలా వికటించి.. భర్తను ఉమ జైలుపాలు చేయడం ఏమిటి? తనే వారిద్దరి సంసారాన్ని పూర్తిగా ఇలా విచ్ఛిన్నం చేయడంతో వేదనతో కుమిలిపోయింది.

- చావలి శ్యామల, విజయవాడ.
=====
మనోగీతికలు

పచ్చని చెట్టు
స్ర్తి పచ్చని చెట్టని
ముళ్లని పెరికి
గూళ్లిచ్చే చెట్టని మరిచాడు
గ్రీష్మతాపాన్ని భరించి
నీడనిచ్చిందని మరిచాడు
అవమానాల్ని హరించి
ఆనందాల్ని పంచిందని
ధిక్కారాలను ఎదిరించి
సంస్కారంతో నిలిచిందని
మరిచాడు
పరదాల మాటున
ఆంక్షల వలలో ఇరికించాడు
స్వేచ్ఛను గిరాటేసి
మనస్సును పెనంపై కాల్చి
గిలగిలా కొట్టుకుంటున్న
ఇష్టాఇష్టాల వికృత చేష్టల్ని
చూస్తున్నాడు
అహంకారపు కళ్లల్లో
అధికారపు మత్తులో
ఆ చెట్టు అస్తిత్వానే్న
ప్రశ్నించాడు
గాయాల్ని తట్టుకుని
వేదనాభరిత ప్రశ్నల సాగరాన్నీది
ఆత్మాభిమానాన్ని
భద్రంగా అదిమిపట్టింది
వేర్లు చిట్లుతున్నా
వెనుదిరగని ధైర్యం
నీకో న్యాయం..
నాకో న్యాయం కాదు
సమసమాజంలో
ఇద్దరికున్నది సమాన ధర్మం!
వౌనానికి ఒక్కసారి మాటలొచ్చి
అహంకారపు జ్వాలలకు
అడ్డుకట్ట వేసింది
ఇప్పుడా చెట్టుకు మరణం లేదు
కూల్చినచోటే
కొత్త చిగురులు వేసింది
రేపటి తరానికి
ప్రాణవాయువుని పంచేందుకు
పచ్చటి అడుగులేస్తోంది!

- అమూల్యాచందు,
విజయవాడ.

నీకు జేజేలు..
ప్రాణాన్ని ఫణంగా పెట్టి
పేగు తెంచి ఇచ్చి
ఒక మూర్తికి జీవం పోసి
సృష్టిక్రమాన్ని కొనసాగించే
మాతృమూర్తిగా..
ఉగ్గుపాలతో, గోరుముద్దలతో
ఆచార వ్యవహారాలను
నీతినిజాయితీలను
దేశభక్తిని రంగరించి
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే
తొలి ఉపాధ్యాయురాలిగా..
పతికి అపార మంత్రాంగంతో
ఇంటిగుట్టు గడప దాటకుండా
అర్ధశాస్త్రాన్ని ఔపోశన పట్టి
ఇంటిని స్వర్గసీమగా మార్చే
గొప్ప గేస్తురాలిగా..
మదినిండా కోటి ఆశలను
లోలోనే నింపుకొని
తల్లి, తండ్రి, తోబుట్టువులు
నిత్యం అణగదొక్కే
పురుషాధిక్య సమాజంలో
లెక్కలేనన్ని కట్టుబాట్లకు
పెక్కు ఇక్కట్లపాలైనా
ధరాతలాన్ని తలదనే్న
నిత్య సహనమూర్తిగా..
విద్యా, సాంస్కృతిక
రాజకీయ, అంతరిక్ష
సాంకేతిక, రక్షణ
కళా, సాహిత్య, ఉద్యోగ
విభిన్న రంగాల్లో రాణించిన
బహుముఖ ప్రజ్ఞాశాలిగా..
ఓ మహిళా!
నీ పాత్ర అనిర్వచనీయం
అనన్య సామాన్యం
సభ్యసమాజం సదా
నీకు రుణగ్రస్తం
నీకివే నా జేజేలు..!చరవాణి : 9059824800

- అద్దంకి సుధాకర్, టీచర్, జగ్గయ్యపేట,
కృష్ణా జిల్లా.
చరవాణి : 8985061346

పరివర్తనే పరిష్కారం!
బాలికైతేనేం
బాలింత అయితేనేం
ముదుసలి అయితేనేం
ఆడతనముంటే చాలు
అత్యాచారానికి అర్హురాలేనట!
కళ్లు మూసుకుపోయిన
మృగాళ్లను
ఏ నిర్భయ చట్టం ఆపగలుగుతోంది?
అర్ధనగ్న వస్తధ్రారణే
అత్యాచారాలకు మూలమని ఒకరు
అసమయ సంచారమే
అఘాయిత్యాలకు హేతువని మరొకరు
నొక్కివక్కాణిస్తున్న
పురుషాధిక్య ప్రపంచంలో
అతివలను ఆదుకునే నాథులెవ్వరు?
ఆడదంటే ఆటబొమ్మ కాదని
ఆడదే సృష్టికి మూలమని
తన జన్మప్రదాత
చెల్లి, చెలియ కూడా ఆడదేనని
వారిని గౌరవించటం
తన కర్తవ్యమని ప్రతి మగాడు
పరివర్తన చెందిననాడు..
ఆనాడే స్ర్తిజాతికి వెలుగు
మహిళాభ్యుదయం జరుగు
అబలలపై అత్యాచారాలు తొలుగు!

- ఆళ్ల నాగేశ్వరరావు, ఆర్టీసీ కండక్టర్, తెనాలి.
చరవాణి : 7416638823

మహిళా దినోత్సవం

పరిపూర్ణతకు ప్రతిరూపం

(8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా)

మహిళ అంటే ఎవరనేది ఒక్కమాటలో నిర్వచించటం కష్టం. మహిళ అంటే విస్తృతార్థంలో పరిపూర్ణతకు ప్రతిరూపం! ఏ రంగంలో అయినా విజయం సాధించటానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భర్తకు, పిల్లలకు, సమాజానికి తనవంతు సంపూర్ణంగా సహకరించేది మహిళ. అందుకే మన మహర్షులు సమాజంలో మహిళలకు అగ్రస్థానం కల్పించారు. వారిని దేవతామూర్తులుగా పూజించారు. సృష్టికి మూలకారకులని కీర్తించారు. త్రిమూర్తులకు శక్తినిచ్చే ఆదిపరాశక్తిగా వర్ణించారు. తల్లిని సృష్టిలో మొదటి గురువుగా చెప్పటంలో ఉద్దేశం మహిళలను గౌరవింపతగిన వారిలో శ్రేష్టులుగా గుర్తించటమే! మహిళను మహాలక్ష్మిగా పిలుస్తారు. ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని అంటారు. కోడలు ఇంట్లోకి అడుగు పెడితే లక్ష్మీదేవి వచ్చిందని అంటారు. ఈవిధంగా మహిళకు మన పురాణేతిహాసాల్లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.
మహిళలను గురించి చెప్పాలంటే మనకు జన్మనిచ్చిన తల్లిని, మగనికి తోడు, నీడగా జీవితాంతం కలిసి బతికే భార్యను, అన్న లేక తమ్ముడి బాగోగులను కనిపెట్టుకునుండే సోదరిని ముందుగా తలచుకోవాలి. వీరు లేకుంటే మగాడు లేడు. ఇంకా చెప్పాలంటే మగవాడికి మనుగడే లేదు! ప్రతి మగవాడి విజయం వెనుక తప్పక స్ర్తి వుంటుంది అంటారు. మగవాడి విజయానికి గాని, పతనానికి గాని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మహిళ పాత్ర కచ్చితంగా ఉంటుందని చరిత్ర చెబుతోంది. అలా జరిగిన సంఘటనలను మనం కోకొల్లలుగా చూడవచ్చు. ఒక ఇంటి చరిత్రను మార్చాలన్నా, ప్రపంచ చరిత్రను మార్చాలన్నా, వ్యక్తి భవిష్యత్‌ను మార్చాలన్నా, దేశ భవిష్యత్‌ను మార్చాలన్నా అది ఒక్క మహిళ చేతిలోనే వుందనేది అక్షర సత్యం. ఇలా చరిత్ర గతులను మార్చిన మహిళలెందరో మనం మన గత చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే తెలుస్తుంది. మహిళలో ఒక తల్లి ఉంది, చెల్లి ఉంది, భార్య ఉంది, వీటన్నిటినీ మించి ఆమెకు భూదేవంత సహనం ఉంది, శాంతం ఉంది. అలాగే ఆమెలో క్షమాగుణం ఉంది, దయాగుణం ఉంది, దానగుణం ఉంది, దండించే గుణం ఉంది. అంటే ఒక రూపంలో అనేక శక్తులన్నమాట. ఇవన్నీ కలగలిసిన రూపమే స్ర్తి. అలాంటి ఉత్తమ మహిళ నేడు సమాజం నుండి, తోటి మగాడి నుండి అనేక రకాలైన చిత్రహింసలకు గురౌతోంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న జరుపుకుంటారు. మొట్టమొదట 1910లో సోషలిస్ట్ సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశంలో కోపెన్‌హాగెన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు జరిగినట్లు చెబుతారు. తరువాత 1911 మార్చి 19న ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లలో 11 లక్షల మందితో వేడుకలు జరిగాయి. 1913లో రష్యాలో, ఇలా వివిధ దేశాల్లో వివిధ రకాలుగా మహిళా దినోత్సవాలు జరిగినా చివరకు 1914లో మార్చి నెల 8వ తేదీని ప్రపంచ మహిళా దినోత్సవంగా నిర్ణయించి మహిళలందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఒక్కో సంవత్సరం ఒక్కో సమస్యపై పోరాడటానికి వేదికగా ఎంచుకున్నారు. మహిళల హక్కుల గురించి, సమాజంలో వారి స్థానం గురించి, సమాజంలో వారిపై జరుగుతున్న అత్యాచారాల గురించి, వివక్ష గురించి ప్రపంచం మొత్తానికి తెలియజేయటానికి వేదికగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజు కొన్ని దేశాల్లో జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. అవి అర్మీనియా, మోల్టోవా, రష్యా వంటి దేశాలు. మన దేశంలో కొన్ని రాష్ట్రాలు సెలవు దినంగా ప్రకటించాయి. ఆనాడు మహిళలందరూ ఒకచోట చేరి తమ సమస్యలపై చర్చించటమే కాక ఆనాడు అనేక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఘనంగా సత్కరిస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయటానికి ప్రపంచ మహిళా దినోత్సవాన్ని వేదికగా మలచుకుంటున్నారు.
నేటికీ సమాజంలో ప్రతిరోజూ ఏదోఒక ప్రదేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయ. మహిళలు ఆత్మహత్యలు చేసుకోవటం, విద్యార్థినులపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తోటి స్నేహితుల లైంగిక దాడులు, యాసిడ్ దాడుల వంటివి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావటం సిగ్గుచేటు. ఇకనైనా ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా అమలుచేయవలసిన అవసరం ఉంది. అలాగే మహిళలు తమ హక్కులను తాము సాధించుకుంటూ, తమ బాధ్యతలనూ తెలుసుకోవాలి. మారుతున్న కాలాన్నిబట్టి తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించగలగాలి. సమాజానికి తాము ఎంతవరకు ఉపయోగపడగలమో అవగాహన చేసుకుని ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మహిళలను గౌరవించటం, ఆదరించటం, వారికి ప్రేమానురాగాలు పంచటం అందరి బాధ్యత. అప్పుడే మహిళా దినోత్సవం సార్థకవౌతుంది.

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122

పుస్తక సమీక్ష

బాధ్యతను గుర్తుచేసే ‘మన మంచి తెలుగు’

తెలుగువారి కోసం తెలుగులో ప్రియమైన పుస్తకంగా వచ్చింది. తెలుగు చదువరులకు కోపం వస్తుంది. నిజమే. తెలుగులో మాట్లాడటం, రాయడం నామోషీగా, నామర్దాగా భావిస్తున్న కాలం. ఎవరి మాతృభాష కోసం వారు పరితపిస్తూ పోతుంటే మన భాష పట్ల మనకేమీ పట్టనట్టుండే దౌర్భాగ్య పరిస్థితి మన తెలుగుకు పట్టింది. ఇంకా భాషా ప్రేమికులు తమ మాతృభాష మీద మమకారం చావకుండా ఉండటం కోసం భాషా విషయాలపై శ్రద్ధపూని నిరంతర కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆ కోవలోదే ఈ పుస్తకం ‘మన మంచి తెలుగు’. రచయత బహు గ్రంథకర్త డాక్టర్ మలయశ్రీ.
తేనెలూరు తెలుగు పదాలలోని రూపాన్ని, భావాన్ని పరామర్శించిన ప్రయత్నమే ఈ పుస్తకం. అందుకే తెలుగు భాషా పదాల - రూప భావ పరామర్శ అన్న ఉప శీర్షికతో పుస్తకాన్ని వెలువరించారు. చరిత్రను గురించి చెప్పుకుంటూ వచ్చారు. చదువుకుంటూ రెండో పేజీలోకి రాగానే మనకొక తెలుగుమాట కన్పడుతుంది. గాధా సప్తశతిలోని ‘పులుమావి’. ఆ పదం యొక్క అర్థం ‘గడ్డి గర్భ సంజాతుడు’ అని. ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించారు మలయశ్రీ. తెలుగు భాష జనం వాడుకలో ఉన్నా అప్పటికి తెలుగు వాక్యాలు రాలేదంటే ఆ స్థాయికి ఎదిగి ఉండదంటారు. పదకొండవ శతాబ్దంలో నన్నయ్య భట్టారకుడు అనువదించిన మహాభారతమే కవిత్వంలో మొదటిది అంటారు. అప్పటికి ఇప్పటికి అదే మన తెలుగు భాషకు, కవిత్వానికీ ప్రామాణిక గ్రంథం అంటారు. చరిత్రను ఔపోసన పట్టిన మాస్టారు రాసిన విషయాలు చదువుతుంటే మన మాతృభాషను ఎంత భ్రష్టుపరుస్తున్నామో అనిపిస్తుంది. తెలుగు అనార్య భాష అయితే ద్రవిడ భాషా కుటుంబానికి చెంది పరిపక్వ భాష అయిందంటారు.
పండితుల సంస్కృతాభిమానంతో తెలుగు పదాలు మాయమైపోయాయి. చాలా పదాలు తెలుగు పదాలనుకునేంత సంస్కృత పదాలు తెలుగులో కలిసిపోయాయి. అన్నం, దేహం, సూర్యచంద్రులు, గృహం, వివాహం, సంతానం, స్వర్గ నరకాలు ఇవీ సంస్కృత పదాలు. ఆశ్చర్యమనిపిస్తాయి. సామెతలు ఎలా పుట్టాయో ఎలాంటి మార్పులు చెందాయో చర్చించారు. మనకు బాగా అలవాటైన సామెత ‘గాడిద గుడ్డు కంకర పీచు’గా కొట్టి పారేస్తాం. అది ఎలా ఆవిర్భవించిందో చెప్తూ జానపదంలో అయిన మార్పును విశే్లషించారు. అలాగే ‘పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్టు’ అంటుంటాం. నిజానికి ‘పిల్లి’ కాదు, ‘పిలిచి’. అది జనవాడుకలో పిల్లి అయిపోయింది. ‘పోరు నష్టం పొందు లాభం’ పోరు అంటే వెళ్లరని కాదు గొడవ, తగాదా. అలాగే పొందు అంటే పొందటం కాదు చెలిమని, అలాంటివెన్నో చక్కగా విపులీకరించారు రచయిత మలయశ్రీ.
పురాణ పురుషుల పేర్లలోని అర్థాలు వివరణ బాగుంది. చూడండి ‘అభిమన్యు’ అంటే అధిక కోపం కలవాడు, అగస్త్యుడు అంటే కొండను అట్లా ఉంచినవాడని, కుచేలుడు అంటే చినిగిన బట్టల వాడు అని వివరించారు. గమ్మతె్తైన ఈ పేరును చూడండి ‘బాలాజీ’ అంటే ఠపీమని వెంకటేశ్వరస్వామి అనేస్తాం. కాని నిజానికి బాలాత్రిపుర సుందరిని సంక్షిప్తం చేస్తే ‘బాల’ కదా గౌరవ వాచకం చేస్తే మరి వింతగా లేదు. రావణ = పెద్ద అల్లరి చేయువాడు, వాలి = తోక కలవాడు, ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ, కౌసల్య, కైకేయి లాంటివి. చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి అసలు పేర్లు కావు. విశేషణాలు అంటారు. కావ్య రచన కదా కవుల సృష్టి. అలాగే తెలుగు పేర్ల పదాలను పరామర్శించారు. భద్రాచలం, వెంకటాచలం, సింహాచలం, వీటిని విడదీస్తే భద్ర+అచలం అలాగే మిగతావి అచలం అంటే కొండ. సింహాద్రి, వెంకటాద్రి, శేషాద్రి. అద్రి అన్నా కొండ అర్థం. రంగాచారి, రామాచారి సరికాదంటారు. చారి - సంచారి. సంచరించువాడు. దానికి ఆచారవంతుడనే అర్థం రాదంటారు. తప్పుని ఒప్పుగా పాడేసుకుంటూ పెద్ద తప్పిదం ‘్భద్రాద్రి రామదాసు’ పాట ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి కరుణించుమని చెప్పవే’ అంటూ తెగ పాడేసుకుంటాం. కాని ‘బ్రోవుమని’ అంటే కరుణించమని ఉండాల్సిందంటారు. హనుమద్దాసులు అనాలోచితంగా పద రూపాలు మార్చి పాడి ఉంటారు అనేది ఆయన అభిప్రాయం. ఇంకో సినిమా పాట చాలా మంచి పాట. ‘వౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది... ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది’ కదా! ఎదగమని, ఒదగమని ఇవి వ్యతిరేకార్థ పదాలు కావా? ఎందుకో చాన్నాళ్ల నుంచి మన కవులు, రచయితలు, పండితులు - పామరులు, పత్రికల రాతలు - సభల ప్రసంగాలు అంతటా ఈ అనమను, తినమను, వినమను అంటూ నెగిటివ్ పదాలు వాడుతున్నారని ఆయన వాపోతున్నారు. ఎందుకంటే అనేవారికి, వినే వారికి లేని ఈ బాధ విశే్లషకులకే ఉంటుంది మరి.
ఇంకా ఈ పుస్తకంలో అన్నమయ్య పదాలతో మారిన సంస్కృత పద రూపాలు, తెలుగు పద రూపాల పట్టిక. డాక్టర్ సినారె పద ప్రయోగాలు, గురజాడ వాడిన పదాలు పట్టికగా ఇచ్చారు. ఇవి పరిశోధక విషయాలు. క్షేత్రయ్య, త్యాగరాజు, రామదాసు అలా కొందరు వాడిన పద ప్రయోగాలు పుస్తకంలో ఉన్నాయి. ఆయన ముఖ్యంగా కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్యం చరిత్రపై పరిశోధన చేసిన వారు. తన భౌతిక వాది పత్రిక ద్వారా, తన రచనల ద్వారా తెలుగు భాషా సేవ చేస్తున్న భాషావేత్త కనుక ఈ పుస్తకం విద్యార్థులు సాహితీపరులు, భాషాభిమానులు కొని తప్పక చదవ తగిన పుస్తకం.

- రవికాంత్, సెల్: 9642489244

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com