మిర్చిమసాలా

గులాబీ పూవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ ఉప ఎన్నికల్లో తొలి ఓటరుకు గులాబీ పూవు ఇవ్వనున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. ఏదో మంచి ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంటే ఆయా పార్టీల అభిమానులు మాత్రం దీనిలో అనేక అర్ధాలను వెతుకుతున్నారు. గులాబీ రంగు అధికార పక్షం టిఆర్‌ఎస్‌ది కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయమని చెప్పడమే కదా? అని బిజెపి నేత అంటే పువ్వు అంటే మీ పార్టీ గుర్తు కదా? అని కాంగ్రెస్ నేత అనుమానం వ్యక్తం చేశారు. సరే పువ్వు చేతితో ఇస్తారు, చేతితో తీసుకుంటారు అంటే మీ పార్టీకి ప్రచారం చేయడమే కదా? అని మిగిలిన పార్టీల వారు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఏం చేసినా రాజకీయం తప్పదనుకున్నారు విమర్శలు విన్నవాళ్లు.
- మురళి

రెండూ తెలంగాణ దుకాణాలే, కానీ...!
జానారెడ్డికి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో దుకాణం పెట్టి, పదవి రాగానే దానిని మూసేశారన్న రహస్యాన్ని వరంగల్ ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ బయట పెట్టారు. ‘నా సంగతి ఏమో కానీ, నీకు కూడా చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదనే పార్టీ పెట్టలేదా?’ అని జానారెడ్డి ఎదురు ప్రశ్నించారు. మొత్తంగా మంత్రి పదవులు రాకపోవడం వల్లనే దుకాణాలు తెరిచినట్టు పరోక్షంగా ఇద్దరూ చెప్పుకొచ్చారు. అయితే జానారెడ్డి, కెసిఆర్‌ల పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం జానారెడ్డిని కాకుండా కెసిఆర్‌నే నమ్మడంలో ఆంతర్యం దాగి ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్‌ఎస్‌ను స్థాపించిన తర్వాతనే కెసిఆర్‌కు కేంద్ర మంత్రి పదవి వచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర సాధన ఉద్యమ కాడిని దించకుండా చివరకంటూ పోరాడటం వల్ల ప్రజలు కెసిఆర్‌ను నమ్మి అధికారాన్ని అప్పగించారు. అయితే కెసిఆర్ కంటే ముందు జానారెడ్డితో సహా అనేక మంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ పేరుతో ఉద్యమాలు చేసినప్పటికీ పదవులు రాగానే ఆ అంశాన్ని పక్కన పెట్టారు. కెసిఆర్ మాత్రం అలా కాకుండా పార్టీ పెట్టిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరినప్పటికీ రాష్ట్రాన్ని సాధననే అంతిమ లక్ష్యంగా పోరాడటం వల్లనే తెలంగాణ సిద్ధించిందన్నది జగమెరిగిన సత్యం. కెసిఆర్, జానాల పరస్పర ఆరోపణలకు మధ్య తేడా ఇదే...
- వెల్జాల చంద్రశేఖర్

పాపులర్ పదాలు
కొన్ని పదాలు సమాజంలో జరిగే సంఘటనలు బట్టి పాపులర్ అవుతుంటాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నక్సలైట్లతో చర్చలు, అనంతరం నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా జరిగిన విషయం విదితమే. ఆరేడేళ్ల క్రితం తరచుగా కూంబింగ్, ఎన్‌కౌంటర్, నాకాబందీ, డంపులు, కొరియర్, ఇన్‌ఫార్మర్ అనే పదాలు తరచుగా వినబడేవి. ఈ మధ్య కాలంలో ఆ పదాలు రెండు రాష్ట్రాల్లో కనుమరుగయ్యాయి. ఇటీవల విశాఖ ఏజన్సీలో కొంత మందిని నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా భద్రాచలం వద్ద ఒక పార్టీ నేతలను మావోయిస్టులు అపహరించుకునిపోయారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ కూంబింగ్ అంటే గాలింపు, ఎన్‌కౌంటర్ అంటే పరస్పర కాల్పులు, నాకాబందీ అంటే ఆకస్మిక తనికీలు, డంపులు అంటే మావోయిస్టుల రహస్య నిధి, కొరియర్ అంటే ఉత్తరప్రత్యుత్తరాలు, డాక్యుమెంట్లను గమ్యానికి చేర్చేవారు, ఇన్‌ఫార్మర్ అంటే సమాచారాన్ని అందించేవాడు అనే పదాలు తెరపైకి వచ్చేస్తున్నాయి. కాల క్రమంలో ఈ పదాలు కొన్నాళ్లు తెరమరుగైనా, మళ్లీ వాడాల్సి వస్తోందని ఒక సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
- శైలేంద్ర

అన్నీ ఉచితం..!!
ఫ్రీ అనగానే ఎగబాకడం ఎవరి విషయంలోనైనా సహజంగా జరిగేదే. కళ్ల టెస్టింగ్ ఫ్రీగా చేస్తామని ప్రకటనలు వస్తుంటాయి. తీరా కళ్లు టెస్టు చేశాక మరో ఫ్రీ ఆఫర్ చేస్తారు. అదేమంటే అద్దాలు కొంటే ఫ్రేమ్ ఫ్రీగా ఇస్తామంటారు. ఈ డబుల్ దమాకా ఆఫర్‌తో ఎవరైనా ఇట్టే ఫ్లాట్ కావల్సిందే, సరే అనడమే తరువాయి, అద్దాలకు ఐదువేలో పదివేలో చార్జి చేస్తారు. ఇంకా మంచి అద్దాలు కావాలంటే 30వేల నుండి లక్ష రూపాయిల వరకూ ఉన్నాయని చెబుతారు. లక్షతో పోలిస్తే పదివేలతో సరిపెట్టుకోవడం ఉత్తమమని అక్కడి నుండి బయటపడుతుంటారు. తీరా చూస్తే 500 టెస్టింగ్ ఫీజు ఫ్రీ కోసం పోతే 10వేలు చేతి చమురు వదలడం ఖాయం. అవన్నీ ప్రాప్తకాలజ్ఞత. ఇపుడు చదువుల్లో కూడా టెస్టులు ఫ్రీ, అడ్మిషన్ ఫారం ఫ్రీ, కౌనె్సలింగ్ ఫ్రీ, క్లాసులు ఫ్రీ...చివరికి ఇంజనీరంగ్‌లో కన్వీనర్ కోటాలో సీట్లకు ఫ్రీ సీట్లు అనే పేరే కొనసాగుతోంది. కొద్ది కాలం క్రితం సాంకేతిక విద్యామంత్రికి సైతం నిజంగా ఫ్రీ అనుకుని పాత్రికేయులను అడిగితే పేరు ఫ్రీ అయినా ఫీజు 15వేలు అని చెప్పడంతో నివ్వెరపోయాడు. ఇంతకీ ఈ ఫ్రీ కథనం ఎందుకంటే సింగపూర్ వాళ్లు ఆంధ్రాకు అంతా ఫ్రీగా చేస్తున్నారట...లొగుట్టు తెలుసుకోండి..నన్ను అడగొద్దు ఖర్చులకు 12 కోట్లు వెచ్చించారు...అంతే అన్నీ ఫ్రీ...
-బి.వి.ప్రసాద్

సమాంతరంగా..
ఒకవైపు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనలో, పథకాలు, కార్యక్రమాల అమల్లో పోటాపోటీగా ఓకే రకంగా ముందుకు వెళుతున్నారు. గ్రామీణ ప్రజలతో మమేకం అయ్యేందుకు మీఇంటికి మీభూమి పథకాన్ని బాబు చేపట్టగా, మీఊరు-మీప్రణాళిక పేరుతో కెసిఆర్ అలాంటి పథకాన్ని చేపట్టారు. రైతుల రుణమాఫీ రెండు రాష్ట్రాల్లోనూ ఒకేరకంగా జరుగుతోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఇదే వరవడి కొనసాగుతోంది. వీటన్నింటికీ మించి వాస్తును ఇద్దరు సిఎంలు గట్టిగా నమ్ముతున్నారు. అంతే కాదు అమలు కూడా చేస్తున్నారు. వాస్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సచివాలయం కొత్త భవనాలను కెసిఆర్ ఎర్రగడ్డలో నిర్మించాలని ప్రతిపాదిస్తే, రాజధాని నగరానే్న కృష్ణాఒడ్డున నిర్మించేందుకు బృహత్‌పథకాన్ని బాబు అమలు చేస్తున్నారు. ఇలా ఒకటేమిటి, అన్ని విషయాల్లోనూ ఇద్దరు కూడా ఒకే మార్గంలో పయనిస్తున్నారు.
- పి.వి. రమణారావు