మిర్చిమసాలా

అమ్మో పది లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర రాజధాని విజయవాడలో రోడ్డు మీద పదిలక్షల రూపాయల నోట్ల కట్టలు దొరికాయని టీవీ చానళ్లలో చూసిన వారు గుండెలు బాదుకున్నారు. సాధారణంగా దరిద్రంలో కొట్టుమిట్టాడే వారికి లక్షల కరెన్సీ కట్టలు లేదా బంగారం దొరికినట్లు పగటి కలలు కంటుంటారు. లక్ష్మీ దేవి ఎప్పుడు వరిస్తుందా అని జీవితాంతం ఎదురుచూస్తుంటారు. కాని విజయవాడ మొగల్రాజపురంలో ఇటీవల ఒక వ్యక్తి పది లక్షల రూపాయల నోట్ల కట్టలు ఉన్న సంచి పోగొట్టుకున్నారు. ఈ సొమ్ము ఉన్న సంచి మరో వ్యక్తికి దొరికితే, సత్య హరిశ్చంద్రుడి శిష్యుడి మాదిరిగా సచ్ఛీలతతో వ్యవహరించి పోలీసులకు అప్పగించారు. నిజంగా అలా పోలీసులకు అప్పగించిన వ్యక్తినిజంగా గొప్పవాడే. కాని టీవీ చూసిన వారు, పత్రికల్లో వార్తను చదివిన మాత్రం నిజంగా ఇదే సంచి తమకు దొరికి ఉంటే, పది లక్షల రూపాయల సొమ్ముతో కొంతలో కొంత దరిద్రం తీరిపోతుందని, పోలీసులకు ఆ వ్యక్తి ముందు వెనక చూసుకోకుండా, సంచిని తడమకుండా ఎందుకు ఇచ్చారని తిట్టుకున్న వారే ఎక్కువున్నారు. నిజంగా కలికాలంలో ఇలా బతుకుతన్నామంటే ఇలాంటి సత్యహరిశ్చంద్రులు ఉండబట్టే కదా.
- శైలేంద్ర

బక్క కాదు లావు..
తెలంగాణ టిడిపిలో మాజీ ఎమ్మెల్యే బక్క నర్సింహులు సరదగా అందరినీ నవ్విస్తుంటారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తనయుని వివాహామహోత్సవంలో కొంత మంది నాయకులు బక్క నర్సింహులు ముందు తమ సందేహాన్ని వెలువరించారు. టిడిపి ముఖ్య నాయకులందరికీ టిఆర్‌ఎస్ ‘వల’ వేస్తున్నది కదా, మరి మీకు వల వేయలేదా?, లేక మీరు ఆ వలలో పడలేదా? అని వారు తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు. అందుకు బక్క నర్సింహులు స్పందిస్తూ ‘నాకు వల వేయరని, వల వేసి పట్టుకెళితే, నేను అక్కడున్న మన (టిడిపి) వారందరినీ వెనక్కి పట్టుకొచ్చేస్తానన్న భయం..’ అని ఠకీమని చెప్పడంతో అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వారు. బక్క నర్సింహులు ఇప్పుడు బక్క కాదని, లావు నర్సింహులుగా మారారని అక్కడున్న ఒక విలేఖరి అనడంతో, ‘ఏమి చేయమంటారు, వరుసగా ప్రజలు ఓడిస్తుంటే, పనేమి లేక తిని కూర్చుంటే, లావు కాకుండా ఉంటానా?’ అని సమాధానమివ్వడంతో మరోసారి నవ్వుల జల్లు కురిసింది.
- వి. ఈశ్వర్ రెడ్డి

రొటీన్ డైలాగు..
తెలంగాణలో ఏ నాయకుడైనా బంగారు తెలంగాణ అన్నాడు అనుకొండి, ఆయన టిఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని అర్థం. అదే ఆంధ్రప్రదేశ్‌లో నవ్యాంధ్ర అన్నారనుకొండి, ఆయన టిడిపిలో చేరబోతున్నారని అర్థం. తెలంగాణలో పార్టీ జంపుఅవుతున్న నాయకులు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఉందని చెప్పడం, ఆంధ్రప్రదేశ్‌లో జంపుఅవుతున్నవారు నవ్యాంధ్ర నిర్మాణంలో పాలుపంచుకోవాలని చెప్పడం మరీ రోటిన్ డైలాగు అయిపోయింది. ఇరు రాష్ట్రాల్లో ఇక్కడ టిఆర్‌ఎస్, అక్కడ టిడిపి ప్రభుత్వాలు ఏర్పడి ఏడాదిన్నర అవుతుండగా పార్టీలు మారే నేతలకు ఇంతకాలానికి బంగారు తెలంగాణ, నవ్యాంధ్ర నిర్మాణం గుర్తుకు రావడం నిజంగా వీరంతా ట్యూబ్‌లైట్లే. బంగారు తెలంగాణ, నవ్యాంధ్రల గురించి వీరికి ముందుగానే వెలిగి ఉంటే వీరికార్లపై బుగ్గలు (బల్బులు) వెలిగేవి పాపం.
- వెల్జాల చంద్రశేఖర్

చూసి నేర్చుకోవాలి
ఫేస్‌బుక్ సిఇఓ జుకర్ బర్గ్‌ను చూసి నేర్చుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపును ఇచ్చారు. జుకర్ బర్గ్ తనకు కుమార్తె జన్మించిన సందర్భంగా తనకున్న ఆస్తిలో 99శాతం వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాల కోసం ట్రస్ట్‌కు బదలాయించనున్నట్టు ప్రకటించారు. మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఆయన సేవకు వినియోగించడాన్ని అభినందిస్తూ చూసి నేర్చుకోవాలని బాబు పిలుపు ఇచ్చారు. దేశంలో, విదేశాల్లో పారిశ్రామిక వేత్తలు ఇంత భారీ ఎత్తున విరాళాలు ప్రకటించిన ప్రతి సారి చంద్రబాబు వాళ్లను చూసి నేర్చుకోవాలని చెబుతుంటారు. సరే మరి బాబుగారు ఎంత ఆస్తి విరాళంగా ఇచ్చారని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నెలకు రూపాయి జీతం, 40లక్షల ఆస్తి మాత్రమే ఉన్న ఆయనేం విరాళంగా ఇవ్వగలరని కొందరు సమాధానం ఇచ్చారు.
- మురళి

పదేళ్లు ఇక్కడే ...
ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు అంతా పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్‌లోనే ఉంటామని అంటున్నారు. ముఖ్యమంత్రి విజయవాడలో ఉంటే మీరిక్కడేం చేస్తారు అని ఒక పాత్రికేయుడు వారిని ప్రశ్నిస్తే అందుకే ఇక్కడే ఉండాలనుకుంటున్నాం...అని సమాధానం ఇచ్చాడో ఉద్యోగి...విషయం పరిశీలిస్తే సిఎం చంద్రబాబు ప్రతి రోజూ సమీక్షలు, సమీక్షలు, లెక్కలు అంటూ నిరంతరం ఉద్యోగులకు పనులు చెబుతుంటారు, ఆయన ఇక్కడ లేరు కనుక మాకు పనే్లకుండా పోయింది...విజయవాడ వెళ్తే ఇక మాకు కంటి మీద కునుకే ఉండదు కదా అని ఆయన లోగొట్టు కాస్తా చెప్పాడు. సిఎం విజయవాడలో ఉండటంతో సీనియర్ అధికారులు సైతం విజయవాడలోనే ఉంటున్నారు. దాంతో ఆంధ్రా సచివాలయ ఉద్యోగులకు విరామం దొరికిందని చెప్పుకోవచ్చా...?
-బి.వి.ప్రసాద్