మిర్చిమసాలా

సినిమాపై ‘రివ్యూ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా మొత్తం చూసిన తర్వాత సమీక్ష (రివ్యూ) చేయగలం కానీ సినిమా ప్రారంభంకాగానే చెప్పలేం కదా? అని ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిపై విలేఖరుల సమావేశం నిర్వహించేందుకు విహెచ్ మర్నాడు అసెంబ్లీకి వచ్చారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై గురువారం స్పందించలేదు ఎందుకని విలేఖరులు ఆయన్ను ప్రశ్నించగా, సినిమా ఫస్ట్-షో సమయం వరకు అయినందున, ఇవాళ చెబుతానని, సినిమా మొత్తం చూసిన తర్వాతే కామెంట్లు, సమీక్షలు, విశే్లషణలు వస్తాయని విహెచ్ అనడంతో అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

మీరు ఏ ఇంటి అల్లుడండీ..?
గతంలో ఏమైనా రాజకీయపరమైన ఉద్యమాలు, ఘర్షణలు చోటుచేసుకున్నప్పుడు ముఖ్యంగా కులపరమైన ఆందోళనకారులు, లేదా బాధితుల పట్ల సంఘీభావం తెలిపేందుకు వచ్చే రాజకీయ నాయకులను తొలుత ‘మీదేమి కులం?’ అనే ప్రశ్నను లేవనెత్తేవారు. ఆ తర్వాత వారు చెప్పేది విశ్వసించకపోయినా, అంగీకరించకపోయినా సావధానంగా వినేవారు. అయితే ఇటీవల కాపులను బిసిలుగా గుర్తించేందుకు మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపట్టటం, ఆతర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకోవటం జరిగాయి. తాజాగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కాపునాడు నేత, దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంపై మరో కొత్త ఆందోళన చోటుచేసుకుంది. ఈ ఉద్యమాల సమయంలో తమ వద్దకు వస్తున్న కాపు నేతలను ఆందోళనకారులు తెలివిగా ‘మీరు ఏ ఇంటి అల్లుడు?’అని నేరుగా ప్రశ్నించడం లేదా ఇతరులను అడిగి తెలుసుకోటం ప్రారంభమైంది. ఎందుకంటే పలువురు కులాంతర వివాహాలు చేసుకుని కాపులుగా చెలామణి అవుతుండటమే దీనికి కారణమంటున్నారు. అలాంటివారిని అత్తింటి కులం వారు ఏమైనా ప్రభావితం చేస్తున్నారా?..ముఖ్యంగా కమ్మ వర్గం అల్లుళ్లను అధికార పక్షం తెలుగుదేశం ప్రభావితం చేస్తోందా?.. అనేది కాపు యువకుల్లో తలెత్తుతున్న వెయ్యిడాలర్ల ప్రశ్న! అందుకే కులాంతర వివాహాలు చేసుకున్న కాపు నేతలు కొందరు తెలివిగా ఆందోళనకారుల వైపు కనె్నత్తి చూడటం లేదు.
- నిమ్మరాజు చలపతిరావు

ఉచితం వినడానికే
చాలా సందర్భాల్లో ఉచితం అనగానే పూర్తి ఉచితం అని భ్రమపడే పరిస్థితి అందరికీ అనుభవంలో ఉన్నదే, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్రీ సీటు అనే మాట వాడుకలో ఉంది...అంటే కన్వీనర్ కోటాలో వచ్చే సీట్లను ఫ్రీ సీటు అంటారు. దానికి కూడా కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తాజాగా ఉచితంగా ఇసుక ఇస్తామంటే అంతా ఉచితం అనుకునేరు ...కానే కాదని ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా స్పష్టం చేసింది. లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు ఇసుక కావాలనుకునే వారు చెల్లించాల్సిందే. మరో మాట చెప్పాలంటే ఇసుక మీదైనా వాహనం, లోడింగ్ మాత్రం ఇంకొకరిది, సో మీ ఉచిత ఇసుకను చార్జీలు చెల్లించి మీరే వాడుకోవచ్చు. అన్నట్టు మరో మాట, మీ ఉచిత ఇసుకను ఇంకొకరికి అమ్ముతామంటే కూడా ప్రభుత్వం ఒప్పుకోదు, కేసులు పెట్టి జైలుకు పంపుతుంది... ఇదన్నమాట ఉచితం వెనుక వ్యవహారం
- బి. వి. ప్రసాద్

ఎంత ప్రేమో!
ఈ రోజు రక్తసంబంధీకులకు సైతం ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండడం లేదు. రాజకీయాల్లో ఈ ప్రేమ మరీ అరుదు. అధికారం కోసం తమ్ముడిపై అన్న ,అక్కపై చెల్లి పోటీ చేస్తుంటారు. మామను అల్లుడు, అల్లుడిని తోడల్లుడు దెబ్బతీసే రోజులు ఇవి. ఇలాంటి కాలంలో ఏ బంధుత్వం లేకున్నా టిడిపి ఎమ్మెల్సీ ఒకరు తన పదవిని త్యాగం చేసేందుకు సిద్ధపడ్డారు. విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ వెంకన్న లోకేశ్ బాబు కోసం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని, దాని కోసం తన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నిస్వార్థంగా ఆయన చేసిన త్యాగ ప్రకటనను సైతం గిట్టని వాళ్లు విమర్శిస్తున్నారు. ఇదంతా ముందస్తు నాటకం, ఎవరే త్యాగం చేయాలో, ఎవరే త్యాగ ప్రకటనలు చేయాలో బాబు ముందుగానే ప్రకటిస్తారు అని గిట్టని వాళ్లు విమర్శిస్తున్నారు.
- మురళి

హరీశ్ గ్రాఫ్ పడిపోయిందా!
టిఆర్‌ఎస్ అధికారంలోకి రాక ముందు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఒక్క వెలుగు వెలిగిన కొందరు నేతలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాభవం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు పార్టీలో అధినేత కెసిఆర్ తర్వాత నంబర్-2గా వెలుగు వెలిగిన టి హరీశ్‌రావు స్థానం ప్రస్తుతం నంబర్-4కు పడిపోయింది. ఇది ఎవరో సర్వే తేల్చిన గ్రాఫ్ కానేకాదు. ఆ పార్టీ శ్రేణులు, నేతలు పరోక్షంగా హరీశ్‌రావుకు నాలుగవ స్థానాన్ని కట్టబెట్టారు. వివిధ సందర్భాల్లో పార్టీ నేతలు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, పోస్టర్లలో ముఖ్యమంత్రి ఫోటో ఒకవైపు, మరోవైపు మంత్రి కెటిఆర్, రెండవ వరుసలో ఒకవైపు ఎంపి కవిత మరోవైపు హరీశ్‌రావు (నంబర్ నాలుగు) ఫోటోలను ప్రాధాన్యతా క్రమంలో ముద్రిస్తున్నారు. గతంలో ఫ్లేక్సీలపై ఒకవైపు కెసిఆర్ ఫోటో ఉంటే, మరో వైపు హరీశ్‌రావు ఫోటో ఉండేది. అంటే నంబర్-2 స్థానంలో ఉండేది. పార్టీలో రోజు రోజుకు కెటిఆర్‌కు, కవితకు పెరిగిపోతున్న ప్రాధాన్యతను పార్టీ నేతలు అంచన వేసి హరీశ్‌రావుకు నాలుగవ స్థానం కల్పించినట్టు దీనిని బట్టి అర్థం అవుతుంది.
- వెల్జాల