మిర్చిమసాలా

దీపం ఉండగానే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలంటారు. కానీ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం దీపం ఉండగానే చదువుకోవాలని విద్యార్థులకు సూచించింది. ఎందుకంటారా? ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కరెంటుకు కష్టాలను ఎదుర్కొంటున్నది. అయితే విద్యార్థులకు పరీక్షా కాలం కావడంతో సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు, ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రం కరెంటు కోత లేకుండా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ టైం టేబుల్ ప్రకారమే చదువుకోవాలని సూచించింది. విద్యార్థులకు ఎన్ని కష్టాలో అనుకుంటున్నారా? అంతేకాదు అసెంబ్లీలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఆ రాష్ట్ర బడ్జెట్‌ను మొబైల్ ఫోన్‌లో ఉండే టార్చ్‌లైటుతోనే చదివారంటే నమ్మండి. వ్యవసాయానికైతే ‘కోత’లు చెప్పాల్సిన పని లేదు. ఇదీ కర్నాటక రాష్ట్రం కరెంటు కష్టాలు.
- వి. ఈశ్వర్ రెడ్డి

దటీజ్ జలీల్ ఖాన్!
మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు జలీల్ ఖాన్‌కు పార్టీలు ఫిరాయించడమనేది అతి మామూ లు విషయం! ఇటీవల తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న జలీల్ ఖాన్ నెలరోజుల క్రితం వరకు తెలుగుదేశం ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేయని ఆరోపణ, విమర్శ లేదనే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం సిఆర్‌డిఏ కార్యాలయం వద్ద వైకాపా అధినేత జగన్ నాయకత్వంలో జరిగిన మహాధర్నాలో పాల్గొ న్న జలీల్ ఖాన్ రాజధాని పేరిట జరిగిన భూసమీకరణ తీరుని తీవ్రంగా దుయ్యబట్టారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు ఎవరి భూములు వారికి తిరిగి ఇస్తారని కూడా ప్రకటించారు. తాజాగా విలేఖర్లతో అదే జలీల్ ఖాన్ టిడిపి యువనేత లోకేష్ మంత్రి కావాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ‘జగన్ మంత్రివర్గంలోనా?’ అని ఓ కొంటె విలేఖరి ప్రశ్నించగా.. నవ్వులు వెల్లివిరిశాయి. తన నోటి నుంచి వాస్తవాలే వస్తాయని తరచూ చెప్పే జలీల్ ఖాన్ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ సీటు రాకపోవడానికి అప్పటి పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కారకుడంటూ విమర్శలు గుప్పించి ఆపై తాను ఏవిధంగా ఎంత ముట్టచెప్పిందో ఆధారాలు కూడా ప్రదర్శించారు. అందుకే ఈ హిస్టరీ అంతా తెలిసిన నగర వాసులు ‘దటీజ్ జలీల్ ఖాన్!’ అంటుంటారు.
- నిమ్మరాజు చలపతిరావు

కలియుగమంటే ఇదే
బతుకు తెరువుకోసం కొంత మంది అనేక వ్యాపారాలు చేస్తుంటారు. కాని ఇటీవల కాలంలో పంచభూతాల వ్యాపారం చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. నగరాల నుంచి గ్రామాల వరకు గాలి, నీరు, భూమి (ఇసుక)ను అమ్ముకుని లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఎక్కడ చూసినా ఆక్సిజన్ బార్లు వస్తున్నాయి. పర్యావరణం దెబ్బకు మంచి గాలిని పీల్చలేని వారికి ఆక్సిజన్ బార్లలో వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు. దీనికి సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఇక నీళ్ల వ్యాపారం సంగతి సరేసరి. వాడవాడలా నీళ్ల వ్యాపారం విజృంభించింది. ట్యాంకర్ల నుంచి ప్లాస్లిక్ బాటిళ్ల వరకు నీళ్ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఇక ఇసుక వ్యాపారం సంగతి సరేసరి. నిర్మాణ రంగంలో ప్రధానమైన వస్తువు ఇసుక. ఇసుక రేట్లు చుక్కలు నంటుతున్నాయి. ఇసుకను అమ్ముకుని కోట్లాది రూపాయల సొమ్మును వెనకేసుకునే వారు పై నుంచి కింది దాకా అన్ని వర్గాల్లో ఉన్నారు. కలియుగమంటే ఇదే.
- శైలేంద్ర

టిడిపి బలం
తెలంగాణలో టిడిపి తన బలం అదే విధంగా నిలుపుకుంటోంది అని రాజకీయ నాయకులు సంబర పడుతున్నారు. ఎక్కడా మార్పు లేదు. ఏ జిల్లా అయినా ఏ నియోజక వర్గం అయినా ఫలితాల్లో ఎలాంటి మార్పు ఉండడం లేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిడిపి యధావిధిగా డిపాజిట్ కోల్పోతుంది. ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్రంగా ఎక్కడా ఒక్క డివిజన్‌లో కూడా గెలవడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో ఒక్క స్థానం గెలిచిన తరువాత ఖమ్మం, వరంగల్, అచ్చంపేటలో కనీసం ఒక్కటంటే ఒక్కటి గెలవలేదు. ఆ తరువాత జరిగిన సిద్దిపేట ఎన్నికల్లో సైతం ఇదే బలాన్ని నిలబెట్టుకుంది. అక్కడా కనీసం ఒక్క స్థానం గెలవలేదు.
- మురళి

బీరుకు నీరు..?
అడుగంటిన భూగర్భ జలాలు..నిత్యం నీటికోసం తహతహలాడుతున్న నగర శివార్లు.. ఏదైతేనేం..తాగేందుకు నీరు దొరకకపోయినా బీరు కంపెనీలకు మాత్రం ప్రతి రోజూ లక్షల లీటర్ల మంజీరా నీరు సరఫరా అవుతోంది. ఇదెక్కడో మారుమూల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతోందనుకుంటే తప్పులో కాలేసినట్టే. నగరానికి ఆనుకొనివున్న మెదక్ జిల్లా సంగారెడ్డిలో పరిస్థితి. ఇక్కడి మంజీరా నీరు ప్రజల దాహార్తిని తీర్చాల్సి ఉండగా బీరు కంపెనీలకు తరలుతుండడం చర్చనీయాంశంగా మారింది. సింగూరు ప్రాజెక్టులో 1.5 టిఎంసిల నీరు ఉన్నప్పుడే నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రెండు నెలల క్రితమే హైదరాబాద్‌కు మంజీరా నీటిని నిలిపివేయించారు. కాగా హైదరాబాద్ పరిధిలోని నీటి ప్రాజెక్టులు ఎండిపోవడంతో నగరశివార్ల ప్రజలు అల్లాడుతుండగా, మూడు బీరు కంపెనీలకు మాత్రం రోజుకు ఐదు లక్షల లీటర్ల నీరు సరఫరా అవుతుండడం విస్మయాన్ని కల్గిస్తోంది. బీరు కంపెనీలకు రోజూ నీరు..తమకు మాత్రం నాలుగు రోజులకోసారా అంటూ నగరశివారు వాసులు అసహనంగా ప్రశ్నిస్తు న్నారు.
- సయ్యద్ గౌస్‌పాషా