మిర్చిమసాలా

మందుబాబులకు ‘చల్లని కేంద్రాలు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం 24 గంటల పాటు శ్రమిస్తూ కూడా ఈ సమయం తనకు ఏమాత్రం సరిపోవటం లేదంటున్నారు. ప్రస్తుత మండుటెండల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఏఒక్కరూ రోడ్డుపైకి రావద్దు.. కాంట్రాక్టర్లు కూలీలతో ఆ సమయాల్లో పనిచేయించవద్దంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయించి వాటిలో చల్లని మినరల్ వాటర్, మజ్జిగ కూడా పంపిణీ చేయాలంటూ బాబు ఆదేశాలిచ్చారు. దీంతో విజయవాడ నగరంలో తెలుగు తమ్ముళ్లు పోటాపోటీగా హైటెక్ చలివేంద్రాలు ఏర్పాటు చేసేశారు. రోజులో కనీసం 18 గంటల పాటు అతి చల్లగా ఉండే ఐస్‌క్యాన్‌లు, ఎలక్ట్రికల్ వాటర్ కూలర్లు సమకూర్చారు. ఇంకేముంది? ఇవి మందుబాబులను ఆకర్షించాయి. వారికి నిలయాలుగా మారిపోయాయి! సమీపంలోని వైన్ షాపు నుంచి మందు తెచ్చుకోటం, ట్యాప్ తిప్పుకోటం ఈజీ ఐపోయింది. గతంలో ఇదే నీటి కోసం ఒక వాటర్ ప్యాకెట్ కోసం రూ.2, లీటర్ వాటర్ కోసం ఐదు రూపాయలు ఖర్చుచేయాల్సి వచ్చేది. కొసమెరుపు ఏమంటే.. ఈ విషయం బాబుకి తెలిస్తే సిసి కెమెరాలు, ఆధార్ అంటూ ఆదేశాలిస్తారేమోనని మందుబాబులు తమలో తాము సణుక్కుంటున్నారు!
- నిమ్మరాజు చలపతిరావు

ఔను ఢోకా లేదు
తెలంగాణలో టిడిపికి ఎలాంటి ఢోకా లేదు అని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి విలేఖరుల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఆ మాటలు విని మీడియా ముసిముసి నవ్వులు నవ్వుకుంది. 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మిగిలింది ముగ్గురు. వారిలో ఆర్ కృష్ణయ్య ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటే ఒక్క రేవంత్‌రెడ్డి మాత్రం చురుగ్గా ఉన్నారు. పార్టీ శ్రేణులు ఎక్కడిక్కడ జారుకున్నారు. ఐనా పార్టీకి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేయడం ఏమిటని ఒక జర్నలిస్టు సందేహం వ్యక్తం చేస్తే పక్కనున్న మరొకరు రావుల చెప్పింది అక్షర సత్యం, పార్టీలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, నాయకులు ఉంటే ఎవరు జారుకుంటారో అనే భయం ఇంత కాలం ఉండేది. అంతా పార్టీ మారి వెళ్లి పోయాక ఇక అయ్యేదేముంది అందుకే పార్టీకి ఇక ఢోకా లేదని ఇప్పుడు ధీమాగా చెప్పవచ్చు అని వివరణ ఇచ్చారు.
- మురళి
గాంధీ భవన్‌లో ఆ పత్రిక
కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో ఆ వార్తా పత్రిక కనిపించడంతో నేతలు నివ్వెరపోయారు. ఏమిటా ఆ పత్రిక కథ అంటారా? తెలంగాణకు సంబంధించిన ఒక పత్రిక తమ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేనందున ఆ పత్రికకు ఇకమీదట దూరంగా ఉండాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఉత్తమ్ ప్రకటించిన మర్నాడు యధావిధిగా గాంధీ భవన్‌లో ఆ పత్రిక దర్శనం ఇచ్చింది. ఏమిటీ? అధ్యక్షుని మాటకూ విలువ లేదా! అని విలేఖరులు సందేహంగా ఉత్తమ్‌కు పిఆర్వోగా ఉండే కప్పెర హరిప్రసాద్‌ను ప్రశ్నించగా, ఆయన అవాక్కైయ్యారు. అయితే సదరు పత్రిక తమ పార్టీ నిర్ణయాన్ని ఏ విధంగా వక్రీకరించిందా? అని చూసేందుకు తెప్పించామని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాగే రోజూ అనుకుంటూ తెప్పిస్తారేమోనని మరో విలేఖరి అనడంతో అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

ఒకరికి ఖేదం, మరొకరికి మోదం
మెడికల్ డెంటల్ చదివే వారు తప్పనిసరి నీట్ రాయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో విద్యార్థులు లబోదిబో మంటుంటే, యాజమాన్యాలు మాత్రం సంతోషంలో మునిగి తేలుతున్నాయి. ఎమ్సెట్ పూర్తయిన తర్వాత ఏం చేయాలో పాలుపోని కార్పొరేట్ యాజమాన్యాలు రాత్రికి రాత్రి నీట్ కోచింగ్ మొదలుపెట్టాయి. అక్కడితో ఊరుకోకుండా బైపిసితో ఇంటర్ చదివిన వారందరికీ ఫోన్లు మెసేజ్‌లు పెట్టి వారిని కోచింగ్‌కు ఆహ్వానిస్తున్నాయి. ఒకొక్కరి నుండి 50వేలు మొదలు రెండు లక్షల రూపాయిల వరకూ వసూలుచేస్తున్నాయి. మరోసారి పరీక్ష రాయాల్సి వస్తోందని ఇబ్బంది పడుతున్న విద్యార్ధులకు పరీక్ష కోచింగ్ ఫీజు వింటే పెనం మీద నుండి పొయ్యలో పడ్డట్టయింది
-బి.వి.ప్రసాద్

కాంగ్రెస్ దుకాణం ఖాళీ!
పాలేరు ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (టిపిసిసి) సమావేశమై ఇక నుంచి తమ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్లడానికి ఏమేమి చేయాలో వ్యూహరచన చేసినట్టు పత్రికాముఖంగా వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికలకు ఏడాది ముందే సగం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రతిపక్షానికి వ్యూహామే లేకుండా పోయిందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేసారంటే బహుశ వీరి ప్రకటన చూసే ఆవిధంగా అనివుండవచ్చు. అధికారంలో ఉన్న పార్టీలే ఏడాది ముందు అభ్యర్థులను ప్రకటించడానికి సాహసం చేయవు. అలాంటిది రాష్ట్రంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తే ఇక దుకాణం పూర్తిగా ఖాళీ అయినట్టే. పోలింగ్‌కు గంట ముందు తిరుగుబాటు బావుటా ఎగురవేసి పార్టీ అభ్యర్థులను ఓడించే చరిత్ర కలిగిన నాయకులున్న కాంగ్రెస్‌లో ఏడాది ముందు అభ్యర్థులను ప్రకటిస్తే ఇక ఏమైనా ఉందా? టికెట్ రాని నాయకులంతా ఏకమై పార్టీ అభ్యర్థిని ఓడించడానికి కంకణం కట్టుకోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. అందుకేనెమో ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరి ఇంత బలహీనంగా ఉండటం ఏమిటన్న సానుభూతితోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వ్యూహం లేకుండా పోయిందని సానుభూతి వ్యక్తం చేసి ఉంటారు కాబోలు!
- వెల్జాల చంద్రశేఖర్