మిర్చిమసాలా

ఇన్ని డ్రై డేలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో మద్యం షాపుల డ్రై డేలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2వ తేదీ, గణేష్ నిమజ్జనం రోజున డ్రై డేలు ఉంటాయి. ఇటీవల కాలంలో శ్రీరామనవమి, హనుమజ్జయంతికి కూడా హైదరాబాద్‌లో డ్రై డేలు ప్రకటించారు. బోనాల ఉత్సవం, హోళీ పండగకు కూడా మద్యం షాపుల బంద్ ప్రకటించారు. ప్రభు త్వం మద్యం అమ్మకాలను నిరుత్సాహపరిచేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల మద్యం వ్యతిరేకులు స్వాగతిస్తున్నారు. కాని మద్యం ప్రియులు మాత్రం ప్రతి పర్వ దినానికి డ్రై డే ప్రకటిస్తే ఎలా అని విసుక్కుంటున్నారు. పర్వ దినాల్లో మద్యం షాపులను మూసివేయడం మంచి పరిణామమని పోలీసులు, సామాజిక వేత్తలు విశే్లషిస్తున్నారు.
- శైలేంద్ర

ఎన్ని మార్కులు..?
సుమారు రెండేళ్ళు పూర్తి చేసుకోబోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు?. నిజంగా ఇది కొంత చిక్కు ప్రశే్న. ఇదే ప్రశ్నను బిజెపి నూతన సారథి డాక్టర్ కె. లక్ష్మణ్‌ను ‘మీట్-ది-ప్రెస్’లో ఓ విలేఖరి ప్రశ్నించగా, లక్ష్మణ్ అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెబుతూ దాట వేశారు. దీంతో మరో విలేఖరి కల్పించుకుని మీరు దాట వేయడం వల్ల మీరు పేపరు (ఆన్సర్ షీట్) దిద్దలేదేమో! అనే అనుమానం కలుగుతున్నదని అనడంతో నవ్వుల జల్లు కురిసింది. అందుకు లక్ష్మణ్ కూడా నవ్వాపుకోలేకపోయారు. వెంటనే ప్రభుత్వ పని తీరు పట్ల ఆయన పెదవి విరిచారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదని ఆయన విమర్శించారు. దళితులకు 3 ఎకరాల చొప్పున భూమి, గిరిజనులకు, మైనారిటీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ నిలబెట్టుకోలేదని ఆయన ఉదహరించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌కు మార్కులు వేస్తారని ఆయన మరోసారి దాట వేశారు. లక్ష్మణ్ మాత్రం మార్కులు వేయలేదు. అదే మరీ రాజకీయ నేతల చాతుర్యం, తాము చెప్పాల్సిందే చెప్పి మిగతావి దాట వేస్తారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

బ్రేకింగ్ న్యూస్
డాక్టర్ ఆస్పత్రికి వెళితే న్యూస్ కాదు, టీచర్ స్కూల్‌కు వెళితే న్యూస్ కాదు, కానీ ముఖ్యమంత్రి సచివాలయానికి వెళితే మాత్రం మాకు న్యూస్ అంటూ బిజెపి కొత్త అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చమత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక సమీక్షలు అన్నీ క్యాంపు కార్యాలయంలోనే నిర్వహిస్తారు. సచివాలయానికి రావడం తక్కువ. క్యాబినెట్ సమావేశాలకు మాత్రం సచివాలయానికి వస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్మణ్ చమత్కరించారు. నిజమే కెసిఆర్ సచివాలయానికి వస్తే న్యూస్, మోదీ ఇండియాకు వస్తే బ్రేకింగ్ న్యూస్ అని లక్ష్మణ్‌కు మరొకరు సమాధానం చెప్పారు. గతంలో ఏ ప్రధానమంత్రి తిరగనన్ని దేశాలు అతి తక్కువ కాలంలో మోదీ తిరిగారు.
- మురళి

వెంకయ్య తక్కువ తిన్నారా..!
కృష్ణా జిల్లా సూరంపల్లిలో రూ.50 కోట్లతో నిర్మించనున్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (సీపెట్) సంస్థ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అనంత కుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి శంకుస్థాపన చేశారు. కేంద్రం పట్ల గుర్రగా ఉన్న చంద్రబాబును అనునయించేందుకు వెంకయ్య తనదైన ధోరణిలో ‘బాబు తెల్లవారితే అభివృద్ధి, అభివృద్ధీ అంటారు.. అనంత కుమార్ రూ.5వేల కోట్లు ఇస్తానంటే కాదు, రూ.10వేల కోట్లు కావాలంటారు.. పోనీ రూ.10వేల కోట్లు ఇస్తామంటే అలాకాదు, రూ.15వేల కోట్లు అవసరమంటారు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అక్కడ ఉన్నవారు మాత్రం ‘వెంకయ్యా!.. నువ్వేమైనా తక్కువ తిన్నావా? రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఐదేళ్లపాటు అంటే కాదు, పదేళ్లు కావాలని డిమాండ్ చేయలేదా?’ అంటూ గుర్తు చేసుకున్నారు. వెంకయ్య చెప్పినట్లుగా కాక చంద్రబాబు ఏకంగా 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. తీరా ఏమైం ది? ఒక్క ఏడాది కూడా రాష్ట్రం ప్రత్యేక హోదాకు నోచుకునేలా కన్పించడం లేదని పలువురు గుసగుసగా వ్యాఖ్యానించటం వినిపించింది!
- నిమ్మరాజు చలపతిరావు

చోర్ బైక్..
చోర్ బైక్ అంటే ఇదేదో దొంగాట కాదు.. దొంగవాహనం అంతకంటే కాదు. నగరంలో చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికి నిష్ణాతులైన సుశిక్షితులచే శిక్షణ ఇచ్చిన విషయం విధితమే. బైక్‌తోపాటు సైలెంట్ రివాల్వర్ కూడా ఇచ్చారు. అయితే వీరు రౌండ్ ది క్లాక్ చైన్ స్నాచర్లపై నిఘా వేసి ఉండాలి. ఎక్కడైనా చైన్ స్నాచింగ్ జరిగితే పోలీసులు చైన్‌స్నాచర్లను వెంబడించాలి. కానీ చైన్ స్నాచర్లే తిరగబడితే బైక్ వదిలి వెళ్లడమంటే ఆశ్చర్యమేస్తుంది. అలాంటి ఘటనే ఇటీవల ఎల్‌బినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్‌బినగర్-సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్తుండగా అక్కడే వున్న ఓ కానిస్టేబుల్ వారిని వెంబడించారు. చైన్ స్నాచర్ల బైక్‌లో పెట్రోలు అయిపోవడంతో చైన్ స్నాచర్లు కానిస్టేబుల్ బైక్‌నే ఎత్తుకొని పారిపోగా సమ్మయ్య అనే కానిస్టేబుల్ సరూర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో కానిస్టేబుల్ బైక్ చోరీ అంటూ ముక్కున వేలేసుకున్నారు.
-సయ్యద్ గౌస్‌పాషా