మిర్చిమసాలా

ఎర్రవెల్లికి యాగ ఫలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వ కల్యాణం, ప్రజా శ్రేయస్సును ఆకాంక్షిస్తూ రాజులు, చక్రవర్తులు, మునీశ్వరులు గతంలో అయుత చండీయాగాన్ని నిర్వహించినట్టు పురాణ, ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు రాజుల కాలం కాదు కాబట్టి ఒక రాష్ట్రానికి రాజులాంటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మహాయాగాన్ని తలపెట్టారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి యాగాన్ని నిర్వహిస్తున్నవారికే యాగ ఫలం దక్కుతుందా? అని ముఖ్యమంత్రిని మీడియా ప్రశ్నించగా యాగ ఫల స్వీకర్తలు యావత్తు తెలంగాణ ప్రజలని చెప్పారు. యాగం పూర్తి అయిన తర్వాత దక్కే ఫలం ఎలా ఉంటుందో కానీ యాగం నిర్వహించడానికి ముందుగానే ఆ ఫలాన్ని ఇది నిర్వహించబోయే ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే దారిలో ఉన్న గ్రామాలకు దక్కిందని చెప్పవచ్చు. చండీయాగానికి రాష్టప్రతితో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వంటి వివిఐపిలు హాజరుకానుండటంతో యాగం జరగబోయే ఎర్రవెల్లి గ్రామానికి వెళ్లే రహదారి రాత్రికిరాత్రి డబుల్ రోడ్‌గా మారిపోయి అద్దంలా తళ, తళ మెరిసిపోతుందంటే యాగఫలం ఆ గ్రామ ప్రజలకు ముందుగానే దక్కిందనే చెప్పవచ్చు.
- వెల్జాల చంద్రశేఖర్

ఒక చోట యాగం, మరో చోట ఆగం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాల్‌మనీ రాకెట్‌తో కుతకుతలాడుతోంది. అన్ని పార్టీల నేతల ఆగడాలు రోజురోజుకు బహిర్గతమవుతున్నాయి. వడ్డీ వ్యాపారం ముసుగులో మహిళలను వేధించడం, వారి జీవితాలతో అడుకున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఆంధ్రాలో ఆగమాగం అవుతోంది. ఇక తెలంగాణలో ప్రజలకు శాంతి కలగాలని, వర్షాలు సకాలంలో కురవాలని, అందరికీ మంచి ప్రసాదించాలని కోరుతూ ఇక్కడ ముఖ్యమంత్రి కెసిఆర్ మహా చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో యాగం, ఆంధ్రాలో ఆగమాగం అని ఏపి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కారిడార్లలో పలువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.
- శైలేంద్ర

కన్నీటీ రోజా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కాల్ మనీ వ్యవహారంపై చర్చ జరుగుతున్నప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టూ చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానం వైపు వెళ్ళి కాల్ మనీ, కాల్ చంద్రబాబు.. అంటూ ఇంకా ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని టిడిపి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆమెను సస్పెండ్ చేయాలని తీర్మానం టిడిపి-బిజెపి ఎమ్మెల్యేలు తీర్మానం ఆమోదించడంతో స్పీకర్ ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యా రు. ముఖ్యమంత్రిని అనరాని మాటలు అనడం ఎందుకు? ఆ తర్వాత బాధ పడడం దేనికీ? అని తోటి ఎమ్మెల్యేలే అన్నారు. సినిమా షూటింగ్ కాదని, ఒక్కసారి ఏదీ మాట్లాడినా రికార్డుల్లోకి వెళుతుందని తెలుసుకోవాలని వారు హితవు చెప్పారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

రేపే విడుదల
ఐఎస్ ఉగ్రవాదుల్లో చిక్కుకున్న ఇద్దరు తెలుగువారిని రేపే విడుదల చేయిస్తాం మీరు ధైర్యంగా ఉండండి అంటూ ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహా ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు ఇలా ప్రతి నేతా హామీ ఇచ్చి వంద రోజులు గడిచిపోయాయి. బందీలుగా ఉన్న తెలుగువారి అతీగతీలేకపోవడం, ఐఎస్ ఉగ్రవాదుల భరతం పడతామంటూ అమెరికా డ్రోన్‌ల దాడికి పాల్పడటంతో వారి కుటుంబ సభ్యులు బిక్కు బిక్కుమంటున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో తమ కుటుంబ సభ్యులకు ఏం ముప్పు జరుగుతోందోననే ఆందోళనలో వారున్నారు. నేతలు మాత్రం ఖేల్ కతం...దుకాణ్ బంద్ అన్న చందంగా ప్రకటనలు ఇచ్చేశాం కదా అంటూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
-బి.వి.ప్రసాద్

సామాజిక సమస్య
ఒకప్పుడు బాబు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది మీడియాలో. ఒకవైపు ప్రత్యర్థి పార్టీలకు సైతం మీడియా రావడం ఒక సమస్య అయితే సామాజిక మాధ్యమాలు మరో సమస్యగా మారాయి బాబుకు. కాల్ మనీ వ్యవహారం హడావుడి ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు చంద్రబాబుకు చికాగో యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించిందని, రెండువందల ఏళ్ల చరిత్రలో ఇతర దేశానికి చెందిన రాజకీయ నాయకుడికి డాక్టరేట్ ప్రకటించడం ఇదే మొదటి సారి అని మీడియాలో హడావుడి. చికాగో యూనివర్సిటీకి చెందిన వారికి ఇప్పటి వరకు వంద నోబెల్ బహుమతులు వచ్చాయి. బాబుకు డాక్టరేట్ ప్రకటించింది ఆ యూనివర్సిటీ కాదు అమెరికాలోనే ఉన్న చికాగో స్టేట్ యూనివర్సిటీ అని ఆ దేశంలో 1164 యూనివర్సిటీలు ఉంటే ఈ యూనివర్సిటీ ర్యాంకు 1066 అంటూ సామాజిక మాధ్యమాల్లో సమాచారం చక్కర్లు కొడుతోంది.
- మురళి