మిర్చిమసాలా

అదే ఊకదంపుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గడచిన రెండేళ్లుగా ఎప్పుడు మీడియాతో భేటీ అయినా, రాజకీయపరమైన సభ అయినా, కాకపోయినా, మరెలాంటి సభ అయినా కావచ్చు.. ముందుగా రెండు అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం సర్వసాధారణమైంది. ఆయన మిత్రపక్షం బిజెపి పూర్తి మద్దతుతో విభజన బిల్లును నాడు పార్లమెంట్‌లో ఆమోదం పొందింపజేసి ‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. రాజధాని కాదుకదా కనీసం కూర్చోటానికి, విశ్రమించడానికి కార్యాలయం కూడా లేకపోయింది. అయినప్పటికీ రోజుల తరబడి బస్సులోనే గడిపాను. హైదరాబాద్ నుంచి తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులకు కూడా కొంతకాలం ఇలాంటి కష్టాలు తప్పవు’.. అంటూ ఆయన హితోపదేశం చేయటం పరిపాటిగా మారింది. ఆ సమయంలో మీడియా మిత్రుల్లో ఒక్కసారిగా గుసగుసలు వినిపిస్తాయి. ‘ఇక్కడి విలేఖరులందరి ఇళ్ల విలువ కలిపినా బాబు బస చేసే బస్సు ఖరీదు చేయదు’ అంటూ గొణుక్కుంటారు. ఇంతకీ ఆ బస్సు ఖరీదెంతో తెలుసా? ఐదు కోట్ల రూపాయలని అధికారులు చెబుతుంటారు. ఇక అంతకంటే అందమైన మరో ప్యాలెస్ ఉంటుందా? అంటూ విలేఖర్లు, అధికారులు తమలో తాము చర్చించుకోటం కూడా పరిపాటిగా మారింది!
- నిమ్మరాజు చలపతిరావు

చెడితే అంతే!
అన్నదమ్ములైనా, స్నేహితులైనా, ప్రేమికులైనా పరస్పర నమ్మకం ముఖ్యం. నమ్మకం, విశ్వసనీయత చెడిపోయి, అనుమానాలు పెరిగితే అనుబంధాలు ఎంతో కాలం ఉండవు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిస్థితి అంతే. 60 ఏళ్లు కలిసి ఉన్న ఒకే భాష మాట్లాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఇప్పుడు నీటి తగదాలు ముదురుతున్నాయి. చివరకు కృష్ణా జలాలను మీరు ఎక్కువ వాడుకుంటున్నారంటే, మీరు ఎక్కువ వాడుకుంటారనే అనుమానాలు పెరిగాయి. వాదనలు జరిగాయి. ఈ వాదనల బాధను భరించలేక కృష్ణా ప్రాజెక్టులపై అన్ని చోట్ల నీరు విడుదలయ్యే చోట్ల నీటి మీటర్లను పెట్టనున్నట్లు ప్రకటించింది. వీటిని సెన్సర్లు అంటారు. శాటిలైట్ల ద్వారా పనిచేస్తాయి. ఎవరెన్ని నీళ్లు వాడుకున్నారనేది దాదాపు తెలుస్తుంది. సంబంధాలు చెడిపోతే ఇలాగే వ్యవహారాలు ఇలాగే ఉంటాయి.
- శైలేంద్ర

కబాలి...సిఫార్సు!!
ఎవరైనా కళాశాలలో అడ్మిషన్లు, రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ల కోసమో లేదా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికో, శ్రీశైలం మల్లన్న, భద్రాది రామన్న దర్శనానికో వెళ్ళాలనుకుంటే మంత్రుల వద్దకు వెళ్ళి సిఫార్సు లేఖలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ నటించిన కబాలి సినిమా కోసం తమిళనాట అభిమానుల పిచ్చి అంతాఇంతా కాదు. కొంత మంది అభిమానులు టిక్కెట్ల కోసం తమిళనాడు రాష్ట్ర మంత్రులను ఆశ్రయించారు. సదరు మంత్రులు ఎందుకైనా మంచిదని భావించి తమ లెటర్‌హెడ్‌పై కాకుండా పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్లను లెటర్లు ఇవ్వాల్సిందిగా సూచిస్తే, అభిమానులు వీరావేశంతో ఆ లెటర్లు పట్టుకెళ్ళి సినిమా థియేటర్ల మేనేజర్ల చేతిలో పెట్టి సినిమా టిక్కెట్లు తీసుకున్నారట.
- వి. ఈశ్వర్ రెడ్డి

ఇద్దరూ ఇద్దరే!!
అన్నట్టు మీ సిఎం గారి పాలన ఎలా ఉంది...అంటూ ఆంధ్రా అధికారులు తెలంగాణ అధికారులను ప్రశ్నిస్తే వారి నుండి వచ్చే సమాధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇద్దరూ ఇద్దరే అంటూ తెలంగాణ అధికారులు సమాధానం చెబుతున్నారు. మీ సిఎం అమరావతి పేరుతో మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్లగొడితే, మా సిఎం మాకు చివరికి ఇళ్లు కూడా లేకుండా చేశారు, సిఎం బంగ్లా కోసం మా ఇళ్లను కూలగొట్టడంతో కొత్త ఇళ్లు వెతుక్కోవల్సి వస్తోంది...మొత్తం మీద సిఎంలు ఇద్దరూ ఇద్దరే అంటూ చెప్పుకోవడంతో విస్తుపోవడం విన్నవాళ్ల వంతైంది.
- బి వి ప్రసాద్

తెలంగాణను వదలలేదు!
తెలంగాణ టిడిపిని స్వతంత్రంగా నడిపించేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మాత్రం నెల నెలా తెలంగాణ నుంచి మీ పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటాను అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం ఢిల్లీలో ఉన్నట్టు తెలంగాణ టిడిపికి విజయవాడలో అధిష్టానం ఉండడంతో మిగిలి ఉన్న కొద్దిమంది టిడిపి నాయకులు ఇబ్బంది పడుతున్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా రేవంత్‌రెడ్డి అట్టహాసంగా రెండు రోజుల దీక్ష చేపట్టారు. ఎక్కడా ఎన్టీఆర్ ఫోటో, చంద్రబాబు ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారు. పోస్టర్లు, కటౌట్లు తయారు చేయించినా బాబు బొమ్మ లేకుండా చూసుకున్నారు. తీరా విజయవాడలో చంద్రబాబు తెలంగాణ నేతలతో సమీక్ష జరిపి నేను తెలంగాణను వదిలిపెట్టలేదు, నెల నెలా నివేదికలు తెప్పించుకుంటాను అని చెప్పారు.
- మురళి