మిర్చిమసాలా

జానా రూటే వేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో జానారెడ్డి రూటే వేరు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడేది అబద్ధం అయినా గట్టిగా మాట్లాడాలి అంటారు. మహారాష్టత్రో ప్రాణహిత ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ గతంలోనే ఒప్పందం చేసుకుంది అని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేయగా, జానారెడ్డి ఒక్కసారిగా ప్రతిపాదనలు నిజమే కానీ ఒప్పందం జరగలేదు అని విలేఖరుల సమావేశంలో తేల్చి చెప్పారు. అనంతరం జరిగిన సిఎల్‌పి సమావేశంలో కొందరు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తే, నేను నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడతాను, నా తీరు అంతే అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పడంతో మిగిలిన వారికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారే అన్నట్టుగా ఉన్నారు.
- మురళి

మైభీ హూనా...!
మహారాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆధారాలు ఉంటే పట్టుకురండి, రాజీమానా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్ సవాల్ విసరడం తెలిసిందే. అయితే మాటల యుద్ధంతో సంబంధం లేకపోయినా టిటిడిపి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించి కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. టిటిడిపికి సంబం ధం లేకపోయినా రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను చూస్తుం టే నరుూమ్ కేసులో సినీ నిర్మాత నట్టికుమార్‌ను గుర్తు చేస్తుందని టిఆర్‌ఎస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. నరుూమ్ వ్యవహారంతో తెలుగు సినిమా రంగానికి సంబంధం లేకపోయినా పబ్లిసిటీ కోసం నట్టికుమార్ తమను లాగుతున్నాడని నిర్మాతల మండలి వాపోతుంది. మహారాష్ట్ర ఒప్పందంలో కూడా టిటిడిపికి సంబంధం లేకపోయినా రాజకీయంగా ఎక్కడ వెనుకబడి పోతామన్న ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి సందేట్లో సడేమియాగా స్పందించారని టిఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్

పుట్టలో పాములన్నీ బిరాబిరా బైటికి..!
ఇప్పటివరకు ఏ అంశంపైనయినా నాలుగ్గోడల మధ్య జరిగే మంతనాలు, రాతకోతలు, ఒప్పందాలు అన్నింటిపైనా ‘లోగు ట్టు పెరుమాళ్లకెరుక!’ అనుకునేవారు. కానీ నేడలా కాదు. అటు ప్రభుత్వపరంగా అడుగడుగునా సిసి కెమెరాలు, ఫోన్ ట్యాపింగ్‌లు, మరోవైపు రాత్రీ పగలూ ఆవలిస్తే పేగుల్లెక్కించే మీడి యా ఉండనే ఉంది. దాదాపు 2వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేసిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాల కంటేనూ విజయవంతం అయ్యాయంటూ తెగ సంబరపడిపోతోంది. ‘అప్పుడే ఏమైంది.. ముందుంది మొసళ్ల పండగ’ అన్నట్టు అవినీతి, అక్రమాల పుట్టల్లోని పాములన్నీ ఇపుడిపుడే బైటికి వస్తుంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పుష్కరాల సందర్భంగా జరిగిన నాసిరకం పనులపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఫొటోలు, వీడియోలు సహా నివేదికలు రూపొందిస్తున్నారు. విజయవాడ నగర ప్రథమపౌరుడు మే యర్ కోనేరు శ్రీ్ధర్‌ను కూడా దాదాపు 3కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వ్యవహారం మెడకు చుట్టుకుంటోంది. పుష్కర నగర్‌లు, విఐపిలకు విందు భోజనాలు, ఆప్రాన్ వద్ద స్టాళ్ల ఏర్పాటుకు కాంట్రాక్ట్ దక్కించుకున్న కోనేరు మురళీకృష్ణ కెఎంకె సంస్థల్లో సాక్షాత్తూ మేయర్ సతీమణి, మాజీ కార్పొరేటర్ రమాదేవి ఒక కీలకమైన డైరెక్టర్ కావటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేమంటే సిసి కెమెరా ఫుటేజ్‌లు కూడా చూపుతామని విపక్షాలు చెబుతున్నాయి.
కొసమెరుపు: కీలకమైన మేయర్ కుటుంబ సభ్యులకు ఏదైనా కాంట్రాక్టు ఇవ్వవచ్చా.., లేదా? అనేది ఇంతజరిగాకా ప్రస్తుతం చర్చనీయాంశమైన హాట్ టాపిక్!
- నిమ్మరాజు చలపతిరావు

‘నన్ను విమర్శిస్తే పార్టీకే నష్టం’..?
సిఎల్పీ నేత జానారెడ్డి తీరుపై తెలంగాణ సిఎల్పీ సమావేశంలో తీవ్ర చర్చ కొనసాగింది. మహరాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం ‘మహా’ ఒప్పందం విషయంలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. మీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేలా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై సిఎల్పీ సమావేశంలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు జానారెడ్డి. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆయన వాపోయారు. తనను విమర్శిస్తే పార్టీకే నష్టమని ఆక్రోశం వెళ్లగక్కారు. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో సిబిఐ విచారణ అవసరం లేదన్న జానారెడ్డి వ్యాఖ్యలను సమావేశంలో పలువురు నేతలు తప్పుబట్టారు. ఈ రెండు అంశాలపై గంటకు పైగా జానారెడ్డి వివరణ ఇవ్వడం గమనార్హం.
-సయ్యద్ గౌస్‌పాషా

నిప్పులాంటి బాబుకు భయమా?
‘నేను నిప్పులాంటి వాడిని’ అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ప్రకటించుకున్నారు. అందులో తప్పుపట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే కోర్టు విచారణకు నిప్పులాంటి మనిషి ఎందుకు భయపడుతున్నారు..అన్న అనుమానం సామాన్యుడికి కూడా కలుగుతోంది. గతంలో ఏలేరు స్కాంలో విచారణ జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును విచారణ చేయాల్సిన సమయంలో కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నారు..తనను విచారణ చేయవద్దని. ప్రస్తుతం నోటుకు ఓటు కేసులో కూడా మళ్లీ హైకోర్టు మెట్లెక్కి మళ్లీ స్టే తెచ్చుకున్నారు. నిప్పులాంటి బాబుకు విచారణ అంటే ఎందుకు భయం అన్న అనుమానం అందరికీ కలుగుతోంది.
- పి.వి. రమణారావు