మిర్చిమసాలా

రైల్వే జోన్ భ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వే బడ్జెట్ వస్తున్నదంటే చాలు. ఆంధ్రాకు ఈ సారి బడ్జెట్‌లోనైనా రైల్వే జోన్‌ను కేటాయిస్తారా? లేదా? ఇదే చర్చ. కేంద్రంలో భాజపా ప్రభుత్వం వరుసగా రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. ఆంధ్రాకు రైల్వే జోన్‌ను కేటాయిస్తామనే దానిపై ఉలూకూ పలుకూ లేదు. ఈ సారి గ్యారంటీగా రైల్వే జోన్ వస్తుందని, విభజన చట్టంలో ఉన్న హామీని నెరవేర్చుతామని కేంద్ర పెద్దలు చెబుతుంటారు. ఒకరేమో విశాఖని, మరొకరేమో గుంటూరు లేదా విజయవాడ అని పేచీపడుతుంటారు. విశాఖను తూర్పు రైల్వే జోన్ నుంచి బయటకు తీసుకురావడమే గగనమైతే, మళ్లీ ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సబబేనా అని మరొకరు ప్రశ్నిస్తుంటారు. రాయలసీమ వాసులేమో గుంతకల్ లేదా తిరుపతిలో పెట్టండని అడుగుతున్నారు. ఈ సారి బడ్జెట్‌లోనైనా కేంద్రం కరుణించి ఎక్కడో ఒక చోట రైల్వే జోన్ పెడుతుందా లేక అందని ద్రాక్ష తియ్యన అన్నట్లుగా భ్రమల్లో ముంచి ఏడిపిస్తుందా? ఈ నెలాఖరు వరకు వేచి చూడాలి మరి!
- శైలేంద్ర

వారిది ఏ కులం..?
ఎన్నికల్లో గెలిచిన వారంతా ఒకే కులం ఓట్లతో గెలిచారా? మోదీది ఏకులం? కేసీఆర్‌ది ఏ కులం? అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ సభలో ప్రశ్నించారు. కులాలతో గెలిస్తే ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో, ఏ కులం వారు అధికారంలోకి వచ్చారో చెప్పగలమా? అంటూ ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. కుల సంఘాల పేరుతో వర్గ వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని కొందరు నాయకులు ఆరో పణలు చేస్తున్నారు. ఏపీలో కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ చేపట్టిన ఆందోళన, ఆమరణ దీక్షను ఆపగలిగింది కులాల రిజర్వేషన్‌పై ఇచ్చిన హామీయే కదా? అని కొందరు నాయకులు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కులాలను పాలకులు వాడుకోవడం పరిపాటి అయంది. మరి ఈ నాయకులకు ఓట్లేసిన ఓటర్లది ఏ కులం అంటూ లోకసత్తా నేత ఒకరు ప్రశ్నించడం గమనార్హం.
- గౌస్

జేపీకి గ్రేటర్‌లో ఫాలోయింగ్ ఎక్కువే!
లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ (జెపి) స్థాపించిన పార్టీని తెలంగాణ ప్రజలు పక్కన పెట్టినప్పటికీ, ఆయన పిలుపును మాత్రం ఇక్కడి ప్రజలు వేదవాక్కుగా ఫాలో అవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు, నగర ప్రజలకు ఆయన పిలుపునిస్తూ, టిడిపికి ఎవరూ ఓట్లు వేయవద్దని, ఆ పార్టీకి వేసినా టీఆర్‌ఎస్‌కు వేసినా ఒక్కటేనని సెలవిచ్చారు. టిడిపికి ఓట్లు వేసి గెలిపిస్తే, వారు ఎలాగు టిఆర్‌ఎస్‌లో చేరే వారే కాబట్టి, ఆ పనేదో ఓటర్లే చేస్తే సరిపోతుందని జేపీ చెప్పారు కూడా. అందుకేనేమో నగర ప్రజలు టిడిపిని పక్కన పెట్టి గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. అయితే ఇక్కడో కొసమెరుపు ఉంది. జేపీ మాటను నగర ప్రజలంతా తు.చ తప్పకుండా పాటించినప్పటికీ, గతంలో జేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కెపిహెచ్‌బి ప్రజలు మాత్రం పట్టించుకోకుండా టిడిపి అభ్యర్థిని గెలిపించారు. జెపి లెక్క ప్రకారం కెపిహెచ్‌బి నుంచి గెలిచిన ఏకైక టిడిపి కార్పొరేటర్ కూడా మున్ముందు టిఆర్‌ఎస్‌లో చేరిపోతారేమో వేచి చుద్దాం.
- వెల్జాల చంద్రశేఖర్

సొంత ఇల్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి ఘోరపరాజయం పాలుకాగానే నగరానికి చెందిన టిడిపి ఎమ్మెల్యేలు ఆలోచనల్లో పడ్డారు. ముందుగా తేరుకున్న కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ముఖ్యమంత్రిని కలిసి టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అందరు నేతలు పార్టీ మారి బంగారు తెలంగాణ కోసం అంటుంటే ఈయన మాత్రం ఎవరూ ఊహించని విధంగా సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది అని చెప్పారు. గతంలో వివేక్ టిఆర్‌ఎస్‌లో పని చేశారు. టిడిపిలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అతను టిఆర్‌ఎస్‌లో పని చేసినట్టు ఎవరికీ గుర్తు లేకపోయినా గుర్తు చేసి సొంతింటికి అన్నారు. సొంతింటికి వచ్చినట్టు ఉందని ఆయన అనగానే సామాజిక మాధ్యమాల్లో మరి ఇన్ని రోజులు వేరేవాళ్ల ఇంటిలో ఎందుకున్నావని ప్రశ్నించారు.
- మురళి

ఏం చేద్దాం?
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కెటిఆర్ నూటికి నూరు శాతం మార్కులు కొట్టేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులంతా ఆయనను అభినందించారు. కేటీఆర్‌లా నూటికి నూరుశాతం మార్కులు కొట్టేయాలంటే ఏం చేయాలి? అంటూ రాష్ట్ర మంత్రులంతా ఆలోచిస్తున్నారు. అయితే కేటీఆర్‌కు తన సమర్థతను నిరూపించేందుకు జిహెచ్‌ఎంసి ఎన్నికలు ఉపయోగపడ్డాయి. మరి తమకు ఏం ఉపయోగపడతాయోనని మంత్రులంతా పరేషాన్‌లో ఉన్నారట!
- పి.వి. రమణారావు