మిర్చిమసాలా

రాష్ట్రాలు వేరు-మార్గాలు ఒకటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపి, తెలంగాణ రాష్ట్రాలు వేరుగా ఉన్నప్పటికీ, రెండు రాష్ట్రాలకు సిఎంలుగా పనిచేస్తున్న గురు, శిష్యుల (చంద్రబాబు-కెసిఆర్) మార్గాలు మాత్రం ఒకే విధంగా ఉన్నాయి. పరిపాలనాపరంగా చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలైన రైతుల రుణమాఫీ, మహిళల పెళ్లిళ్లకు చేయూత, గ్రామీణాభివృద్ధి తదితర కార్యక్రమాలు, పథకాలన్నీ దాదాపు ఒకే విధం గా ఉంటున్నాయి. చివరకు అధికార పార్టీలో (ఎపిలో టిడిపి, తెలంగాణలో టిఆర్‌ఎస్) విపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో కూడా మూస విధానమే గురుశిష్యులు అవలంభిస్తున్నా రు. ఎంతైనా ఇద్దరిలో ఉన్నది కాంగ్రెస్, టిడిపిల రక్తమే కదా!
- పి.వి. రమణారావు

శోభనాన్ని అడ్డుకున్న పోలీసులు
నేరాలు, ఘోరాలు జరిగిన చోటే కాదు..వ్యక్తిగత విషయాల్లోకి పోలీసులు దూరటమా? అంటూ ఆగ్రహం చెందితే తప్పులో కాలేసినట్టే. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పుణ్యమా అని.. ఒక మహిళ జీవితం అన్యాయం కాకుండా ఆగింది. ఏలూరులోని పెనుగొండ మండలం నాగళ్లదిబ్బకు చెందిన సోమరాజు అనే వ్యక్తి దుర్మార్గాన్ని పోలీసులు అడ్డుకోవడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా అందుకు కారణమైన పోలీసులు పలువురి ప్రశంసలు పొందారు. హెచ్‌ఐవితో బాధపడుతున్న సోమరాజు తనకున్న వ్యాధిని దాచి పెట్టి ఒక అమాయకురాలిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అసలు విషయం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలిసింది. దీంతో వారు పెనుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన వధువు ఇంటికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ కొత్తగా పెళ్లయిన జంటకు శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వరుడి దుర్మార్గం గురించి వధువు తరఫు వారికి చెప్పడంతో వారు శోభనాన్ని రద్దు చేసుకున్నారు. వధువు జీవితాన్ని కాపాడిన పోలీసులకు ఆమె తరఫు వారు అభినందించారు.
-సయ్యద్ గౌస్‌పాషా

ఆ పదవి వద్దు ‘బాబో’య్!
రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం అటుంచి, జిల్లా అధ్యక్షుడిని కాపాడుకోవడం ఇప్పుడా ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. గతానుభవంతోనైనా జిల్లా అధ్యక్షునిగా ఎవరినీ నియమించవద్దనీ కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబుకు మొర పెట్టుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మహేందర్‌రెడ్డి ఎన్నికలకు ముందు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరి ఏకంగా మంత్రయ్యారు. దీంతో ఆ పదవిలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని నియమించింది. పార్టీలో మహేందర్‌రెడ్డిలాంటి బలమైన నేత పార్టీ మారడం వెనుక మతలబు ఏమిటనీ తీగలాగుతూ, లా గుతూ చివరకు తీగల కృష్ణారెడ్డి కూడా టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇలా అయితే లాభం లేదని మంచోడిని చూసి అధ్యక్షపదవిని కట్టబెట్టాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని జిల్లా అధ్యక్షునిగా నియమించింది. ఆయన కూడా ఒక ఒక మంచిరోజు చూసుకొని టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా అయితే లాభం లేదని జిల్లాలో పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తాడన్న నమ్మకంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను అధ్యక్షునిగా నియమించింది. అయితే పార్టీ కంటే తన నియోజకవర్గం ప్రకాశమే ముద్దని ఈయనా గులాబీ కండువా కప్పుకున్నారు. పట్టుమని రెండేళ్లైనా గడవకముందే వరుసబెట్టి నలుగురు అధ్యక్షులు టిఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో ఇక ఆ పదవి పార్టీకి అచ్చిరాదని, ఇక ముందు ఎవరినీ ఆ పదవిలో నియమించవద్దని కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు!
- వెల్జాల చంద్రశేఖర్

కోట్లా..? ఏవి ఎక్కడ??
తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేరినపుడు టిడిపికి చెందిన నేతలు అటు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడమేగాక, హైకోర్టులో కూడా పిటీషన్లు వేశారు. అక్కడితో ఊరుకోని టిడిపి నేతలు టిఆర్‌ఎస్‌లో చేరిన వారికి పెద్ద ఎత్తున డబ్బు ముట్టజెప్పారనే ఆరోపణలు చేశారు. ఇంకొంత మంది నేతలు మరో అడుగు ముందుకు వేసి కోట్లు అందాయని ఆరోపించారు. ఇదంతా తెలంగాణ తతంగం! ఇక ఆంధ్రాకు వచ్చేసరికి అక్కడ వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన నేతలకు ఆ పార్టీ బాధ్యులు కోట్ల రూపాయిలు ముట్టజెప్పారని, అందుకే వారు టిడిపిలో చేరారని వైకాపా నేతలు ఆరోపించారు. ఒక పార్టీలోని నేత మరో పార్టీలోకి వెళ్లగానే ఇలా పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయని చెప్పడం సహజం. అంతవరకూ బాగానే ఉన్నా, పార్టీలు మారిన నేతలు మాత్రం ఆరోపణలు చేస్తున్న వారు చెబుతున్నట్టు తమకేమీ కోట్లు అందలేదని అయోమయంగా చూస్తున్నారు. ఈ వ్యవహారంలో గతుక్కుమనడం సామాన్యుడి వంతైంది.
- బి.వి. ప్రసాద్

ఐదు లక్షల మందు..!!
ఏపీ రాజధాని విజయవాడలోని ఏ మద్యం దుకాణానికి వెళ్లినా గడచిన రెండు మాసాలుగా చీప్ లిక్కర్ మాట ఎక్కడా విన్పించడం లేదు. అతి పేదవాడి నుంచి రిక్షాకూలీ, యాచకుడి వరకు దర్జాగా మద్యం దుకాణం కౌంటర్‌కెళ్లి ఐదు లక్షల మందు వుందా? అని అడుగుతుంటే ఆ మాట విన్న పక్కనున్న వారు వారి వేషధారణ, భాష చూసి ఉలిక్కిపడాల్సిందే! కానీ కౌంటర్‌లోని వారు మాత్రం ఆ మందు అడిగినవారు జేబులో నలిగిన రూ.20లు కాగితం కౌంటర్‌లో పడవేస్తే చాలు క్షణాల్లో పెగ్గు ఇచ్చి తిరిగి చిల్లర ఇస్తుంటే పక్కనున్న వారు మరింత ఉలిక్కిపడుతున్నారు. ఇంతకీ ఐదు లక్షల మందు ఏమిటంటారా?.. నగరంలోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన మద్యం దుకాణంలో గత డిసెంబర్ 7న జరిగిన కల్తీ మద్యం ఘటనలో ఆరోజే ఐదుగురు మరణించారు. తాజాగా 84 రోజులపాటు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొం దుతూ ఓ అనాధ ఈమధ్యనే మరణించాడు. ఈ ఘటనలో 18 మంది అస్వస్థతకు గురై ప్రాణాలతో బైటపడ్డారు. జరిగిన కల్తీ ప్రతిపక్ష నేత మద్యం షాపులో కదా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఉదారంగా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాగా అందించారు. ఇక అప్పటి నుంచి చీప్ లిక్కర్ స్థానంలో ‘ఐదు లక్షల మందు’ అనేది ప్రచారంలోకి వచ్చింది. ఇక ఎక్సైజ్ ప్రెస్‌మీట్‌లలో కూడా చీప్ లిక్కర్ స్థానంలో ఇదే ప్రస్తావనకు వస్తుంటే కొత్తవారికి అర్థంగాక విస్తుపోతున్నారు. కల్తీ చేసేది కిక్ కోసమైతే..అదే కల్తీ ప్రాణాలు తీస్తే రూ.5లక్షల లక్!
- నిమ్మరాజు చలపతిరావు