మిర్చిమసాలా

నిద్రా దేవి నిద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి , పగలు, నిన్న, నేడు రేపు అనే తేడా లేకుండా పని చేస్తుండడం వల్ల నిద్రా దేవి ఆయన ఎప్పుడు నిద్ర పోతాడా? అని ఎదురు చూసి బాబు నిద్ర పోక పోవడంతో నిద్రా దేవి తానే నిద్ర పోయిందట! ఇది ఫేస్‌బుక్‌లో టిడిపి అధికారిక పేజీలో బాబు విదేశీ ప్రయాణంపై రాసిన పోస్ట్. బాబు ఇమేజ్ పెంచాలనే ఉద్దేశం బాగానే ఉంది. అభిమానం బాగానే ఉంది కానీ ఇది ఫేస్‌బుక్‌కు మంచి మసాలా ఐటంగా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ప్రతి మనిషికి నిద్ర అవసరం. నిద్ర లేకపోతే మెదడు పని చేయదు అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అభిమానులు బాబు ఇమేజ్ పెంచడానికి చేస్తున్న ప్రచారం కాస్తా నవ్వుల పాలవుతోంది.
-మురళి

అ‘న్యాయం’ అంటే ఇది కాదా..?
రాష్ట్ర హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్లపై తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఆందోళన న్యాయమైందేనంటున్న మేధావి వర్గం, పాలక వర్గం పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రా న్యాయాధికారులు అంటున్నారు. ఈ చర్య వల్ల తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరుగుతుందనే ది వాదన. అయితే ఈ వాదనకు ముందు అంటే రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఒప్పందం ఉన్న విషయాన్ని విస్మరిస్తున్నారని, ఆంధ్రా న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ న్యాయవాదుల ఆందోళనకు తాము వ్యతిరేకం కాదు. కానీ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు, రాష్ట్ర విభజన ఒప్పందం మరిస్తే మీరనుకునే న్యాయం.. అన్యాయం కాదా? అంటూ ఆంధ్రా న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.
- గౌస్‌పాషా

మాకేంటి.. మరో మూడేళ్లు దర్జా..!
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ఎంచక్కా అన్నివిధాలా వినియోగించుకునే అవకాశాలు ఆంధ్రా వాళ్లకు చట్టబద్ధంగానే పుష్కలంగా ఉన్నాయి. సచివాలయం, డైరెక్టరేట్, కమిషనరేట్లు, ఇతర అన్నిరకాల ప్రభుత్వ కార్యాలయాలను మరో ఎనిమిదేళ్ల పాటు ఎలాంటి అద్దెలు లేకుండా యథాతథంగా వినియోగించుకోవచ్చు. అయితే జూన్ 27వ తేదీ గడువు విధించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తరలి రావాల్సిందేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హుకుం జారీ చేయటంతో డైరెక్టరేట్లు, కమిషనరేట్లు అద్దె భవనాల్లోకి తరలి వస్తే, తాత్కాలిక సచివాలయంలో సదుపాయాలు లేకపోయినా తెలంగాణ నుంచి సచివాలయాన్ని దశలవారీగా తరలిస్తున్నారు. ఇదంతా బాగుంది. ఇక ఎటూ ఖాళీగానే ఉన్నాయి కదా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్లను ఖాళీ చేసి రావచ్చుకదా.. అని కొంటె విలేఖరులు ఎవరైనా అడిగితే చాలు ‘మాకేంటి.. మరో మూడేళ్లు కదలం.. తర్వాత ఓడినా ఖాళీ చేయం..’ అంటూ దర్జాగా ఎదురు ప్రశ్న వేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే అసలు ఆ క్వార్టర్స్ ఖాళీగా ఉంటే కదా..! బంధుమిత్రులు, అద్దెదారులతో కళకళలాడుతున్నాయి సుమా!!
- నిమ్మరాజు చలపతిరావు

రేటింగ్ పెరిగింది
చంద్రబాబు నాయుడు చైనా పర్యటనలో ఉన్నా, ఏ రోజుకారోజు అమరావతికి ఉద్యోగుల తరలింపు సమీక్షిస్తూనే ఉన్నారు, ఉద్యోగులతో పాటు తమను కూడా ఎక్కడ సమీక్షిస్తారోనని మంత్రులు కూడా అందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి, వెలగపూడి, విజయవాడలలో ఉన్న మంత్రులు తమ కార్యాలయాలకు వెళ్లి అక్కడ హాజరు వేయించుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే మంత్రులందరి కంటే ఎక్కువ సమయం గడిపి గృహనిర్మాణ మంత్రి కిమిడి మృణాళిని ఆ క్రెడిట్ కొట్టేశారు. పిడి హౌసింగ్‌తో, డ్వామా పిడితో , సిఆర్‌డిఎ అడిషనల్ కమిషనర్‌తో ప్రతిరోజూ సమీక్షిస్తూ, తన కార్యాలయానికి వెళ్లి కాసేపు కూర్చుని మంత్రిగారు వచ్చారనిపించారట.
- బి వి. ప్రసాద్

నామినేటెడ్‌కు జిల్లాలు అడ్డు!
టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. మార్కెట్ కమిటీలు తప్ప నామినేటెడ్ పోస్టులేవీ భర్తీ కాలేదు. ఎప్పటికప్పుడు ఎదో ఒక వంకతో నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతూనే ఉంది. ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ఎన్నికలు, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఖాళీల భర్తీ ఇలా ఎదో ఒక కారణంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి అడ్డు వస్తూనే ఉన్నాయి. వీటి భర్తీ మాట అటుంచి తాజాగా డిఎస్సీని కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే డిఎస్సీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగా మళ్లీ నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా వాయిదా పడిపోయినట్టేనని ఆశావాహులు నీరుగారి పోతున్నారు. మే నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని సిఎం కెసిఆర్ స్వయంగా ప్లీనరీలో ప్రకటించారు. ఈ సారి కొత్త జిల్లాలు ఏర్పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదాకు కారణం కావచ్చని ఆశావాహులు అంచన వేస్తున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్