గుంటూరు

వేలకోట్ల ఇసుక దోపిడీ సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎమ్మెల్యే ఆర్కే ధ్వజం
మంగళగిరి, జనవరి 1: రాష్ట్రంలో 2 వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీకి గురయిందని, సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే చెప్పుకుంటూ తమ అవినీతికి తామే కితాబు నిచ్చుకోవటం సిగ్గుచేటని, మంత్రులే 2 వేల కోట్లు అంటున్నారంటే ఇక ఎన్నివేల కోట్లు దోచుకున్నారో అర్ధమవుతోందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. శుక్రవారం తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్కే విలేఖర్లతో మాట్లాడుతూ ఇసుక దోపిడీ గురించి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల ముసుగులో తన అనుచరులకు, బినామీలకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం పూనుకుందని ఆర్కే అన్నారు. ఇసుక మాఫియా ముసుగులో అనుచరులతో దోచుకున్న అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు వేలం విధానం వలన నేరుగా దోచుకునేందుకు పథకం రూపొందించారని ఆయన విమర్శించారు. నదులతో పాటు మేటల పేరుతో ఇసుకను దోచుకునే కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండే కృష్ణానదీ తీరంలో కూతవేటు దూరంలో కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరుగుతుంటే ఆయనకు తెలియక పోవడం విచిత్రంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నివాసం పైనుంచి చూస్తే ఇసుక దోపిడీ కన్పిస్తుందని ఆయన అన్నారు.

పేటలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
చిలకలూరిపేట, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట ప్రాంతంలో వేడుకలను వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను పుల్లారావు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధశాఖల అధికారులు, ప్రముఖులతో ఆయన గృహం కిక్కిరిసింది. నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించి మల్లెల రాజేష్‌నాయుడుకు అందజేశారు. అదేవిధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఇంటి వద్ద కార్యకర్తలు, నాయకుల మధ్య కోలాహల వాతావరణంలో 53 కిలోల భారీ కేక్‌ను మర్రి కట్ చేసి పంచిపెడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు నాయుడు వాసు, పార్టీ నాయకులు బేరింగ్ వౌలాలి, ఖాశిం, కాట్రగడ్డ మస్తాన్‌రావు, చెన్నంపల్లి సుందరరావు, గుర్రం ఉపేంద్ర, కౌన్సిలర్లు పుల్లగూర కల్పన, రవూఫ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి ఇంటి వద్ద ఏర్పాటుచేసిన కేక్‌ను ఆమె కట్ చేసి పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను పట్టణ అధ్యక్షుడు ఎంబిటి సుభానిమేస్ర్తి, రాధాకృష్ణ, రామకోటేశ్వరరావు, శ్రీనివాసులు తదితరులు నిర్వహించారు. పట్టణంలోని ఎఎంజి సంస్థలో అరుణ్ కుమార్ మహంతి ఆధ్వర్యంలో, విద్యాసంఘం అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు ఇంటి వద్ద, వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

తెనాలిలో మరోవేదం సినిమా షూటింగ్ ప్రారంభం
తెనాలి, జనవరి 1: నూతన రాజధాని అమరావతిగా ఏర్పడి తరువాత మొట్టమొదటిగా సిఆర్‌డిఏ పరిధిలోని తెనాలి పట్టణంలో ప్రవీణ్‌కుమార్ నిర్మాణం, సిహెచ్ ప్రసాద్ కథ, మాటలు, దర్శకత్వ సారథ్యంలో మరోవేదం సినిమా షూటింగ్‌ను మున్సిపల్ కమిషనర్ కె శకుంతల ప్రారంభించారు. ఈసందర్భంగా కమిషనర్ శకుంతల మాట్లాడుతూ ఆంధ్రాప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలి పట్టణం సినిమా షూటింగ్‌లకు అనుకూలమైన ప్రాంతమని ఈవిషయాన్ని గుర్తించిన కొందరు నిర్మాతలు ముందుకువచ్చి ఈప్రాంతంలో సినిమాలు తీయటం అభినందనీయం అన్నారు. అనంతరం ప్రవీణ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ఓసన్నివేశ చిత్రీకరణకు కమిషనర్ క్లాప్‌కొట్టి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో సినీ నిర్మాత ఎ ప్రవీణ్‌కుమార్, దర్శకులు చిత్తజల్లు ప్రసాద్, సంగీత దర్శకుడు అర్జున్, పట్టణ రంగస్థల కళాకారల సంఘం అధ్యక్షులు ఎస్‌కె జానీభాషా, కనపర్తి రత్నాకర్, జయశేఖర్, ప్రసాద్, గరికపాటి సుబ్బారావు, మణికంఠ, నాగేశ్వరరావు, కృష్ణామాష్టారు, సినిమాకు చెందిన పలువిభాగాల దర్శకులు, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

సౌత్‌జోన్ హ్యాండ్‌పాల్ పోటీలకు స్వప్న, నందిని
గుంటూరు , జనవరి 1: ఇటీవల తెనాలి జెఎంజె కళాశాలలో జరిగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మహిళల హ్యాండ్‌బాల్ పోటీల్లో గోరంట్ల సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల క్రీడాకారిణులు ఎ స్వప్న, ఎన్ నందిని పలు పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించి వర్సిటీ మహిళల హ్యాండ్‌బాల్ జట్టుకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ డాక్టర్ కె ఆంథోనీమేరి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆంథోనీమేరి మాట్లాడుతూ ఈనెల 4 నుండి 8వ తేదీ వరకు చెన్నై రాష్ట్రంలోని అలగప్ప యూనివర్సిటీలో జరగనున్న ఆలిండియా అంతర్ యూనివర్సిటీల సౌత్‌జోన్ మహిళల హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం ఆచార్య నాగార్జున వర్సిటీ నిర్వహిస్తున్న శిబిరంలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. వర్సిటీ జట్టుకు ఎంపికైన స్వప్న, నందినిలను ప్రిన్సిపాల్ ఆంథోనీమేరి, ఫిజికల్ డైరెక్టర్ కెవి ప్రసాదరావు ఇతర అధ్యాపకులు, విద్యార్థినులు అభినందించారు.

టిజెపిఎస్ కళాశాల క్రీడాకారుడి ప్రతిభ
గుంటూరు, జనవరి 1: టిజెపిఎస్ కళాశాలలో జూనియర్ ఇంటర్ సిఇసి గ్రూపు చదువుతున్న పి వెంకటకల్యాణ్‌తో ఈనెల 23,24 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో జరిగిన 61వ ఎస్‌జిఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న జట్టు తృతీయస్థానం సాధించిందని ప్రిన్సిపాల్ వైవి శివప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలోనూ తమ కళాశాల నుండి నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఎపి స్టేట్‌మీట్‌లో ప్రథమస్థానం, రాష్టస్థ్రాయి సబ్ జూనియర్స్‌లో చెన్నైలో జరిగిన పోటీల్లో ద్వితీయస్థానం సాధించారన్నారు. ఈ సందర్భంగా వెంకటకల్యాణ్‌ను ప్రిన్సిపాల్ శివప్రసాదరావు, వ్యాయామ అధ్యాపకులు ఎం నాగరాజు, కార్యదర్శి టి శ్రీనివాసబాబు, ఏకనాథ గుప్త తదితరులు అభినందనలు తెలిపారు.

తాగునీటికై కటకట
పెదనందిపాడు, జనవరి 1: మండల పరిధిలోని ఉప్పలపాడులో మంచినీటి చెరువు అడుగంటింది. నిత్యావసరాలకు సైతం నీరు దొరకని పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రభుత్వం గత ఐదు నెలలుగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుంది. గ్రామ జనాభా అవసరాలకు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరు సరిపోవడం లేదు. రానున్నది వేసవికాలం కావడంతో ఇప్పుడే ఇలా ఉంటే రేపటి నీటి అవసరాలు ఎలా అన్నట్టుంది పరిస్థితి. అసలే మెట్టప్రాంతం కావడంతో పాటు ఓగేరు వాగులో ప్రవహించే వర్షపునీరే ఉప్పలపాడు, పాలపర్రు, రాజుపాలెం, అన్నవరం గ్రామాలకు దిక్కు. గత ఏడాది తలెత్తిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఓగేరు వాగులో చుక్కనీరు ప్రవహించని పరిస్థితి. గతంలో చెరువులో ఉన్న కొద్దిపాటి నీరుసైతం అయిపోవడంతో నిత్యావసరాలు, పశుపోషణకు సైతం నీరు లభించని పరిస్థితిలో గ్రామస్థులు ఆందోళనతో సతమతమవుతున్నారు. ఉప్పలపాడులో 2400 మందికి పైగా నివశిస్తున్నారు. మనిషికి ఒక్కింటికి 30 లీటర్ల నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కానీ సరఫరా చేసే నీరు అవసరాలు తీర్చలేకపోవడంతో ఇకనైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కండక్టర్లు అదనపు ఆదాయాన్ని తీసుకురావాలి
* ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లో 24 గంటల రిజర్వేషన్
* ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి
గుంటూరు , జనవరి 1: ప్రతి కండక్టర్ బస్సు కండక్టర్ తన ట్రిప్‌కు రావాల్సిన సర్వీస్ బ్రేక్ ఈవెన్ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ట్రిప్ వారీగా లెక్కించి కొంత అదనపు ఆదాయాన్ని తీసుకురావాలని ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లోని ఆయన కార్యాలయంలో కండక్టర్లకు ఇపిబి పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రూటులో ట్రిప్పుల వారీగా అదనపు ఆదాయాన్ని తీసుకురావడం వలన నష్టాల నుంచి సంస్థ లాభాల పయనిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులకు బస్సులను సరైన సమయంలో అందించే విధంగా సమయపాలన పాటించడంతో పాటు ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్ 3వ షిఫ్ట్‌ను కూడా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం శ్రీహరి మాట్లాడుతూ ఎపిఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు నూతన సంవత్సర కానుకగా రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రవేశపెట్టిందని, ఈ కౌంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో నర్సరావుపేట డిప్యూటీ సిటిఎం వెంకటేశ్వరరావు, షెడ్యూలు సిఐ బెనర్జీ, కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

8 నుంచి గుంటూరులో సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశం
మంగళగిరి, జనవరి 1: సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 8 నుంచి గుంటూరులో నాలుగురోజుల పాటు జరుగుతాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ జాతీయ కార్యదర్శితో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మంది పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొంటారని, గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో జరుగుతాయని, 8వ తేదీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రజా ప్రదర్శన, అనంతరం మహిస గార్డెనె్సలో బహిరంగ సభ జరుగుతుందని ముప్పాళ్ల అన్నారు. 8వ తేదీవరకు సిపిఐ 90వ వార్షికోత్సవ ఉత్సవాలు జరుగుతాయని, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జాతీయ కౌన్సిల్‌లో చర్చించడం జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపి హయాంలో వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టబడిందని, ఆ రెండు పార్టీలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వర్గాలకు మేలు చేస్తున్నాయని, 80 శాతం ప్రజల పక్షాన సిపిఐ పోరాడుతోందని ముప్పాళ్ల అన్నారు. విలేఖర్ల సమావేశంలో సిపిఐ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, రావుల శివారెడ్డి, కె హేమసుందరరావు, చలపతి తదితరులు పాల్గొన్నారు.